జ్ఞానవాపి కేసు: ‘శివలింగం’ వయసును ఎలా నిర్ధారిస్తారు? కార్బన్ డేటింగ్ అంటే ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ‘శివలింగం’గా భావిస్తున్న నిర్మాణం వయసును తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఆ నిర్మాణం ‘శివలింగమే’ అని కొందరు హిందువులు వాదిస్తుంటే కాదు అది ‘ఫౌంటైన్ హెడ్’ అని జ్ఞానవాపి మసీదును నడిపే అంజుమన్ ఇంతేజామియా మసీద్ కమిటీ చెబుతోంది.
ఈ నేపథ్యంలో ఆ కట్టడం వయసును నిర్ధారించాలంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. అయితే ‘శివలింగం’గా భావిస్తున్న ఆ కట్టడం జీవం లేనిది కాబట్టి, కార్బన్ డేటింగ్ ద్వారా దాని వయసును నిర్ధారించడం సాధ్యం కాదని భారత పురాతత్వశాఖ కోర్టుకు వెల్లడించింది.

ఫొటో సోర్స్, Science Photo Library
కార్బన్ డేటింగ్ అంటే ఏంటి?
మన వయసు ఎంత? అని అడగ్గానే టక్కున చెప్పేస్తాం. ఎందుకంటే మనకు మన పుట్టిన తేదీ తెలుసు కాబట్టి. మరి వేల ఏళ్ల కిందటి శిలాజాల వయసును ఎలా నిర్ధారిస్తారు? మనకు దొరికిన ఒక ఎముక, 40వేల ఏళ్ల కిందట ఆఫ్రికాలో నివసించిన మానవుడిది అని ఎలా చెబుతారు?
ఇలా చెప్పేందుకు ఉపయోగించే పద్ధతే కార్బన్ డేటింగ్. దీన్నే రేడియోకార్బన్ డేటింగ్ అని కూడా అంటారు. మానవ, జంతు శిలాజాల వయసును తెలుసుకునేందుకు ఈ టెక్నిక్‌ను వాడతారు.
కార్బన్ అంటే?
ఈ ప్రపంచంలో ప్రతి జీవిలోనూ కార్బన్ ఉంటుంది. కార్బన్ అనేది ఒక రసాయనిక మూలకం. మనం తరచూ చూసే పెన్సిల్, డైమండ్స్ వంటి వాటిలో స్వచ్ఛమైన కార్బన్ కనిపిస్తుంది.
మనుషులు, జంతువులు, చెట్లు వంటి వాటిలో కార్బన్ అణువులు ఉంటాయి. మనకు అవసరమైన కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్‌లో కార్బన్ కాంపౌండ్స్ అంటే కార్బన్ సమ్మేళనాలు ఉంటాయి.
కార్బన్ ఐసోటోప్స్
కార్బన్ డేటింగ్ పద్ధతిని అర్థం చేసుకోవాలంటే ఐసోటోప్స్ గురించి కాస్త తెలుసుకోవాలి. ప్రోటాన్ల సంఖ్య సమానంగా ఉండి న్యూట్రాన్ల సంఖ్య భిన్నంగా ఉండే అణువులను ఐసోటోప్స్ అంటారు. కార్బన్ ఐసోటోపులు మూడు రూపాల్లో ఉంటాయి.
అవి… కార్బన్-12, కార్బన్-13, కార్బన్-14.
కార్బన్-12: భూమి మీద 99శాతం కార్బన్ ఈ ఐసోటోపు రూపంలోనే ఉంటుంది. కార్బన్-12 అణువులో 6 ప్రోటాన్లు, 6 న్యూట్రాన్లు ఉంటాయి.
కార్బన్-13: భూమి మీద దీని వాటా దాదాపు 1శాతం మాత్రమే. ఇందులో 6 ప్రోటాన్లు, 7 న్యూట్రాన్లు ఉంటాయి.
కార్బన్-14: ఇది భూమి మీద అత్యంత అరుదుగా లభించే ఐసోటోప్. లక్ష కోట్ల కార్బన్ అణువుల్లో ఒకటి మాత్రమే ఉంటుంది. ఇందులో 6 ప్రోటాన్లు, 8 న్యూట్రాన్లు ఉంటాయి.

వయసును ఎలా నిర్ధారిస్తారు?
జీవులు బతికి ఉన్నంత వరకు వాటి శరీరంలోకి కార్బన్ చేరుతూ ఉంటుంది. ఆహారం తీసుకున్నప్పుడు కార్బొహైడ్రేట్స్ వంటి రూపంలో కార్బన్ లభిస్తుంది.
- జీవి చనిపోయిన తరువాత శరీరంలోకి కార్బన్ చేరడం ఆగిపోతుంది. అయితే మృతదేహంలోని కార్బన్-12 అలాగే ఉంటుంది. ఇందులో ప్రోటాన్లు, న్యూట్రాన్లు సమానంగా ఉంటాయి కాబట్టి ఎటువంటి మార్పుకు ఇది లోను కాకుండా స్థిరంగా ఉంటుంది.
- కానీ కార్బన్-14 మాత్రం స్థిరంగా ఉండకుండా మార్పుకు లోనవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇందులో ప్రొటాన్ల సంఖ్యకు సమానమైన న్యూట్రాన్లు ఉండవు. ఈ తేడా వల్ల కాలక్రమంలో కార్బన్-14 క్షీణిస్తూ పోతుంది. దీన్నే రేడియో యాక్టివ్ డికే లేదా ఆల్ఫా డికే అంటారు.
- దాదాపు ప్రతి 5,730 ఏళ్లకు మృతదేహంలోని కార్బన్-14 అణువుల్లో సగం క్షీణించి పోతాయని శాస్త్రవేత్తలు లెక్కించారు. 11,460 ఏళ్ల తరువాత 25శాతం అణువులు మాత్రమే మిగిలి ఉంటాయి. 17,190 ఏళ్ల తరువాత 12.5శాతం కార్బన్-14 అణువులు ఉంటాయి. కార్బన్-14 అణువులు పూర్తిగా క్షీణించే వరకు ఈ పద్ధతి కొనసాగుతుంది.
బతికున్న ప్రాణి శరీరంలో ప్రతి లక్ష కోట్ల కార్బన్-12 అణువులకు ఒక్క కార్బన్-14 అణువు మాత్రమే ఉంటుంది. అంటే ఈ నిష్పత్తి 1,00,00,000,000:1గా ఉంటుంది. కానీ జీవి మరణించిన తరువాత కార్బన్-14 క్షీణిస్తూ పోతుంది కాబట్టి ఈ నిష్పత్తి మారుతూ ఉంటుంది. ఆ నిష్పత్తిని లెక్కించడం ద్వారా ఒక శిలాజం వయసును కనుగొంటారు.

ఫొటో సోర్స్, ANI
ఈ పద్ధతిలో ‘శివలింగం’ వయసును ఎందుకు తెలుసుకోలేరు?
- కార్బన్ డేటింగ్ పద్ధతిలో వయసు నిర్ధారించాలంటే కార్బన్ ఎంతో కీలకం. ప్రాణం ఉన్న జీవుల్లో మాత్రమే కార్బన్ చేరుతుంది. అందువల్ల చనిపోయిన తరవాత వాటిని వయసును లెక్కించగలరు.
- కానీ ప్రాణం లేని రాళ్లు, ఇనుము వంటి వాటిలో కార్బన్ ఉండదు. కాబట్టి కార్బన్ డేటింగ్ ద్వారా ఇటువంటి వాటి వయసును తెలుసుకోవడం సాధ్యం కాదు.
- జ్ఞానవాపి మసీదులోని ‘శివలింగం’ అని చెబుతున్న నిర్మాణం కూడా ఈ పరిధిలోకి వస్తుంది. ఒకవేళ ఆ నిర్మాణంలో ఏదైనా జీవులకు సంబంధించిన శిలాజం ఉంటే అప్పుడు దాని వయసును కొంతమేరకు అంచనా వేయొచ్చు.
- కార్బన్ డేటింగ్ పద్ధతిలో సుమారు 50వేల ఏళ్ల వయసు వరకు మాత్రమే నిర్ధారించగలరు. 50వేల ఏళ్లు దాటిన శిలాజాల్లో కార్బన్-14 జాడ దాదాపుగా కనిపించదు.
- 50వేల ఏళ్లకు మించిన వాటి వయసును తెలుసుకునేందుకు పొటాషియం-40 వంటి రేడియో యాక్టివ్ ఐసోటోప్స్‌ను ఉపయోగిస్తారు. ఇది 1.3 బిలియన్ సంవత్సరాల వయసు వరకు లెక్కిస్తుంది.
యురేనియం-238, థోరియం-232 వంటి ఐసోటుపుల సాయంతో 14.1 బిలియన్ సంవత్సరాల వరకు వయసును కనుగొనవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
‘శివలింగం’ వయసు తెలుసుకోవడం ఎలా?
కార్బన్ డేటింగ్ పద్ధతిలో ‘శివలింగం’ వయసును గుర్తించడం కష్టమని, దానికి ఇతర శాస్త్రీయ పద్ధతులను పరిశీలిస్తామని పురాతత్వశాఖ, కోర్టుకు తెలిపింది.
అయితే ఆ నిర్మాణం వయసును తెలుసుకోవాలంటే ముందు దాన్ని ఏ రకం రాయితో చేశారో తెలుసుకోవాలని జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో సీనియర్ జియాలిస్టుగా పని చేస్తున్న అర్పితా రాయ్ అన్నారు.
‘రాయి రకాన్ని బట్టి వివిధ రకాల డేటింగ్ పద్ధతులను పాటిస్తారు. అంటే అందులోని కెమికల్ కంపోజిసన్ తెలియాలి. రాయిలో ఉండే మూలకాల ఆధారంగా సమారియం వంటి డేటింగ్ పద్ధతులను అనుసరిస్తారు. కార్బన్-14 డేటింగ్ అనేది ఆర్గానిక్ మ్యాటర్ విషయంలోనే సాధ్యమవుతుంది.
కట్టడాలు, రాళ్ల విషయంలో అందులో ఉన్న మెటీరియల్స్ ఆధారంగా మాత్రమే డేటింగ్ పద్ధతిని ఎంచుకోవాల్సి ఉంటుంది’ అని అర్పితా రాయ్ బీబీసీకి తెలిపారు.
యురేనియం వంటి రేడియో యాక్టివ్ ఐసోటోపులు ఉండే రాళ్ల వయసును రేడియోమెట్రిక్ డేటింగ్ పద్ధతిలో కనుగొనవచ్చు.
అయితే జ్ఞానవాపి కేసులో వివాదాస్పదంగా ఉన్న కట్టడం గురించి అడిగితే దాని మీద తాను మాట్లాడలేనని అర్పితా రాయ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ 2022: స్టేడియంలో బీరు అమ్మకాల గురించి ఫీఫా ఎందుకు పోరాడుతోంది?
- ఫిఫా వరల్డ్ కప్: జాతీయ గీతాలాపనలో ఇరాన్ ఆటగాళ్ళ మౌనం, స్వదేశంలో ప్రభుత్వ వైఖరిపై నిరసన
- 50 ఏళ్లు ప్రతి రోజూ కొండపైకి వెళ్లిన ఈ 85 ఏళ్ల తాతను అంతా ఎగతాళి చేశారు, ప్రభుత్వం సన్మానం చేసింది
- జ్యూస్ ఇలా తాగారా ఎప్పుడైనా?
- టీడీపీ రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ ఎవరు? చంద్రబాబు నాయుడు ‘చివరి ఎన్నికలు’ అస్త్రం ఆయనదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














