ఐవీఎఫ్: 30 ఏళ్ల కిందట దాచిన పిండాలతో కవల పిల్లల జననం

ఫొటో సోర్స్, NATIONAL EMBRYO DONATION CENTER
- రచయిత, శామ్ కాబ్రాల్
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో ఈ ఏడాది అక్టోబర్ 31న కవల పిల్లలు పుట్టారు. అయితే.. 30 ఏళ్ల కిందట శీతలీకరించి భద్రం చేసిన పిండాల నుంచి ఈ కవలలు పుట్టటం విశేషం.
పిండాలను ఫ్రోజ్ చేసిన అత్యంత సుదీర్ఘ కాలం తర్వాత విజయవంతంగా సజీవంగా పిల్లలు పుట్టిన రికార్డు ఇదేనని భావిస్తున్నారు.
ఆ పిండాలను 1992 ఏప్రిల్ 22వ తేదీన మైనస్ (-) 128 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద లిక్విడ్ నైట్రోజన్‌లో శీతలీకరించి దాచారు.
ఓరెగావ్‌కు చెందిన నలుగురు పిల్లల తల్లి రాచెల్ రిడ్జ్‌వే.. ఆ పిండాలను తన గర్భంలో మోసిన 2022 అక్టోబర్ 31వ తేదీన కవల పిల్లలకు జన్మనిచ్చారు.
ఈ జననం సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తోందని ఆ పిల్లల తండ్రి ఫిలిప్ రిడ్జ్‌వే పేర్కొన్నారు.
కవల పిల్లలు లిడియా ఆన్, తిమోతి రోనాల్డ్ రిడ్జ్‌వేలు సరికొత్త రికార్డు నెలకొల్పుతారని నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటర్ (ఎన్‌ఈడీసీ) అనే పరైవేటు సంస్థ పేర్కొంది.
విరాళంగా ఇచ్చిన పిండాల ద్వారా 1,200 మంది శిశువుల జననానికి తమ సంస్థ సాయపడిందని తెలిపింది.
ఇంతకుముందు 2020లో శీతలీకరించిన పిండం నుంచి దాదాపు 27 ఏళ్ల తర్వాత మాలీ గిబ్న్ అనే శిశువు జన్మించారు. ఆ శిశువు పిండాన్ని శీతలీకరించిన అత్యంత సుదీర్ఘ కాలం తర్వాత జన్మించిన శిశువుగా ఎన్‌ఈడీసీ గత రికార్డు చెప్తోంది.
‘‘ఈ పిండాలను దత్తత తీసుకోవాలన్న ఈ నిర్ణయం.. 5, 10, 20 సంవత్సరాల కిందట శీతలీకరించిన పిండాలను దత్తత తీసుకోవటానికి ఎవరైనా సిద్ధపడతారా అని సందేహించే వారికి భరోసానిస్తోంది’’ అని ఈ పిండ మార్పిడిని నిర్వహించిన డాక్టర్ జాన్ డేవిడ్ గోర్డన్ పేర్కొన్నారు.
‘‘అవును సిద్ధంగా ఉంటారని ఈ ఉదంతాలు ఘంటాపధంగా చెప్తున్నాయి’’ అన్నారాయన.
తాజాగా కవల పిల్లలకు జన్మనిచ్చిన ఆ జంట పిండాలను.. వివరాలు గోప్యంగా ఉంచిన ఒక వివాహిత జంట కోసం ఐవీఎఫ్ పద్ధతితో తయారు చేశారు. వారిలో 50 ఏళ్ల వయసున్న పురుషుడి వీర్యం, 34 ఏళ్ల వయసున్న ఒక మహిళ దానం చేసిన అండాలను కలిపి ఆ పిండాలను రూపొందించారు.
అలా తయారైన పిండాలను అమెరికా పశ్చిమ తీరంలోని ఒక ఫెర్టిలిటీ లేబొరేటరీలో 2007 వరకూ ఉంచారు. ఆ ఏడాది ఆ దంపతులు ఈ పిండాలను మరో దంపతులకు ఇవ్వాలంటూ టెన్నెసీ రాష్ట్రంలోని నాక్స్‌విల్‌లో గల ఎన్‌ఈడీసీకి విరాళంగా ఇచ్చారు.
ఎన్‌ఈడీసీ భాగస్వామ్య క్లినిక్ సౌత్‌ఈస్ట్రన్ ఫెర్టిలిటీలోని ఎంబ్రియాలజిస్టులు.. ఈ ఏడాది ఈ పిండాలను వారికి జన్మనిచ్చిన తల్లి గర్భసంచిలోకి బదిలీ చేశారు.
ఈ పిండాల నుంచి కవలలు ఆరోగ్యంగా జన్మించిన వార్త.. ఇతరులు కూడా పిండాలను దత్తత తీసుకునేలా ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నట్లు ఎన్‌ఈడీసీ పేర్కొంది.
రిడ్జ్‌వే దంపతులకు ఇప్పటికే ఏడాది వయసు నుంచి ఎనిమిదేళ్ల వయసు ఉన్న నలుగురు సంతానం ఉన్నారు. వారు ఐవీఎఫ్ ద్వారా కానీ, దాతల ద్వారా కానీ పిల్లలను కనటం ఇదే తొలిసారి.
‘‘లిడియా, తిమోతీలకు దేవుడు జీవాన్ని ఇచ్చినపుడు నా వయసు ఐదు సంవత్సరాలు. దేవుడు అప్పటి నుంచీ ఆ జీవాన్ని కాపాడుతూ వచ్చారు’’ అని ఫిలిప్ రిడ్జ్‌వే సీఎన్ఎన్ వార్తా సంస్థతో చెప్పారు.
‘‘ఈ కవలలు మాకు చిన్నపిల్లలే అయినప్పటికీ.. ఒక రకంగా మా పిల్లలందరిలోకీ వీళ్లే పెద్దవాళ్లు. ఇది సంభ్రమాశ్చర్యాలను కలిగించే విషయం’’ అన్నారాయన.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ - గద్వాల: ప్రసవం మధ్యలో డాక్టర్ వెళ్ళిపోయారని ఆరోపణలు... పురిటిలోనే బిడ్డ మృతికి కారకులెవరు?
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో సుఖభోగం-ఇందుకోసం మాథమ్యాటిక్స్ ఫార్ములా
- PMSBY ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన: 20 రూపాయలతో రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందడం ఎలా?
- కిసాన్ క్రెడిట్ కార్డ్: రైతుకు రూ. 3 లక్షల లోన్, ఏటీఎం నుంచి డ్రా చేసుకోవచ్చు. ఎలాగంటే...
- ‘నా ఉద్యోగం పోయింది, ఇప్పుడు నేనేం చేయాలి’-అమెరికాలో జాబ్ కోల్పోయిన భారతీయ టెక్కీల ఆవేదన

















