కాశీ తమిళ సంగమం ఏమిటి? ఇది ప్రభుత్వ కార్యక్రమమా లేక రాజకీయ వ్యూహమా?

తమిళ సంప్రదాయ దుస్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, PMO India

    • రచయిత, ప్రమీల కృష్ణన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

వారణాసిలో 'కాశీ తమిళ సంగమం'ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తమిళనాడు, వారణాసిల మధ్య పురాతన సంబంధాలను పునరుద్ధరించడం, దాన్ని యువత వద్దకు తీసుకెళ్లడం ఈ కార్యక్రమం లక్ష్యమని కేంద్ర విద్యా శాఖ తెలిపింది. అయితే దీని ఉద్దేశం, లక్ష్యాలపై ప్రశ్నలు, సందేహాలు వెలువడుతున్నాయి. వివిధ వేదికలపై దీని గురించి చర్చిస్తున్నారు. దీన్ని అర్థం చేసుకోవడానికి బీబీసీ చేసిన ప్రయత్నమే ఈ కథనం.

భారతదేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంలో, ఈ కార్యక్రమం 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' ఆదర్శాన్ని పటిష్టం చేసేందుంకు దోహదపడుతుందని, తమిళం వంటి ప్రాచీన భాష అభివృద్ధికి సహాయపడుతుందని విద్యా శాఖ చెబుతోంది.

అయితే, ఇలాంటి కార్యక్రమాలు తమిళ భాషను అభివృద్ధి చేయవు సరికదా, సంస్కృతానికి మరింత ప్రాధాన్యం కల్పిస్తాయని విమర్శకులు అంటున్నారు.

ఏమిటీ కాశీ తమిళ సంగమం?

వారణాసిలో నవంబర్ 17 నుంచి ఒక నెల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు విద్యా శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇందులో నిపుణులతో చర్చలు, సమావేశాలు, సదస్సులు, కాశీలో వాణిజ్య, మత పరమైన కేంద్రాల సందర్శన, కర్నాటక సంగీత కచేరీలు, జానపద నృత్యాలు ఉంటాయని వెల్లడించింది.

కాశీ, తమిళనాడు మధ్య సంబంధాలు, ఇరు ప్రాంతాల సంప్రదాయ జ్ఞానం, కళ, వాణిజ్యం మొదలైన అంశాలపై వివిధ రంగాలకు చెందిన నిపుణులు ప్రసంగిస్తారు. చర్చ జరుగుతుంది. 

సంగమం ముగిసే సమయానికి తమిళ ప్రజలు కాశీ గురించి, కాశీ ప్రజలు తమిళనాడు సాంస్కృతిక గొప్పతనాన్ని తెలుసుకుంటారని విద్యా శాఖ తెలిపింది.

వారణాసి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వారణాసి

ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు?

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా కేంద్ర విద్యా శాఖ దీన్ని నిర్వహిస్తోంది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం, ఐఐటీ మద్రాస్ జ్ఞాన పరమైన భాగస్వామ్యాన్ని అందిస్తాయి.

ఎవరెవరు పాల్గొంటారు?

ఇందులో పాల్గొనేందుకు తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి 210 మందితో కూడిన బృందాన్ని ఎనిమిది రోజుల పాటు కాశీకి తీసుకురానున్నారు. 

అలాంటి మరో 12 బృందాలు, అంటే సుమారు 2500 మంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.

ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక వెబ్‌సైట్ రూపొందించారు. ఇందులో పాల్గొనాలనే ఉత్సాహం ఉన్నవారు ఈ కింది వెబ్‌సైట్‌లో తమ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు.

రిజిస్టర్ చేసుకున్నవారిలో 2500 మందిని ఎంపిక చేసి ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. వీరందరికీ ప్రయాణ, వసతి ఖర్చులు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.

సెలెక్ట్ అయినవారు రామేశ్వరం, చెన్నై, కోయింబత్తూర్‌ల నుంచి ట్రైన్‌లో బయలుదేరాల్సి ఉంటుంది. వీరి కోసం ప్రత్యేక బోగీలు వేయనున్నారు. 

తమిళ శాసనం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒక తమిళ శాసనం

కాశీకి, తమిళనాడుకి సంబంధం ఏమిటి?

దీని గురించి పురావస్తు శాస్త్రవేత్త పద్మావతితో మేం మాట్లాడాం. 10వ శతాబ్దం నాటికే కాశీ, తమిళనాడు మధ్య సంబంధాలు ఉన్నాయని తెలిపే శాసనాలు ఉన్నాయని ఆమె చెప్పారు. 

"వారణాసి గురించి ప్రస్తావించే చోళుల కాలం నాటి శాసనాలు మన వద్ద ఉన్నాయి. కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి దేవాలయాలు తమిళనాడులో చాలా ప్రాంతాలలో ఉన్నాయి. తమిళనాడులో కాశీ పేరుతో పట్టణాలు కూడా ఉన్నాయి. చాలామంది తమిళులు ఇప్పటికీ కాశీలో నివసిస్తున్నారు. వారికి కాశీ విశ్వనాథుడి దేవాలయంతో అనుబంధం ఉంది. నేటికీ ఉత్తర భారతవాసులు శివుడిని దర్శించుకోవడానికి రామేశ్వరం వస్తారు. దక్షిణ ప్రాంత వాసులు కాశీ వెళ్లి విశ్వనాథుడిని దర్శించుకుంటారు. పూర్వం నుంచే ఈ సంప్రదాయాలు కొనసాగుతూ వస్తున్నాయని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. 17వ శతాబ్దానికి చెందిన శైవ కవి కుమారగురుపరార్ తమిళనాడు నుంచి కాశీకి వెళ్లి అక్కడ ఒక మఠాన్ని స్థాపించారు. తరువాతి కాలంలో ఆ మఠాన్ని తంజావూరు జిల్లాలోని తిరుప్పనంతల్‌కు మార్చారు. అయినా, ఇప్పటికీ దాన్ని కాశీ మఠం అనే పిలుస్తారు" అని పద్మావతి వివరించారు.

 ప్రొఫెసర్ అరుణన్

ఫొటో సోర్స్, ARUNAN/FB

ఫొటో క్యాప్షన్, ప్రొఫెసర్ అరుణన్

కాశీ తమిళ సంగమం కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నవారు ఎవరు? ఎందుకు?

అయితే, ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిన అవసరమేమిటని ప్రొఫెసర్ అరుణన్ ప్రశ్నిస్తున్నారు.

"తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ వ్యతిరేకతను శాంతింపజేయడానికి బీజేపీ తమిళ భాషను, సంస్కృతిని గౌరవిస్తున్నట్టు చిత్రీకరిస్తోంది. భారతీయ భాషల అభివృద్ధి కోసం భారతీయ భాషా సమితి అనే సంస్థను స్థాపించారు. తమిళ సంస్కృతి, తమిళ భాషాభివృద్ధి కోసమే అయితే ఆ సమితి ఈ కార్యక్రమాన్ని తమిళనాడులో నిర్వహించాలి. సంస్కృతానికి పెద్ద పీట వేసే వారణాసిలో ఎందుకు నిర్వహిస్తున్నారు? తమిళనాడులోని కీలాడిలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తే మరింత ప్రయోజనం సమకూరుతుంది. తమిళ భాష, సంస్కృతుల ప్రాముఖ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి హిందూత్వ ప్రధాన కార్యాలయంగా పేరొందిన వారణాసిని ఎంచుకోవడం వెనుక బీజేపీ రాజకీయ వ్యూహాలు, ప్రయోజనాలు ఉన్నాయన్నది స్పష్టం" అని ప్రొసర్ అరుణన్ అభిప్రాయపడ్డారు. 

"దేశంలోని పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ, దీని కోసం హిందూ పట్టణంగా పరిగణించే వారణాసిని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు? ఒకవేళ అలాంటి కార్యక్రమం నిర్వహించాల్సి వస్తే తమిళనాడు, వాటికన్ సిటీల మధ్య ఉన్న సంబంధమేంటో, తమిళనాడు, మక్కా మధ్య ఉన్న సంబంధాల గురించి కూడా తెలుసుకోవాలి కదా. అందుకు ఆ మతాలకు సంబంధించిన ప్రధాన నగరాలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. వాటన్నిటిలో తమిళ ప్రభావం ఉందో, లేదో తెలుసుకోనక్కర్లేదా? నిజంగా తమిళ భాష ప్రాముఖ్యం, ప్రత్యేకతపై దృష్టి పెట్టాలనుకుంటే, కీలాడి, ఆదిచనల్లూర్లలో జరిపిన త్రవ్వకాల నివేదికలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి, భారతదేశ చరిత్ర హరప్పా, మొహెంజొదారోలలో కాదు తమిళనాడులో మొదలయిందని ప్రకటించాలి" అన్నారు అరుణన్.

బనారస్ హిందూ యూనివర్సిటీ ఏమంటోంది?

ఈ విషయమై, బనారస్ హిందూ యూనివర్సిటీలో భారతీయ భాషల విభాగంలోని ప్రొఫెసర్లతో మాట్లాడాం.

"ఇప్పటివరకు మాకు ఎలాంటి అధికారిక ప్రకటన అందలేదు. ఇందులో మా పాత్ర ఏమిటో మాకు స్పష్టంగా తెలీదు. ఒక నెల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని పత్రికా ప్రకటన ద్వారా మాకు తెలిసింది. దీనికి మా నుంచి ఏ ఆశిస్తున్నారో తెలీదు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కంటే రాజకీయ కార్యక్రమంలా కనిపిస్తోంది. బనారస్ యూనివర్సిటీలో దీని గురించి ఇంతవరకు ఎలాంటి సన్నాహలు చేయలేదు. ప్రారంభోత్సవం ఐఐటీ చెన్నైలో చేశారు. ఐఐటీ దీనికోసం ఒక వెబ్‌సైట్ తయారుచేసింది. 12 కమిటీలను ఏర్పాటుచేశారు. సభ్యులను త్వరలోనే ఎంపిక చేస్తారు. దీనికోసం మమ్మల్ని సంప్రదించలేదు. మా అభిప్రాయాలు తీసుకోలేదు" అని ఒక ప్రొఫెసర్ చెప్పారు. ఆయన పేరును గోప్యంగా ఉంచమని కోరారు.

నారాయణన్ తిరుపతి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు

ఫొటో సోర్స్, @NARAYANANTBJP/TWITTER

ఫొటో క్యాప్షన్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి

ఇది రాజకీయ కార్యక్రమమా?

దీనిపై తమిళనాడు బీజేపీ ప్రతినిధి నారాయణన్ తిరుపతితో మేం మాట్లాడాం.

"ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రజల ఐక్యతను చాటిచెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మనం భిన్న భాషలు మాట్లాడినా, అందరం భారతీయులమేనని తెలియజెప్పే కార్యక్రమమే కాశీ తమిళ సంగమం. 

ఇందులో పాల్గొనే 2,500 మంది ఐక్యతకు ప్రతినిధులుగా ఉంటారు. కాశీ ప్రజలకు తమిళ భాష, సంస్కృతుల గొప్పతనం తెలుస్తుంది. అలాగే, తమిళ ప్రజలు కాశీకి వచ్చి ఇందులో పాల్గొంటారు కాబట్టి, ఇరు ప్రాంతాల ప్రజల మధ్య ఐక్యతా భావం వర్ధిల్లుతుంది. ఈ కార్యక్రమం తమిళ భాష గొప్పతనాన్ని చాటిచెప్పుతుంది" అని నారాయణన్ అన్నారు. 

వారణాసినే ఎందుకు ఎంచుకున్నారని మేం ప్రశ్నించాం. 

"యువ తరానికి కాశీ, తమిళనాడుల మధ్య సంబంధాన్ని తెలియజెప్పే ప్రయత్నమిది. తమిళ ప్రజలకు కాశీతో సుదీర్ఘకాల అనుబంధం ఉంది. ఇందులో మేం కొత్తగా చెబుతున్నది ఏమీ లేదు. ఆస్తికులే కాదు, నాస్తికుడైన పెరియార్ కూడా కాశీలో కొన్ని నెలలు గడిపారు. ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నవారికి ఆ విషయం తెలీదు. మాకెలాంటి రాజకీయ వ్యూహాలు లేవు. భాషా రాజకీయాలు నెరిపే అలవాటు డీఎంకే పార్టీకే ఉంది” అని నారాయణన్ తిరుపతి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)