ఫ్రాన్స్ ప్రభుత్వ నిబంధన: ‘ఏసీలు వాడుతున్నప్పుడు షాపుల తలుపులు మూసేయాలి.. లేదంటే భారీ జరిమానా చెల్లించాలి’

ఫ్రాన్స్‌లో దుకాణాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్‌లో దుకాణాలు

ఇంధన వృథా నియంత్రణ కోసం చర్యలు తీసుకునే దిశగా ఫ్రాన్స్ అడుగులు వేస్తోంది.

అందులో భాగంగా దుకాణాలలో ఏసీలు వాడుతున్నప్పుడు తలుపులు మూసి ఉంచాలని, నియాన్ లైట్ల వినియోగం తగ్గించాలని త్వరలో ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఆ దేశ మంత్రి ఒకరు తెలిపారు.

ఫ్రాన్స్‌లో ఈ నిబంధనలు ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో అమలులో ఉండగా ఇకపై దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి.

ఫ్రాన్స్ పర్యావరణ మంత్రి ఆగ్నస్ పన్నియర్ రూనాచర్ ఈ మేరకు 'డ్యు దిమాంచి' న్యూస్‌పేపర్‌తో ఈ విషయం చెప్పారు.

యుక్రెయిన్, రష్యా యుద్ధం నాటి నుంచి ఐరోపాలో ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఇంధన వృథా నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు.

వీడియో క్యాప్షన్, ఏసీల కరెంటు బిల్లు తగ్గించేందుకు 8 మార్గాలు..

ఏసీలు వాడుతున్నప్పుడు దుకాణాల తలుపులు వేసుకోకుంటే దుకాణాలకు 750 యూరోల(సుమారు రూ. 62,000) వరకు జరిమానా విధిస్తారు.

స్థానిక రేడియో ఆర్ఎంసీతో కూడా పర్యావరణ మంత్రి ఇదే విషయం చెప్పారు. ఏసీలు వాడుతున్నప్పుడు తలుపులు మూయకపోవడమనేది సరికాదని ఆమె అన్నారు.

ఇంధన వృథాపై త్వరలో రెండు ఆదేశాలు జారీచేయనున్నట్లు మంత్రి చెప్పారు.

నగరం పెద్దదా చిన్నదా అని కాకుండా ప్రతి నగరంలోనూ రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 6 గంటల మధ్య నియాన్ దీపాలతో ప్రకాశవంతమైన ప్రకటనలను ప్రదర్శించడంపై నిషేధం విధిస్తూ తొలి ఆదేశం జారీ చేస్తారు.

రెండోది ఏసీలు పనిచేస్తున్నప్పుడు తలుపులు మూసుకోకపోతే జరిమానాలు విధించడంపై ఉంటుంది.

ఎయిర్ కండిషనర్లు

ఫొటో సోర్స్, EPA

కాగా ఫ్రాన్స్‌లో ఇప్పటికే 8 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న నగరాలలో నియాన్ సైన్‌బోర్డుల వినియోగంపై నిషేధం ఉంది. ఎయిర్‌పోర్టులు, స్టేషన్లకు దీన్నుంచి ప్రస్తుతం అక్కడ మినహాయింపు ఉంది.

రష్యా నుంచి గ్యాస్ సరఫరా తగ్గడంతో యూరోపియన్ యూనియన్‌లో ఇంధన సరఫరాలో కోటా విధించే అవకాశాలను కొట్టిపారేయలేమని 'షెల్' సంస్థ తెలిపింది.

మరోవైపు ఫ్రాన్స్‌లో వాతావరణం చాలా వేడిగా ఉంటుండడంతో ఏసీల వాడకం పెరుగుతోంది.

వీటన్నిటి నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)