టీడీపీ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ ఎవరు? చంద్రబాబు నాయుడు ‘చివరి ఎన్నికలు’ అస్త్రం ఆయనదేనా?

ఫొటో సోర్స్, facebook/TDP.Official
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తొలిసారిగా వైఎస్సార్సీపీ ఒక ఎన్నికల వ్యహకర్తను తెరమీదకు తీసుకొచ్చింది. ఐదేళ్ల క్రితం మంగళగిరి సమీపంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా ఐ ప్యాక్ సంస్థ ప్రతినిధిగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఆపార్టీ శ్రేణుల ముందుకు వచ్చారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ జగన్ ఆయన్ని అందరికీ పరిచయం చేశారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఆ సంస్థ క్రియశీలకంగా వ్యవహరించింది. కీలక పాత్ర పోషించింది. ఫలితాల అనంతరం కూడా సీఎం జగన్ ప్రత్యేకంగా ఐ ప్యాక్ బృందంతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో తనకు సహకరించినందుకు ధన్యవాదాలు కూడా చెప్పారు.
అదంతా గతం. ఇప్పుడు మరోసారి ప్రతిపక్షం అదే పంథాలో సాగుతోందా అనే చర్చ మొదలయ్యింది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తొలిసారిగా ఎన్నికల వ్యూహకర్తను తెరమీదకు తెచ్చింది. గడిచిన కొన్ని నెలలుగా ఆపార్టీ కోసం ఎన్నికల వ్యూహకర్తలు పనిచేస్తున్నారు. కానీ మంగళగిరిలోనే ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విస్తృత సమావేశం సందర్భంగా రాబిన్ శర్మ వేదికనెక్కడం విశేషంగా మారింది. ఆయన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సభకు పరిచయం చేశారు. పార్టీ కార్యక్రమాల గురించి రాబిన్ శర్మ సభలో మాట్లాడారు.
అప్పట్లో ప్రశాంత్ కిషోర్ నాటి ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కోసం పోషించిన పాత్రను ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కోసం రాబిన్ శర్మ పోషిస్తున్నట్టు స్పష్టం అవుతోంది. ఫలితాలు ఎలా ఉంటాయన్నది పక్కన పెడితే ఏపీ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తల పాత్ర పెరుగుతున్న తీరుకి ఇది నిదర్శనమని పలువురు అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, Facebook/TDP.Official
విజయవాడకు మారిన ఐప్యాక్ కార్యాలయం
దిల్లీ స్థాయి రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తలు 2014 ఎన్నికల నాటికే కీలకంగా మారారు. అప్పట్లో బీజేపీ కోసం ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. ఆనాటి సాధారణ ఎన్నికల్లో ఛాయ్ పే చర్చ సహా వివిధ భిన్నమైన కార్యక్రమాల ప్రభావం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఎన్నికల వ్యూహకర్తలు ప్రధాన భూమిక పోషించే పరిస్థితి ఏర్పడింది. ప్రశాంత్ కిషోర్ కి చెందిన ఐ ప్యాక్ సంస్థ ఏపీ రాజకీయాల్లో వైఎస్సార్సీపీ విజయం కోసం పనిచేసింది. సోషల్ మీడియా క్యాంపెయిన్స్ తో పాటుగా కొన్ని నినాదాల రూపకల్పన చేసి ప్రజలను ఆకర్షించడంలో విజయవంతమయిందనే అభిప్రాయం ఉంది.
రాబోయే ఎన్నికలకు అనుగుణంగా ఇప్పటికీ ఐ ప్యాక్ సంస్థ వైఎస్సార్సీపీ తరుపున పనిచేస్తోంది. ఇటీవల ఆపార్టీ ప్లీనరీ సమావేశాల సందర్భంగా ఐ ప్యాక్ ప్రతినిధులు వేదికపై నుంచే కొంత పరిశీలన కూడా చేశారు. సభా ప్రాంగణంలో వివిధ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఇక క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల నానుడి తెలుసుకునేందుకు సర్వేలు చేయడం, రాష్ట్రస్థాయిలో ప్రజలను ఆకట్టుకునేలా సోషల్ మీడియాలోనూ, బయటా కార్యక్రమాల రూపకల్పనలో ఆ సంస్థ పాత్ర నేటికీ ఉందని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు.
దానికి అనుగుణంగా ఇప్పటి వరకూ హైదరాబాద్ కేంద్రంగా నడిచిన ఐప్యాక్ ఇప్పుడు విజయవాడలో కార్యాలయం ఏర్పాటు చేసింది. వైఎస్సార్‌సీపీకి పనిచేస్తున్న ఎక్కువ మంది సిబ్బంది ఈ కార్యాలయం నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో పాదయాత్రలో ఉండగా ఆయన బృందం మాత్రం వివిధ రాష్ట్రాలతో పాటుగా ఏపీలో కూడా పనిచేస్తోంది.
ఎన్నికల వ్యూహకర్తలను మార్చిన టీడీపీ
అందుకు కొనసాగింపుగా తెలుగుదేశం పార్టీ కోసం రాబిన్ శర్మ అనే ఎన్నికల వ్యూహకర్త దాదాపు రెండేళ్లుగా పనిచేస్తున్నారు. ఆయన కూడా ఐ ప్యాక్ సంస్థలో ప్రశాంత్ కిషోర్ వెంట నడిచిన అనుభవం ఉన్న వ్యక్తి. షో టైమ్ కన్సల్టెన్సీ పేరుతో ఆయన ఏర్పాటు చేసి సంస్థ ద్వారా టీడీపీ వ్యూహాల రూపకల్పనలో ఉన్నారు.
ఆయన తో పాటుగా తెలుగు నేపథ్యం ఉన్న సునీల్ కనుగోలు అనే మరో వ్యూహకర్తను కూడా టీడీపీ నియమించుకుంది. ఏకకాలంలో ఇద్దరు టీడీపీ కోసం పనిచేయడం మరో విశేషం. కానీ కొంతకాలానికే సునీల్ కనుగోలు తన బాధ్యత నుంచి తప్పుకున్నారు. తమ అభిప్రాయాలను టీడీపీ నాయకత్వం పరిగణలోకి తీసుకోవడం లేదనే అసంతృప్తితో ఆయన విరమించుకున్నారని ప్రచారం జరిగింది. దాంతో ప్రస్తుతం రాబిన్ శర్మదే టీడీపీ కార్యక్రమాల రూపకల్పనలో కీలకపాత్రగా మారింది ఈ విషయాన్ని చంద్రబాబు స్వయంగా వేదికపై నుంచి ప్రకటించారు.
జనసేన కూడా 2018లోనే దేవ్ అనే ఎన్నికల వ్యూహకర్తను నియమించుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది. కానీ ఆ తర్వాత ఆయన కొంతకాలమే ఉన్నారు. ప్రస్తుతం ఆపార్టీ ఎన్నికల వ్యూహాలకు సంబంధించి ఎవరినీ నియమించిన జాడ లేదు.
చంద్రబాబులో మార్పునకు, 'ఇదేం ఖర్మ'కు కారణం ఆయనేనా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యవహారశైలిలో ఇటీవల స్పష్టమైన మార్పు వచ్చింది. ఆయనతో పాటుగా ఆయన తనయుడు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట తీరు, కార్యాచరణలో కూడా మార్పు ఉంది. వాటన్నింటి వెనుకా వ్యూహకర్తల పాత్ర ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.
తాజాగా కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించకపోతే రాజకీయాలకు దూరమవుతానని బహిరంగంగా ప్రకటించారు. తదుపరి ఎన్నికలే తనకు చివరి ఎన్నికలవుతాయని కూడా అన్నారు. ఆ తర్వాత పార్టీ విస్తృత సమావేశంలో ఆయన స్వరంలో కొంత మార్పు వచ్చింది. వైస్సార్సీపీని ఓడించకపోతే రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఆపార్టీ నుంచి విముక్తి కోసం రాష్ట్రానికిదే చివరి ఛాన్స్ అని కూడా ప్రస్తావించారు.
పత్తికొండ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల ప్రభావం గమనించిన తర్వాత వ్యూహాత్మకంగా ఆయన మాటతీరులో మార్పు వెనుక వ్యూహకర్తల పాత్ర ఉంటుందనే అభిప్రాయం టీడీపీ నుంచి వినిపిస్తోంది.
ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చేపట్టిన కార్యక్రమం 'ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి' రూపకల్పన రాబిన్ శర్మ బృందానిదేనని టీడీపీ ప్రకటించింది. ప్రతిష్టాత్మకంగా భావించిన 'బాదుడే బాదుడు ' కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా అమలయిన తీరుని కూడా విస్తృత సమావేశంలో టీడీపీ కార్యక్రమాల అమలు కమిటీ ప్రస్తావించింది. ఆ కార్యక్రమం అమలు నుంచి అనుభవాలు తీసుకుని 'ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి' విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.
దాంతో విన్నూత్న నినాదాలు, విభిన్న కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యే యత్నంలో ఉన్న టీడీపీ వ్యవహారాల వెనుక రాబిన్ శర్మ బృందం పాత్రని ఇవి తేటతెల్లం చేస్తున్నాయి.
‘వ్యూహకర్తల పాత్ర పెరుగుతోంది’
ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని మలచడంలోనూ, నాయకులకు పాజిటివ్ ఇమేజ్ తీసుకురావడంలోనూ వ్యూహకర్తల పాత్ర ఉంటుందనే అభిప్రాయం ఉంది. అదే సమయంలో వ్యూహకర్తల ద్వారానే క్షేత్రస్థాయిలో పరిస్థితులను మలచుకోవచ్చనే అభిప్రాయానికి వస్తే అది నేల విడిచి సాము విడిచినట్టవుతుందని సీనియర్ జర్నలిస్ట్ అయినం ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
"వర్తమాన రాజకీయాల్లో తమ పార్టీ నాయకుడి కీర్తిని పెంచడమే కాకుండా, ప్రత్యర్థుల ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం కూడా ఎక్కువగా జరుగుతోంది. సోషల్ మీడియా క్యాంపెయిన్లలో అదే ముఖ్యభాగం. అందుకోసమే ఎన్నికల వ్యూహకర్తల పేరుతో ప్రత్యేక బృందాలు నియమించుకుంటున్నారు. గతంలో ప్రశాంత్ కిషోర్ టీమ్ ఏపీ రాజకీయాల్లో అలాంటి ప్రయత్నమే చేసింది. నేటికీ రెండు ప్రధాన పార్టీల నుంచి అది కొనసాగుతోంది. ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతోనే అందరూ దానిని అనుసరిస్తున్నారు. ఖచ్చితంగా ఎన్నికల వ్యూహకర్తల మూలంగా ఫలితాలు ఉంటాయి. పైగా రాజకీయ పార్టీల పరిధి కన్నా విస్తృతంగా ఆలోచించే శక్తి ఆయా వ్యూహకర్తలకు ఉండడం కూడా ఉపయోగకరంగా మారుతోంది" అంటూ ప్రసాద్ అన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న పొలిటికల్ ట్రెండ్ లో వ్యూహకర్తల పాత్ర మరింత పెరిగే అవకాశం ఉంటుందని తన అంచనాగా ఆయన బీబీసీతో అన్నారు.
‘కార్పోరేట్ రాజకీయాల్లో ఇది తప్పదు’
ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి వ్యూహకర్తల నియామకం జరుగుతోందని, వాటిని అతిగా నమ్మితే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని గ్రహించాలని రాజకీయ విశ్లేషకుడు చెవుల కృష్ణాంజనేయులు అన్నారు.
"చాలామంది రాజకీయ నేతలు తమ పార్టీ కార్యకర్తలు, నేతలు కన్నా వ్యూహకర్తల బృందాల ఫీడ్ బ్యాక్ నే ఎక్కువగా నమ్ముతున్నాయి. రాజకీయాల్లో తమ శ్రేణుల అభిప్రాయాల ఆధారంగా నిర్ణయాలు ఉంటేనే శ్రేయస్కరం. కానీ ప్రజలతో నాయకుల సంబంధాలు అంతంతమాత్రంగా మారుతున్న వేళ కన్సల్టెన్సీల పాత్ర కీలకం అవుతుంది" అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
వ్యాపారాలు రాజకీయంగా మారిన తరుణంలో గతంలో మాదిరిగా ప్రజా సేవ కోసం చేసే వారి సంఖ్య ప్రస్తుతం తగ్గిపోతోందని కృష్ణాంజనేయులు అభిప్రాయపడ్డారు. గెలుపే లక్ష్యంగా పోటీలో దిగుతున్న కార్పోరేట్ రాజకీయాల్లో వ్యూహకర్తల పేరుతో ఎలాంటి ప్రచారానికైనా దిగిపోతున్న పరిస్థితి సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు.

ఫొటో సోర్స్, YSRCP
ఈ వ్యూహకర్తలకు చెల్లిస్తున్న ఫీజు ఎంత?
ఇప్పటికే దాదాపుగా అన్ని రాజకీయా పార్టీలు సోషల్ మీడియా విభాగాలను నడుపుతున్నాయి. వాటికి వివిధ పేర్లు పెడుతున్నప్పటికీ సోషల్ మీడియాలో పార్టీ ప్రచారం చేసేందుకు నియోజకవర్గ స్థాయి నుంచి కమిటీలు వేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
వివిధ స్థాయి నేతలు కూడా తమ పర్యటనలు, ఇతర కార్యక్రమాల ప్రచారం కోసం ఈ బృందాలు వెంట లేకుండా బయటకు వెళ్లే పరిస్థితి లేదు.
ఆయా సోషల్ మీడియా విభాగం కార్యకర్తల కోసం క్షేత్రస్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద మొత్తాలను పార్టీలు వెచ్చిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా డిజిటల్ మీడియా కార్పోరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పలువురు సిబ్బందిని కూడా నియమించింది. గతంలో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల మీద చేసిన కామెంట్స్ విషయంలో డిజిటల్ కార్పోరేషన్ పాత్రపై సీబీఐ కూడా విచారణకు పూనుకోవడం గమనిస్తే సోషల్ మీడియాలో క్యాంపెయిన్ల తీరు అర్థం చేసుకోవచ్చు.
అయితే సొంత సైబర్ సైన్యాలకు తోడుగా వ్యూహకర్తలను అదనంగా నియమించడానికి రాజకీయ ప్రయోజనాలుండడమే కారణమని ఈ బృందంలో పనిచేస్తున్న రమేష్ అనే వ్యక్తి తెలిపారు.
"కేవలం సోషల్ మీడియాలో ప్రచారం కోసం మాత్రమే మా బృందాలు పనిచేయవు. ప్రజలను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి, వాటిని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే విషయాలు గమనిస్తాము. వాటికి అనుగుణంగా నిర్వహించే కార్యక్రమాల తీరు ఎలా ఉంది, ఫలితం ఎలా ఉంటుందనే డేటా సేకరిస్తాము. ప్రత్యర్థుల పరిస్థితి, వాటికి తగిన సమాధానం చెప్పేందుకు ఎలాటి చర్యలుండాలి అనే అంశాలు గమనిస్తాము. అన్ని చోట్ల బలాలతో పాటుగా బలహీనతలను కూడా తెలుసుకుని దానికి అనుగుణంగా రిపోర్టులు రూపొందిస్తాము. వాటి కోసమే సిబ్బంది నిత్యం పనిచేయాల్సి ఉంటుంది." అంటూ రమేష్ బీబీసీకి తెలిపారు.
సంస్థ అవసరాలను బట్టి సిబ్బంది పనిచేస్తారని, రాష్ట్రమంతా నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నిస్తుంటారని ఆయన వివరించారు.
ఈ వ్యూహకర్తల కోసం కూడా పార్టీలు భారీగా వెచ్చిస్తున్నాయి. 2019 ఎన్నికల్లోనే ప్రశాంత్ కిషోర్ టీమ్ కోసం ఏకంగా రూ. 200 కోట్లు పైబడి ఖర్చు చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. కన్సల్టెన్సీలతో రాజకీయాలను కలుషితం చేస్తున్నారని కూడా విమర్శించింది.
ప్రస్తుతం టీడీపీ కూడా అదే బాట పట్టినప్పటికీ ఆయా కన్సల్టెన్సీ సంస్థలకు ఎంత మొత్తం చెల్లిస్తున్నారనే విషయం అధికారికంగా వెల్లడించడం లేదు. దాంతో వాటి చుట్టూ విస్తృత ప్రచారానికి ఆస్కారం ఏర్పడుతోంది. ప్రస్తుతం రాబిన్ శర్మ బృందానికి టీడీపీ నుంచి రూ. 100 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది.
ఈసారి ఎన్నికల్లో కూడా అదే రీతిలో ప్రధాన పార్టీలు వ్యూహకర్తలకు ఖర్చు చేస్తుండడంతో రాజకీయ పార్టీల అధినేతలు, నాయకులు, కార్యకర్తలతో పాటుగా వ్యూహకర్తల బృందాల సందడి కూడా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా ఎన్నికల ఖర్చు పెరుగుతుందని చెప్పక తప్పదు.
ఇవి కూడా చదవండి:
- సూర్యకుమార్ యాదవ్ ‘వీడియో గేమ్ ఇన్నింగ్స్’.. అంతర్జాతీయ టీ20ల్లో రెండో సెంచరీ
- హైదరాబాద్లో ఐపీఎల్ తరహా కార్ రేసులు: స్ట్రీట్ రేసింగ్, ఫార్ములా ఈ రేస్..
- పాడైపోయిన అవయవాలు మళ్లీ పుట్టుకొచ్చాయి.. కుష్టువ్యాధి బ్యాక్టీరియాతో..
- ‘మనుషులు చంద్రుడి మీద జీవిస్తారు.. మరో 10 సంవత్సరాల్లోనే ఇది సాధ్యమవుతుంది’
- జ్ఞాపకశక్తి: ఏం తింటే పెరుగుతుంది, ఎలాంటి ఆహారాలతో దెబ్బతింటుంది?
- మోదీ గ్లోబల్ లీడర్ అవుతున్నారా, అమెరికా ఎందుకు పొగడ్తల వర్షం కురిపించింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















