North Korea Ballistic Missile: జపాన్ మీదుగా బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించిన ఉత్తర కొరియా

మంగళవారం ఉదయాన్నే ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం గురించి జపాన్ టీవీ స్టేషన్లు బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేశాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మంగళవారం ఉదయాన్నే ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం గురించి జపాన్ టీవీ స్టేషన్లు బ్రేకింగ్ న్యూస్ ప్రసారం చేశాయి
    • రచయిత, రూపర్ట్ వింగ్‌ఫీల్డ్ హాయెస్, వెట్టె టాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ఉత్తర జపాన్‌లోని కొంత భాగం మీదుగా ఉత్తర కొరియా ఒక అనుమానిత మధ్యంతర స్థాయి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.

ఈ మిస్సైల్ ప్రయాణ సమయంలో హొక్కైడో ద్వీపంలోని ప్రజలంతా తమను తాము కాపాడుకోవాలని జపాన్ ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. కొన్ని రైళ్ల రాకపోకలను కూడా తాత్కాలికంగా రద్దు చేసింది.

2017 తర్వాత జపాన్ మీదుగా నార్త్ కొరియా క్షిపణిని పేల్చడం ఇది తొలిసారి.

ఉత్తర కొరియా బాలిస్టిక్, న్యూక్లియర్ ఆయుధ పరీక్షలు జరపకుండా ఐక్యరాజ్యసమితి నిషేధం విధించింది.

ఈ చర్యలను జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా తీవ్రంగా ఖండించారు. ఈ ప్రయోగాన్ని 'హింసాత్మక ప్రవర్తన'గా ఆయన అభివర్ణించారు. జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది.

పసిఫిక్ మహాసముద్రంలో జపాన్ నుంచి 3 వేల కిలోమీటర్ల దూరంలో ఈ మిస్సైల్ పడిందని ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని కూడా వెల్లడించింది.

''ఉత్తర కొరియా ఒక మిస్సైల్ ప్రయోగించినట్లుంది. ప్రజలంతా భవనాల లోపలికి కానీ, భూగర్భ షెల్టర్లలోకి కానీ వెళ్లండి'' అని జపాన్ ప్రభుత్వం స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 7.29 గంటలకు హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం నుంచి ఇలాంటి హెచ్చరికలు రావడం అరుదు.

క్షిపణి ప్రయోగం ఉదయం 7.23 గంటలకు జరిగిందని, జపాన్ గగనతలం నుంచి అది దూసుకెళ్లిందని దక్షిణ కొరియా సైన్యం చెప్పింది.

ఈ వ్యవహారంపై అమెరికా కూడా స్పందించింది. ఉత్తర కొరియా నిర్ణయం 'దురదృష్టకరం' అని అమెరికా తూర్పు ఆసియా దౌత్యవేత్త డానియల్ క్రిటెన్‌బ్రింక్ అభివర్ణించారు.

గత వారం రోజుల్లో ఉత్తర కొరియా ప్రయోగించిన ఐదవ క్షిపణి ఇది.

శనివారం రెండు రాకెట్లు జపాన్ ప్రత్యేక ఎకనామిక్ జోన్ బయట జలాల్లో పడ్డాయి.

ఈమధ్యకాలంలో ఉత్తర కొరియా తన క్షిపణి ప్రయోగాలను పెంచింది. వాటిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి విధించిన నిషేధాన్ని పట్టించుకోవట్లేదు.

ఈ మధ్యనే ఉత్తర కొరియా తననుతాను అణ్వాయుధ దేశంగా ప్రకటించుకుంటూ ఒక చట్టం చేసింది. అణు నిరాయుధీకరణపై చర్చల అవకాశాలను ఆ దేశ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ కొట్టిపారేశారు.

తమ దేశంపై విస్తృతంగా ఆంక్షలు విధించినప్పటికీ ఉత్తర కొరియా 2006 నుంచి 2017 మధ్యకాలంలో ఆరుసార్లు అణు పరీక్షలు జరిపింది.

అదనపు రిపోర్టింగ్ నాథన్ విలియమ్స్..

ఉత్తర కొరియా క్షిపణులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)