పీరియడ్స్‌లో బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు ఏం చేయాలి, 9 ముఖ్యమైన ప్రశ్నలు-జవాబులు

ఫొటో సోర్స్, Getty Images
నేడు ఆన్‌లైన్‌లో విస్తృతంగా సమాచారం అందుబాటులో ఉండేటప్పటికీ, రుతుక్రమానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి.
ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు. దీంతో దీనికి సంబంధించిన సమస్యలు అలానే ఉండిపోతున్నాయి.
రుతుచక్రానికి సంబంధించి గూగుల్‌లో ఎక్కువ మంది శోధించిన కొన్ని ప్రధానమైన ప్రశ్నలకు మేం సమాధానాలు కనుక్కొనేందుకు ప్రయత్నించాం.
అయితే, మీకు ఏదైనా అనారోగ్యంగా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. వారి సూచనలు లేకుండా మందులు వేసుకోకూడదు.

ఫొటో సోర్స్, Getty Images
1. రుతుక్రమంలో ఎంత బ్లీడింగ్ అవుతుంది?
మహిళల రుతుచక్రంలో బ్లీడింగ్ కూడా ఒక భాగం.
బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌ఎస్ఎస్) వివరాల ప్రకారం.. సాధారణంగా రుతుక్రమ సమయంలో 30 నుంచి 72 ఎంఎల్‌ల రక్తం విడుదల అవుతుంది. అంటే ఇది ఐదు నుంచి 12 టేబుల్ స్పూన్లు వరకూ ఉంటుంది.
కొంత మంది మహిళల్లో రక్తస్రావం మరింత ఎక్కువగానూ ఉండొచ్చు.
సాధారణంగా ఈ రక్తం రంగు గులాబీ లేదా నలుపు లేదా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. బ్లీడింగ్ ఎక్కువైనప్పుడు ఇది ఎరుపు రంగులోనూ కనిపిస్తుంది.
2. రుతుచక్రం ఎన్ని రోజులకు వస్తుంది?
సాధారణంగా నెలసరి ప్రతి 28 రోజులకు ఒకసారి మొదలవుతుంది.
కానీ, కొంత మందిలో 21 నుంచి 40 రోజుల మధ్య సమయం కూడా తీసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
3. బ్లీడింగ్ ఎందుకు ఎక్కువ అవుతుంది, అలాంటప్పుడు ఏం చేయాలి?
బ్లీడింగ్‌తోపాటు నొప్పి కూడా ఎక్కువగా ఉండటాన్ని మెనోరేజియా లేదా హెవీ పీరియడ్స్‌గా పిలుస్తారు. దీని వెనుక చాలా కారణాలు ఉండొచ్చు.
80 ఎంఎల్ కంటే ఎక్కువ బ్లీడింగ్ జరిగినప్పుడు మెనోరేజియాగా పిలుస్తారు. దీన్ని కొన్ని అంశాల ద్వారా గుర్తించొచ్చు.
రక్తం గడ్డలుగా విడుదల కావడం, గంటగంటకూ ప్యాడ్లు మార్చుకోవాల్సి రావడం, మందులు వేసుకున్నా కడుపు నొప్పి తగ్గకపోవడం లాంటి లక్షణాలు బాధితుల్లో కనిపిస్తాయి. గర్భాశయం, జీవక్రియా రేటు, హార్మోన్లలో మార్పుల వల్ల ఇలా జరిగే అవకాశముంటుంది.
మెనోపాజ్ దగ్గరపడేటప్పుడు కొందరి మహిళల్లో ఈ హెవీ పీరియడ్స్ కనిపిస్తాయి.
హర్మోన్లలో హెచ్చుతగ్గులు, గర్భాశయంలో కణితులు ఉండటం లాంటి సమస్యల వల్లా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.
మరోవైపు రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గినప్పుడు కూడా హెవీ పీరియడ్స్ రావొచ్చు. రక్తాన్ని పలుచన చేసే మందులను తీసుకున్నప్పుడు కూడా ఈ సమస్య రావొచ్చు.
కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు లేదా కొన్ని రకాల మందులు తీసుకున్నప్పుడు బ్లీడింగ్ ఎక్కువ కావొచ్చు.
ఈ సమస్యను తగ్గించుకునేందుకు ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, బీట్‌రూట్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజుకు 30 నుంచి 40 నిమిషాలు వ్యాయామం చేయాలని కూడా చెబుతున్నారు.
మీకు ఎలాంటి మందులు అవసరం అవుతాయో వైద్యులు మాత్రమే సూచించగలరు. పరీక్షల అనంతరం వారు ఒక అవగాహనకు వస్తారు. అందుకే మనకు తోచినట్లుగా మందులు వేసుకోవడం మంచిదికాదు.

ఫొటో సోర్స్, Getty Images
4. ఎన్ని రోజులు నెలసరి ఉంటుంది?
నెలసరి అనేది 3 నుంచి 8 రోజుల వరకు ఉండొచ్చు.
సాధారణంగా ఎక్కువ మందిలో ఇది ఐదు రోజులు ఉంటుంది. మొదటి రెండు రోజులు మాత్రం బ్లీడింగ్ ఎక్కువగా ఉంటుంది.
5. రుతుచక్రం ఎప్పుడు మొదలవుతుంది?
సాధారణంగా బాలికలకు 12ఏళ్ల వయసులో ఈ రుతుచక్రం మొదలవుతుంది.
అయితే, కొంతమంది బాలికల్లో ఇది కాస్త ముందుగానే మొదలుకావొచ్చు. మరికొంత మందిలో ఇది ఆలస్యం కూడా కావొచ్చు.
16 లేదా 18 ఏళ్ల వయసుకు వచ్చే సరికి పీరియడ్స్ అనేవి క్రమంగా రావడం మొదలవుతుంది. కొన్ని కారణాల వల్ల ఇది కాస్త ఆలస్యం కావచ్చు కూడా.

ఫొటో సోర్స్, Getty Images
6. అండాలు ఎప్పుడు విడుదల అవుతాయి?
రుతుచక్రం గురించి తెలుసుకునే క్రమంలో చాలా మంది గర్భధారణకు సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతుంటారు. మహిళలకు గర్భధారణ జరిగేటప్పుడు.. అసలు ఎప్పుడు ఇది మొదలైందని లెక్కలు వేసేందుకు కూడా నెలసరిని పరిగణలోకి తీసుకుంటారు.
సాధారణంగా పీరియడ్ సమయంలో మహిళల్లో అండాలు గర్భాశయంలోనే ఉంటాయి. సరిగ్గా వచ్చే రుతుక్రమానికి 12 నుంచి 14 రోజుల ముందు ఈ అండాలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది.
ఎన్‌హెచ్ఎస్ సమాచారం ప్రకారం.. శుక్రకణాలు మహిళల శరీరంలో దాదాపు ఏడు రోజులు సజీవంగా ఉంటాయి. ఈ లోపే ఇవి అండంతో కలిస్తే గర్భధారణ జరుగుతుంది.
ఈ సమయంలో, అంటే పీరియడ్స్‌కు 12 నుంచి 14 రోజుల ముందు గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
పీరియడ్స్ వెంటనే గర్భందాల్చే అవకాశం తక్కువ. అయితే, ఇలా జరగదని అనుకోవడానికి వీల్లేదు.
7. రుతుక్రమ సమయంలో సెక్స్ చేయొచ్చా?
నెలసరి సమయంలో సెక్స్‌ను భారతీయ సమాజంలో తప్పుగా పరిగణిస్తారు.
దీనిపై పశ్చిమ దేశాల్లో లోతైన అధ్యయనాలు జరిగాయి. ఇలా చేయడంలో ఎలాంటి తప్పూలేదని పశ్చిమ దేశాల పరిశోధనలు చెబుతున్నాయి.
రుతుక్రమ సమయంలో సెక్స్ చేయడంతో ఒక కొత్త అనుభూతి ఉంటుందని ఒక అధ్యయనంలో పాల్గొన్న 500 మందిలో 55 శాతం మంది చెప్పారు. అయితే, మిగతా 45 శాతం మంది మాత్రం అలాంటి అనుభూతి తమకు కలగలేదని వివరించారు.
8. నెలసరి సమయానికి రావాలంటే ఏం ఆహారం తీసుకోవాలి?
మనం తీసుకునే ఆహారానికి రుతుచక్రానికి దగ్గర సంబంధం ఉంటుంది.
సంతులిత ఆహారం తీసుకోవడంతో అపసవ్యమైన రుతుచక్రాన్ని గాడిలో పెట్టుకోవచ్చు. అయితే, ఇప్పటికే సమస్య తీవ్రమైతే వైద్యులను సంప్రదించాలి.
రుతుచక్రాన్ని ప్రభావితం చేసే హార్మోన్లపై చిరుతిండ్లు ప్రభావం చూపిస్తాయి. దీని వల్ల నెలసరి ఆలస్యం కావడం లేదా పీరియడ్స్ ఎక్కువ రోజులు ఉండటం లాంటివి జరుగుతాయి.
9. నెలసరి వాయిదావేసే మాత్రలతో దుష్ప్రభావాలు ఏమిటి?
పండగల సమయంలో మహిళలు తరచుగా నెలసరి వాయిదావేసే మాత్రలను తీసుకుంటుంటారు.
అయితే, ఇలాంటి మాత్రలను తీసుకోవాలని వైద్యులు దాదాపు సూచించరని నాశిక్‌లోని సహ్యాద్రి ఆసుపత్రి గైనకాలజిస్టు డాక్టర్ గౌరీ పింపాల్కర్ చెప్పారు.
‘‘మహిళల శరీరంలో ఈస్ట్రోజన్, ప్రోజెస్టెరాన్‌గా పిలిచే రెండు రకాల హార్మోలు ఉంటాయి. వీటి ఆధారంగానే నెలసరి వస్తూ ఉంటుంది. అయితే, ఈ హార్మోన్లకు సంబంధించిన ట్యాబ్లెట్లు తీసుకుంటే రుతుచక్రం వాయిదా వేసుకోవచ్చు. అంటే హార్మోన్ల సైకిల్‌ను ఈ మాత్రలు దెబ్బ తీస్తున్నాయి. దీని వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయి’’అని గౌరీ చెప్పారు.
‘‘తరచూ ఆ మాత్రలు తీసుకుంటే పక్షవాతం వచ్చే ముప్పు ఉంటుంది. కొంతమంది మహిళలు మరీ పది నుంచి 15 రోజులపాటు వీటిని తీసుకుంటారు. ఇది మరింత ప్రమాదకరం’’అని ఆమె అన్నారు.
ట్యాబ్లెట్లు సూచించేటప్పుడు రోగుల ఆరోగ్య చరిత్రను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. మైగ్రేన్, రక్తపోటు, బరువు తక్కువగా ఉండటం లాంటి సమస్యలు ఉండేవారు అసలు ఈ మాత్రలను తీసుకోకపోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి:
- పోడు వ్యవసాయమా, హరిత హారమా, పాత పగలా.. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరణానికి కారణం ఏంటి
- బంగారు నాణేలను మ్యూజియంలోంచి 9 నిమిషాల్లో కొట్టేశారు, వాటి విలువ రూ. 13.5 కోట్లు
- అఫ్గానిస్తాన్: ‘ఆకలితో ఉన్న నా పిల్లలను నిద్రపుచ్చేందుకు మత్తు మందు ఇస్తున్నా'
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా ముస్తాబై మొఘల్ సైన్యం మీదకు అహోం సైన్యం ఎందుకు వెళ్లేది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















