‘చంద్రుడి మీద మనుషులు జీవించే రోజు ఎంతో దూరంలో లేదు...’

ఓరియాన్

ఫొటో సోర్స్, LOCKHEED MARTIN

    • రచయిత, రాబ్ కార్ప్
    • హోదా, సండే విత్ లారా క్యూన్స్‌బర్గ్

ఈ దశాబ్దంలోనే మానవులు చంద్రుడిపై ఎక్కువ నిడివి నివసించవచ్చునని నాసా అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

చంద్రుడి మీద సైన్స్ పరిశోధన కార్యక్రమాల కోసం అక్కడ మానవ ఆవాసాలు అవసరమవుతాయని నాసా ఓరియాన్ చంద్రయాన అంతరిక్షనౌక కార్యక్రమానికి సారథ్యం వహిస్తున్న హొవార్డ్ హు పేర్కొన్నారు.

సండే విత్ లారా క్యూన్స్‌బర్గ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బుధవారం నాడు ఓరియాన్ అంతరిక్షనౌకను చంద్రుడి దిశగా తీసుకెళ్లిన ఆర్టెమిస్ రాకెట్ ప్రయోగం ‘‘మానవ అంతరిక్షయానంలో చరిత్రాత్మక దినం’’ అని ఆయన అభివర్ణించారు.

ఓరియాన్ ప్రస్తుతం చంద్రుడికి 1,34,000 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఓరియాన్

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, ఓరియాన్ ప్రస్తుతం చంద్రుడికి 1,34,000 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఒక స్వప్నం

చంద్రుడి మీదకు మళ్లీ మనుషులను పంపించటానికి నాసా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా.. బుధవారం నాడు కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి 100 మీటర్ల పొడవైన ఆర్టెమిస్ రాకెట్‌లో ఓరియాన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపించారు.

ఓరియాన్‌లో మనుషులు లేకపోయినా మనుషులను పోలిన బొమ్మలను ఉంచారు. ఈ ప్రయాణంలో మనుషుల మీద పడగల ప్రభావాలను అవి నమోదు చేస్తాయి.

ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రెండు సార్లు ఆర్టెమిస్ రాకెట్‌ను ప్రయోగించటానికి చేసిన ప్రయత్నాలను చివరి కౌంట్‌డౌన్ సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా నిలిపివేశారు. బుధవారం నాడు మూడోసారి చేసిన ప్రయత్నంలో రాకెట్‌ను, దానిమీద అమర్చిన ఓరియాన్ నౌకను విజయవంతంగా ప్రయోగించారు.

ఆర్టెమిస్ నింగిలోకి దూసుకెళుతున్న దృశ్యాన్ని వీక్షించటం ‘‘నమ్మశక్యం కాని భావన.. ఒక స్వప్నం’’ అని హొవార్డ్ హు చెప్పారు.

ఆర్టెమిస్ 1 ప్రయోగం

ఫొటో సోర్స్, NASA

మొదటి అడుగు

‘‘దీర్ఘకాలిక అంతరిక్ష అన్వేషణ కోసం మనం వేస్తున్న మొదటి అడుగు అది. అమెరికా ఒక్క దేశానికే కాదు మొత్తం ప్రపంచానికి కూడా’’ అన్నారాయన.

‘‘నాసాకు ఇది ఒక చరిత్రాత్మక దినమని నేను భావిస్తున్నా. మానవ అంతరిక్షయానాన్ని, సుదూర విశ్వాన్వేషణను ప్రేమించే ప్రజలందరికీ కూడా ఇది చరిత్రాత్మక దినమే’’ అని అభివర్ణించారు.

‘‘మనం మళ్లీ చంద్రుడి మీదకు వెళుతున్నాం. ఒక స్థిరమైన కార్యక్రమం దిశగా పనిచేస్తున్నాం. మనల్ని తిరిగి చంద్రుడిపైకి తీసుకెళ్లి దింపే వాహనం ఇది’’ అని చెప్పారు.

ప్రస్తుత ఆర్టెమిస్ ప్రయాణం విజయవంతమైనట్లయితే.. తర్వాత ప్రయోగంలో మనుషుల్ని పంపిస్తారని, అనంతరం మూడో ప్రయోగంలో వ్యోమగాములు చంద్రుడి మీద దిగుతారని హొవార్డ్ తెలిపారు.

ఆర్టెమిస్ 1 ప్రయోగం

ఫొటో సోర్స్, NASA

50 ఏళ్ల తర్వాత

1972 డిసెంబర్‌లో అపోలో 17 మిషన్‌లో చివరిసారిగా చంద్రుడిపైకి మనిషులు వెళ్లివచ్చారు.

యాబై ఏళ్ల తర్వాత మళ్లీ మనుషులను చంద్రుడి మీదకు పంపటానికి నాసా ఈ ప్రయోగాలు చేపట్టింది.

ప్రస్తుత ప్రయోగం సక్రమంగా సాగుతోందని, అన్ని వ్యవస్థలూ పని చేస్తున్నాయని హొవార్డ్ బీబీసీకి చెప్పారు. ప్రయోగం తర్వాతి దశలో సోమవారం నాడు ఓరియాన్‌లోని ఇంజన్లను మండించి, చంద్రుడి దూర కక్ష్యలోకి పంపించటానికి సిద్ధమవుతున్నారని వివరించారు.

ఓరియాన్ పంపించబోయే ఫొటోలు, వీడియోల కోసం ఉద్విగ్నంగా ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఆర్టెమిస్-1 ప్రయోగంలో అత్యంత క్లిష్టమైన దశల్లో.. ఓరియాన్ మాడ్యూల్‌ను క్షేమంగా భూమికి తీసుకురావటం. అది గంటకు 38,000 కిలోమీటర్ల వేగంతో – అంటే ధ్వని శబ్దానికన్నా 32 రెట్ల వేగంతో భూమి వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. దీనివల్ల మాడ్యూల్ కిందిభాగంలో ఉండే షీల్డ్ 3,000 డిగ్రీల వరకూ వేడెక్కిపోతుంది.

ఓరియాన్ ప్రయాణం
ఫొటో క్యాప్షన్, ఓరియాన్ ప్రయాణ మార్గం

స్థిరమైన వేదిక

ఆర్టెమిస్‌లోని భాగాలు, వ్యవస్థలు క్షేమంగా ఉన్నాయని పరీక్షించి, రూఢి చేసుకున్న తర్వాత.. ఈ దశాబ్దంలోనే మనుషులను చంద్రుడి మీద నివసించేలా చేయాలన్నది ప్రణాళికగా హోవార్డ్ చెప్పారు.

చంద్రుడి మీదకు మళ్లీ మనుషులను పంపించటం వెనుక ప్రధాన లక్ష్యాల్లో.. ఆ ఉపగ్రహం దక్షిణ ధృవం దగ్గర నీరు ఉందేమో అన్వేషించటం ఒకటి అని ఆయన తెలిపారు. అక్కడ నీరు ఉన్నట్లయితే.. విశ్వంలో మరింత దూరాలకు.. ఉదాహరణకు అరుణగ్రహం మీదకు ప్రయాణించే అంతరిక్షనౌకలకు దానిని ఇంధనంగా మలచుకోవచ్చునని వివరించారు.

‘‘మేం చంద్రుడి మీద మనుషులను దించుతాం. వాళ్లు చంద్రుడి మీద నివసిస్తూ సైన్స్ పరిశోధనలు చేస్తారు’’ అని చెప్పారాయన.

‘‘మన భూమి కక్షకు అవతలివైపు ఉన్న విశ్వం గురించి కొంచెం తెలుసుకోవటానికి, ఆ తర్వాత మార్స్ మీదకు మనుషులు వెళ్లటానికి ఈ ప్రయోగాలు చాలా ముఖ్యమవుతాయి’’ అని పేర్కొన్నారు.

‘‘ఒక స్థిరమైన వేదికను, రవాణా వ్యవస్థను రూపొందించుకోవటానికి, సుదూర విశ్వ వాతావరణంలో ఎలా నిర్వహించాలనే దానిని నేర్చుకోవటానికి ఆర్టెమిస్ మిషన్లు వీలుకల్పిస్తాయి’’ అని హొవార్డ్ వివరించారు.

ఇవి కూడా చదవండి: