ఆంధ్రప్రదేశ్: సీఎం పర్యటనలకు ఇంత హడావుడి ఎందుకు? నల్లదుస్తులుకూడా ధరించనివ్వనంత కట్టడి ఏంటి?

ఫొటో సోర్స్, @AndhraPradeshCM
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
నల్ల దుస్తులు, నల్ల టోపీలు, నల్ల బురాఖా, నల్ల చున్నీ ధరించి ఎవరైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు వస్తే యూ టర్న్ తీసుకోవాల్సిందేనా?
ఎందుకంటే ఆ రంగు ధరించిన వారిని ఆయన భద్రతా సిబ్బంది లోపలకు అనుమతించడం లేదు.
అలాగే రెండు, మూడు రోజుల ముందుగా సభా ప్రాంగణానికి రెండు కిలోమీటర్ల వరకు బారికేడ్లు పెడుతూ, దుకాణాలను మూయిస్తున్నారు.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గత మూడున్నరేళ్లలో ఎన్నాడు లేని విధంగా ఈ తరహా ఆంక్షలు ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అసలేం జరుగుతోంది?
నెల రోజులుగా సీఎం జగన్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల అడ్డగింతలు, అవసరం లేని చోట కూడా ప్రజల రాకపోకలపై నియంత్రణలు సర్వసాధారణమైపోయాయి. ఇలాంటి చర్యలతో సామాన్య జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
2022 నవంబర్ 21న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జగన్ పర్యటనలో నల్లచున్నీలు వేసుకుని వచ్చిన మహిళల్ని, అయ్యప్ప మాలలో ఉన్న కొందరు వ్యక్తులను కూడా సభలోకి అనుమతించలేదని మీడియాలో వచ్చింది.
“ఎక్కడికక్కడ బారికేడ్లు, పరదాలు కట్టడం ముందస్తుగానే దుకాణాలు మూసివేయించడం వంటి దృశ్యాలు సీఎం పర్యటనల్లో కనిపిస్తున్నాయి. అలాగే సీఎం సభలకు వచ్చే వారు నలుపు వస్త్రాలు ఏ రూపంలో ధరించినా వారిని అనుమతించడం లేదు. నవంబర్ 21న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో, 23న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కూడా నలుపు రంగు దుస్తులు ధరించిన వారిని సభలకు అనుమతించలేదు’’ అని విశాఖకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ మోహన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Lakkoju Srinivas
‘‘అధికారులు ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారో మరి. సీఎంకు తెలిసే జరుగుతుందా? లేకపోతే సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం చూపిస్తాన్నారో అర్థం కావడం లేదు” అని పేర్కొన్నారు.
నవంబర్ 1న విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమానికి సీఎం హాజరయ్యేందుకు వెళ్లే మార్గంలో పరదాలు కట్టారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ నుంచి కొంత దూరంలో ఉండే జంక్షన్ వరకు పరదాలతో కప్పేశారు.

ఫొటో సోర్స్, Lakkoju Srinivas
నరసన్నపేట సభలో ఏం జరిగింది?
సీఎం నరసన్నపేట సభకు వెళ్లిన బీబీసీ, అప్పుడు ఆ పట్టణంలోని పరిస్థితిని గమనించింది.
నరసన్నపేటలో సభకు హాజరయ్యేందుకు వచ్చిన ప్రజల్లో ఎవరైనా నలుపు రంగు టోపీలు, చున్నీలు, షర్టులు, బనియన్లు ధరించి వస్తే వారిని వెనక్కి పంపించేశారు.
నల్ల చొక్కాలు, టీ షర్టులు ధరించి వచ్చిన కొందరికి వైసీపీ గుర్తు, జగన్ బొమ్మ ఉన్న టీ షర్టులు ఇచ్చి, వైసీపీ పార్టీ ప్లకార్డు ఒకటి ఇచ్చి లోపలికి పంపించారు.
వ్యవసాయ శాఖకు చెందిన ఓ ప్రభుత్వ అధికారి నల్ల చున్నీ ధరించడంతో ఆమెను సైతం వెనక్కి పంపించేశారు. కానీ ఈ సభలో అయ్యప్ప స్వాములను మాత్రం అనుమతించారు. కాకపోతే వారు మెడలో వేసుకున్న నల్ల కండువాలను నడుముకు కట్టించి లోపలికి అనుమతించారు.
అలాగే ఎర్ర కండువాలు వేసుకున్న వారిని కూడా అనుమతించలేదు. దీంతో ఎర్ర కండువాలను కొందరు చెట్లపై దాచుకుంటే, నల్ల టోపీలను కొందరు బయటే వదిలేసి సభకు హాజరయ్యారు.

ఫొటో సోర్స్, Lakkoju Srinivas
“నలుపు, ఎరుపు దుస్తులు, కండువాలు వంటివి ధరించి రావటం పెద్ద నేరంగా భావించటం ఏమిటి? వాళ్లేమన్నా నిరసన తెలియ చేశారా? పబ్లిక్ మీటింగుకి అనేక మంది ప్రజలు వస్తారు. వాళ్లు రకరకాల రంగుల దుస్తుల్లో వస్తారు. ఒక వేళ నలుపు ధరించి రావద్దని అంటే ముందే అది అనౌన్స్ చేయాలి. అలా కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని నలుపు రంగో, ఎరుపు రంగో ధరించారని పంపించేయడం సరి కాదు’’ అని మానవ హక్కుల వేదిక ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు కె.వి.జగన్నాధరావు బీబీసీతో పేర్కొన్నారు.
‘‘ఆ రంగుల వలన లా అండ్ ఆర్డరుకు ఇబ్బందేమైనా ఉందా? నిరసనలు తెలియ చేస్తారనే భయం వల్ల కావచ్చు, నలుపు, ఎరుపు రంగులను అనుమతించడం లేదు. అసలు ఇదంతా సీఎంకు తెలిసే చేస్తున్నారా? లేదా సెక్యూరిటీ పేరుతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో తెలియాలి” అన్నారాయన.
ముందు రోజు ‘క్లోజ్’, సీఎం వచ్చిన రోజు ‘ఓపెన్’
జగన్ నరసన్నపేట సభ సందర్భంగా సభ జరిగే ప్రభుత్వ కళాశాలకు వచ్చే దారిలో భద్రతా కారణాల రీత్యా నవంబరు 22న దాదాపు కిలోమీటరు పరిధిలో పలు చోట్ల బారికేడ్లు పెట్టారు. సభ ప్రాంగణానికి ఆనుకుని ఉన్న దుకాణాలు అన్నిటినీ మూయించేశారు.
కానీ సభ జరిగిన రోజున అంటే నవంబరు 23న అక్కడ చాలా దుకాణాలు తెరిచే కనిపించాయి. సీఎం ప్రసంగ వేదికకు రెండు వందల మీటర్ల దూరంలోనే ఇవి ఉన్నా, వీటిని తెరిచే ఉంచారు.
కొన్ని దుకాణాలు మూసి ఉంటే వారికి పోలీసులు ఫోన్ చేసి మరీ తెరవాలని చెప్పారు. సీఎం సభ వేదికకు సమీపంలో ఉన్న సెలూన్, కిరణా, కూరగాయల దుకాణల యాజమానులతో బీబీసీ మాట్లాడింది.

ఫొటో సోర్స్, Lakkoju Srinivas
“సీఎం సభ వేదికకు దగ్గరగా ఉందనే ఉద్దేశంతో 22వ తారీఖున మా షాపు మూసేశాం. 23న ఉదయం 10 గంటలకు నాకు లోకల్ పోలీసులు ఫోన్ చేశారు. అర్జంటుగా వచ్చి షాపు తెరవాలని చెప్పారు. అదే సమయంలో సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అవుతోంది. నేను వద్దామని ప్రయత్నించాను. కానీ, ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి రాలేకపోయాను. పోలీసులే స్వయంగా ఫోన్ చేసి షాపు తెరుచుకోమన్నారు” అని సెలూన్ షాపు నిర్వహకుడు భాస్కరరావు చెప్పారు.
ఇలా సీఎం సభ రోజే, సీఎం వస్తున్న సమయంలోనే షాపు యాజమానులకు పోలీసులే ఫోన్ చేసి మరీ తెరిపించారు. అలాగే ముందు రోజు రాత్రి కూడా కొందరు పోలీసు సిబ్బంది సభా ప్రాంగణం వద్ద ఉన్న షాపుల యాజమానులను కలిసి దుకాణాలను తెరవండని చెప్పారని అక్కడ వ్యాపారులు తెలిపారు.
“సీఎం సర్ వస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల వల్ల నాలుగు రోజులు షాపు మూయండని తొలుత చెప్పారు. ఆ తర్వాత మీరు షాపు తీసుకోవచ్చునని చెప్పారు. ముందు మూయమని చెప్పి, ఆ తర్వాత సీఎం సభ జరుగుతున్న రోజే పోలీసులే షాపు తీయాలని చెప్పారు. మేం షాపు తీశాం కానీ వ్యాపారం ఏం జరుగుతుంది? ఈ లోపలికి మనుషుల్ని అనుమతించకుండా, షాపులను మాత్రం తెరిపిస్తే ఏం ఉపయోగం” అని ప్రభుత్వ కాలేజ్ రోడ్డులో దుకాణాలు నిర్వహిస్తున్న సంతోష్, వాసుదేవరావు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Lakkoju Srinivas
పోలీసులే దుకాణాలను దగ్గరుండి ఎందుకు ఓపెన్ చేయించారు?
సీఎం సభలో ప్రసంగిస్తున్నప్పుడు సైతం 200 అడుగుల దూరంలో ఉన్న షాపులు తెరిచే ఉన్నాయి. ఇలా ఎందుకు జరిగిందనే విషయంపై అక్కడే విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులను బీబీసీ అడిగితే.. పై నుంచి ఆర్డర్స్ వచ్చాయని చెప్పారు.
సీఎం సెక్యూరిటీ పేరుతో ‘అతి’ ఎక్కువైందనే విమర్శలు రావడంతోనే ఇలా చేసి.. అంతా సజావుగా ఉందని చెప్పే ప్రయత్నం చేసి ఉంటారని మానవ హక్కుల సంఘం నేత జగన్నాధరావు అన్నారు.
“సీఎం లాంటి హై ప్రొఫెల్ పర్సన్‌కి సెక్యూరిటీ చాలా అవసరం. అయితే ప్రజలకు, వారి దైనందిన కార్యక్రమాలకు, వారి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ అంక్షలుండాలి. అంతే కానీ, ‘సీఎం వస్తున్నారు, మీరు ఎలా పోతారో మాకు అనవసరం’ అనేలా ఉండకూడదు. అలా అతి చేయడం వలనే విమర్శలు ఎక్కువైయ్యాయి. ఇప్పుడు మళ్లీ ఆ విమర్శల నుంచి తప్పించుకునేందుకు సీఎం సభ జరుగుతుండగా కూడా పక్కనే ఉన్న షాపులను ఓపెన్ చేయించడం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అత్యుత్సాహమే అనాలి” అని జగన్నాధరావు విమర్శించారు.
ముఖ్యంగా వైద్యం కోసమో, పరీక్షల కోసమో వెళ్తున్న వారికి ఇలా అంక్షలు పెడితే వాళ్లు ఎంతగానో కష్టనష్టాలకు లోనవుతారని చెప్పారు. ముందస్తు సమాచారం ఇచ్చి ఆంక్షలు విధించటం సరే కానీ, ఎలాంటి సమాచారం లేకుండా ఆంక్షలు పెట్టడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఆయన వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Lakkoju Srinivas
సెక్యూరిటీ బ్లూ బుక్‌లో ఏముంది?
వీవీఐపీలు, వీఐపీల సెక్యూరిటీ విషయంలో బ్లూ బుక్ పేరుతో నిబంధనలు ఉంటాయి. హై ప్రొఫైల్ వ్యక్తులు వచ్చినప్పుడు సెక్యూరిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ స్థాయిలో సెక్యూరిటీ కల్పించాలో అందులో ఉంటుంది.
ముఖ్యంగా సీఎం వంటి వ్యక్తులు పర్యటించేటప్పుడు రోవ్ వే ఎంత దూరంలో ఉండాలి? కాన్వాయ్‌లో ఏయే వాహనాలుండాలి? ఆ వాహనాలను ఎంత వరకు అనుమతించాలి? ఇలాంటి విషయాలు కూడా స్పష్టంగా ఉంటాయి. అయితే దీనిని ఇంటెలిజెన్స్ సర్వీస్ వింగ్ చూస్తుంటుందని ఏపీ పోలీసుశాఖలోని ఓ ఉన్నతాధికారి చెప్పారు.
“సీఎం సభ సందర్భంగా దుకాణాలు మూసేయడం, ఇష్టానుసారం బారికేడ్లు పెట్టడమనే నిబంధన, నియమం ఎక్కడా ఉండదు. స్థానిక పరిస్థితుల ఆధారంగా సీఎం సెక్యూరిటీ చూసేవారు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ అవి ప్రజలకు ఇబ్బంది కలిగించకూండానే ఉండాలి. సీఎం సభల సందర్భంగా స్థానిక నాయకులు, పోలీసుల అత్యుత్సాహం కొంత ఉంటుంది” అని ఆ పోలీసు ఉన్నాతాధికారి వివరించారు.

ఫొటో సోర్స్, Lakkoju Srinivas
నిబంధనల ప్రకారమే సెక్యూరిటీ: ఎస్‌పీ రాధిక
నరసన్నపేట సభ సందర్భంగా ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, సెక్యూరిటీ పేరుతో దుకాణాలు మూయించడం వంటి అంశాలను నరసన్నపేట సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన శ్రీకాకుళం జిల్లా ఎస్‌పీ జి.ఆర్.రాధిక వద్ద బీబీసీ ప్రస్తావించింది.
“బ్లూ బుక్ ప్రకారమే మేం నడుచుకుంటాం. కాకపోతే అందులోని వివరాలన్నీ కాన్ఫిడెన్షియల్. బయటకు చెప్పలేం. సీఎం సెక్యూరిటీ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు. అలాగే అతి చేయడం ఉండదు. అన్నీ సెక్యూరిటీ నియమ, నిబంధనల ప్రకారమే చేస్తాం. ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఎటువంటి సెక్యూరిటీ ఆంక్షలు ఉండవు’’ అని ఎస్‌పీ చెప్పారు.
‘‘వీఐపీలు, వీవీఐపీలు వచ్చినప్పుడు సెక్యూరిటీ కాస్త హడావిడిగానే కనిపిస్తుంది. కానీ అది ఆయా వ్యక్తుల క్యాడర్ బట్టి ఉంటుంది. నరసన్నపేట సభలో సీఎం జగన్ సెక్యూరిటీ పేరుతో ఎటువంటి ఇబ్బందికర ఆంక్షలు పెట్టలేదు” అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Lakkoju Srinivas
‘ఇంతకుముందు ఊర్లు బాగుపడేవి’
ఇవాళ రాజకీయ నాయకులు ఎన్ని కార్లతో ప్రయాణిస్తే అంత గొప్ప లీడర్లుగా భావిస్తున్నారని, అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడా లేకుండా అంతా అదే చేస్తున్నారని, ఇదంతా రాచరిక పాలన అవశేషాలేనని విశాఖపట్నానికి చెందిన ఫోరం ఫర్ ఇక్వాలిటీ సభ్యుడు డి.విశ్వనాథ్ విమర్శించారు.
“గతంలో సీఎం కానీ, పీఎం కానీ, మంత్రి కానీ గ్రామాలకు, పట్ణణాలకు వస్తే ముందుగా వాటిని శుభ్రం చేయడం, అలాగే ఆ వీఐపీలు వచ్చే దారుల్లో రోడ్లు లేకపోతే వేయడం వంటి పనులు చేసేవారు. దీంతో వీఐపీలు వస్తే తమ గ్రామాలు, పట్టణాలు బాగుపడతాయని భావించేవారు. కానీ ఇప్పుడు వీఐపీలు వస్తున్నారని డేట్స్ ప్రకటించగానే.. ఆ రోజుల్లో తాము బయటకు వెళ్లే పనుందా? ఉంటే వీఐపీల హడావిడి దాటి ఎలా వెళ్లాలి అనే లెక్కలు వేసుకుంటున్నారు” అని విశ్వనాథ్ వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మరో వైపు జగన్ సభల సందర్భంగా చున్నీలు, బురఖాలను తీయించడం దారుణమని ప్రతిపక్ష టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
ఇప్పటికే బారికేడ్లు, పరదాల మధ్య ఉంటున్న సీఎం చివరకు నల్ల రంగులో ఉన్నాయని మహిళల చున్నీలు తీయించడం దారుణమని, ఇది భద్రత కాదు, జగన్ అభద్రతా భావమని ఆ ట్వీట్ లో విమర్శించారు.
ముఖ్యమంత్రి సెక్యూరిటీ పటిష్టంగా ఉండేలా చూడటం అత్యవసరమని, దానిని కూడా తప్పుపడితే ఎలా అని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- కాంతారా: అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా మీద అసంతృప్తి ఎందుకు?
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా మొఘల్ సైన్యం మీదకు విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ
- పెళ్లి కావడం లేదనే బాధతో మగవాళ్ళే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎందుకిలా? - NCRB
- పీరియడ్స్‌లో బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు ఏం చేయాలి, 9 ముఖ్యమైన ప్రశ్నలు-జవాబులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














