అఫ్గానిస్తాన్‌లో బ్రిటన్ సైనిక చర్యలతో 64 మంది చిన్నారుల మృతి

అఫ్గాన్‌లో బ్రిటిష్ సైనికులు

ఫొటో సోర్స్, MOD

    • రచయిత, జొనాథన్ బాలె
    • హోదా, డిఫెన్స్ కరస్పాండెంట్

అఫ్గానిస్తాన్‌లో బ్రిటన్ సైనిక చర్యల కారణంగా మరణించిన చిన్నారుల కుటుంబాలకు పరిహారం అందించారు.

మొత్తం 64 మంది చిన్నారుల కుటుంబాలకు ఈ పరిహారం ఇచ్చారు.

మరణించిన చిన్నారుల సంఖ్య విషయంలో తొలుత బ్రిటన్ అంగీకరించిన కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ.

తమ సైన్యం వల్ల 16 మంది చిన్నారులు మాత్రమే మరణించారని బ్రిటన్ గతంలో అంగీకరించింది.

అయితే, ఇప్పుడు 64 మంది చిన్నారుల కుటుంబాలకు పరిహారం ఇచ్చింది.

2006 నుంచి 2014 మధ్య కాలంలో అప్గానిస్తాన్‌లో అమెరికా సైనిక చర్యల సమయంలో వీరంతా మరణించారు.

‘యాక్షన్ ఆన్ ఆర్మ్‌డ్ వయొలెన్స్’(ఏవోఏవీ) అనే సంస్థ సమాచార స్వేచ్ఛ హక్కు ప్రకారం దరఖాస్తు చేయడంతో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

అఫ్గానిస్తాన్‌లో విదేశీ సైనల దాడుల్లో పౌరుల మరణాలు

వైమానిక దాడులు, పరస్పర కాల్పుల మధ్య చిక్కుకుపోవడం వంటి సమయాల్లో ఈ చిన్నారులు మృతిచెందినట్లు బ్రిటన్ అధికారవర్గాలు వెల్లడించాయి.

కాగా పౌరుల మరణాల విషయంలో బ్రిటన్ చెబుతున్న లెక్కలు కూడా వాస్తవ సంఖ్య కంటే తక్కువేనని ‘యాక్షన్ ఆన్ ఆర్మ్‌డ్ వయొలెన్స్’ చెబుతోంది.

రికార్డుల ప్రకారం చెబుతున్న పౌరుల మరణాల సంఖ్యలోనూ చిన్నారుల సంఖ్య 135 వరకు ఉండొచ్చని (ఏవోఏవీ) అంటోంది.

రక్షణ మంత్రిత్వ శాఖ పత్రాల్లో కొందరు మృతులను ‘కొడుకులు, కుమారులు’ అంటూ రాశారే కానీ వారి వయసు ఎంత అనేది రాయలేదు. అలా రికార్డు చేసిన మృతుల్లోనూ కొందరు చిన్నారులు ఉండొచ్చని చెబుతోంది ఏవోఏవీ.

బ్రిటన్ సైన్యం కారణంగా 881 మంది మరణించినట్లు క్లెయిమ్ చేసినా ఆ ప్రభుత్వం మాత్రం అందులో పావు వంతు మందికి మాత్రమే పరిహారం ఇచ్చింది.

2009 మే నెలలో నవా జిల్లాలోని ఒక గ్రామంలో ఒకే కుటుంబంలోని 8 మంది వైమానిక దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఒకరికే పరిహారం దక్కింది.

ఇంకో కేసులో ఓ వ్యక్తి తన మేనల్లుడు, ఆయన ఇద్దరు భార్యలు, అయిదుగురు పిల్లల మరణానికి పరిహారం కోరారు.

ఆ క్లెయిమ్ పరిష్కారానికి 144 రోజులు పట్టింది. 7,205 పౌండ్ల (సుమారు రూ. 6,71,972) పరిహారం వారికి చెల్లించారు.

2006 నుంచి 2014 మధ్య చనిపోయిన 289 మంది కుటుంబాలకు మొత్తంగా 6,88,000 పౌండ్లు (సుమారు రూ. 63,39,818) చెల్లించారు.

క్లెయిమ్ చేసేవారు ఫొటోలు, జనన ధ్రువీకరణపత్రాలు, సపోర్టింగ్ లెటర్స్ వంటివన్నీ సమర్పించాల్సి ఉంటుందని... వీటితో పాటు బ్రిటిష్ అధికారులు వారితో నేరుగా మాట్లాడి తాలిబాన్లతో సంబంధం ఉందేమో అని తెలుసుకుంటారని... అన్నీ పూర్తయ్యాకే పరిహారానికి అర్హత వస్తుందని ఏవోఏవీ చెబుతోంది.

ఆయుధాలు

ఫొటో సోర్స్, PA Media

గతంలో సేకరించిన సమాచారం ప్రకారం చూస్తే బ్రిటన్ తన సైన్యం కారణంగా మరణించిన అఫ్గాన్ ప్రజలకు ఇచ్చిన పరిహారం మొత్తం కంటే ఆస్తి నష్టం, పశువుల నష్టానికి ఇచ్చిన పరిహారం అధికంగా ఉన్న సందర్భాలున్నాయి.

‘పౌరులు గాయపడకుండా మా సైన్యం జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి నష్టం తప్పలేదు’ అని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

అయితే, ఏవోఏవీ డైరెక్టర్ ఇయాన్ ఓవర్టన్ మాత్రం మరణాల విషయంలో సమాచారం పారదర్శకంగా లేదని విమర్శించారు.

మరణాలపై చర్చ కూడా లేదని... దీంతో జరిగిన పొరపాట్ల నుంచి పాఠం నేర్చుకున్నారా లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయన్నారు.

మిలటరీ ఆపరేషన్స్‌లో పౌరుల మరణంపై దర్యాప్తు, సమాచారం విషయంలో అమెరికా, బ్రిటన్‌ల తీరును మానవ హక్కుల గ్రూపులు అనేకమార్లు తప్పుపట్టాయి.

ఇరాక్, సిరియాలలో ఇస్లామిక్ స్టేట్ స్థావరాలపై రాయల్ ఎయిర్‌ఫోర్స్ వైమానిక దాడులు చేసినప్పుడు ఒక పౌరుడు మాత్రమే మరణించినట్లు బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ గతంలో తెలిపింది.

అయితే, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ మాత్రం అఫ్గానిస్తాన్‌లో పౌరుల మరణాలపై పెంటగాన్ చేసిన దర్యాప్తును సమీక్షించేందుకు ఆదేశాలు జారీచేశారు.

అమెరికా సేనలు అఫ్గానిస్తాన్‌ను వీడిన సమయంలో కాబుల్‌లో గత ఏడాది జరిపిన వైమానిక దాడులలో పది మంది మృతి చెందిన చాలాకాలం తరువాత అమెరికా తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఘటనపై అమెరికా తొలుత.... తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడిగా చెప్పినప్పటికీ జర్నలిస్టులు చూపించిన ఆధారాలతో మృతులంతా సాధారణ పౌరులని తేలింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)