Kim Jong-un: నార్త్ కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్‌కు కరోనా.. దక్షిణ కొరియా వల్లే సోకిందన్న కిమ్ సోదరి.. కోవిడ్‌పై విజయం సాధించామని ప్రకటన

కిమ్, కిమ్ యో జోంగ్ (2018 నాటి ఫోటో)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కిమ్, కిమ్ యో జోంగ్ (2018 నాటి ఫోటో)
    • రచయిత, ఫ్రాన్సెస్కా గిలెట్
    • హోదా, బీబీసీ న్యూస్

కోవిడ్ మహమ్మారి సమయంలో నార్త్ కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ జ్వరంతో బాధపడినట్లు ఆయన చెల్లెలు ప్రకటించారు.

ఆయనకు వైరస్ సోకినట్లు చెబుతున్న తొలి సమాచారం ఇదే.

దక్షిణ కొరియా కోవిడ్ తో ఇన్ఫెక్ట్ అయిన లీఫ్ లెట్లను సరిహద్దులద్వారా దేశంలోకి పంపడం వల్లే దేశంలో మహమ్మారి తలెత్తినట్లు ఆమె ఆరోపించారు.

అయితే, ఈ ఆరోపణలు ఆధారం లేనివని దక్షిణ కొరియా ఖండించింది.

కోవిడ్‌పై విజయం సాధించినట్లు కిమ్ ప్రకటించిన తర్వాత ఆమె మాట్లాడారు.

దేశ విషయాలను వెల్లడి చేసే విషయంలో రహస్యాన్ని పాటించే నార్త్ కొరియా తమ దేశంలో కోవిడ్ మే నెలలో తలెత్తినట్లు ప్రకటించింది. అప్పటి నుంచి దేశంలో నమోదైన మరణాలను, ఇన్ఫెక్షన్ లను చాలా తక్కువగా వెల్లడి చేసింది. కానీ, ఈ దేశం విడుదల చేసిన డేటా పై చాలా అనుమానాలున్నాయి.

వీడియో క్యాప్షన్, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు ప్రకటించే ఈమె ఎవరో తెలుసా!

సరిహద్దుల ద్వారా కోవిడ్ ఇన్ఫెక్షన్ సోకిన లీఫ్ లెట్లను పంపించి సౌత్ కొరియా తమ దేశంలో కోవిడ్ వ్యాప్తి చేసిందని ఆరోపించారు. "దక్షిణ కొరియాలో ప్రచారకర్తలు తమ ప్రచారానికి సంబంధించిన పత్రాలను బెలూన్ల ద్వారా కొన్ని దశాబ్దాలుగా పంపిస్తున్నారు. అయితే, ఉత్తర కొరియా గత ఏడాది ఈ విధానాన్ని నిషేధించింది" అని మిస్ కిమ్ అన్నారు.

"ఇలా పత్రాలను పంపడం మానవత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న నేరం" అని అన్నారు.

వస్తువులను కలుషితం చేయడం ద్వారా ప్రమాదకరమైన రోగాన్ని వ్యాప్తి చేశారని ఆమె ఆరోపించినట్లు నార్త్ కొరియా ప్రభుత్వ వార్తా సంస్థ కే సిఎన్ ఏ అంది.

దక్షిణ కొరియా చర్యకు గట్టిగా సమాధానం చెబుతామని ఆమె హెచ్చరించారు.

ఆమె ప్రసంగంలో సోదరుని ఆరోగ్యం గురించి ప్రస్తావించారు.

ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నప్పుడు కూడా ప్రజల కోసం ఆలోచిస్తూ ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదని అన్నారు.

నార్త్ కొరియాలో కోవిడ్ పరీక్షల కోసం పరికరాలు లేకపోవడంతో ఈ ఇన్ఫెక్షన్ లను జ్వరం కిందే పరిగణించింది.

ఇంతలో కోవిడ్ పై విజయం సాధించినట్లు కిమ్ ప్రకటిస్తూ, ఉత్తర కొరియా ప్రజల పోరాట తత్వాన్ని ప్రశంసించారు.

నార్త్ కొరియాలో ఉన్న కోవిడ్ నిబంధనలను సడలించాలని ఆయన ఆదేశించారు. కోవిడ్ సోకి దేశంలో 74 మరణాలే చోటు చేసుకోవడం అద్భుతం అని అన్నారు.

జులై 29 తర్వాత నార్త్ కొరియాలో కోవిడ్ కేసులను ప్రకటించలేదు. కానీ, ఈ దేశంలో కోవిడ్ పరీక్షలు అత్యంత తక్కువ స్థాయిలో జరుగుతున్నాయని అంతర్జాతీయ పరిశీలకులు అంటున్నారు.

ఈ దేశం చెబుతున్న గణాంకాలు నమ్మడం కష్టమని నిపుణులు అంటున్నారు. ఈ దేశంలో ప్రపంచంలోనే అత్యంత దారుణమైన వైద్య వ్యవస్థ ఉందని అంటారు. ఇక్కడ ఐసియూ సౌకర్యాలు అతి తక్కువగా ఉండటంతో పాటు కోవిడ్ చికిత్సకు ఔషధాలు కానీ, వ్యాక్సిన్లు కానీ అందుబాటులో లేవని అన్నారు.

మహమ్మారి సమయంలో ఈ దేశంలో వ్యాక్సీన్ కార్యక్రమం అమలు జరగలేదు. నార్త్ కొరియా పూర్తిగా లాక్ డౌన్లు, గృహ వైద్యం పైనే ఆధారపడింది. ఈ విధానాన్ని "కొరియా స్టైల్ సోషలిస్ట్" విధానం అని కిమ్ వర్ణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)