Jasprit Bumrah: బౌలింగ్ యాక్షన్‌నే బుమ్రా శరీరానికి ప్రాణాంతకంగా మారిందా? వరుస గాయాలకు కారణం అదేనా?

జస్‌ప్రీత్ బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జస్‌ప్రీత్ బుమ్రా
    • రచయిత, చంద్రశేఖర్ లూథ్రా
    • హోదా, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్‌కు ముందు టీమ్‌ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో నంబర్ వన్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌గా లేనందున ఈ టోర్నీలో పాల్గొనే అవకాశం కోల్పోయాడు.

బుమ్రా ఈ సమస్య నుంచి కోలుకోవడానికి, పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి కనీసం ఆరు నెలల సమయం పడుతుందని బీసీసీఐకి చెందిన విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

కీలకమైన టోర్నీకి ముందు బుమ్రా జట్టు నుండి నిష్క్రమించడం భారత అవకాశాలను దెబ్బతీసే అవకాశం ఉంది. ఎందుకంటే, అతని స్థానాన్ని భర్తీ చేయడం అంత సులభం కాదు.

వెన్ను సమస్య కారణంగా బుమ్రా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో పాల్గొన లేదు. అంతకు ముందు, జూలై, సెప్టెంబర్ మధ్యలో కూడా అతను మైదానానికి దూరంగా ఉన్నాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌కు తిరిగి వచ్చినా, సమస్య మళ్లీ మొదలు కావడంతో జట్టు నుంచి తప్పించక తప్పలేదు.

ప్రాథమిక వైద్య అంచనాల ప్రకారం, బుమ్రా స్ట్రెస్ ఇంజ్యురీ సమస్యతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి పంపారు.

టీ20 ప్రపంచ కప్‌కు ముందు జట్టుకు బలమైన బౌలింగ్ స్క్వాడ్‌ను తీర్చిదిద్దేందుకు భారత జట్టు మేనేజ్‌మెంట్ గత కొన్ని నెలలుగా విభిన్న బౌలర్లతో ప్రయోగాలు చేస్తోంది. ఇప్పుడు బుమ్రాకు ప్రత్యామ్నాయం కనుక్కోవడం సెలక్టర్లకు సవాల్‌గా మారింది.

జస్‌ప్రీత్ బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

షమీ, చాహర్‌ల మధ్య పోటీ

వెటరన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ, స్వింగ్ బౌలర్ దీపక్ చాహర్‌లను టీ20 వరల్డ్‌కప్‌ కు స్టాండ్-బై బౌలర్‌లుగా ఉంచారు.

ఈ ఇద్దరిలో ఎవరినైనా జట్టులోకి తీసుకోవచ్చు. అయితే చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి వీరిద్దరిలో ఒకరిని ఎంపిక చేయడం అంత సులువుగా కనిపించడం లేదు.

గాయం తర్వాత చాహర్ తిరిగి జట్టులోకి రావడం దీనికి ప్రధాన కారణం. మరోవైపు గత టీ20 ప్రపంచకప్ తర్వాత మహ్మద్ షమీ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కోవిడ్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లలో అతను పాల్గొనలేకపోయాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో దీపక్ చాహర్ అద్భుతంగా బౌలింగ్ చేసాడు. అయితే, కొత్త బంతితో బౌలింగ్ చేయడానికి అతను మొదటి ఆప్షన్ కాగలడా అన్నది సందేహంగా మిగిలిపోయింది.

ఐపీఎల్ సమయంలో, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా చాహర్‌ను చివరి ఓవర్లలో మాత్రమే ఉపయోగించాడు. చెన్నై టీమ్ మేనేజ్‌మెంట్ కొత్త బాల్‌తో కాకుండా పాత బాల్‌తోనే అవకాశం ఇచ్చింది.

టీ20 ప్రపంచకప్ జట్టులో అనుభవజ్ఞుడైన స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా ఉన్నాడు. అయితే, చివరి ఓవర్లలో బౌలింగ్ చేయడం కుమార్‌కు కష్టమవుతోంది. ఇటీవలి సిరీస్‌లలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.

భువనేశ్వర్ కుమార్ చివరి ఓవర్లలో ఓవర్‌కు 12 పరుగులు ఇవ్వడం వరుసగా ఆరు మ్యాచ్‌లలో కనిపించింది. అటువంటి పరిస్థితిలో, చాహర్‌ను పాత బంతితో కూడా ఆడించవచ్చు. అయితే, భారత జట్టు ఒక బ్యాటర్‌ను తగ్గించుకోవాల్సి ఉంటుంది.

వీడియో క్యాప్షన్, మహిళ క్రికెట్‌లో అత్యధిక పారితోషికం మిథాలీకే..

అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ రూపంలో ఇద్దరు కొత్త ఫాస్ట్ బౌలర్‌లతో కూడా ప్రయత్నించే అవకాశం జట్టు మేనేజ్‌మెంట్‌కు ఉంటుంది. అలాగయితే, టీ20 వరల్డ్ కప్‌లో మహమ్మద్ షమీకి అవకాశం లభిస్తుందా?

ఇక ముందు నువ్వు టీ20 జట్టులో భాగం కాకపోవచ్చని టీమ్ మేనేజ్‌మెంటు టీమిండియాలో అత్యంత అనుభవజ్ఞుడైన బౌలర్ షమీకి గత సంవత్సరమే చెప్పినట్లు సమాచారం.

కానీ అదే సెలెక్టర్లు షమీకి అవకాశమిచ్చి ఆశ్చర్యపరిచారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరిగే టీ20 సిరీస్‌లకు అతనికి జట్టులో స్థానం కల్పించారు.

అంతేకాకుండా, టీ20 కి స్టాండ్‌బై ప్లేయర్‌గా కూడా ఉంచారు. బుమ్రా గాయం దృష్ట్యా, షమీ గురించి సెలక్టర్లు తమ ఆలోచనను మార్చుకోవాల్సి వచ్చింది.

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరిగిన సిరీస్‌లో మహ్మద్ షమీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉండేది. కానీ, కోవిడ్ ఇన్‌ఫెక్షన్ కారణంగా అతను జట్టులో భాగం కాలేకపోయాడు.

ఎలాంటి మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా షమీకి టీ20 ప్రపంచకప్‌లో అవకాశం ఇవ్వడమంటే జూదమాడినట్లే. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో అతను చివరి ఓవర్లలో చాలా ఇబ్బంది పడ్డాడు.

ఐపీఎల్ చివరి రెండు సీజన్లలో, అతను చివరి ఓవర్లలో ఓవర్‌కు 10 పరుగులకు పైగా ఇచ్చాడు.

జస్‌ప్రీత్ బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

పోటీలో మహ్మద్ సిరాజ్....

డెత్ ఓవర్ల ప్రకారం జట్టు బౌలర్లను ఎంపిక చేస్తే మాత్రం, దానికి షమీ సరైన ఆప్షన్ కాదు. అయితే, ఆస్ట్రేలియా పిచ్‌లపై బౌలింగ్ చేయడంలో షమీకి అద్భుతమైన అనుభవం ఉండటం అతనికి కలిసొచ్చే అంశం.

ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే, మొహమ్మద్ సిరాజ్ ను చివరి ఆప్షన్‌గా భావించే అవకాశం ఉంది. సిరాజ్ చాలా కాలంగా టెస్ట్ జట్టులో ఉన్నాడు. బుమ్రాకు గాయం కావడంతో దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో చేర్చుకున్నారు.

సిరాజ్ వేగం విషయంలో బుమ్రాకు గట్టి పోటీ ఇవ్వగలడు. కానీ,అతని పెర్ఫార్మెన్స్‌లో నిలకడ లేదు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది.

28 ఏళ్ల ఈ హైదరాబాదీ బౌలర్ ఈ ఐపీఎల్‌లో ఓవర్‌కు 10కి పైగా పరుగులు ఇచ్చాడు. భారత్ తరఫున 13 టెస్టు మ్యాచ్‌ల్లో 40 వికెట్లు పడగొట్టాడు. ఇప్పటి వరకు 10 వన్డేలలో ఆడే అవకాశం దక్కింది. అందులో 13 వికెట్లు, ఐదు టీ20ల్లో అయిదు వికెట్లు తీసుకున్నాడు.

వీడియో క్యాప్షన్, వీడియో: క్రికెట్ బంతిని ఎలా తయారు చేస్తారో చూశారా?

మహ్మద్ సిరాజ్ గంటకు 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో నిలకడగా బౌలింగ్ చేయగలడు. ఆస్ట్రేలియా పిచ్‌లను పరిశీలిస్తే, వేగం కూడా చాలా ముఖ్యమైన అంశం.

అక్టోబరు 6న భారత జట్టు పెర్త్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఒక వారం కండిషనింగ్ క్యాంప్‌లో, జట్టు వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో వామప్ మ్యాచ్ ఆడుతుంది.

అక్టోబర్ 23న పాకిస్తాన్‌తో టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌కు సన్నాహకంగా ముందు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది.

జస్‌ప్రీత్ బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

బుమ్రా బౌలింగ్ యాక్షన్‌లో ఇబ్బందులు

వెన్ను సమస్య కారణంగా జట్టుకు దూరమవడం జస్‌ప్రీత్ బుమ్రా కెరీర్‌లో ఇదే మొదటిసారి కాదు.

2019లో కూడా చిన్న స్ట్రెస్ ఫ్రాక్చర్ కారణంగా అతను మూడు నెలల పాటు బౌలింగ్‌కు దూరంగా ఉన్నాడు. ఒకే రకమైన బౌలింగ్ శైలి వెన్నుపై మరింత ఒత్తిడిని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.

వైద్యపరంగా, స్ట్రెస్ ఫ్యాక్చర్‌లకు శస్త్రచికిత్స అవసరం. సులభంగా నయమయ్యే సమస్య.

2022లో బుమ్రా టెస్ట్, వన్డే, టీ20...ఈ మూడు ఫార్మాట్లలో ఒక్కొక్కటి ఐదు మ్యాచ్‌లు ఆడాడు. ముంబై ఇండియన్స్ నుంచి ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లకు అతను ఫిట్‌గా ఉన్నాడు.

ప్రస్తుత తరుణంలో బుమ్రా ఖచ్చితంగా ఒక ప్రమాదకరమైన బౌలర్‌లలో ఒకడు. అతను లేని లోపం ఆసియా కప్ సమయంలో స్పష్టంగా కనిపించింది. పాకిస్తాన్, శ్రీలంక చేతిలో ఓడిపోవడంతో భారత జట్టు ఫైనల్‌కు కూడా చేరలేకపోయింది. టీ20 ప్రపంచకప్‌లో బుమ్రాపై భారత క్రికెట్ బోర్డు చాలా ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడానికి ఇదే కారణం.

అయితే, బుమ్రా ఫిట్‌నెట్‌ను పొందేందుకు సుదీర్ఘమైన ప్రక్రియను కొనసాగించాలని, కనీసం ఆరు నెలల సమయం పడుతుందని తేల్చారు. బుమ్రాకు సమస్యకు మూలం అతని బౌలింగ్ యాక్షన్. అతను బంతిని ఫ్రంట్‌ఫుట్ లైన్ వెలుపల విసిరుతాడు. దానివల్ల శరీరాన్ని 45 డిగ్రీల కంటే ఎక్కువగా వంచాల్సి ఉంటుంది. ఇది వెన్నెముకపై ఒత్తిడిని కలిగిస్తుంది.

జస్‌ప్రీత్ బుమ్రా

ఫొటో సోర్స్, Getty Images

బౌలింగ్ యాక్షన్‌లో తేడాలేంటి?

నిజానికి బుమ్రా మామూలు బౌలర్లలా సైడ్ ఆర్మ్ బౌలర్ కాదు. అతను బంతిని విసిరినప్పుడు అతని ఛాతి బ్యాటర్‌కు ఎదురుగా ఉంటుంది. వాస్తవానికి బౌలర్ భుజం బ్యాటర్‌కు ఎదురుగా ఉండాలి.

అయితే, ఈ ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్ కారణంగా బుమ్రా తక్కువ రన్-అప్‌తో ఎక్కువ పేస్‌ను సాధించగలిగాడు. కానీ, దీనిలో సమస్య ఏంటంటే, ఇది వెన్నెముక సమస్యలకు కారణమవుతుంది.

ఈ బౌలింగ్ యాక్షన్‌తో ఎక్కువకాలం బౌలింగ్ చేయడం సాధ్యం కాదని, బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టినప్పటి నుంచీ విశ్లేషకులు భావించారు.

కానీ గత ఐదేళ్లలో, బుమ్రా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో చాలా విజయవంతమయ్యాడు, అతని బౌలింగ్ యాక్షన్‌ను మార్చమని ఏ కోచ్ కూడా అతనికి సలహా ఇవ్వలేదు. బుమ్రా కూడా ఈ అంశంపై దృష్టి పెట్టలేకపోయాడు.

వీడియో క్యాప్షన్, కాలు లేకపోయినా క్రికెట్‌లో సూపర్‌స్టార్

ఫిట్‌నెస్‌, వయసు కారణంగా శరీరం అతనికి సహకరించింది. కానీ, ఇప్పుడు ఆయన శరీరం ఎక్కువ ఒత్తిడిని తట్టుకోలేక పోతున్నట్లు తెలుస్తోంది. ఈ గాయం తీవ్రంగా లేకుంటే, అది విశ్రాంతి, ఫిజియోథెరపీలతో నయమవుతుంది.

కానీ, దిగువ వీపు మొత్తాన్ని ప్రభావితం చేస్తే మాత్రం, శస్త్రచికిత్స అవసరం కావచ్చు.

అటువంటి పరిస్థితిలో, బుమ్రా క్రికెట్ కెరీర్ ఎంతకాలం కొనసాగుతుంది అనేది అతని శరీరం అవసరాలు, అవగాహనపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)