ఉత్తర కొరియా: ''చాలా ముఖ్యమైన పరీక్ష నిర్వహించాం''

ఫొటో సోర్స్, AFP
ఉత్తర కొరియా తాను ఒక శాటిలైట్ ప్రయోగ కేంద్రం వద్ద ''చాలా ముఖ్యమైన పరీక్ష'' నిర్వహించినట్లు చెప్పింది.
ఈ ప్రయోగం ఫలితాలను దేశ వ్యూహాత్మక స్థాయిని పెంచటానికి ఉపయోగిస్తామని ప్రభుత్వ వార్తా సంస్థ కేసీఎన్ఏ పేర్కొంది. ఆ ప్రయోగానికి సంబంధించి వివరాలేమీ వెల్లడించలేదు.
అయితే.. శాటిలైట్ ప్రయోగానికి ఉపయోగించే రాకెట్‌లో కానీ, ఖండాంతర గతిశీల క్షిపణిలో కానీ ఉపయోగించగల ఇంజన్‌ను భూమి మీద పరీక్షించి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికాతో ఇక చర్చలకు ఉత్తర కొరియా తలుపులు మూసివేసినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ పరీక్ష నిర్వహించటం గమనార్హం.
''అమెరికాతో ఇప్పుడు సుదీర్ఘ చర్చలు జరపాల్సిన అవసరం మాకు లేదు. అణ్వస్త్ర నిరాయుధీకరణ అనే అంశం చర్చించే అంశాల జాబితా నుంచి ఎప్పుడో జారిపోయింది'' అని ఐక్యరాజ్య సమితిలో ఉత్తర కొరియా రాయబారి కిమ్ సాంగ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, AFP
తమ దేశం మీద విధించిన ఆంక్షలను గణనీయంగా సడలిస్తూ కొత్త అణస్త్ర నిరాయుధీకరణ ఒప్పందంతో ఈ ఏడాది చివరిలోగా చర్చలకు రావాలని.. లేదంటే తాము ''కొత్త మార్గం'' ఎంచుకుంటామని ఉత్తర కొరియా గడువు విధించింది.
ఉత్తర కొరియాతో ఒప్పందం చేసుకోగలమని తాను ఇంకా ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ శనివారం చెప్పారు.
ఉత్తర కొరియాతో దౌత్యం నెరపటం 2018లో తన విదేశీ విధానానికి కేంద్ర బిందువుగా చేసుకున్నారు ట్రంప్. ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్‌తో రెండుసార్లు సమావేశమై, ఉత్తర కొరియాలో అడుగు పెట్టినా కూడా.. అణ్వస్త్ర నిరాయుధీకరణ విషయంలో గణనీయమైన పురోగతి సాధించటంలో విఫలమయ్యారు.
ఉత్తర కొరియా తాజా పరీక్షను సోహే ఉపగ్రహ ప్రయోగ కేంద్రంలో నిర్వహించింది. ఈ కేంద్రాన్ని మూసివేస్తామని కిమ్ హామీ ఇచ్చినట్లు అమెరికా గతంలో పేర్కొంది.

ఫొటో సోర్స్, AFP
''తాజా ముఖ్యమైన పరీక్ష ఫలితాలు.. డీపీఆర్‌కే (ఉత్తర కొరియా) వ్యూహాత్మక స్థాయిని సమీప భవిష్యత్తులో మరోసారి మార్చటంలో కీలకమైన ప్రభావం చూపుతాయి'' అని కేసీఎన్ఏ చెప్పింది.
ఉత్తర కొరియా అణు, క్షిపణి కార్యక్రమాల విషయమై ఐక్యరాజ్య సమితి సహా పలు సంస్థలు, దేశాలు అనేక ఆంక్షలు విధించినప్పటికీ.. ఈ దేశం ఈ ఏడాది ఆరంభంలో తన బాలిస్టిక్ క్షిపణుల పరీక్షలను మళ్లీ ప్రారంభించింది.
అంతేకాదు.. ట్రంప్ మీద దాదాపు ఏడాది కాలం తర్వాత ఈ వారంలో మొదటిసారి మాటల దాడిని కూడా పున:ప్రారంభించింది. ఉత్తర కొరియా మీద సైనిక శక్తిని ప్రయోగించే హక్కు అమెరికాకు ఉందని ట్రంప్ పేర్కొన్న తర్వాత ఈ విమర్శలు ఎక్కుపెట్టింది.
అమెరికా నుంచి తనకు ఆంక్షల రాయితీలు లభించకపోతే.. ఉత్తర కొరియా అంతరిక్ష ఉపగ్రహాన్ని ప్రయోగించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటువంటి ప్రయోగం చేయటం ద్వారా.. దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించటం కన్నా తక్కువగా రెచ్చగొట్టే విధంగా.. తన రాకెట్ సామర్థ్యాలను పరీక్షించటంతో పాటు, ప్రదర్శించటానికి కూడా వీలు కలుగుతుంది.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ ఎన్కౌంటర్: ‘పోలీసుల కథనం చిన్నపిల్లలు కూడా నమ్మేలా లేదు’
- హైదరాబాద్ ‘ఎన్కౌంటర్’: సీన్ రీ-కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు?
- హైదరాబాద్ ఎన్కౌంటర్: తెలంగాణ పోలీసుల తీరుపై అయిదు సందేహాలు
- ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి తెలంగాణలో రేప్ నిందితుల వరకు.. ఎన్కౌంటర్లలో నిజమెంత
- రేప్ కేసుల విచారణలో ఇతర దేశాలతో పోల్చితే భారత న్యాయవ్యవస్థ పనితీరు ఎలా ఉంది?
- మనుషులెవరూ లేని ప్రాంతాల్లో తప్పిపోతే ప్రాణాలతో బయటపడటం ఎలా?
- నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్
- పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








