INDvsPAK: విరాట్ స్వరూపంతో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం

ఫొటో సోర్స్, Getty Images
విరాట్ కోహ్లీ వీరవిహారం, హార్దిక్ పాండ్యా సహకారం, చివరి ఓవర్లలో పాకిస్తాన్ బౌలర్ల తప్పిదాలు వెరసి రోహిత్ సేన ఘన విజయం. భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మరో రసవత్తరమైన మ్యాచ్‌కు మెల్‌బోర్న్ స్టేడియం వేదికైంది.
టీ20 వరల్డ్ కప్‌లో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ చివరి వరకు అత్యంత ఉత్కంఠగా సాగగా, చివరకు భారత్‌ను విజయం వరించింది. నాలుగు వికెట్ల తేడాలో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ చివరి మూడు ఓవర్లు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠను కలిగించాయి.
ఈ మ్యాచ్‌లో గెలుపు అనంతరం భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (53 బంతుల్లో 82; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) భావోద్వేగాలను అదుపులో పెట్టుకోలేకపోయాడు. దూకుడుకు మారుపేరైన కోహ్లి కంట కన్నీరు రావడం ఈ మ్యాచ్ ప్రత్యేకతను చెప్పకనే చెబుతుంది.
ఆరంభంలో భారత్ తడబాటు
160 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన భారత జట్టు ఆరంభంలో తడబడింది. 10 పరుగుల వద్ద రెండు వికెట్లు, 31 పరుగులు వద్ద నాలుగు వికెట్లు కోల్పోయిన భారత జట్టు ఆ తర్వాత విరాట్ కోహ్లీ (82 నాటౌట్, 53 బంతుల్లో ), హార్దిక్ పాండ్యా(40, 37 బంతుల్లో)ల మెరుపు బ్యాటింగ్ తో నిలదొక్కుకుంది.
చెరి నాలుగు పరుగులు చేసి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లు అవుట్ కాగా, అక్షర్ పటేల్ 2 పరుగులు వద్ద రనౌట్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 15 పరుగులు చేశాడు. చివర్లో వచ్చిన వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ 1 పరుగు చేసి అవుటయ్యాడు. అశ్విన్ 1 పరుగుతో నాటౌట్ గా నిలిచాడు.
భారత ఇన్నింగ్స్‌ను కోహ్లీ, పాండ్యాలు చక్కదిద్దే పనిలో స్కోరును మెల్లగా ముందుకు నడిపించారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ నిలకడగా ఆడారు. ఇద్దరూ కలిసి 113 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
భారత్ జట్టు 15 ఓవర్లు ముగిసే సమయానికి 100 పరుగులు పూర్తి చేసింది. చివరి ఐదు ఓవర్లలో రోహిత్ సేన 30 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉంది.
16వ ఓవర్‌లో కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి. వీటిలో మూడు పరుగులు బైలు, వైడ్స్ ద్వారానే వచ్చాయి.
17వ ఓవర్ కూడా నిరాశగానే ముగిసింది. ఈ ఓవర్లో కూడా కేవలం 6 పరుగులే వచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
కీలకమైన ఓవర్లు
చివరి 3 ఓవర్లలో 48 పరుగులు సాధించాల్సిన స్థితిలో ఉన్న విరాట్ కోహ్లీ చెలరేగిపోవడం ప్రారంభించాడు.
18వ ఓవర్లో మొదటి బంతిని, మూడో బంతిని, చివరి బంతిని విరాట్ కోహ్లీ ఫోర్లుగా మలచడంతో ఈ ఓవర్‌లో మొత్తం 17 పరుగులు వచ్చాయి. చివరి రెండు ఓవర్లు వచ్చే సరికి భారత జట్టు 31 పరుగులు చేయాల్సి ఉంది.
19వ ఓవర్లో విరాట్ కోహ్లీ కొట్టిన రెండు సిక్సులతో పాటు మొత్తం 15 పరుగులు వచ్చాయి.
20వ ఓవర్ వచ్చేసరికి భారత్ లక్ష్యం 6 బంతుల్లో 16 పరుగులుగా ఉంది.
20వ ఓవర్ తొలిబంతికే హార్దిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. నవాజ్ వేసిన బంతిని హిట్ కొట్టడానికి ప్రయత్నించి బాబర్ ఆజమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో భారత జట్టు లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమన్న భావన ఏర్పడింది.
హార్దిక్ పాండ్యా స్థానంలో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ రెండో బంతికి ఒక పరుగు సాధించాడు.
మూడో బంతికి విరాట్ కోహ్లీ రెండు పరుగులు, ఆ తర్వాత ఒక సిక్స్ కొట్టడంతో భారత జట్టు చివరి 3 బంతుల్లో పరుగులు చేయాల్సి ఉంది.
తర్వాతి బంతి నో బాల్ కావడంతో భారత్ 3 బంతుల్లో 5 పరుగులు చేయాల్సిన స్థితికి చేరుకుంది.
తర్వాత నవాజ్ వేసిన నాలుగో బంతికి మూడు పరుగులు రావడంతో చివరి రెండు బంతుల్లో మూడు పరుగులు చేయాల్సిన స్థితిలో ఉంది భారత జట్టు.
అయితే అయిదో బంతికి దినేశ్ కార్తీక్ అవుట్ కావడంతో చివరి బంతికి టీమిండియా 2 పరుగులు చేయాల్సి ఉంది.
ఈ దశలో భారత్ విజయం ఇక లాంఛనమే అనుకున్నారంతా... కానీ, నవాజ్ వేసిన అయిదో బంతికి పాక్ వికెట్ కీపర్ రిజ్వాన్ సరైన సమయంలో చురుగ్గా స్పందించడంతో దినేశ్ కార్తీక్ అవుటయ్యాడు. ఆ స్థితిలో దినేశ్ క్రీజు వదిలి బయటకు వచ్చి వికెట్‌కీపర్‌కు దొరికిపోతాడని ఎవరూ ఊహించలేరు.
దీంతో మళ్లీ టెన్షన్ పెరిగిపోయింది. ఎందుకంటే కోహ్లి నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్నాడు. అతను బంతిని ఎదుర్కొనే అవకాశం లేదు. ఆఖరికి ఒకటే బంతి మిగిలి ఉండగా, క్రీజులోకి కొత్త బ్యాట్స్‌మన్ అశ్విన్ రావాల్సి ఉంది. విజయానికి 2 పరుగులు చేయాలి. అశ్విన్ క్రీజులోకి వచ్చాడు.
నవాజ్ అశ్విన్‌కు విసిరిన బంతి వైడ్ కావడంతో భారత జట్టు ఒక బంతికి ఒక పరుగు చేయాల్సి ఉంది.
అప్పటికి స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ అవసరం ఉంటుందా అనిపించింది. కానీ, చివరి బంతికి అశ్విన్ సింగిల్ తీయడంతో భారత్ అభిమానుల హర్షాతిరేకాలు మిన్నంటాయి.
భారత్ విజేతగా నిలిచింది.
53 బంతుల్లో 82 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ జట్టును విజయతీరాలకు చేర్చడంతో కీలకపాత్ర పోషించాడు. చివరి ఓవర్లలో కోహ్లీ సాధించిన సిక్స్‌లు, ఫోర్లు లక్ష్యాన్ని సునాయాసం చేసి చివరకు విజయాన్ని సాధించి పెట్టాయి.
'మాటలు రావట్లేదు': కోహ్లీ
స్టేడియంలోని నెలకొన్న వాతావరణం గురించి నిజంగా మాటల్లో చెప్పలేను. ఇప్పటివరకు మొహాలీలో ఆడిన ఇన్నింగ్స్ నా అత్యుత్తమ టీ20 ఇన్నింగ్స్ అని చెప్పేవాడిని. అప్పుడు 52 బంతుల్లో 82 పరుగులు చేశాను. ఇప్పుడు 53 బంతుల్లో 82 పరుగులు సాధించా. ఈ రెండు ఇన్నింగ్స్‌లు నాకెంతో ప్రత్యేకమైనవి. చాలా నెలలుగా నేను పరుగులు చేయలేక సతమతం అవుతున్నప్పుడు మీరంతా నా వెంట ఉన్నారు. థ్యాంక్యూ సో మచ్.
ఈ మ్యాచ్‌లో చివరి వరకు క్రీజులో నిలబడాలని హార్దిక్ చెబుతూనే ఉన్నారు. షహీన్ పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేస్తున్నప్పుడు అతని బౌలింగ్‌లో ఎదురుదాడి చేయాలని హార్దిక్‌కు చెప్పాను. ప్రణాళిక ప్రకారం ఆడాం. హారిస్ బౌలింగ్‌లో ఎదురుదాడి చేస్తే వారు భయపడతారని మేం అనుకున్నాం. అలాగే చేశాం. చివరకు 6 బంతుల్లో 16గా సమీకరణం మారింది. రవూఫ్ బౌలింగ్‌లో వరుస సిక్స్‌లను నేనే నమ్మలేకపోయా'' అని కోహ్లి మ్యాచ్ అనంతరం అన్నాడు.
'వారిద్దరే మ్యాచ్ గతిని మార్చేశారు': బాబర్ ఆజమ్
''చాలా కఠినమైన మ్యాచ్. మేం మ్యాచ్‌ను బాగా ఆరంభించాం. కానీ, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లి మ్యాచ్ గతిని మార్చేశారు. ఇఫ్తికార్, షాన్ మసూద్ ఇన్నింగ్స్ ఆనందాన్ని ఇచ్చాయి. మా బౌలర్లు ప్రయత్నించారు. కానీ, మళ్లీ ఈ క్రెడిట్ విరాట్ కోహ్లికే ఇవ్వాలి'' అని పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ వ్యాఖ్యానించాడు.
'హ్యాట్సాఫ్ విరాట్': భారత కెప్టెన్ రోహిత్ శర్మ
''నాకు చెప్పడానికి మాటలు రావట్లేదు. వీలైనంతవరకు మ్యాచ్‌లో పోరాడాలని మేం అనుకున్నాం. పరిస్థితులు ఎలా ఉన్నా చివరి వరకు పోరాడాలని మేం నిర్ణయించుకున్నాం. హార్దిక్, కోహ్లి చాలా అనుభవం ఉన్న ప్లేయర్లు. ఇలాంటి పిచ్‌పై అంత లక్ష్యాన్ని ఛేదించడం సులభం కాదని మాకు తెలుసు. కానీ, వారిద్దరూ చాలా సమర్థంగా వ్యవహరించి మ్యాచ్‌ను గెలిపించారు. మేం గెలిచిన తీరు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. హ్యాట్సాఫ్ విరాట్. ఇది అతని అత్యుత్తమ ప్రదర్శన ఒక్కటే కాదు, భారత్ తరఫున కూడా ఇదొక అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచిపోతుంది'' అని రోహిత్ శర్మ అన్నారు.
ఈ విజయంతో గ్రూప్ 2 లోని జట్లలో భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ ఇన్నింగ్స్
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది భారత జట్టు. పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. భారత జట్టు ముందు 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
భారత జట్టులో అర్షదీప్ సింగ్ , హార్దిక్ పాండ్యాలు చెరి మూడు వికెట్లు తీసుకున్నారు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలకు చెరో వికెట్ లభించింది.
పాకిస్తాన్ జట్టులో ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్ (4) బాబార్ అజామ్ ( 0) పరుగులకే అవుట్ కావడంతో పాకిస్తాన్ జట్టు ఒత్తిడికి లోనైంది. ఈ దశలో బ్యాటింగ్‌కు దిగిన మసూద్, ఇప్తికార్‌లు నిలకడగా ఆడుతూ అర్ధసెంచరీలు సాధించారు.
షాన్ మసూద్ 52 పరుగులు, ఇఫ్తికార్ అహ్మద్ 51 పరుగులు చేశారు. షాన్ మసూద్ నాటౌట్‌గా మిగలగా, ఇఫ్తికార్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన పాకిస్తాన్ బ్యాట్స్‌మన్‌లలో షహీన్ అఫ్రిదీ ఒక్కడే రెండంకెల స్కోరు సాధించాడు.
ఇవి కూడా చదవండి:
- మహిళలపై ఆర్ఎస్ఎస్ వైఖరి మారుతోందా... బీజేపీకి ఓట్ల కోసమే అలా చేస్తున్నారా?
- లంపీ స్కిన్ వ్యాధి సోకిన పశువుల పాలు తాగొచ్చా? ఈ వైరస్ మనుషులకూ సోకుతోందా? దేశంలో ఎందుకిన్ని వదంతులు?
- పాకిస్తాన్లో క్రికెట్‌ను భారత్ వ్యాపార సంస్థలే నడిపిస్తున్నాయా? బీసీసీఐ నిధులు ఇవ్వకపోతే పాక్ క్రికెట్ బోర్డు కూలిపోతుందా?
- దీపావళి టపాసులు అమ్మితే మూడేళ్లు జైలుశిక్ష, టపాసులు కాల్చితే 6 నెలలు జైలు శిక్ష
- లిజ్ ట్రస్: ప్రధాని అయిన 45 రోజులకే ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది, బ్రిటన్ తాజా రాజకీయాలపై తెలుసుకోవాల్సిన 8 పాయింట్లు
- ఇండియా మోస్ట్ వాంటెడ్ పాక్ తీవ్రవాదులను చైనా ఎలా రక్షించిందంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













