బంగారునాణేలను మ్యూజియం లోంచి 9 నిమిషాల్లో కొట్టేశారు, వాటి విలువ రూ. 13.5 కోట్లు

ఫొటో సోర్స్, FRANK MÄCHLER
- రచయిత, నయన మీనా, మట్టీయా బుబాలో
- హోదా, బీబీసీ న్యూస్
జర్మనీలోని ఒక మ్యూజియంలో సెల్టిక్ నాగరికతకు చెందిన ప్రాచీన బంగారు నాణేలు దోపిడీకి గురయ్యాయి. వీటి విలువ 16 లక్షల యూరోలు (సుమారు 13.64 కోట్ల రూపాయలు)గా చెప్తున్నారు.
బవేరియాలోని మాంచింగ్ నగరంలోని మ్యూజియంలో ఉన్న వందలాది బంగారు నాణేలను బుధవారం అర్థరాత్రి తొమ్మిది నిమిషాల్లో ఈ దోపిడీని పూర్తిచేసినట్లు పోలీసులు చెప్పారు.
మ్యూజియం అలారం వ్యవస్థను దొంగలు నిర్వీర్యం చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ దోపిడీకి కేవలం కొన్ని నిమిషాల ముందు సమీపంలోని ఇంటర్నెట్ తీగలను కత్తిరించారు. దీంతో ఆ ప్రాంతమంతా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.
ఇంటర్నెట్ నిలిచిపోవటంతో దొంగలు మ్యూజియం తలుపులను బలవంతంగా తెరిచినా కూడా అలారం మోగలేదు. అయితే.. దోపిడీ ఎప్పుడు జరిగిందనే విషయం రికార్డయింది.
గతంలో జరిగిన దోపిడీలకు, ఈ దోపిడీకి సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరుసటి ఉదయం విధులకు హాజరైన ఉద్యోగులకు మ్యూజియం నేల మీద పగిలిన అద్దాలు కనిపించాయి. ప్రాచీన బంగారు నాణేలను ప్రదర్శించిన పెట్టెలో అవి కనిపించలేదు.
ఆ నాణేలు పోవటం పాత మిత్రుడిని కోల్పోయినంత బాధను కలిగిస్తోందని స్టేట్ ఆర్కియలాజికల్ కలెక్షన్‌లో కలెక్షన్స్ విభాగాధిపతి రూపర్ట్ గెభార్డ్ విచారం వ్యక్తంచేశారు.
దోపిడీ దొంగలు రెండో ప్రదర్శన పెట్టె అద్దాలను కూడా పగుల గొట్టి అందులో ఉన్న మూడు పెద్ద నాణేలను కూడా దొంగిలించారు.
ఈ నాణేల దోపిడీ వెనుక వ్యవస్థీకృత నేర బృందాలు ఉండి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. గతంలో జరిగిన దోపిడీలకు దీనికి పోలికలు ఉన్నట్లు కనిపిస్తోందని పోలీసులు సూచనప్రాయంగా చెప్పారు.
2017లో బెర్లిన్ మ్యూజియం నుంచి 100 కిలోల బరువున్న భారీ బంగారు నాణేన్ని దొంగిలించారు. ఆ తర్వాత రెండేళ్లకు డ్రెస్డెన్‌లోని గ్రీన్ వాల్ట్ మ్యూజియంలో దొంగలు పడి.. 21 ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు దోచుకెళ్లారు. ఆ దోపిడీ సీసీటీవీల్లో రికార్డయింది.
అయితే ఆ దోపిడీలకు, తాజా దోపిడీకి మధ్య సంబంధం ఉందా అనేది తాము చెప్పలేమని పోలీసులు పేర్కొన్నారు.
‘‘మ్యూజియంలోకి అలా నడుచుకుంటూ వెళ్లి సంపదను ఎత్తుకెళ్లిపోరు అనేది స్పష్టమైన విషయమే’’ అని బవేరియా సైన్స్ అండ్ ఆర్ట్స్ మంత్రి మార్కస్ బ్లూమ్ స్థానిక వార్తా చానల్‌తో పేర్కొన్నారు.
‘‘ఇది కట్టుదిట్టమైన భద్రత ఉన్న మ్యూజియం. ఇది వ్యవస్థీకృత నేరమని భావించటం సహేతుకమే అవుతుంది’’ అని ఆయన చెప్పారు.
దోపిడీ చేసిన బంగారు నాణేలను కరిగించేస్తారని, దానివల్ల వాటికి గల చారిత్రక విలువ కూడా కరిగిపోతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
మాంచింగ్ నగరంలో 1999లో పురావస్తు తవ్వకాల సందర్భంగా ఈ బంగారు నాణేలు బయటపడ్డాయి. 20వ శతాబ్దంలో కనుగొన్న అతిపెద్ద సెల్టిక్ బంగారు నిధిగా దీనిని పరిగణిస్తారు. ఈ నిధి బయటపడటంతో.. 2,000 ఏళ్ల కిందట బవేరియాలో నివసించిన ప్రజల రోజువారీ జీవితాలు ఎలా ఉండేవనే విషయం ప్రజలకు కాస్తైనా తెలిసిందని మార్కస్ బ్లూమ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: రెండేళ్ళ బాలుడి రెండు కాళ్ళూ తీసేశారు, ఈ దారుణానికి కారకులెవరు, ప్రభుత్వం ఏమంటోంది?
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా మొఘల్ సైన్యం మీదకు విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ
- ఖతార్ ప్రపంచకప్‌లో ‘నకిలీ’ అభిమానులు.. ఉచితంగా విమానం టికెట్లు, హోటల్ గదులు.. బీబీసీ పరిశోధనలో బయటపడ్డ నిజాలివీ...
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- PMSBY ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన: 20 రూపాయలతో రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















