రవీంద్రనాథ్ ఠాగూర్ 1930లో జర్మనీకి గిఫ్ట్‌గా ఇచ్చిన పెయింటింగ్స్‌ను హిట్లర్ ఎందుకు ధ్వంసం చేశారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, ఇండియా కరస్పాండెంట్
అవి మొత్తం 5 కళాఖండాలు. కొన్నిట్లో పక్షులు, మరికొన్నిట్లో మనుషులు కనిపిస్తున్నారు. ఇంకో చిత్రంలో పొడవాటి ఎర్ర గౌను వేసుకున్న అమ్మాయి ఉంది.
ఇండియాకు చెందిన కవి రవీంద్రనాథ్ ఠాగూర్ రంగు సిరాలు, వాటర్ కలర్స్‌తో వేసిన ఈ చిత్రాలు బెర్లిన్‌లోని ఓ మ్యూజియంలో ఉన్నాయి.
నోబెల్ సాహిత్య బహుమతి దక్కించుకున్న తొలి ఐరోపాయేతర కవి ఠాగూర్.
1930లో ఆయన తన ఈ చిత్రాలను జర్మనీకి బహూకరించారు.
అక్కడికి ఏడేళ్ల తరువాత నాజీల పాలనలో వాటిని పనికిరానివిగా, అక్కడ ఉండడానికి తగనవిగా పేర్కొంటూ తొలగించారు.
విఫల చిత్రకారుడైన హిట్లర్ ఫోస్ట్ ఇంప్రెషనిస్ట్ మోడర్న్ ఆర్ట్‌ను ‘స్థిమితం లేని మానసిక స్థితికి నిదర్శనం’గా భావించేవారు. ఆ క్రమంలోనే ఆయన జర్మనీ మ్యూజియంలలో ఉన్న ఇలాంటి 16,000 చిత్రాలను తొలగించాలని ఆదేశించారు. అందులో విన్సెంట్ వాన్ గాఫ్, మేన్ రే వంటి వారి చిత్రాలూ ఉన్నాయి.
ఈ తరహా చిత్రాలను ‘దిగజారుడు చిత్రాలు’గా భావించిన నాజీలు వాటిని ఎగతాళి చేసేందుకు ప్రత్యేకంగా వాటితో ఒక ప్రదర్శననూ నిర్వహించారు.
అపఖ్యాతి చేసేందుకు హిట్లర్ చేపట్టిన ఈ ప్రచారంలో రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రాలనూ ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారనేది చెప్పడానికి తగిన ఆధారాలు, రికార్డులు పెద్దగా అందుబాటులో లేవు.
ఎవరి కళనైనా రాక్షసంగా చూపించడం నాజీలకు పెద్దగా కష్టమేమీ కాదన్నది చరిత్రకారుల అంచనా. ఆధునికవాదులను వారు లక్ష్యంగా చేసుకుంటారు.
‘ఆకాశాన్ని ఆకుపచ్చగా, పొలాలను నీలంరంగులో చిత్రించేవారిని పిల్లలను కనేందుకు పనికిరాకుండా చేయాలి’ అని హిట్లర్ ఓ సందర్భంలో అన్నట్లు చరిత్రకారులు చెబుతారు.

రవీంద్రనాథ్ ఠాగూర్ తన జీవిత కాలంలో మూడుసార్లు జర్మనీలో పర్యటించారు. 1921, 1926, 1930లలో ఆయన జర్మనీ వెళ్లారు.
అప్పటికే ఠాగూర్ రాసిన సుమారు 25 పుస్తకాల జర్మన్ అనువాదం అక్కడ అందుబాటులో ఉంది. ‘జర్మనీలో ఠాగూర్ ఎక్కడ మాట్లాడేందుకు వెళ్లినా అక్కడ హాల్ నిండిపోయేది. ఆయన కార్యక్రమం జరిగే హాల్‌లోకి ప్రవేశం దొరకనివారి పోట్లాట, అక్కడ జరిగే గొడవల గురించి పత్రికలు రాసేవి’ అని ఠాగూర్ రచనలను అనువదించిన జర్మన్ రచయిత మార్టిన్ కాంప్షెన్ చెప్పారు.
జర్మనీ మీడియా కూడా ఠాగూర్‌ను తూర్పు దేశాల నుంచి వచ్చిన విజ్ఞుడిగా కీర్తించింది.
1930లో ఠాగూర్ వేసిన 300 చిత్రాలతో యూరప్‌లో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆయన వేసిన 100కి పైగా చిత్రాలతో పారిస్‌లోనూ ప్రదర్శన నిర్వహించారు. అక్కడి నుంచి ఆ ప్రదర్శన లండన్‌కు మార్చారు. మధ్యలో బెర్లిన్‌లోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్స్‌లోనూ ప్రదర్శించారు.
1937 వరకు ఠాగూర్ పెయింటింగ్‌లు బెర్లిన్‌లోని బారోక్ క్రౌన్ ప్రిన్స్ ప్యాలస్‌లో ఉండేవి. నేషనల్ గ్యాలరీ కూడా ఈ ప్యాలస్‌లోనే ఉండేది.
అయితే, ‘1937 అక్టోబర్ 15న హిట్లర్ ఇలా చిత్రాల ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించినప్పుడు రూపొందించిన తొలగింపు జాబితాలో ఠాగూర్ వేసిన 5 చిత్రాలనూ చేర్చారు.
వాటిని ప్యాలస్ నుంచి తొలగించి వేరేచోటికి మార్చారు. అక్కడికి వెళ్లేందుకు అతి కొద్దిమందికి మాత్రమే అనుమతులుండేవి’ అని కళాచరిత్రకారుడు కాంస్టాంటిన్ వెంజలాఫ్ చెప్పారు.
194142లో సంకలనం చేసిన ఓ ‘డీజనరేట్ ఆర్ట్’ ఇన్వెంటరీ.. నాజీల కాలంలో తొలగింపునకు గురైన చిత్రాల జాబితాను కొంతవరకు అందుబాటులోకి తేగలిగింది. అందులో ఠాగూర్ చిత్రాలను మాస్క్, పోర్ట్రయిట్, గర్ల్ ఇన్ రెడ్ రోబ్, మాస్క్, టూ బర్డ్స్‌గా పేర్కొన్నారు.
తొలగించిన చిత్రాల జాబితాను అక్షర క్రమంలో రూపొందించి వాటిని వర్గీకరించారు. ప్రతి పెయింటింగ్‌పైన
T (మార్పిడి కోసం), V (విక్రయానికి), X (ధ్వంసం చేయడానికి) అని గుర్తులు పెట్టారు.
ఠాగూర్ చిత్రాల విషయానికొస్తే రెండు పెయింటింగులను మార్చినట్లు.. మరో రెండింటిని ధ్వంసం చేసినట్లు జాబితాలో ప్రస్తావించారు. అయిదో చిత్రం ‘టూ బర్డ్స్’ను ఏం చేశారనేది అందులో లేదు.

ఫొటో సోర్స్, COURTESY OLIVER KASE
గ్యాలరీ నుంచి ఠాగూర్ చిత్రాలు అదృశ్యమయ్యాయని, ఇంతవరకు వాటిని రికవర్ చేయలేదని వెంజలాఫ్ పేర్కొన్నారు.
కాగా 1939లోనే అందులోని మూడు పెయింటింగ్‌లను తిరిగి పంపించే ప్రయత్నాలు జరిగాయి. నాజీ జర్మనీలోని రీచ్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ ఎన్‌లైటెన్‌మెంట్ అండ్ ప్రోపగాండా నుంచి ఈ మేరకు లేఖ కూడా వచ్చింది. అయితే, అప్పటికి ఠాగూర్ జీవించే ఉన్నప్పటికీ ఈ చిత్రాలను అప్పగించేందుకు గాను ఠాగూర్ వారసుల చిరునామాల కోసం ఆ మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేసింది.
ఠాగూర్ చిత్రాలపై అధ్యయనం చేసిన చరిత్రకారుడు ఆర్.శివకుమార్... ఈ మూడు చిత్రాలను జర్మనీ నాజీ ప్రభుత్వం ఠాగూర్‌కు అప్పగించిందని.. మిగిలిన రెండు పోయాయని చెప్పారు.
అయితే పోయినట్లుగా భావిస్తున్న రెండు చిత్రాల్లో ఒకటి 1964 నుంచి బవేరియన్ స్టేట్ పెయింటింగ్ కలెక్షన్స్‌లో ఉందని మ్యూనిచ్‌లోని పినాకోథెక్ మోడెర్నా మ్యూజియం చీఫ్ క్యురేటర్ ఓలివర్ కేస్ చెబుతున్నారు. నీడలో సగం తలభాగం ఉన్నట్లుగా ఆ చిత్రం ఉంటుందని కేస్ చెప్పారు.
పోయిన రెండు చిత్రాలలో ఇంకోటి 1996 అక్టోబర్‌లో బ్రిటన్‌లో నిర్వహించిన వేలంలో ఓ వ్యక్తి కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇక ఠాగూర్‌కు తిరిగి ఇచ్చిన మూడు పెయింటింగ్‌లలో ఒకటి పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లో ఉన్న ఠాగూర్ విశ్వభారతి విశ్వవిద్యాలయంలోని ఆర్కైవ్‌లలో ఒకటి చూసినట్లుగా ఉందని శివకుమార్ తెలిపారు.
శాంతినికేతన్‌లో ఈ ఆర్కైవ్స్ బాధ్యతలు చూసే నీలాంజన్ బంధోపాధ్యాయ మాత్రం తనకు ఈ పెయింటింగ్ విషయం తెలియదన్నారు.
‘ఠాగూర్ తన 60లలో చిత్రలేఖనం ప్రారంభించారు. 1941లో ఆయన చనిపోవడానికి ముందు వరకు ఆయన దశాబ్దకాలంలో 2,300 కంటే ఎక్కువ చిత్రాలు వేశారు. 1928లో ఆయన తన తొలి పెయింటింగ్ వేశారు’ అని శివకుమార్ చెప్పారు.
‘భారత్‌లో తన కళ ద్వారా స్వేచ్ఛ అనే ఆలోచనను కలిగించే ప్రయత్నం ఆయన చేశారు. 1930లలో బ్రిటన్, అమెరికాలు ఇంకా ఆధునిక చిత్రకళను పూర్తిగా అందిపుచ్చుకోలేదు. జర్మనీలో ఠాగూర్ చిత్రాలను చూసిన అక్కడివారు ఆయన కళను అధివాస్తవికత, వ్యక్తీకరణవాదంతో పోల్చారు’ అని శివకుమార్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- కిసాన్ క్రెడిట్ కార్డ్: రైతుకు రూ. 3 లక్షల లోన్, ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటే...
- హనీ ట్రాప్ అంటే ఏంటి... సెక్స్‌ను ఒక ఆయుధంగా ఎలా వాడతారు
- ఆన్లైన్ పార్ట్‌టైమ్ జాబ్స్ చేయాలనుకుంటున్నారా? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవీ..
- ఫుట్‌బాల్: భారత జట్టుకు వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం వచ్చినా ఎందుకు ఆడలేదు?
- కృష్ణ: తిరుపతిలో గుండు చేయించుకుని వచ్చాక పద్మాలయ స్టుడియో గేటు దగ్గర ఆపేశారు, అప్పుడు ఏమైందంటే
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














