టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్: ‘బోనులోని పులులు బయటకు వచ్చాయి’

టీ20 ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బీఎస్ఎన్ మల్లేశ్వర రావు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పాకిస్తాన్ జట్టు టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్‌కు చేరుకుంది. 13వ తేదీ ఆదివారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో జరిగే ఫైనల్‌కు ఆ జట్టు అర్హత సాధించింది.

న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేసిన పాకిస్తాన్ జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది.

2007లో టీ20 ప్రపంచకప్ ప్రారంభమైంది.

ప్రారంభ టోర్నీలో పాకిస్తాన్ ఫైనల్ వరకూ చేరింది.

ఫైనల్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడగా.. ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు కప్ గెల్చుకుంది.

ఆ తర్వాత రెండేళ్లకు 2009లో జరిగిన టోర్నీలో కూడా పాకిస్తాన్ జట్టు ఫైనల్‌కు చేరుకోవడంతో పాటు కప్‌ కూడా గెల్చుకుంది.

ఆ మ్యాచ్‌లో శ్రీలంక, పాకిస్తాన్ జట్లు తలపడగా.. పాకిస్తాన్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

మళ్లీ 13 సంవత్సరాల తర్వాత ఆ జట్టు టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది.

కాగా, ఈసారి కూడా భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్‌లో తలపడే అవకాశం ఉంది.

గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత జట్టు విజయం సాధిస్తే ఇది సాధ్యమవుతుంది.

‘‘ఇంగ్లండ్‌పై భారత జట్టు గెలిచి ఫైనల్‌లో అడుగుపెడితే మైదానం పైకప్పు ఎగిరిపోతుంది’’ అని కామెంటేటర్, టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి అభివర్ణించారు.

భారత్-పాకిస్తాన్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడితే కనుక ప్రపంచం నలుమూలల ఉన్న క్రికెట్ అభిమానులంతా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ (ఎంసీజీ)కు క్యూ కడతారని, విమానాలన్నీ మెల్‌బోర్న్ వైపు చూస్తాయని రవిశాస్త్రి అన్నారు.

ఎంసీజీలో జరిగిన 1992 ప్రపంచకప్ ఫైనల్‌లో పాకిస్తాన్న జట్టు ఇంగ్లండ్‌పై 22 పరుగుల తేడాతో గెలుపొందింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎంసీజీలో జరిగిన 1992 ప్రపంచకప్ ఫైనల్‌లో పాకిస్తాన్న జట్టు ఇంగ్లండ్‌పై 22 పరుగుల తేడాతో గెలుపొందింది

పాకిస్తాన్ 1992 ప్రపంచకప్‌ ఫలితాన్ని రిపీట్ చేస్తుందా?

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో పాకిస్తాన్‌కు విడదీయరాని అనుబంధం ఉంది. ఆ జట్టు తొలిసారి వన్డే ప్రపంచకప్ గెల్చుకుంది ఈ వేదికపైనే.

1992లో ఆస్ట్రేలియాలో వన్డే ప్రపంచకప్ జరగ్గా.. ఫైనల్ మ్యాచ్‌కు ఎంసీజీ వేదిక అయ్యింది. అప్పుడు ఇంగ్లండ్‌తో తలపడిన పాకిస్తాన్ జట్టు 22 పరుగుల తేడాతో గెలుపొందింది.

తిరిగి 30 ఏళ్ల తర్వాత ఎంసీజీలో పాకిస్తాన్ జట్టు మరొక ప్రపంచకప్ ఫైనల్ ఆడబోతోంది.

గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్ జట్టు విజయం సాధిస్తే.. మూడు దశాబ్ధాల కిందట వన్డే ప్రపంచకప్‌ కోసం పోరాడిన ఇరు జట్లు.. ఇంగ్లండ్, పాకిస్తాన్.. మరొకసారి టీ20 ప్రపంచకప్ కోసం పోరాడే అవకాశం ఉంటుంది.

ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్ చూస్తాం - బాబర్ ఆజమ్

‘‘మేం ఫైనల్‌లో ఎవరితో తలపడాల్సి వస్తుందో మాకు తెలియదు. రేపు జరిగే మ్యాచ్ చూస్తాం. ఫైనల్‌కు సిద్ధం అయ్యేందుకు మాకు కొన్ని రోజులు సమయం ఉంది. అంతా కలసి చర్చించుకుంటాం’’ అని సెమీ ఫైనల్ విజయం అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అన్నాడు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టం. కానీ, పాకిస్తాన్ బాగా ఆడింది. ఆదిలోనే మేం వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది. వాళ్లు చాలాబాగా బౌలింగ్ చేశారు. అయితే, మేం పెట్టిన లక్ష్యం బట్టి గెలుస్తామనే అనుకున్నాం. కానీ, బాబర్, రిజ్వాన్ (ఇద్దరూ అర్థ సెంచరీలు సాధించారు) మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేశారు’’ అని అన్నాడు.

న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ రిజ్వాన్ గెల్చుకున్నాడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును పాకిస్తాన్ ఓపెనింగ్ బ్యాటర్ రిజ్వాన్ గెల్చుకున్నాడు

‘బోనులోని పులులు బయటకు వచ్చాయి’

టోర్నమెంటు సూపర్ 12 మ్యాచ్‌లు చివరి రోజు వరకూ పాకిస్తాన్ సెమీ ఫైనల్‌కు వెళ్లే అవకాశం లేదనే అంతా అనుకున్నారు. కానీ, చివరి రోజు దక్షిణాఫ్రికా జట్టును నెదర్లాండ్స్‌ ఓడించడంతో పాకిస్తాన్ జట్టుకు సెమీఫైనల్‌ చేరుకునే అవకాశం దక్కింది.

‘‘పాకిస్తాన్‌ను అంచనా వేయడం కష్టం. ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఈరోజు మాత్రం వాళ్లు తమ శక్తిని, దృఢత్వాన్ని చూపించారు. అలాగే అవసరం అయినప్పుడు అంతా ఒక్కటయ్యారు. ఇది నిజంగా అద్భుతం. వాళ్లు తిరిగి పుంజుకున్న తీరును చూస్తే ఇదంతా రాసిపెట్టి ఉంది అనుకోవాల్సిందే’’ అని బీబీసీ టెస్ట్ మ్యాచ్ స్పెషల్ కామెంటేటర్ హెన్రీ మోరన్ అన్నారు.

‘‘నెదర్లాండ్స్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించడం వల్లే పాకిస్తాన్ సెమీఫైనల్స్ చేరుకుంది. కానీ, ఆ అవకాశాన్ని వాళ్లు అందిపుచ్చుకున్నారు’’ అని బీబీసీ టెస్ట్ మ్యాచ్ స్పెషల్‌లో ఇంగ్లండ్ మాజీ బౌలర్ అలెక్స్ హార్ట్‌లీ అన్నారు.

‘‘ఒక వారం కిందట పాకిస్తాన్ జట్టు టీ20 ప్రపంచకప్ టోర్నమెంటు రేసులోనే లేదు. ఇప్పుడు మాత్రం బోనులోని పులులు తిరిగొచ్చాయి. మొత్తం మ్యాచ్‌లో పాకిస్తాన్‌దే పైచేయి. ఇది సమగ్రమైన విజయం’’ అని బీబీసీ టెస్ట్ మ్యాచ్ స్పెషల్ కామెంటేటర్ డానియెల్ నార్‌క్రాస్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)