రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్రతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఢీ కొట్టగలరా?

రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, facebook/IndianNationalCongress

    • రచయిత, నిఖిల్ ఈనాందార్
    • హోదా, బీబీసీ న్యూస్, ముంబై

భారతదేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో’ పేరుతో దేశవ్యాప్తంగా చేపట్టిన సుదీర్ఘ సమైక్యతా పాదయాత్ర సగానికి పైగా ముగిసింది.

ఐదు నెలల పాటు మొత్తం 2,000 కిలోమీటర్లకు పైగా దూరం సాగే రాహుల్ పాదయాత్ర తమిళనాడులోని కన్యాకుమారిలో మొదలైంది. వచ్చే ఫిబ్రవరిలో జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో ఈ యాత్ర ముగుస్తుంది.

భారతదేశంలో అత్యంత సంపన్న రాష్ట్రమైన మహారాష్ట్రలో అత్యంత పేద ప్రాంతమైన విదర్భ గుండా ఈ పాదయాత్ర సాగుతున్నపుడు రాహుల్ గాంధీని బీబీసీ కలిసింది. రైతుల ఆత్మహత్యలతో విదర్భ ప్రాంతం తరచుగా పతాక శీర్షకల్లో కనిపిస్తుంటుంది.

మహిళా పార్టీ కార్యకర్తలు, క్వీర్ హక్కుల బృందాలు, వృద్ధాప్య పింఛన్ల ఉద్యమకారులు గుంపులు గుంపులుగా వెంట నడుస్తుండగా.. ‘‘ఈ పాదయాత్ర ద్వారా భారతదేశమనే భావనకు ప్రత్యామ్నాయ దృక్పథాన్ని అందించటానికి’’ తాను ప్రయత్నిస్తున్నాని రాహుల్ చెప్పారు.

‘‘మరింతగా కృషి చేస్తే.. అధికార భారతీయ జనతా పార్టీని మట్టికరిపించే సామర్థ్యం దీనికి ఉంది’’ అని పేర్కొన్నారు.

ఈ వాదన ఆయన మద్దతుదారులను ఉత్సాహపరుస్తోంది. అయితే విమర్శకులు సందేహిస్తున్నారు. ఒకప్పుడు తన ఉచ్ఛస్థితిలో భారతదేశంలో సుదీర్ఘ కాలం పాటు అతి పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది.

ముక్కలు కాని దేశాన్ని అతికించటానికి చేస్తున్న ప్రయత్నమంటూ రాహుల్ గాంధీ పాదయాత్రను బీజేపీ కొట్టివేసింది.

రాహుల్ గాంధీ పాదయాత్ర

ఫొటో సోర్స్, NIKHIL INAMDAR/BBC

అయితే గత 75 రోజులుగా సాగుతున్న ఈ పాదయాత్రలో కొందరు బాలీవుడ్ నటులు, పలువురు విద్యావేత్తలు, ఉద్యమకారులతో పాటు.. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించే ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు సైతం రాహుల్‌కు మద్దతు తెలుపుతూ ఈ యాత్రలో చేరారు.

విదర్భ గ్రామీణ రోడ్లకు ఇరువైపులా పెద్ద పెద్ద పార్టీ జెండాలు, భారీ రాహుల్ పోస్టర్లు బారులు తీరాయి. ఆ రోడ్ల మీద వడివడిగా అడుగులు వేస్తున్న రాహుల్ వేగాన్ని అందుకోవటానికి పరిగెడుతున్నట్లుగా నడుస్తూ మేం ఆయనతో మాట్లాడాం.

వందలాది మంది జనం యువకులు, రాజకీయాలు తెలియని స్కూలు పిల్లలు, డ్యాన్సర్లు.. రోడ్లకు ఇరువైపులా వరుస క్రమంలో నిల్చుని సంప్రదాయ లాజియుం జానపద నాట్యం ప్రదర్శిస్తున్నారు. యాత్ర గ్రామాల గుండా వెళుతున్నపుడు జనం తమ ఇళ్ల పైకప్పుల మీద నిల్చుని చేతులు ఊపుతున్నారు. పార్టీ కార్యకర్తలు ‘నఫ్రత్ చోడో, భారత్ జోడో (ద్వేషాన్ని వీడండి, దేశాన్ని కలపండి)’ అని ముక్తకంఠంతో నినాదాలు చేస్తున్నారు.

ముందు రోజు ఈ యాత్రలో భాగంగా కాంగ్రెస్ నిర్వహించిన ఒక బహిరంగ సభకు లక్ష మందికి పైగా జనం హాజరయ్యారు. ఆ సభలో రాహుల్ ప్రసంగిస్తూ.. అధికార పార్టీ ‘విభజన రాజకీయాల’ను నిరసిస్తూ ఉద్రేకంగా ప్రసంగించారు.

రాహుల్ గాంధీ వెంట వందల కిలోమీటర్లు నడిచిన సామాన్య జనం కొందరితో బీబీసీ మాట్లాడింది.

రాహుల్ గాంధీ, తుషార్ గాంధీ

ఫొటో సోర్స్, CONGRESS

హైదరాబాద్‌కు చెందిన ఒక మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్.. 2014 ఎన్నికల్లో తాను ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, బీజేపీకి ఓటు వేశానని, కానీ ప్రస్తుత ప్రభుత్వం పట్ల ‘భ్రమలు తొలగిపోవటంతో’ తాను రాహుల్ పాదయాత్రలో పాల్గొంటున్నానని చెప్పారు.

పుణె నగరంలో ఐస్‌క్రీమ్ పార్లర్ నడిపే ఒక జంట.. భారత విశ్వవిద్యాలయాలను రాజకీయం చేస్తున్నారంటూ దానికి నిరసనగా బ్యానర్లు పట్టుకుని ప్రదర్శించారు.

చాలా మంది గ్రామస్తులు.. తాము ఉంటున్న ప్రాంతంలో ఇంత ఘనమైన కార్యక్రమేమీదీ ఎప్పుడూ జరగలేదని, కాబట్టి ఆసక్తిగా వచ్చామని తెలిపారు.

మహాత్మా గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీ ఈ యాత్రలో ఒక రోజు మొత్తం పాల్గొంటున్నారు. ‘‘భారతదేశం కోల్పోయిన ఉదార, లౌకిక, సమ్మిళిత, పురోగామి విలువలను ఈ యాత్ర మళ్లీ రాజేస్తుందనే ఆశతో ఇక్కడికి వచ్చాను’’ అని ఆయన చెప్పారు.

బీజేపీకి అనుకూలంగా ఉండే భారతీయ మీడియాలోని చాలా వర్గాలు ఈ యాత్రను పెద్దగా పట్టించుకోనప్పటికీ.. రాహుల్ గాంధీ ఇప్పటి వరకూ నడిచిన ఐదు రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో ప్రజాసమూహాలను కూడగట్టగలిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

కానీ ఈ యాత్ర సామర్థ్యం గురించి విస్తృత ప్రశ్నలు ఇంకా అలాగే ఉన్నాయి.

జవసత్వాలుడిగిన ఘనమైన పురాతన పార్టీకి, ఇటీవల దారుణ ఓటములు ఎదుర్కొన్న పార్టీకి ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు అందించటానికి ఈ యాత్ర తోడ్పడుతుందా?

అనాసక్తంగా రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రతిర్థులు విమర్శించే రాహుల్ గాంధీ పట్ల దృక్పథాలను ఈ యాత్ర మారుస్తుందా?

రాహుల్ గాంధీ పాదయాత్ర

ఫొటో సోర్స్, NIKHIL INAMDAR/BBC

‘‘ఆయన రాజకుమారుడు కాదు. అది ఆయన ప్రత్యర్థులు సృష్టించిన చిత్రం’’ అంటారు కన్హయ్య కుమార్. సరిగ్గా ఇలాంటి ‘‘ప్రచారాన్నే’’ క్షేత్ర స్థాయిల్లో తిప్పికొట్టటం ఈ యాత్ర ఉద్దేశమని చెప్పారు. మాజీ విద్యార్థి నేత అయిన కన్హయ్య ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ప్రజలను ఆకట్టుకునేలా ప్రసంగించగల ఆయన వాక్చాతుర్యాన్ని రాహుల్ యాత్రలో సంపూర్ణంగా వాడుకుంటున్నారు.

ఈ యాత్ర ఎన్నికల మీద దృష్టి పెట్టి చేపట్టిన యాత్ర కాదని కాంగ్రెస్ పార్టీ పలుమార్లు చెప్పింది. అయితే.. ఓటర్లతో భావేద్వేగ బంధాన్ని మళ్లీ నెలకొల్పుకోవటం కూడా ఈ యాత్ర కారణాల్లో ఒకటని కన్హయ్య కుమార్ అంగీకరించారు. అందుకే రాహుల్ గాంధీ తన ప్రసంగాల్లో ఆర్థికవ్యవస్థ, జీవన వ్యయం, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యల విషయంలో బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.

పార్టీ కార్యకర్తలను క్షేత్రస్థాయిలో కలవటం కూడా కాంగ్రెస్ పార్టీని కింది స్థాయి నుంచి ‘‘వ్యవస్థాగతంగా పునరుత్తేజితం’’ చేస్తోందని సీనియర్ నాయకుడు జైరాం రమేష్ పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ ఈ పాదయాత్ర చేపట్టినప్పటి నుంచీ ఆయన పాపులారిటీ (ప్రజాదరణ) రేటింగ్‌లు కూడా స్వల్పంగా పెరిగాయి.

రాహుల్ గాంధీ పనితీరు పట్ల.. ఆయన నడిచిన అన్ని రాష్ట్రాల్లో ఆయన యాత్ర ప్రారంభించటానికి ముందు పోలిస్తే యాత్ర తర్వాత ప్రజల్లో సంతృప్తి 3 నుంచి 9 శాతం మేర పెరిగిందని పోలింగ్ సంస్థ సీ-ఓటర్ చెప్తోంది.

అయితే ఈ స్వల్ప స్థాయి మెరుగుదలలు.. 2024 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి గట్టి సవాలు ఇవ్వగల నేతగా రాహుల్ ఆవిర్భవించాలంటే ఆయన ఇంకా ఎంతగా కృషి చేయాల్సి ఉంటుందనే విషయాన్ని కూడా ఎత్తి చూపుతున్నాయి.

రాహుల్ గాంధీ పాదయాత్ర

ఫొటో సోర్స్, Congress

బీజేపీకి బలమైన పట్టులేని ‘‘దక్షిణాది రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ ప్రతిష్టకు మరమ్మతు చేయటానికి’’ ఈ యాత్ర ఉపయోగపడిందని సీ-ఓటర్ వ్యవస్థాపక డైరెక్టర్ యశ్వంత్ దేశ్‌ముఖ్ పేర్కొన్నారు. ఆ ప్రయోజనాన్ని ఓట్లుగా మలచుకోవటం పూర్తిగా విభిన్నమైన విషయమని ఆయన వ్యాఖ్యానించారు.

‘‘అధికార బీజేపీకి బలమైన పట్టు ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లోకి – లేదా ‘హిందీ హార్ట్‌ల్యాండ్’లోకి – రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రవేశించిన తర్వాత ఆయన వెంట వచ్చే మద్దతుదారులు పలుచబడిపోతారా అనే సందేహం కూడా ఉంది’’ అని యశ్వంత్ చెప్పారు.

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో రాహుల్ యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీకి తక్షణ ఎన్నికల లబ్ధి ఉంటుందా అనేదీ అనుమానమేనని విమర్శకులు అంటున్నారు.

అలాగని, కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలంలో ప్రయోజనం పొందుతుందా లేదా అనేది.. ‘‘యాత్ర ముగిసిన తర్వాత ఆ ఒరవడిని ఎంత సమర్థంగా కొనసాగించగలుతుంది’’ అనే అంశంపై ఆధారపడి ఉంటుందని ఆ పార్టీ మాజీ అధికార ప్రతినిధి సంజయ్ ఝా చెప్పారు. పార్టీని విమర్శించినందుకు గాను 2020లో ఆయనను కాంగ్రెస్ సస్పెండ్ చేసింది.

వీడియో క్యాప్షన్, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కంటైనర్ల కాన్వాయ్ ఎందుకు?

నైతిక స్థైర్యం కోల్పోయిన శ్రేణుల్లో పునరుత్తేజం నింపటం, అంతర్గత కుమ్ములాటలను, బంధుప్రీతిని తగ్గించటం, బీజేపీని విమర్శించటానికే పరిమితం కాకుండా ఒక స్పష్టమైన సైద్ధాంతిక వైఖరిని ఏర్పరచుకోవటం వంటి లోతైన వ్యవస్థాగత సమస్యల పరిష్కారానికి కూడా ఏకకాలంలో కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

బీజేపీకి వలసపోతున్న ఫిరాయిపుదార్ల పట్ల అంత ఉదాశీనంగా ఉండకూడదని, గాంధీ కుటుంబం పట్ల వారసత్వ భావనను తొలగించుకోవటం కూడా ఆ పార్టీకి అవసరమన్నారు.

కాంగ్రెస్ పార్టీ 24 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి చెందని తొలి అధ్యక్షుడిని ఎన్నుకుంది. అయితే గాంధీ కుటుంబానికి విధేయుడైన మల్లిఖార్జున ఖర్గేను వారికి బినామీగా చూస్తున్నారు. అంతర్గత అధ్యక్ష ఎన్నికల్లో విస్తృత నైపుణ్యాలున్న నేతలను దూరం పెట్టారని కూడా ఆ పార్టీ మీద విమర్శలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో.. తన సొంత పార్టీని సమైక్యంగా ఉంచుకోలేని రాహుల్ గాంధీ భారతదేశాన్ని ఎలా ఐక్యం చేయగలరని బీజేపీ ప్రశ్నిస్తోంది. తమ సొంత పార్టీలోనే ప్రజాస్వామ్యం లోపించినపుడు దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ఎలా చెప్తారని విమర్శిస్తోంది.

అయినప్పటికీ.. ప్రతిపక్షాల్లో శూన్యత పెరిగిపోతున్న దేశంలో ఈ పని ఎప్పుడో జరగాల్సిందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఈ పాదయాత్ర మంత్రం దండం కాదు. కానీ 2014 నుంచి అంతకంతకూ దిగజారుతున్న కాంగ్రెస్ పార్టీ పతనాన్ని నిలువరించటానికి ఇది మొదటి గణనీయమైన చర్య కావచ్చునని చెప్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)