అత్త, కోడళ్ల మధ్య గొడవలు ఎందుకొస్తాయి? అత్తింటివారితో ఘర్షణలకు కారణాలేంటి?

పిల్లల పెంపకం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మేగన్ కార్నెగీ
    • హోదా, బీబీసీ న్యూస్

అత్తింటివారితో బంధుత్వాలలో పరస్పర అభినందనలు, సంతోషం, ప్రేమాభిమానాలు ఉంటాయి.

సాధారణంగా పెళ్లి తరువాత కొత్తగా మరో కుటుంబంతో బంధుత్వం ఏర్పరుచుకుని తమ మద్దతును పెంచుకుంటారన్న ప్రజాభిప్రాయం.

తమ అత్తింటివారిని ద్వేషించాలని ప్రారంభం నుంచి అందరూ అనుకోరు. ఎక్కువ శాతం జంటలు తమ వివాహం తరువాత రెండు కుటుంబాల మధ్య బంధాలు సానుకూలంగా ఉంటాయననే భావిస్తారని అమెరికాలోని పర్జ్యూ యూనివర్సిటీ 2012లో చేసిన అధ్యయనం ఒకటి వెల్లడించింది.

అయితే, అత్తింటివారితో సంబంధాలు ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉంటాయన్న భావనను పితృస్వామ్య వ్యవస్థలోని సంప్రదాయాలు, పాపులర్ కల్చర్‌లోని పాత్రలు వ్యాప్తి చేస్తుంటాయి. ప్రధానంగా మహిళల్లో ఇలాంటి భావనలు ఎక్కువగా కనిపిస్తాయి.

ఉదాహరణకు.. చెడ్డవారైన అత్తింటివారి పాత్రలను కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు. హామ్లెట్‌ నాటకంలో గెర్ట్రూడ్ భర్తను ఆమె మరిదే చంపేస్తాడు. కానీ గెర్ట్రూడ్ వద్ద అబద్ధాలు చెప్పి ఆమెను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు.

‘మీట్ ద పేరెంట్స్’ ఫిల్మ్ సిరీస్‌లో రాబర్ట్ డీనీరో పాత్ర ఒకప్పుడు తాను పనిచేసిన సీఐఏలోని నైపుణ్యాలను ఉపయోగించి తనకు కాబోయే అల్లుడిపై దుమ్మెత్తిపోస్తుంది. ఇలాంటివి టీవీ సీరియళ్లలోనూ ఎక్కువగా కనిపిస్తాయి.

అయితే, నిజజీవితంలోనూ అత్తింటివారితో వైరానికి చాలా ఉదాహరణలు కనిపిస్తుంటాయి.

పాప్ సింగర్ జియాన్ మాలిక్‌కు ఆయన అత్త, టీవీ నటి యోలాందా హదీద్‌కు మధ్య సంబంధాలు బెడిసికొట్టడం... ఫ్యాషన్ డిజైనర్ విక్టోరియా బెక్‌హామ్‌కు, కోడలు నికోలా పెల్జ్‌కు మధ్య వైరం వంటివన్నీ నిజజీవితంలోనూ కనిపించే ఇలాంటి ఉదాహరణలు.

ఇద్దరు మహిళల మధ్య ఘర్షణలకు ప్రాధాన్యం ఇవ్వడంలో మీడియాకు ఉండే ఆసక్తి అత్తమామలంటే క్రూరులనే భావన పెరగడానికి కారణమవుతోంది.

ఇలాంటివాటి వల్ల అత్తాకోడళ్లు, మామాఅల్లుళ్ల మధ్య గొడవలు సాధారణమే అనే భావన ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు.

ఇబ్బందికర వాతావరణం..

అత్తింటివారితో సంబంధాలు ఎలా నడపాలనే విషయంలో రూల్ బుక్ ఏమీ లేదు. తమ అత్తమామలతో ఎంత దగ్గరగా ఉండాలి, ఎంత తరచుగా వారిని కలుస్తూ ఉండాలి.. వారి విషయంలో తమ బాధ్యతలేంటి వంటివాటిపై ఎక్కడా స్పష్టత లేదు.

అత్తమామలతో పరస్పర అవగాహన ఉండాల్సిన అవసరం కానీ, భావాలు కలవాల్సిన అవసరం కానీ లేదని న్యూజీలాండ్‌లోని కాంటర్‌బరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గ్రీషెన్ పెర్రీ అన్నారు. ‘ఇన్ లాస్ రిలేషన్‌షిప్ ఇన్ ఎవల్యూషనరీ పెర్‌స్పెక్టివ్: ది గుడ్, ది బేడ్ అండ్ ద అగ్లీ’ అనే అధ్యయనపత్రానికి గ్రీషెన్ పెర్రీ సహ రచయిత.

మనుషులకు వారి సొంత కుటుంబాలతోనూ ఘర్షణలు ఉండొచ్చన్నది ఆమె మాట. సొంత కుటుంబం విషయానికొస్తే ‘మీరు వారితో ఏకీభవించే, వారితో ఉమ్మడి ఆసక్తులను కలిగి ఉండే అవకాశాలూ ఉన్నాయి’ కానీ, అత్తింటివారి విషయానికొచ్చేసరికి సొంత కుటుంబంతో ఉన్నట్లు ఏకీభావానికి అవకాశాలు తక్కువే అంటారామె.

చారిత్రకంగా కుటుంబ నిర్మాణం హెటెరో సెక్సువల్‌గా ఉండడమనేది కూడా ఇలాంటి ఉద్రిక్తలకు ఒకింత కారణం కావొచ్చు. అన్నింట్లో అత్త జోక్యం కూడా సంబంధాలు బెడిసికొట్టడానికి కారణమవుతుందని పెర్రీ అంటారు.

కొన్ని పితృస్వామ్య సమాజాల్లో తమ పిల్లల పెళ్లి విషయంలో తల్లిదండ్రులే నిర్ణయం తీసుకుంటారు. పెళ్లి తరువాత కోడలు అత్తవారింటికి వెళ్తుంది.

అత్తవారింట్లోని మహిళల్లో పెద్ద వ్యక్తిగా అత్తే అక్కడ కుటుంబ వ్యవహారాలలో కీలక పాత్ర పోషిస్తుంటారు.

ఆ కారణంగా కుటుంబంలో, సామాజికంగా ఆమెకు ఎక్కువ హోదా దక్కుతుంది. అలాగే, నిర్ణయాధికారమూ ఉంటుంది. ముఖ్యంగా కోడలి విషయంలో నిర్ణయాలు తీసుకునే అధికారం ఎక్కువగా అత్త చేతిలొనే ఉంటుందని పెర్రీ చెప్పారు.

‘‘అప్పటివరకు తల్లిదండ్రుల రక్షణలో ఉన్న అమ్మాయి కోడలిగా అత్తవారింట అడుగుపెట్టిన తరువాత ఆమెకు అక్కడి వాతావరణం కొత్తగా, కష్టంగా ఉంటుంది’’ అంటారు పెర్రీ.

Too much company and conflicting expectations can lead to tensions over holiday periods, say experts

ఫొటో సోర్స్, Getty Images

అంతా అత్తాకోడళ్ల మధ్యే

అయితే, అత్తవారింటితో ఘర్షణ అంటే ఎక్కువగా అత్తాకోడళ్ల మధ్యే ఉంటుందని గణాంకాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది అమెరికాలో వెల్లడైన ఓ అధ్యయనం ప్రకారం పురుషులకైనా, మహిళలకైనా తమ తల్లులతో కంటే అత్తలతోనే ఎక్కువగా ఘర్షణపూరిత వాతావరణం ఉంటుంది. అలాగే.. తల్లులకు కూడా తమ కూతుళ్లతో కంటే కోడళ్లతోనే ఎక్కువగా ఘర్షణ వాతావరణం ఉన్నట్లు ఈ అధ్యయనం తేల్చింది.

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ న్యూన్‌హామ్ కాలేజ్ బోధకులు, సైకాలజిస్ట్ టెర్రీ ఆప్టర్ ఈ అంశంపై రెండు దశాబ్దాలపాటు అధ్యయనం చేసి 2008లో ఓ పుస్తకం ప్రచురించారు.

85 శాతం అల్లుళ్లు అత్తతో హ్యాపీ

ఆమె సర్వే చేసిన మహిళల్లో 60 శాతం మంది తమ జీవితంలో అత్తతో కానీ, కోడలితో కానీ ఘర్షణ వల్లే అశాంతిగా గడిపామని, ఒత్తిడి అనుభవించామని అంగీకరించారు.

టెర్రీ ఆప్టర్ సర్వేలో పాల్గొన్న మహిళల్లో మూడింట రెండొంతులు మంది.. అత్తలు తరచూ తమపై అసూయపడేవారని.. కొడుకుపై తల్లిగా ప్రేమ చూపించేవారని చెప్పారు.

టెర్రీ ఆప్టర్ సర్వేలో 75 శాతం మంది జంటలు తమ అత్తమామలతో సమస్యలున్నట్లు చెప్పగా 15 శాతం మందిలో మాత్రమే అత్త, అల్లుడి మధ్య విభేదాలున్నాయి.

కుటుంబం

ఫొటో సోర్స్, Getty Images

పిల్లల పెంపకం విషయంలో..

అత్తింటివారితో కోడళ్లకు పొసగకపోవడానికి కారణాలలో పిల్లల పెంపకం ఒకటి. కోడలికి పిల్లలు పుట్టడానికి ముందు నుంచే ఏమాత్రం ఘర్షణపూరిత వాతావరణం ఉన్నా అది పిల్లలు పుట్టాక మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.

ఫిన్లాండ్‌లో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం.. పెళ్లయిన యువతలో చాలామందికి తమ తొలి సంతానం తరువాత అత్తమామలతో గొడవలు పెరుగుతాయి.

‘పిల్లల పెంపకం కొత్త కావడంతో ఈ యువ జంటలు అత్తమామలను ఎక్కువగా సంప్రదిస్తారు. గర్భంతో ఉన్నప్పుడు, బిడ్డకు పాలిచ్చే కాలంలో, చంటిబిడ్డను జాగ్రత్తగా చూసుకునే రోజుల్లో కోడళ్లకు సవాళ్లు ఎదురవుతుంటాయి. అలాంటి సమయంలో వారికి మరింత అండందండలు అవసరమవుతాయి’ అని పెర్రీ వివరించారు.

ఈ క్రమంలో కోడలు తన తల్లి, అత్తల్లో ఎవరిపై ఆధారపడుతున్నారు.. ఎవరిని ఎక్కువగా సంప్రదిస్తున్నారు, ఎవరిని విశ్వసిస్తున్నారు..వారిలో ఎవరు ఎక్కువగా అండగా ఉంటున్నారనే అంశాలన్నీ అత్తాకోడళ్ల మధ్య సంబంధాలలో కీలకమవుతాయి.

పిల్లల పెంపకం తీరులోనూ తరాల మధ్య ఉండే అంతరాలూ అత్తాకోడళ్ల మధ్య విభేదాలకు కారణాలవుతాయి.

అత్త తన మనవడు లేదా మనవరాలిని ఒక రకంగా పెంచాలనుకుంటే ఆ పద్ధతి కోడలికి నచ్చకపోవచ్చు.. అదే సమయంలో కోడలి పెంపకం తీరు అత్తకు నచ్చకపోవచ్చు.. ఇలాంటి సందర్భాలలో సంఘర్షణ ఏర్పడుతుంది.

ఇలాంటి సందర్భాలలో తరాల మధ్య అంతరాన్ని ఇద్దరూ అర్థం చేసుకోగలిగితే విభేదాలకు తావుండదు.

అయితే, పిల్లల పెంపకంలో అత్తాకోడళ్ల మధ్య సంప్రదింపులు ఎంత ఎక్కువగా ఉంటే విభేధాలకు అంత ఎక్కువ ఆస్కారం ఉంటుందని ఈ ఫిన్లాండ్ అధ్యయనం పేర్కొంది. ఒకరి జీవితాల్లో మరొకరి జోక్యం ఎంత ఎక్కువ ఉంటే ఘర్షణకు అంత ఎక్కువ అస్కారం ఉంటుందన్న సిద్ధాంతం ఇక్కడ వర్తిస్తుందని ఈ అధ్యయనం పేర్కొంది.

పండగలు, సెలవుల సమయంలో

అత్తాకోడళ్ల మధ్య సంబంధమనే కాదు అత్తింటివారితో సంబంధాలు కాలం గడిచేకొద్దీ ఘర్షణలకు దారితీసేలా మారడానికి కారణాలలో సెలవులు, పండుగలు, వేడుకలూ ఉంటాయి.

క్రిస్మస్ పండుగ సమయంలో మా ఇంటికి రావాలంటే మా ఇంటికి రావాలంటూ అటు తల్లిదండ్రులు, ఇటు అత్తమామలు పట్టుపడితే దంపతులు ఇరుకునపడతారని కెనడాలోని మెక్‌మాస్టర్ యూనివర్సిటీ సైకాలజీ, న్యూరోసైన్స్, బిహేవియర్ సైకాలజీ ప్రొఫెసర్ మార్టిన్ డాలీ అన్నారు.

క్రిస్మస్ వంటి సందర్భాలే ఉద్రిక్తతలు, ఘర్షణలకు దారితీస్తాయి.. అలాంటి వేళల్లో అంతా కలిసి గడపాలని కోరుకుంటారు.. ఈ క్రమంలోనే తేడాలొస్తాయి అని డాలీ చెప్పారు.

అలాగే అత్తమామలతో కలిసి ఉండేటప్పుడు ఇంట్లో సరిపడా స్థలం లేకపోవడం, ప్రైవసీ లేకపోవడం వంటివీ సంబంధాలు బెడిసికొట్టడానికి కారణాలవుతాయని అమెరికాలోని వెస్ట్ వర్జీనియా యూనివర్శిటీలో కమ్యూనికేషన్ స్టడీస్ ప్రొఫెసర్ మెలానీ బూత్ బటర్‌ఫీల్డ్ అన్నారు. బటర్‌ఫీల్డ్ ఈ అంశంపై ఒక పుస్తకం రాస్తున్నారు.

అంతేకాకుండా సంప్రదాయ వైరుధ్యాల కారణంగానూ విభేదాలు ఏర్పడొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

సెలవుల్లో అంతా కలిసి ఎంత సమయం గడుపుతారు, పిల్లలను ఎలా పెంచుతారు, డబ్బులు ఎలా ఖర్చు చేస్తారు, అప్పులు మొదలైన అంశాలై అత్తింటివారితో సంబంధాలను ప్రభావితం చేస్తాయి.

డిజిటల్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ఫాదర్లీ 2016లో జరిపిన సర్వేలో అత్తమామలతో విభేదించే జంటల్లో 29 శాతం మంది పేరెంటింగ్ తీరు, 15 శాతం మంది రాజకీయాలను, 14 శాతం మంది డబ్బు, 4 శాతం కెరీర్ గురించి అత్తింటివారు గుచ్చిగుచ్చి ప్రస్తావిస్తుండడం కారణాలుగా చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)