Jaali Technique: ఇళ్లు ఇలా కట్టుకుంటే ఏసీల అవసరం తగ్గుతుంది, మరి కట్టడానికి ఇబ్బందులేంటి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఫెషా తబస్తుమ్ అజ్మీ
- హోదా, బీబీసీ ఫ్యూచర్
నోయిడాలోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌లోకి అడుగుపెట్టిన వెంటనే ‘‘తాజ్ మహల్’’ నిర్మాణ శైలికి మనకు గుర్తుకు వస్తుంది.
తెల్లని రంగు, చిన్నచిన్న రంధ్రాలతో జాలీలా కనిపించే ఇక్కడి గోడలు అచ్చంగా తాజ్ మహల్ గోడల్లానే ఉంటాయి.
జాలీ గోడల మధ్య నుంచి వచ్చే కాంతులతో ఈ భవనం లోపల పరిసరాలు కాంతిమంతంగా కనిపిస్తుంటాయి. తక్కువ విద్యుత్‌ను వినియోగించడంతోపాటు కార్బన ఉద్గారాలను తక్కువగా విడుదల చేయడం ఈ భవనం ప్రత్యేకత. అమెరికా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సస్టైనబిలిటీ సర్టిఫికేషన్ (లీడర్‌షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ డిజైన్ - లీడ్) దీనికి ప్లాటినం రేటింగ్ ఇచ్చింది.
జాలీ గోడలు ఎక్కువగా మధ్య, దక్షిణాసియాలలో కనిపిస్తాయి. సాధారణంగా మార్బుల్ లేదా రెడ్ శాండ్‌స్టోన్‌ను చెక్కుతూ వీటిని తయారుచేస్తారు. 16 నుంచి 18 శతాబ్దాల మధ్య భారత్‌లో ఇలాంటి నిర్మాణాలు ఒక ప్రత్యేక శైలిగా మొదలయ్యాయి.
17వ శతాబ్దం మధ్యలో ఆగ్రాలో నిర్మించిన తాజ్ మహల్‌లోనూ ఈ జాలీ గోడలు కనిపిస్తాయి. 1799లో జైపుర్‌లో రాజ్‌పుత్‌లు నిర్మించిన ‘‘హవా మహల్ (విండ్ ప్యాలస్)’’లోనూ ఇలాంటి 953 జాలీ గోడలు కనిపిస్తాయి. చల్లని గాలి భవనమంతా తిరుగాడేలా వీటిని ఏర్పాటుచేశారు.
‘‘భవనానికి వన్నె తీసుకురావడంతోపాటు ఈ జాలీ గోడల వల్ల చల్లని గాలి లోపలకు వస్తుంది. ఎండ నుంచి రక్షణ ఇస్తాయి. అదే సమయంలో మనకు ప్రైవసీ కూడా ఉంటుంది’’అని ఆర్కిటెక్చర్ నిపుణుడు యతిన్ పాండ్య చెప్పారు. సస్టైనబుల్ డిజైన్‌పై యతిన్ పుస్తకాలు కూడా రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
పాత విధానంతో ఎన్నో ప్రయోజనాలు..
కార్బన ఉద్గారాలు తగ్గించే కూలింగ్ వ్యవస్థల కోసం ఆర్కిటెక్చర్ నిపుణులు నేడు అన్వేషిస్తున్నారు. దీంతో పురాతన కట్టడాలపై వారి దృష్టి పడుతోంది.
భవన నిర్మాణ రంగాన్ని వాతావరణ మార్పుల సమస్య వెంటాడుతోంది. భవనాల నుంచి వస్తున్న ఉద్గారాలు 2019 తర్వాత మళ్లీ గరిష్ఠానికి పెరుగుతున్నాయి. ప్రపంచ కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల్లో వీటి వాటా 38 శాతం వరకు ఉంటోంది.
భవనాలను చల్లబరిచేందుకు ఎక్కువ విద్యుత్ ఖర్చవుతోంది. ముఖ్యంగా చాలా ఎక్కువ ఏసీలను వీటిలో వాడుతున్నారు. 2050 నాటికి ఈ ఏసీల సంఖ్య మూడు రెట్లు పెరుగుతుందని అంచనా. నేడు భారత్, చైనా మొత్తంగా కలిపి వినియోగిస్తున్న విద్యుత్ అప్పుడు కేవలం ఏసీలకు మాత్రమే సరిపోతుంది.
అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా హీట్‌వేవ్‌ల తీవ్రత, సంఖ్య కూడా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం భారత్‌పైనా కనిపిస్తోంది. ఈ ఏడాది దిల్లీలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు 49 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగాయి.
విపరీత పట్టణీకరణ, పెరుగుతున్న ఉష్ణోగ్రతల నడుమ సుస్థిర, హరిత, ఇంధన ఖర్చును తగ్గించే కూలింగ్ వ్యవస్థల కోసం భారత్ అన్వేషిస్తోంది.
2019లో భారత ప్రభుత్వం ‘‘ఇండియా కూలింగ్ యాక్షన్ ప్లాన్’’ను తీసుకొచ్చింది. దీనిలో సుస్థిర, ఇంధనాన్ని తగ్గించే కూలింగ్ వ్యవస్థల కోసం తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. భవన నిర్మాణంలో మార్పులకు దీనిలో పెద్దపీట వేశారు. వీటివల్ల భవనాలు వాతావరణ మార్పులను తట్టుకొని నిలబడతాయని, ‘‘అర్బన్ హీట్ ఐలాండ్’’ ప్రభావాన్ని కూడా తగ్గిస్తాయని పేర్కొన్నారు.
హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే ఉష్ణోగ్రతల వల్ల భవనాలు, రోడ్లు బాగా వేడెక్కి రాత్రిపూట కూడా వేడిగా ఉండేందుకు కారణం కావడం.
‘‘అధిక ఉష్ణోగ్రతల ముప్పు భారత్‌ను వెంటాడుతోంది. రానున్న రోజుల్లో ఈ ముప్పు మరింత పెరుగుతుంది. ఫలితంగా ఎయిర్ కండిషనర్లు మరిన్ని అవసరం అవుతాయి. దీంతో కార్బన ఉద్గారాలు ఎక్కువవుతాయి. మొత్తంగా ఇది భూమి వేడెక్కేందుకు కారణం అవుతోంది’’అని బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన శాస్త్రవేత్త జే శ్రీనివాసన్ చెప్పారు.
భవనాలను చల్లబరిచేందుకు మనం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఆయన సూచించారు.
ఇందుకోసం కొందరు ఆర్కిటెక్ట్‌లు జాలీ గోడలు లాంటి సంప్రదాయ మార్గాలవైపు చూస్తున్నారు. ‘‘గదిని చల్లగా ఉంచేందుకు, గాలి ఆడేందుకు ఇది ఎకో ఫ్రెండ్లీ విధానం లాంటిది’అని నెట్ జీరో బిల్డింగ్స్‌పై పరిశోధన చేపడుతున్న దిల్లీలోని జెడ్ ల్యాబ్ వ్యవస్థాపక డైరెక్టర్, ఆర్కిటెక్ట్ సచిన్ రస్తోగీ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
70శాతం విద్యుత్ ఆదా..
సంప్రదాయ కూలింగ్ వ్యవస్థలు, భవన నిర్మాణాల్లో మార్పులతో ఇంటి లోపల ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించుకోవచ్చు. దీంతో ఎయిర్ కండిషనర్ల అవసరం తగ్గుతుంది. మొత్తంగా మనకు 70 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుంది.
జాలీ గోడల వల్ల లోపలకు వచ్చే వేడి తగ్గుతుంది. సంప్రదాయ జాలీ గోడల్లో మార్బుల్ లేదా శాండ్‌స్టోన్ మందం పరిమాణానికి సమానంగా రంధ్రాలు ఉండేవని పాండ్య చెప్పారు. ‘‘గోడల మందం, రంధ్రాల పరిమాణం ఇలా ఉండటం వల్ల సూర్యరశ్మి వేడి లోపలకు రాదు. అదే సమయంలో కాంతి మాత్రం వస్తుంది’’అని ఆయన అన్నారు.
జాలీ గోడల కూలింగ్ వ్యవస్థ అనేది ‘‘వెంచురి ఎఫెక్ట్’’ మీద ఆధారపడుతుంది. ఎయిర్ కండిషనర్ కూడా ఇలానే పనిచేస్తుంది. ‘‘ఈ రంధ్రాల గుండా వెళ్లినప్పుడు గాలి వేగం పెరుగుతుంది. దీంతో భవనం లోలోపలకు అది చొచ్చుకుని వెళ్తుంది. రంధ్రాలు చిన్నగా ఉండటం వల్ల గాలిపై చాలా ఒత్తిడి పడుతుంది. ఫలితంగా ఒకసారి రంధ్రం నుంచి అవతలికి వెళ్లిన వెంటనే వ్యాకోచించి చల్లదనానికి కారణం అవుతుంది’’అని పాండ్య చెప్పారు.

ఫొటో సోర్స్, Alamy
సహజ కాంతి లోపలకు వచ్చేలా..
‘‘ఆధునిక కట్టడాల్లో జాలీ లాంటి నిర్మాణాలు పూర్తిగా కనుమరుగు అయ్యాయి. అయితే, భూతాపం వల్ల మళ్లీ అందరి దృష్టి వీటిపై పడుతోంది’’అని పాండ్య అన్నారు. ‘‘సంప్రదాయ నిర్మాణ శైలిలో చాలా విధానాలు వాతావరణ పరిస్థితులకు తట్టుకొని నిలబడగలవు’’అని ఆయన వివరించారు.
చైనాలోని ఫాషన్ నగరంలో ఐ-సిటీ కాంప్లెక్స్ నుంచి ఫ్రాన్స్‌లోని క్యాప్ డీఅగేడ్‌లో నకారా హోటల్, స్పెయిన్‌లోని కార్డోబా హాస్పిటల్ లాంటి ఆధునిక కట్టడాల్లో జాలీ గోడలు కనిపిస్తాయి. ఇవి సహజ కాంతిని లోపలకు వచ్చేలా చూడటంతోపాటు విద్యుత్ ఖర్చులను కూడా తగ్గిస్తున్నాయి.
‘‘జాలీ గోడలు మళ్లీ క్రమంగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ముఖ్యంగా సుస్థిర, పర్యావరణహిత కట్టడాలవైపు చూసేవారు వీటిని ఎంచుకుంటున్నారు’’అని బ్రిటన్‌లోని నాటింగ్‌హమ్ యూనివర్సిటీ పరిశోధకురాలు అయేషా బటూల్ అన్నారు. 2018లో ఆమె చేపట్టిన అధ్యయనంలో జాలీ గోడలు మెరుగ్గా పనిచేస్తాయని వెల్లడైంది.
‘‘జాలీ గోడలతో వేడిని అడ్డుకోవచ్చు. చూడటానికి కూడా ఇవి చక్కగా కనిపిస్తాయి’’అని బటూల్ అన్నారు. ‘‘ముఖ్యంగా సంప్రదాయ విధానాల నుంచి మనం చాలా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. నేడు మనం ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు అవి పరిష్కారం చూపిస్తాయి’’అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండు జాలీ గోడలతో..
దిల్లీలోని పంజాబ్ కేసరి పత్రిక ప్రధాన కార్యాలయంలోనూ ఈ సంప్రదాయ జాలీ గోడలు కనిపిస్తాయి. వీటిని ‘‘స్టూడియో సింబయోసిస్’’ ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. సహజ సిద్ధమైన కాంతిని లోపలకు ఆహ్వానించడం, వేడిని తగ్గించడం, లోపలకు గాలి బయటకు-బయట గాలి లోపలకు రావడం లాంటి ఎన్నో ప్రయోజనాలు ఈ జాలీ గోడలతో ఉంటాయని స్టూడియో సింబయోసిస్ సహ వ్యవస్థాపకుడు బ్రిట్ట నోబెల్ గుప్తా అన్నారు. ఈ డిజైన్ సంస్థకు అవార్డులు కూడా తెచ్చిపెట్టింది.
‘‘రెండు జాలీ గోడలతో మరింత మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి. వీటి వల్ల చల్లగాలి మాత్రమే లోపలకు వస్తుంది. ఇది చిమ్నీలా పనిచేస్తుంది’’అని నోబెల్ గుప్తా అన్నారు. దీని వల్ల మనం ఎయిర్ కండిషనర్లపై ఒత్తిడి తగ్గుతుంది.
ఒక్కో గోడలో రంధ్రాలను ప్రత్యేకంగా డిజైన్ చేసేందుకు సంస్థ డిజిటల్ సిమ్యులేషన్లను ఉపయోగించింది. సూర్యరశ్మి ఎలా గోడలపై పడుతోందనే విధానం ఆధారంగా వీటిని డిజైన్ చేశారు. ఉత్తరం వైపుండే గోడపై ఎక్కువగా వేడి పడటంతో ఆ గోడలపై జాలీలను ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. మొత్తంగా పగటిపూట ఎలాంటి లైట్లు అవసరం లేకుండా ఈ ఆఫీసును తీర్చిదిద్దినట్లు గుప్తా అన్నారు.
గురుగ్రామ్‌లోని సెయింట్ ఆండ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్‌లోని విద్యార్థుల హాస్టళ్లలోనూ ఇలానే జాలీ గోడలను ఏర్పాటుచేశారు.
ఈ భవంలో భౌతిక శాస్త్ర సూత్రం ‘‘స్టాక్ ఎఫెక్ట్’’ను మనం ప్రత్యేకంగా గమనించొచ్చు. అంటే జాలీలోని ఒక్కో ఇటుకను ప్రత్యేక కోణంలో అమర్చారు. దీంతో లోపలకు వచ్చే సూర్యరశ్మిని మెరుగ్గా నియంత్రించొచ్చు. ‘‘ఈ జాలీ గోడలు నేరుగా పడే ఎండను 70 శాతం వరకు అడ్డుకుంటాయి. ఫలితంగా లోపల వేడి తగ్గుతుంది’’అని రస్తోగి చెప్పారు. ఈ బిల్డింగ్‌ను ఆయనే కట్టారు. వేడి గాలిని బయటకు పంపించేలా దీన్ని ప్రత్యేకంగా నిర్మించారు.
ఈ జాలీల వల్ల విద్యుత్ బిల్లులు తగ్గాయి, ముఖ్యంగా ఏసీల అవసరం 35 శాతం వరకూ తగ్గిందని రస్తోగీ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భిన్న దేశాల్లోనూ ఇలానే..
మరికొన్ని దేశాల్లోనూ ఇలాంటి జాలీ గోడల వినియోగం పెరుగుతోంది. స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్‌లోని ద హిస్పాశాట్ శాటిలైట్ కంట్రోల్ సెంటర్ కూడా ఇలానే కట్టారు. ఈ జాలీ గోడల్లో మూడు రకాల రంధ్రాలు ఉన్నాయి. ఇవి కాంతిని మెరుగ్గా నియంత్రింగలవు.
‘‘రెండో గోడగా 5 మి.మీ. మందంలో మెటల్ షీట్లు ఏర్పాటుచేశాం’’అని ఈ బిల్డింగ్ కట్టిన సంస్థ ఈ-స్టూడియో హెరెరోస్ ఆర్కిటెక్ట్ జువాన్ హెరెరోస్ అన్నారు. ‘‘నేరుగా పడే సూర్యకాంతిని తగ్గిస్తూ.. మనకు అవసరమైన మొత్తంలో కాంతిని లోపలకు ఆహ్వానించడం ఈ గోడల ప్రత్యేకత’’అని ఆయన వివరించారు.
భవనంలోని ప్రధాన గోడకు జాలీ గోడకు మధ్య మూడు అడుగుల దూరం ఉంది. ఇది వెంటిలేషన్ రూట్‌లా పనిచేస్తుందని జువాన్ అన్నారు.
ఆధునిక సాంకేతికల వల్ల ఈ జాలీలు మరింత మెరుగవుతున్నాయి. ప్రకృతిలో సహజసిద్ధంగా కనిపించే, ఉష్ణాన్ని నిలువరించే విధానాలను జాలీ గోడలకూ అందిస్తున్నారు. మన చర్మం వేల కొద్దీ చిన్న రంధ్రాలతో ఎలా గాలిని బయటకు, లోపలకు పంపిస్తుందో.. అలానే పనిచేసేలా ఈ గోడలను తీర్చిదిద్దుతున్నారు.
అబుధాబిలోని కఠినమైన ఎడారిలో కట్టిన అల్-బహర్ టవర్స్‌లోనూ ఈ గోడలు కనిపిస్తాయి. బ్రిటన్‌కు చెందిన ఏడాస్ ఆర్కిటెక్ట్స్ దీన్ని నిర్మించారు. ఎండకు తగినట్లుగా తెరచుకోవడం, మూసుకుపోవడం ఈ గోడల ప్రత్యేకత. జాలీతోపాటు మష్రాబియాల ఆధారంగా ఈ గోడలను కట్టారు. అరబ్ దేశాల జాలీ గోడలను మష్రాబియాగా పిలుస్తారు. వీటిని సాధారణంగా చెక్కలతో తయారుచేస్తారు.
‘‘మష్రాబియా విధానం చాలా మెరుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా నేరుగా పడే సూర్యరశ్మిని 20 శాతం వరకు తగ్గిస్తుంది’’అని ఈ సాంకేతికత వెనకున్న ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ అరుప్ మాజీ డైరెక్టర్ జాన్ లీల్ అన్నారు.
‘‘సూర్యరశ్మిలో మార్పులకు అనుగుణంగా ఈ మష్రాబియాలోని మోటర్లు పనిచేస్తాయి. భవనం లోపల తగిన మొత్తంలో కాంతి ఉండేలా చూస్తాయి’’అని జాన్ వివరించారు.
ఈ జాలీ గోడను భవనానికి రెండు మీటర్ల దూరంలో ఏర్పాటుచేశారు. సూర్యుడు కదిలేటప్పుడు ఈ భవనంపై నీడ చక్కగా పడేలా మష్రాబియాలోని మోటర్లు పనిచేస్తాయి. దీని వల్ల ఏసీల నుంచి వచ్చే కార్బన ఉద్గారాలు 40 శాతం వరకు తగ్గుతాయని అరుప్ తెలిపింది.
కొన్ని సమస్యలు కూడా..
జాలీల వాడకం పెరుగుతున్నప్పటికీ, ఇక్కడ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఈ గోడల్లోని కన్నాల్లో పురుగులు, కీటకాలు గూళ్లు కడుతుంటాయి. అద్దాలు లేదా చెదల మందుతో ఈ సమస్యను పరిష్కరించొచ్చు.
మరోవైపు మోటర్లతో కదిలే జాలీ గోడలను తయారుచేయడానికి చాలా సమయం పడుతోంది. పైగా ఇవి ఖరీదైనవి.
మార్బుల్ లాంటి సంప్రదాయ రాళ్లతోనూ ఈ జాలీ గోడలను కట్టడం కాస్త ఖర్చుతో కూడుకున్న పనే. ఒక్కోసారి ఈ గోడల్లో ఉపయోగించే పదార్థాలు వాతావరణానికి తట్టుకొని నిలబడలేకపోతున్నాయి.
నేడు చాలా జాలీలను ఫైర్‌బోర్డు, కాంక్రీటు, ఇటుకలు, చెక్కలు, రాళ్లు, పీవీసీ లేదా ప్లాస్టర్లతో నిర్మిస్తున్నారు.
పొడి ప్రాంతాల్లో చెక్కలతో కాస్త ఉపయోగం ఉంటుంది. ఎండకు మొక్కల్లోని నీరు బయటకు వచ్చినట్టే, ఇవి రాత్రిపూట గాలిలో నీటిని పీల్చుకొని, వేడిగా ఉండేటప్పుడు వాటిని విడుదల చేస్తాయి. ఫలితంగా లోపల కాస్త చల్లగా ఉంటుంది.
అయితే, ఈ జాలీలు ఒక్కో వాతావరణంలో ఒక్కోలా పనిచేస్తాయి. అన్నిచోట్లా ఒకేలాంటి జాలీలు పనిచేయవు.
పొడి వాతావరణంలో ఉండే ప్రాంతాల్లో పది సెంటీ మీటర్ల మందంలోని 30 శాతం రంధ్రాలతో ఉండే గోడలు మెరుగ్గా పనిచేస్తాయి. అదే కాస్త చల్లగా ఉంటే రంధ్రాలను మరికొంత పెంచాల్సి ఉంటుంది.
అయితే, ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ జాలీ గోడలతో విద్యుత్ వినియోగం తగ్గుతుందని, సహజ సిద్ధమైన కాంతి లోపలకు వచ్చేలా ఇవి తోడ్పడతాయని రస్తోగీ అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- పురుషులలో సంతాన లోపం: పిల్లలు లేని మగవారు పడే అవమానాలను ఆపేదెలా?
- కుక్కలు మనుషుల్ని ఎందుకు కరుస్తాయి, వాటితో జాగ్రత్తగా ఎలా మెలగాలి?
- ఓనం బంపర్ లాటరీలో రూ.25 కోట్లు గెలుచుకున్న ఆటోడ్రైవర్, ట్యాక్స్ పోగా ఆయన చేతికొచ్చేది ఎంత?
- ఆంధ్రప్రదేశ్: 16 ఊళ్ళు ఏకమై ప్రభుత్వం చేయలేనిది చేసి చూపించాయి
- మ్యూచువల్ ఫండ్స్: ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














