ఆంధ్రప్రదేశ్: రెండేళ్ళ బాలుడి రెండు కాళ్ళూ తీసేశారు, ఈ దారుణానికి కారకులెవరు, ప్రభుత్వం ఏమంటోంది?
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
బాలుడి మృతి
తూర్పు గోదావరి జిల్లా తాళ్లపాలెం మండలం పైడిపుట్ట గ్రామంలో జరిగిన విద్యుత్ ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన దర్శిత్ అనే బాలుడు నవంబర్ 25వ తేదీన మరణించాడు. చికిత్స పొందుతూ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో ప్రాణం కోల్పోయాడు.
నవంబర్ 12న ఇంటి డాబాపై నుంచి వెళుతున్న 33కేవీ లైన్ విద్యుత్ తీగలు కారణంగా ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయాలుపాలయ్యాడు.
అప్పటి నుంచి కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బాలుడు కోలుకుంటున్నట్టు వైద్యులు ప్రకటించారు.
శుక్రవారం మధ్యాహ్నం ఏపీ హోం శాఖ మంత్రి తానేటి వనిత కూడా బాలుడిని పరామర్శించారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటామని చెబుతూ, మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు.
కానీ కొంత సేపటికే బాలుడు మరణించడం ఆ కుటుంబాన్ని విషాదంలో నింపింది.

ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి పేరు దర్శిత్. ఊరు తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి సమీపంలోని పైడిమిట్ట. పది రోజుల క్రితం వరకూ ఆడుతూ పాడుతూ తిరిగే వాడు. ఉత్సాహంగా పరుగులు పెట్టేవాడు. కానీ ఇప్పుడు కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంచం మీద పడి ఉన్నాడు.
దర్శిత్‌కు రెండు కాళ్లు తొలగించారు. శరీరంలోని అనేక భాగాలు కాలిన గాయాలతో మంట పుడుతుండడం వల్ల నేడు చాలా సమస్యను ఎదుర్కొంటున్నాడు.
ఓ సాధారణ పల్లెలో ప్రశాంతంగా సాగిపోతున్న ఈ బాలుడి పయనంలో ఇంతటి విపత్తుకి కారణం 33కేవీ విద్యుత్ లైన్. వారి నివాసం మీద నుంచి చేతికందే ఎత్తులో కరెంటు తీగలు వేశారు. సమీపంలోని పెట్రోల్ బంక్‌కు కరెంట్ సరఫరా కోసం ఈ లైన్ ఉంది. దానిని తొలగించాలని దర్శిత్ తల్లిదండ్రులు చాలామార్లు విన్నవించామని చెబుతున్నారు.
చివరకు గడపగడపకు కార్యక్రమంలో వారి ఇంటికి వచ్చిన ఏపీ హోం శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తానేటి వనితకి కూడా సమస్యను వివరించగా, విద్యుత్ లైన్లు తొలగించాలని ఆమె ఆదేశించినట్టు చెబుతున్నారు.
మంత్రి ఆదేశాలు అమలు కాలేదు. పలుమార్లు వినతిపత్రాలు అందించినా స్పందించలేదు. చివరకు విద్యుత్ లైన్ కారణంగా ప్రమాదానికి గురయిన రెండేళ్ల దర్శిత్ వికలాంగుడయ్యాడు. అధికారుల అలసత్వంతో ఇప్పుడు తమ బిడ్డకు అన్యాయం జరిగిందని దర్శిత్ కుటుంబం వాపోతోంది.

వరుస ప్రమాదాలు ..
విద్యుత్ తీగల కారణంగా వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రాణాలు కూడా పోతున్నాయి. అయినా ఏపీ ట్రాన్స్‌కో అధికారుల్లో చలనం అంతంత మాత్రంగానే ఉందనే విమర్శలకు తాజాగా తాళ్లపూడి ఘటన ఆధారం అవుతోంది.
అనంతపురం జిల్లాలో గడిచిన 5 నెలల కాలంలో రెండు ప్రమాదాలు జరిగాయి. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యుత్ తీగలు తెగిపడి గతంలో కూలీల ప్రాణలు కోల్పోయారు.
ప్రకాశం జిల్లాలో కూడా అంతకుముందు ఇలాంటి ప్రమాదమే జరిగింది.
వివిధ జిల్లాల్లో నివాస ప్రాంతాలు, పొలం మధ్యలో నుంచే వెళ్లే కరెంటు తీగల మూలంగా ప్రాణాలు కోల్పోవడం, తీవ్ర గాయాలు పాలవడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
వరుస ప్రమాదాల తర్వాత కూడా విద్యుత్ శాఖ అధికారుల వైఖరిలో మార్పు రాకపోవడం ఆందోళనకరంగా కనిపిస్తోంది. తాళ్లపూడిలో జరిగిన ప్రమాదంలో ఏకంగా 33కేవీ లైన్‌ను ఇంటి డాబాను ఆనుకుని కొనసాగించడం పట్ల పలు ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ లైన్లు...
ఇలాంటి విద్యుత్ తీగలు పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అత్యధిక ప్రాంతాల్లో ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. తాళ్లపూడిలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఆనుకుని ఉన్న మరో కాలనీలో కూడా ఇలాంటి పరిస్థితి బీబీసీ పరిశీలనలో కనిపించింది.
కేవలం అక్కడే కాకుండా అనేక చోట్ల నివాస ప్రాంతాల్లోనూ, పొలాలు, కొబ్బరి తోటల సమీపంలోనూ విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కనిపిస్తున్న వైనం చాలామందికి తెలిసిందే. అయినా వాటిని సకాలంలో సరిచేసి, పెను ముప్పు తొలగించాల్సిన అధికారులు ఆశించిన రీతిలో స్పందించడం లేదని ఇటీవలి ప్రమాదాల బాధితులంతా చెబుతున్న మాట.
పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా విద్యుత్ తీగలు సరిచేయడం, స్తంభాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలకు పూనుకోవడం లేదనే విమర్శలున్నాయి.
"మాకు పూరిల్లు ఉండేది. 33కేవీ లైన్ ఇంటి మీద నుంచి వేస్తున్నప్పుడు అభ్యంతరం పెట్టాం. అయినా మమ్మల్ని పట్టించుకోకుండా లైన్ వేసేశారు. మరో మార్గం ఉన్నప్పటికీ మా ఇంటి పై నుంచి లైన్ లాగారు. పెట్రోల్ బంక్ కోసం మా ఇంటి మీద నుంచి లాగిన కరెంట్ లైన్ తొలగించాలని చాలాసార్లు అర్జీలు పెట్టాము. పూరిల్లు తీసేసి డాబా కట్టుకున్నప్పుడు కూడా అడిగాము. అదిగో ఇదిగో అనడమే తప్ప ఆ కరెంటు లైన్ తొలగించలేదు. చివరకు మంత్రి వనిత స్వయంగా గడపగడపకూ వచ్చినప్పుడు చెప్పారు. అది కూడా రెండు నెలలయినా తొలగించకపోవడమే మా బిడ్డ రెండు కాళ్లు పొవడానికి కారణమంటూ" జొన్నకూటి చిట్టబ్బాయి ఆరోపించారు.
లారీ డ్రైవర్లుగా పనిచేస్తూ జొన్నకూటి చిట్టబ్బాయితో పాటుగా ఆయన సోదరుడు వినోద్ కుమార్ కుటుంబం కూడా అదే ఇంట్లో నివసిస్తోంది. వినోద్ కుమార్ కొడుకు దర్శిత్ తీవ్ర గాయాలతో ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నాడు.

మా బిడ్డ భవిష్యత్తు ఏంటీ..
గతంలో విద్యుత్ తీగలు తగిలి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారికి ఏపీ ప్రభుత్వం తరపున నష్టపరిహారం ప్రకటించారు. కానీ, ప్రస్తుతం దర్శిత్ విషయంలో మాత్రం యంత్రాంగం పట్టించుకోలేదని బాధిత కుటుంబం చెబుతోంది. ప్రమాద ముప్పు పొంచి ఉందని తీగలు తొలగించమన్నా స్పందించలేదు. ఇప్పుడు తీగల కారణంగా విద్యుత్ షాక్‌తో కాళ్లు కోల్పోయిన తర్వాత కూడా కనీసం పరామర్శకు కూడా ఎవరూ రాలేదని దర్శిత్ తల్లి చాందిని బీబీసీతో అన్నారు.
"డాబా మీద బట్టలు ఆరేసేందుకు వెళ్లాను. వెనుక బాబు వచ్చేశాడు. తడి బట్టలతో ఉన్నాడు. అక్కడే ఉన్న చిన్న రాడ్డు పట్టుకుని ఆడుకుంటున్నాడు. అంతే 33 కేవీ పవర్ వల్ల అది లాగేసింది. బాబు పడిపోయాడు. ఒళ్లంతా కాలిపోయింది. ట్రాన్స్ ఫార్మర్ ట్రిప్ అవ్వడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే ప్రాణాల మీదకు వచ్చేది. కాకినాడ ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స చేస్తున్నారు. ఇప్పుడు మా బిడ్డకు ఆధారం ఏమిటన్నది అర్థం కావడం లేదు. కనీసం ఒక్క అధికారి గానీ, నాయకుడు గానీ మా దగ్గరకు రాలేదు" అంటూ ఆమె బీబీసీతో అన్నారు.
ప్రమాదం గురించి తెలిసిన అనేక మంది స్పందిస్తున్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. బాలుడు కోలుకోవడానికి అవసరమైన వైద్య సహాయం కోసం ఇప్పటికే రూ.17 లక్షల వరకూ విరాళాలుగా వచ్చాయని దర్శిత్ తండ్రి వినోద్ బీబీసీకి తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోవడం బాధేస్తోందని అన్నారు.

సంబంధిత అధికారుల మౌనం...
నవంబర్ 12న ప్రమాదం జరిగింది. 14వ తేదీ నుంచి ఆ బాలుడికి కాకినాడలో చికిత్స అందిస్తున్నారు. అయినా ట్రాన్స్ కో అధికారులు మాత్రం స్పందించలేదు. కనీసం ప్రమాదానికి కారణమయిన విద్యుత్ తీగలు తొలగించడం గానీ, ప్రత్యామ్నాయ ప్రయత్నాలు గానీ చేసినట్టు కనిపించడం లేదు. నవంబర్ 23 నాటికి కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.
విద్యుత్ ప్రమాదానికి సాక్ష్యంగా 33కేవీ లైన్ కాలిపోయిన ఆనవాళ్లు, బాధితుల డాబా మీద తీగలు మాడిపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. అయినా యంత్రాంగంలో చలనం లేకపోవడం విస్మయకరంగా ఉంది.
దీనిపై నిడదవోలు డివిజనల్ ఇంజనీర్ వీరభ్రరరావు ని బీబీసీ సంప్రదించింది. ఆయన మాత్రం మాట్లాడడానికి నిరాకరించారు. రాజమహేంద్రవరం ఎస్ ఈ అంశం తన పరిధిలోనిది కాదని చెప్పారు.
ఏపీ మంత్రి తానేటి వనిత మాత్రం బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రమాదానికి కారణాలపై అధికారుల వివరణ కోరామని తెలిపారు.
సమగ్ర చర్యలు తీసుకోవాలి...
ట్రాన్స్ కో అధికారులకు కరెంటు చార్జీల వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ విద్యుత్ లైన్ల నిర్వహణ మీద లేకపోవడం ప్రమాదాలకు కారణమని రిటైర్డ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎం రాజేశ్వరరావు అన్నారు.
‘‘కరెంటు తీగలు 11 కేవీవీ కూడా ఇళ్లకు సమీపంలో ఉండకూడదు. ఎక్కడయినా అలా ఉంటే తక్షణం తొలగించాలి. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి. కానీ, అలా జరగడం లేదు. ప్రమాదాలు జరుగుతున్నప్పుడు హడావిడి చేయడమే తప్ప నివారణ చర్యలు లేవు. అందువల్లనే పదే పదే ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండేళ్ల బాలుడు ఇంటి మీద ఆడుకుంటుండగా 33 కేవీ కరెంటు తీగలు తగలడం చాలా దయనీయం. 33 కేవీ తీగలు ఇంటి పై నుంచి ఎలా వేశారు.. ముందే తీగలుంటే ఇంటి నిర్మాణానికి ఎవరు అనుమతించారన్నది చూడాలి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి’’అని ఆయన అభిప్రాయపడ్డారు.
తక్షణమే 33 కేవీ తీగలను నివాస ప్రాంతాల నుంచి దూరంగా వేయాలని ఆయన కోరారు. జాప్యం చేస్తే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమగ్ర చర్యలు తీసుకుని విద్యుత్ తీగలు, స్తంభాల నిర్వహణ విషయంపై ఎప్పటికప్పుడు ఆడిటింగ్ జరగాలని ఆయన అన్నారు.
సర్వే జరుగుతోంది..
ఇళ్ల మధ్యలో విద్యుత్ లైన్ల విషయంలో రాష్ట్రవ్యాప్తంగా సర్వే జరుగుతోందని చర్యలు తీసుకుంటామని ఏపీఈపీడీసీఎల్ ఆపరేషన్స్ సీజీఎం విజయలలిత అన్నారు.
"ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్ల విషయంలో సర్వే చేస్తున్నాము. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించాము. ఇప్పటికే అనేక చోట్ల మార్పులు జరుగుతున్నాయి. ఎక్కువ సందర్భాల్లో విద్యుత్ లైన్లు వేసిన తర్వాత ఇళ్ల నిర్మాణం వల్ల సమస్య వస్తోంది. అలాంటి వాటిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాం. తాళ్లపూడి ప్రమాదంలో గాయపడిన బాలుడికి నష్టపరిహారం విషయం పరిశీలిస్తాం. దానికి సంబంధించిన రిపోర్ట్ తెచ్చుకుని చూస్తాం. ఇప్పటికే అత్యధిక సందర్భాల్లో బాధితులకు ఈపీడీసీఎల్ తరుపున నష్టపరిహారం చెల్లిస్తున్నాం" అంటూ ఆమె బీబీసీకి వివరించారు.
ప్రమాదానికి సంబంధించిన అంశాలు పరిశీలించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- తమ దేశంలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు 15 లక్షల మందిని కెనడా ఎందుకు ఆహ్వానిస్తోంది
- డిజీహబ్: వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా డీపీ ఎంతవరకు సేఫ్? సోషల్ మీడియాలో మీ ఫోటోల ప్రైవసీ కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి
- ‘లావుగా ఉన్నావని గేలి చేశారు’ అంటూ కేరళ మంత్రి పోస్ట్, ‘బాడీ షేమింగ్’పై స్కూళ్ళలో పాఠాలు చేర్చాలనే ఆలోచనలో ప్రభుత్వం
- తెలంగాణ - గద్వాల: ప్రసవం మధ్యలో డాక్టర్ వెళ్ళిపోయారని ఆరోపణలు, పురిటిలోనే బిడ్డ మృతికి కారకులెవరు?
- ప్రపంచంలోనే బెస్ట్ క్లీనర్: 'ఇంట్లోని చెత్త నన్ను బర్గర్లా ఊరిస్తుంది'
- ఫేస్బుక్, ట్విటర్ల కథ ముగిసిపోతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















