శ్రద్ధ హత్య కేసు: సహజీవనంలో మహిళలకు ఉండే హక్కులేంటి?

సహజీవనం

ఫొటో సోర్స్, DOUGAL WATERS

    • రచయిత, సుమన్‌దీప్ కౌర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దిల్లీకి చెందిన శ్రద్ధ హత్య కేసు చాలామందిని కలచివేసింది.

ఆమెతోపాటు సహజీవనం చేసిన అఫ్తాబ్ పూనావాలా ఆమెను కిరాతకంగా హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

27 ఏళ్ల శ్రద్ధ వాల్కర్‌ను గత మే నెలలోనే అఫ్తాబ్ హత్య చేశాడని, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా కోసి సమీపంలోని అటవీ ప్రాంతంలో విసిరేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఈ కేసులో నిందితుడైన అఫ్తాబ్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

అఫ్తాబ్, శ్రద్ధ ఇద్దరూ మహారాష్ట్రకు చెందినవారే. వీరు దిల్లీలో స్థిరపడ్డారు. వీరిద్దరూ సహజీవనం (లివ్‌ ఇన్) చేసేవారు.

శ్రద్ధ హత్య కేసు

సోషల్ మీడియాలో చర్చ

ఈ హత్య తర్వాత మానసిక ఆరోగ్యంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

మరోవైపు సహజీవనంలో ఉండే మహిళలకు ఎలాంటి హక్కులు ఉంటాయి? చట్టాలు ఏం చెబుతున్నాయి వంటి అంశాలపైనా చర్చ జరుగుతోంది.

హక్కులు, చట్టాలపై వివరాలు తెలుసుకునేందుకు పంజాబ్, హరియాణా హైకోర్టు సీనియర్ అడ్వొకేట్ రీటా కోహ్లీతో మేం మాట్లాడాం.

‘‘సహజీవనం చట్ట వ్యతిరేకమైనది కాదు. అదే సమయంలో దీన్ని ఏ చట్టంలోనూ నిర్వచించలేదు’’అని కోహ్లీ అంటున్నారు.

అయితే, ‘‘ఇద్దరు వయోజనులు తమ పూర్తి ఆమోదంతో కలిసి జీవించడాన్ని సహజీవనం లేదా లివ్‌ఇన్ రిలేషన్‌షిప్’’గా కోర్టు నిర్వచించింది.

‘‘సమాజం దీన్ని నైతిక బంధంగా పరిగణించదు. కానీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, స్వేచ్ఛగా జీవించే హక్కును ఎవరి నుంచి బలవంతంగా తీసేసుకోలేం’’అని ఆమె చెప్పారు.

‘‘ఈ నిబంధన ప్రకారం, లివ్-ఇన్‌ను లీగల్‌గా పరిగణించవచ్చు. కానీ, మన సమాజం మాత్రం దీన్ని నైతికంగా సరైనదని గుర్తించదు’’అని ఆమె అన్నారు.

సుప్రీం కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

భిన్నంగా స్పందించిన కోర్టులు

2006లో ఒక కేసులో తీర్పు ఇచ్చేటప్పుడు ‘‘వయోజనులైన తర్వాత తమకు నచ్చిన వ్యక్తితో కలిసి జీవించే లేదా పెళ్లి చేసుకునే హక్కు వారికి ఉంటుంది’’అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

ఈ సంబంధాన్ని కొందరు అనైతికంగా చూసేటప్పటికీ, ఇదేమీ నేరం కాదని కోర్టు స్పష్టం చేసింది.

అయితే, ఆ తర్వాత భిన్న కోర్టులు ఈ అంశంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి.

2021లో ఈ అంశంపై పంజాబ్, హరియాణా హైకోర్టు స్పందిస్తూ.. ‘‘ఈ పిటిషన్ ద్వారా తమ లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌కు ఆమోద ముద్ర వేయాలని పిటిషనర్లు కోరుకుంటున్నారు. నైతిక చర్యగా సమాజం గుర్తించని ఈ బంధంపై మేం ఎలాంటి ఆదేశాలూ జారీచేయలేం’’అని వ్యాఖ్యానించింది.

సహజీవనం చేస్తున్న 19ఏళ్ల యువతి, 22ఏళ్ల యువకుడు తమకు రక్షణ కల్పించాలంటూ ఈ కేసు ద్వారా పంజాబ్, హరియాణా హైకోర్టును ఆశ్రయించారు.

మరోవైపు 2021లోనూ సహజీవనం చేస్తున్న రెండు జంటలు ఇలానే తమకు రక్షణ కల్పించాలని కోరుతూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాయి. ఆర్టికల్ 21లోని స్వేచ్ఛగా జీవించే హక్కును అమలు చేయాలని కోరుతూ వారు కోర్టును ఆశ్రయించారు.

అయితే, ఈ సహజీవనాన్ని సామాజిక నైతికతకు బదులుగా ‘‘వ్యక్తిగత స్వేచ్ఛ’’ కోణంలో చూడాలని కోర్టు అభిప్రాయం వ్యక్తంచేసింది.

సహజీవనం

ఫొటో సోర్స్, GETTY/UWE KREJCI

మహిళలకు ఎలాంటి హక్కులు ఉంటాయి?

లివ్-ఇన్‌లో ఉండే మహిళలకు ఏం హక్కులు ఉంటాయి? అనే అంశంపై రీటా కోహ్లీ మాట్లాడారు. ‘‘మహిళ కావొచ్చు లేదా పురుషుడు కావొచ్చు.. ఎవరికైనా సహజీవనంలో ప్రత్యేకంగా ఎలాంటి హక్కులూ ఉండవు’’అని ఆమె చెప్పారు.

‘‘పెళ్లి ద్వారా బంధంలోకి అడుగుపెట్టే జంటలకు చాలా హక్కులు ఉంటాయి. అదే సహజీవనం విషయానికి వస్తే, ఎంత కాలం నుంచి వారు ఈ బంధంలో ఉన్నారు? వీరి మధ్య బంధం ఎలా ఉంది? లాంటి అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది’’అని ఆమె చెప్పారు.

‘‘కొన్ని నెలల సహజీవనం తర్వాత ఎవరైనా నేరుగా కోర్టుకు వెళ్లి తమకు వివాహితల తరహాలోనే హక్కులు కల్పించాలని అడిగితే, కోర్టులు కుదరదని చెప్పొచ్చు’’అని ఆమె వివరించారు.

‘‘కానీ, వారి మధ్య బంధం సుదీర్ఘ కాలం నుంచి కొనసాగితే, సమాజం వారిని భార్యాభర్తలుగా గుర్తిస్తే, అప్పుడు వారికి భార్యతో సమానంగా హక్కులు ఇవ్వొచ్చు’’అని కోహ్లీ చెప్పారు.

కోర్టులు కూడా భిన్న సమయాల్లో తమ తీర్పులు ద్వారా ఇదే విషయాన్ని స్పష్టంచేశారని చెప్పారు.

అయితే, ఇంత సమయం కలిసి ఉంటే ఆ బంధాన్ని చట్టపరంగా గుర్తిస్తారనే నిబంధన ఏమైనా ఉందా?

‘‘కొంతమంది రెండేళ్లు లేదా ఐదేళ్లు కలిసి ఉంటే చట్టపరంగా గుర్తిస్తారని అంటున్నారు. అలాంటి పరిమితి లేదా నిబంధన ఏమీలేదు’’అని కోహ్లీ వివరించారు.

‘‘సమాజంలో భార్యా-భర్తలుగా గుర్తింపు ఉండేవారు తమ హక్కులను కోరుతూ కోర్టులకు వెళ్లొచ్చు. కానీ, ఇక్కడ ఎలాంటి ‘కాలం’ అనే పరిమితి ఏమీలేదని మనం గుర్తుపెట్టుకోవాలి’’అని ఆమె చెప్పారు.

శ్రద్ధ హత్య కేసు

ఫొటో సోర్స్, ANI

గృహ హింసకు వ్యతిరేకంగా హక్కులు...

అయితే, గృహ హింస చట్టంలోని నిబంధనలు అందరి మహిళలకు ఒకేలా వర్తిస్తాయని రీటా కోహ్లీ చెప్పారు.

‘‘గృహ హింస చట్టం ప్రకారం, మీరు ఎవరైనా వ్యక్తితో కలిసి ఒకే ఇంట్లో జీవిస్తే, ఆ వ్యక్తి మిమ్మల్ని వేధిస్తే, ఈ చట్టం కింద పోలీసులను ఆశ్రయించొచ్చు’’అని ఆమె చెప్పారు.

‘‘ఇక్కడ చెల్లిని అన్నయ్య వేధించినా ఈ చట్టం కింద పోలీసులను ఆశ్రయించొచ్చు’’అని ఆమె అన్నారు.

‘‘గృహహింస చట్టం అనేది మహిళందరికీ వర్తిస్తుంది’’అని ఆమె తెలిపారు.

వీడియో క్యాప్షన్, మెంటల్ హెల్త్ సెంటర్లో ప్రేమ, పెళ్ళి

పిల్లలకు ఎలాంటి హక్కులు ఉంటాయి?

సహజీవనం ద్వారా పుట్టే హిందువుల పిల్లలకు ఆస్తి హక్కులపై గత జూన్‌లో సుప్రీం కోర్టు ఒక కీలకమైన తీర్పును వెల్లడించింది.

పెళ్లి కాకుండా సుదీర్ఘ కాలం సహజీవనంలో గడిపిన జంటకు పుట్టే పిల్లలకు వారసత్వ ఆస్తిలో హక్కు ఉంటుందని కోర్టు స్పష్టంచేసింది.

ఈ బంధం ద్వారా పుట్టే పిల్లలకు సాధారణ పిల్లల్లానే అన్ని హక్కులూ ఉంటాయని కోర్టు స్పష్టంచేసిందని కోహ్లీ వివరించారు. ‘‘అక్రమ సంతానం అని పిలుస్తూ వారి నుంచి మీరు హక్కులు లాగేసుకోలేరు’’అని ఆమె చెప్పారు.

అసలు సహజీవనంలోకి అడుగుపెట్టేముందుకు మహిళలు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏమిటి?

సహజీవనం

ఫొటో సోర్స్, Getty Images

పెళ్లికి ముందే ఒప్పందం..

మహిళలందరూ ఆర్థికంగా దృఢంగా ఉండేలా చూసుకోవాలని కోహ్లీ సూచించారు.

‘‘ఆ అమ్మాయి చాలా తెలివైనదని మీరు చెప్పొచ్చు. కానీ, వారు భావోద్వేగంగా తమ భాగస్వామి ముందు బలహీనమైపోవడాన్ని మనం చూస్తున్నాం’’అని ఆమె అన్నారు.

‘‘కొంత మంది పూర్తిగా తమ జీవిత భాగస్వామికి అంకితమైపోతారు. కానీ, ఆ జీవిత భాగస్వాములు మాత్రం పక్కదార్లు తొక్కుతుంటారు’’అని ఆమె వ్యాఖ్యానించారు.

‘‘నిజానికి సహజీవనానికి ముందుగా, తర్వాత పెళ్లి చేసుకుంటామని చాలా మంది అమ్మాయిలు అనుకుంటారు. తమ సర్వస్వం అర్పించుకుంటారు. అలా అసలు చేయకూడదు’’అని కోహ్లీ చెప్పారు.

‘‘నిజంగా వారిద్దరూ సహజీవనం చేయాలి అనుకుంటే.. ముందుగా ప్రీ-మారిటల్ కాంట్రాక్టు కుదుర్చుకోవాలి. దీనిలో ఒకరిని మరొకరు ఎలాంటి పరిస్థితుల్లోనూ మోసం చేయబోమని పక్కాగా రాసుకోవాలి’’అని కోహ్లీ సూచించారు.

వీడియో క్యాప్షన్, ఈ అమ్మాయిలిద్దరూ అందాల పోటీల విజేతలు, ఒకరినొకరు ఇష్టపడి పెళ్ళి చేసుకున్నారు

‘‘సహజీవనంలోనూ మనం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే, భార్యకు దక్కే అన్ని హక్కులూ తమకు దక్కేలా ఆ ఒప్పందంలో నిబంధనలు పెట్టుకోవాలి’’అని ఆమె అన్నారు.

‘‘అందుకే అమ్మాయిలు కాస్త తెలివిగా వ్యవహరించాలి. ఇప్పుడు సమాజం వ్యతిరేకించినా, తర్వాత వారే అంగీకరిస్తారు’’అని ఆమె వ్యాఖ్యానించారు.

మరోవైపు సహజీవనంలో ఉండే అమ్మాయిలంతా తమ స్నేహితులు లేదా తెలిసిన వ్యక్తులతో తమ వివరాలు, విశేషాలు అన్నీ పంచుకోవాలని రీటా కోహ్లీ సూచించారు.

‘‘ఎందుకంటే సహజీవనంలో ఆమె ఆందోళనకు గురైతే, ఎవరో ఒకరు ఆమెకు తోడుగా ఉంటారు. కనీసం ఆమెకు సాయం చేయడమో లేదా సూచనలు ఇవ్వడమో చేస్తారు’’అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)