అఫ్గానిస్తాన్: ‘ఆకలితో ఉన్న నా పిల్లలను నిద్రపుచ్చేందుకు మత్తు మందు ఇస్తున్నా'

- రచయిత, యోగితా లిమాయే
- హోదా, బీబీసీ న్యూస్, హెరాత్
అఫ్గానిస్తాన్‌లో జనం ఆకలితో అలమటిస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తిండి పెట్టలేక మత్తు మందులు ఇచ్చి నిద్రపుచ్చుతున్నారు. కొందరైతే బతకటం కోసం ఆడపిల్లల్ని అమ్మేస్తున్నారు. ఇంకొందరు అవయవాలు అమ్ముకుంటున్నారు.
తాలిబాన్లు అధికారం హస్తగతం చేసుకున్న తర్వాత వచ్చిన రెండో శీతాకాలం ఇది. విదేశీ నిధులు ఇంకా స్తంభించిపోయే ఉన్నాయి. లక్షలాది మంది జనం కరవు ముంగిట్లో ఉన్నారు.
‘‘మా పిల్లలు ఏడుపు ఆపడం లేదు. నిద్రపోరు. మా దగ్గర తిండి లేదు. అందుకే మందుల షాపుకు వెళ్లి, బిళ్లలు తీసుకొచ్చి పిల్లలకు వేస్తాం. వాళ్లు మగతకమ్మి నిద్రపోతారు’’ అని అబ్దుల్ వహాబ్ చెప్పారు.
ఆయన కుటుంబం అఫ్ఘాన్‌లో మూడో అతి పెద్ద నగరం హెరాత్ శివార్లలో నివసిస్తుంది. దేశంలో శతాబ్దాలుగా యుద్ధాలు, విపత్తులతో నిర్వాసితులైన జనం ఇక్కడ మట్టి ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు.
మా చుట్టూ మూగిన దాదాపు డజను మంది మగాళ్లలో అబ్దుల్ ఒకరు. ఇలా ఎంత మంది తమ పిల్లలకు మత్తు బిళ్లలు ఇచ్చి నిద్రపుచ్చుతున్నారని మేం అడిగాం.
‘‘చాలా మందిమి... అందరం’’ అని వాళ్లు బదులిచ్చారు.

గులాం హజ్రత్ తన పైకోటు జేబు తడిమి, అందులో నుంచి ట్యాబ్లెట్ల స్ట్రిప్ ఒకటి బయటకు తీశారు. అవి అల్ప్రాజోలామ్ బిళ్లలు. ఆందోళనతో కూడిన సమస్యలకు చికిత్స చేయటానికి డాక్టర్లు సాధారణంగా ఈ మత్తుబిళ్లలు రాస్తుంటారు.
గులాంకు ఆరుగురు పిల్లలున్నారు. అందరిలోకి చిన్నవాడి వయసు ఏడాది మాత్రమే. ‘‘వాడికి కూడా ఈ బిళ్ల వేస్తున్నాను’’ అని చెప్పారాయన.
ఇంకొందరు ఎస్కిలటోప్రామ్, సెర్ట్రాలైన్ ట్యాబ్లెట్ల స్ట్రిప్‌లను మాకు చూపించారు. ఇవి కూడా కుంగుబాటు, ఆందోళన సమస్యలకు చికిత్సలో భాగంగా ఇచ్చే నిద్రమాత్రలు.
సరైన తిండి, పోషకాహారం లేని పిల్లలకు ఈ బిళ్లలు వేస్తే.. వారి కాలేయం దెబ్బతింటుందని, నిస్సత్తువ, నిద్ర, ప్రవర్తనా లోపాలు వంటి అనేక ఇతర సమస్యలూ తలెత్తుతాయని డాక్టర్లు చెప్తున్నారు.
ఈ తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇస్తున్న ఈ మత్తుబిళ్లలను స్థానికంగా మందుల షాపులో 10 రూపాయలకు 5 బిళ్లలు కొనుక్కోవచ్చునని మేం తెలుసుకున్నాం. ఇక్కడ అదే 10 రూపాయలకు ఒక రొట్టెముక్క మాత్రమే వస్తుంది.
మేం కలిసిన కుటుంబాల్లో చాలా కుటుంబాలు.. రోజూ కొన్ని రొట్టెముక్కలను కుటుంబంలో అందరూ పంచుకుని తింటున్నారు. ఉదయం ఎండిన రొట్టె తిన్నామని, రాత్రికి అది మెత్తబడటానికి నీటిలో ముంచి తిన్నామని ఒక మహిళ తెలిపారు.

అఫ్గానిస్తాన్‌లో ఇప్పుడు మానవ మహావిపత్తుకు తెరలేస్తోందని ఐక్యరాజ్యసమితి చెప్పింది.
హెరాత్ శివార్లలోని ఈ జనంలో అత్యధికులు రోజువారీ కూలీలుగా పనిచేస్తుంటారు. వీరిలో చాలా మంది జీవితాలు చాలా ఏళ్లుగా కష్టాల్లోనే ఉన్నాయి.
అయితే గత ఏడాది ఆగస్టులో తాలిబాన్లు అధికారం స్వాధీనం చేసుకున్న తర్వాత.. వారి కొత్త ప్రభుత్వానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కలేదు. దీంతో అప్పటివరకూ అఫ్గానిస్తాన్‌కు వస్తూ ఉన్న విదేశీ నిధులు ఆగిపోయాయి. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలటం మొదలైంది. ఆ ప్రభావం ఈ జనంపై చూపుతోంది. వీరిలో చాలా మందికి చాలా రోజులుగా పనులు దొరకటం లేదు.
ఎప్పుడైనా అరుదుగా పని దొరికితే.. వారికి వచ్చే కూలీ సుమారు 100 రూపాయలు మాత్రమే.
మేం వెళ్లిన ప్రతి చోటా జనం ఆకలితో పస్తులుంటున్నారు. తమ కుటుంబాలను క్షుద్బాధ నుంచి తప్పించటానికి అనూహ్యమైన పనులు చేస్తున్నారు.
అమర్ (అసలు పేరు కాదు) తాను మూడు నెలల కిందట తన శరీరంలోని ఒక కిడ్నీని అమ్మినట్లు చెప్పాడు. పొత్తికడుపు మీద ముందు నుంచి వెనుక వరకూ ఉన్న తొమ్మిది అంగుళాల గాటు, కుట్లు గుర్తులను చూపించాడు. ఆ గుర్తు ఇంకా కాస్త ఎర్రగానే ఉంది.
అతడు ఇంకా జీవితం ఆరంభంలో ఇరవైల వయసులోనే ఉన్నాడు. మేం అతడి భద్రత రీత్యా వివరాలను వెల్లడించటం లేదు.

‘‘మరో దారి లేదు. స్థానిక ఆస్పత్రిలో కిడ్నీ అమ్మవచ్చని విన్నాను. నేను అక్కడికి వెళ్లి నా కిడ్నీ అమ్మాలని అనుకుంటున్నట్లు చెప్పాను. కొన్ని వారాల తర్వాత ఆస్పత్రికి రావాలంటూ నాకు ఫోన్ వచ్చింది’’ అని అమర్ వివరించాడు.
‘‘వాళ్లు కొన్ని పరీక్షలు చేశారు. ఆ తర్వాత ఏదో ఇంజక్షన్ చేశారు. నేను అపస్మారకంలోకి వెళ్లాను. నాకు భయం వేసింది. కానీ గత్యంతరం లేదు’’ అని చెప్పాడు.
ఆ కిడ్నీ కోసం అమర్‌కు సుమారు 2,70,000 రూపాయలు చెల్లించారు. ఆ డబ్బులో చాలా భాగం అప్పటి వరకూ తన కుటుంబాన్ని పోషించుకోవటానికి చేసిన అప్పులు తీర్చటానికి సరిపోయింది.
‘‘మేం ఒక రాత్రి తింటే మరుసటి రాత్రి తినం. నా కిడ్నీ అమ్మిన తర్వాత నేను సగం మనిషిని అయిపోయినట్లుగా అనిపిస్తోంది. నిస్పృహగా ఉంటోంది. జీవితం ఇలాగే ఉంటే నేను చచ్చిపోతానేమో అనిపిస్తోంది’’ అని చెప్పాడు.
డబ్బు కోసం శరీరంలో అవయవాలు అమ్ముకోవటం అనేది అఫ్గానిస్తాన్‌లో కొత్తగా వింటున్న విషయమేమీ కాదు. తాలిబాన్లు అధికారం స్వాధీనం చేసుకోవటానికి ముందు కూడా ఇది జరిగేది. కానీ ఇప్పుడు.. అంత తీవ్ర నిర్ణయాలు తీసుకున్న తర్వాత కూడా ప్రజలకు బతకటానికి దారి కనిపించటం లేదు.

ఒక ఖాళీ ఇంట్లో ఓ యువ తల్లిని మేం కలిశాం. ఆమె ఏడు నెలల కిందట తన కిడ్నీని అమ్మినట్లు తెలిపారు. దానికి ముందు వాళ్లు అప్పు చేసి గొర్రెలను కొన్నారు. రెండేళ్ల కిందట వరదల్లో ఆ గొర్రెలు చనిపోయాయి. వారి జీవనాధారం పోయింది. అప్పు మాత్రం మిగిలింది.
ఆమె కిడ్నీ అమ్మగా వచ్చిన 2,40,000 రూపాయలు అప్పు తీర్చటానికి సరిపోలేదు.
‘‘ఇప్పుడు మేం మా రెండేళ్ల కూతురును అమ్మాల్సి వస్తోంది. మాకు అప్పు ఇచ్చిన వాళ్లు మమ్మల్ని రోజూ వేధిస్తున్నారు. ‘అప్పు తీర్చలేకపోతే మీ కూతుర్ని మాకు ఇచ్చేయండి అంటున్నారు’’ అని ఆమె వివరించారు.
‘‘మా పరిస్థితికి మేం అవమానంతో కుంగిపోతున్నాం. ఇలా బతకటం కన్నా చచ్చిపోవటం మేలని అనిపిస్తుంటుంది’’ అని ఆమె భర్త చెప్పారు.
జనం తమ కూతుర్లను అమ్ముకుంటున్న ఉదంతాలు మాకు పదే పదే వినిపించాయి.
‘‘నేను నా ఐదేళ్ల కూతురును 1,00,000 రూపాయలకు అమ్మేశాను’’ అని నిజాముద్దీన్ చెప్పారు. ఇక్కడ మాకు తెలిసిన దాన్నిబట్టి చూస్తే.. లక్ష రూపాయలంటే ఒక కిడ్నీ అమ్మితే వచ్చే డబ్బుల్లో సగం కూడా కాదు. అతడు పెదాలు కొరుక్కున్నాడు. కళ్లలో నీళ్లు ఉబికి వచ్చాయి.
ఇక్కడి ప్రజలు ఆత్మగౌరవం ఆకలితో మంటగలిసింది.
‘‘అలా చేయటం ఇస్లామిక్ చట్టాలకు విరుద్ధమని మాకు తెలుసు. మా పిల్లల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నామనీ తెలుసు. కానీ మాకు వేరే దారి లేదు’’ అని ఈ సముదాయ పెద్దల్లో ఒకరైన అబ్దుల్ గఫార్ పేర్కొన్నారు.
ఒక ఇంట్లో మేం నాలుగేళ్ల వయసున్న నాజియాను కలిశాం. ఆమె తన 18 నెలల తమ్ముడు షంషుల్లాతో సరదాగా ఆడుకుంటూ సంతోషంగా ఉంది.
‘‘తిండి కొనటానికి నా దగ్గర డబ్బులు లేవు. దీంతో నా కూతురును అమ్ముతానని స్థానిక మసీదులో ప్రకటించాను’’ అని ఆమె తండ్రి హజ్రతుల్లా చెప్పారు.
కాందహార్ రాష్ట్రంలోని ఒక కుటుంబానికి చెందిన బాలుడితో నాజియాకు పెళ్లి చేయటానికి అమ్మేశారు. ఆమెకు 14 ఏళ్ల వయసు వచ్చాక వాళ్లకు అప్పగిస్తారు. ఇప్పటివరకూ హజ్రతుల్లాకు రెండు వాయిదాలుగా వాళ్లు డబ్బులు ఇచ్చారు.
‘‘ఆ డబ్బులో చాలా వరకూ ఆహారం కొనటానికి వాడాను. మిగతాది నా చిన్న కొడుకుకి మందుల కోసం ఖర్చు చేశాను. వాడిని చూడండి. తిండి లేక బక్కచిక్కిపోయాడు’’ అంటూ.. తన కొడుకు షంషుల్లా చొక్కా పైకెత్తి ఉబ్బిపోయిన అతడి పొట్టను చూపించారు హజ్రతుల్లా.
అఫ్గానిస్తాన్‌లో ఐదేళ్ల లోపు వయసు చిన్నారుల మీద ఆకలి చూపుతున్న ప్రభావం ఎంత తీవ్రంగా ఉందనే దానికి.. తీవ్రంగా పెరిగిపోతున్న పోషకాహార లోపం రేట్లు చాటిచెప్తున్నాయి.
దేశంలో పోషకాహార లోపం సమస్యలకు చికిత్స అందించే తమ కేంద్రాల్లో.. గత ఏడాది కన్నా ఈ ఏడాది 47 శాతం ఎక్కువ అడ్మిషన్లు జరిగాయని మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్ (ఎంఎస్ఎఫ్) చెప్తోంది.
హెరాత్‌లోని ఎంఎస్‌ఎఫ్ ఆహార కేంద్రం ఒక్కటే.. హేరాత్‌తో పాటు, పొరుగు రాష్ట్రాలైన ఘోర్, బద్ఘీస్‌లకు కూడా చికిత్స అందిస్తున్న పోషకాహార కేంద్రం. ఆయా రాష్ట్రాల్లో పోషకాహార లోపం రేట్లు గత ఏడాదితో పోలిస్తే 55 శాతం పెరిగాయి.
పోషకాహార లోపంతో చేరుతున్న పిల్లల సంఖ్య పెరుగుతుండటంతో గత ఏడాది నుంచి ఈ కేంద్రంలో పడకల సంఖ్యను పెంచాల్సి వచ్చింది. అయినాకూడా ఈ కేంద్రం దాదాపు ఎప్పుడూ నిండిపోయే ఉంటోంది. అంతేకాక.. ఇక్కడికి వస్తున్న పిల్లలకు ఇతర జబ్బులకు కూడా చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

ఒమిడ్ వయసు 14 నెలలు. పోషకాహార లోపంతో జబ్బుపడ్డ ఆ పిల్లాడికి హెర్నియా, సెప్సిస్ సమస్యలు కూడా తలెత్తాయి. అతడు కేవలం 4 కిలోల బరువు ఉన్నాడు. ఈ వయసు పిల్లలు సాధారణంగా 6.6 కిలోల బరువు ఉండాలని డాక్టర్లు మాతో చెప్పారు. ఒమిడ్‌కు తీవ్రంగా వాంతులు అవుతుండటంతో అతడి తల్లి ఆమ్నా డబ్బులు అప్పు తీసుకుని చాలా దూరం నుంచి అతడిని ఈ కేంద్రానికి తీసుకువచ్చారు.
ప్రజల ఆకలి సమస్యను తీర్చటానిక ఏం చర్యలు చేపడుతున్నారని హెరాత్‌లో తాలిబాన్ ప్రొవిన్షియల్ ప్రభుత్వ అధికార ప్రతినిధి హమీదుల్లా మొతావాకిల్‌ను మేం అడిగాం.
‘‘అఫ్గానిస్తాన్ మీద అంతర్జాతీయ ఆంక్షలు, అఫ్గాన్ ఆస్తులను స్తంభింపజేయటం ఫలితంగా ఈ సమస్య తలెత్తింది. ఎంత మంది ప్రజలు అవసరంలో ఉన్నారనేది మా ప్రభుత్వం గుర్తిస్తోంది. చాలా మంది తమ పరిస్థితి గురించి అబద్ధం చెప్తున్నారు. ఎందుకంటే సాయం అందుతుందని వారు అనుకుంటున్నారు’’ అని ఆయన చెప్పుకొచ్చారు.
పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మేం చూశామని, చాలా ఆధారాలున్నాయని మేం చెప్పినా ఆయన వైఖరి మారలేదు.
ఉపాధి కల్పించటానికి తాలిబాన్ ప్రయత్నిస్తోందని కూడా ఆయన అన్నారు. ‘‘ఐరన్ ఓర్ గనులు, గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టులు ప్రారంభించటానికి మేం చూస్తున్నాం’’ అని చెప్పారు.
ఆ పని త్వరగా జరిగే అవకాశం లేదు.
తాలిబాన్ ప్రభుత్వం, అంతర్జాతీయ సమాజం తమని గాలికి వదిలేసినట్లు అనిపిస్తోందని జనం మాతో అంటున్నారు.
ఆకలి అనేది నెమ్మదిగా, చడీచప్పుడు లేకుండా చంపేస్తుంది. దాని ప్రభావాలు ఎల్లప్పుడూ తక్షణమే కనిపించవు.
ప్రపంచ దృష్టికి దూరంగా ఉన్న అఫ్గానిస్తాన్‌లో ఈ సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందనేది ఎన్నడూ పూర్తిగా వెలుగులోకి రాకపోవచ్చు. ఎందుకంటే ఎవరికీ లెక్కలేదు.
ఇవి కూడా చదవండి:
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- ఖతార్ ప్రపంచకప్‌లో ‘నకిలీ’ అభిమానులు.. ఉచితంగా విమానం టికెట్లు, హోటల్ గదులు.. బీబీసీ పరిశోధనలో బయటపడ్డ నిజాలివీ...
- బిడ్డ నల్లగా పుట్టిందనే అనుమానంతో డీఎన్ఏ పరీక్ష చేయించిన ఈ జంట తెలుసుకున్న ‘భయానక’ నిజం ఏంటంటే...
- PMSBY ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన: 20 రూపాయలతో రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందడం ఎలా?
- ‘నా ఉద్యోగం పోయింది, ఇప్పుడు నేనేం చేయాలి’-అమెరికాలో జాబ్ కోల్పోయిన భారతీయ టెక్కీల ఆవేదన
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















