ICC New Rules: క్రికెట్‌ రూల్స్ మార్చిన ఐసీసీ.. ఈ 8 కొత్త నిబంధనలతో లాభం బౌలర్‌‌కా లేక బ్యాటర్‌కా?

క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ), క్రికెట్ ఆట నియమాలను మార్చింది.

సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని మెన్ క్రికెట్ కమిటీ(ఎంసీసీ) చేసిన సిఫారసుల మేరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ(సీఈసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. వీటిని విమెన్ క్రికెట్ కమిటీకి పంపగా వారు కూడా ఆ సిఫారసులకు ఆమోదం తెలిపారు.

వచ్చే నెల ఒకటి నుంచి క్రికెట్ ఆటలో రానున్న మార్పులు ఇవి.

క్రికెట్

ఫొటో సోర్స్, ANI

1. క్యాచ్ అవుట్ అయితే

ఒక ప్లేయర్ క్యాచ్ అవుట్ అయితే కొత్తగా వచ్చే బ్యాటర్ బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అవుట్ అయిన బ్యాటర్ పరుగు తీస్తూ నాన్ స్ట్రైక్ ఎండ్‌కు వెళ్లినా కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది.

క్రికెట్ బాల్

ఫొటో సోర్స్, Getty Images

2. ఉమ్మితో బాల్ రుద్దడం

సాధారణంగా బాల్‌ను పాలిష్ చేసేందుకు బౌలర్లు ఉమ్మితో రుద్దుతారు. కరోనావైరస్ కారణంగా సుమారు రెండు సంవత్సరాలుగా ఇలా చేయడం మీద నిషేధం విధించారు. ఇకపై ఈ నిషేధాన్ని శాశ్వతంగా కొనసాగనించనున్నారు.

క్రికెట్ రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

3. రెండు నిమిషాల్లో బ్యాటింగ్‌కు రెడీ కావాలి

టెస్టుల్లో, వన్డేలలో బ్యాటర్ రాగానే రెండు నిమిషాల్లో బ్యాటింగ్‌కు రెడీ కావాలి. ప్రస్తుతం టీ20లకు ఇది 90 సెకన్లుగా ఉంది. దీనిలో మాత్రం ఏ మార్పు లేదు.

క్రికెటర్ స్మృతి మందన

ఫొటో సోర్స్, Getty Images

4. పిచ్ బయటకు వెళితే నో బాల్

బ్యాట్ లేదా బ్యాటర్‌లోని కొంత భాగం తప్పనిసరిగా పిచ్‌లో ఉండాలి. అలా కాకుండా పిచ్ బయటకు పోతే అంపైర్ డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు. బ్యాటర్‌ పిచ్ బయటకు వెళ్లేలా బౌలింగ్ చేస్తే ఆ బాల్‌ను 'నో బాల్'గా భావిస్తారు.

బౌలర్ మహ్మద్ షామీ

ఫొటో సోర్స్, Getty Images

5. ఫీల్డర్స్ అనైతికంగా వ్యవహరిస్తే

బౌలర్ బౌలింగ్ చేసేటప్పుడు ఫీల్డింగ్ టీం అనైతికంగా ప్రవర్తిస్తే ఆ బాల్‌ను డెడ్ బాల్‌గా ప్రకటించడంతోపాటు అయిదు పరుగులను బ్యాటింగ్ టీంకు ఇస్తారు.

6. మన్‌కడింగ్ ఇక నైతికమే

నాన్-స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉండే బ్యాటర్ క్రీజు దాటినప్పుడు బౌలింగ్ చేసే బౌలర్ వికెట్లను పడేస్తే దాన్ని ఇకపై 'రన్ అవుట్‌'గా పరిగణిస్తారు. దీన్నే మన్‌కడింగ్ అంటారు. ఇప్పటి వరకు ఇలా అవుట్ చేయడాన్ని క్రీడాస్ఫూర్తిగా విరుద్ధంగా చూసేవారు. ఐసీసీ కొత్త రూల్స్ ప్రకారం ఇకపై ఇది 'అన్‌ఫెయిర్' కాదు.

క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తరచూ ఇలా అవుట్ చేస్తూ ఉండటం పెద్ద చర్చకు తెరతీసింది. మన్‌కడింగ్‌ను 'ఫెయిర్ ప్లే'గా చూడాలంటూ ఎంతో కాలంగా అశ్విన్ వాదిస్తూ వస్తున్నాడు.

రవిచంద్రన్ అశ్విన్

ఫొటో సోర్స్, Getty Images

7. బౌల్ చేయకముందే బ్యాటర్ క్రీజు దాడితే

ప్రస్తుతం బౌల్ చేయక ముందే బ్యాటర్ క్రీజు దాటి బయటకు వస్తే బౌలర్ వికెట్లను బాల్‌తో కొట్టి 'రన్ అవుట్' చేయొచ్చు. లేదా కీపర్‌కు బాల్ అందించడం ద్వారా అవుట్ చేయొచ్చు. కానీ ఇకపై అలా కుదరదు. అలా విసిరే బాల్‌ను 'డెడ్ బాల్'గా పరిగణిస్తారు.

8. ఇతర మార్పులు

ఈ ఏడాది జనవరిలో టీ20ల్లో ప్రవేశపెట్టిన ఇన్-మ్యాచ్ పెనాల్టీని వన్డేలకు కూడా అప్లై చేయనున్నారు.

దీని ప్రకారం ఫీల్డింగ్ టీం నిర్దేశిత సమయంలో బౌలింగ్ కోటాను పూర్తి చేయకపోతే అదనంగా మరొక ఫీల్డర్‌ను ఫీల్డింగ్ సర్కిల్ లోపలకు తీసుకురావాల్సి ఉంటుంది. ఆటలో మిగిలిన ఓవర్లు అన్నీ అయిపోయే అంతవరకు ఆ ఫీల్డర్ సర్కిల్ లోపలే ఉండాలి.

2023లో జరిగే పురుషుల వరల్డ్ కప్ తరువాత ఈ నిబంధన అమల్లోకి వస్తుంది.

మెన్, విమెన్ వన్డేలు, టీ20లలో హైబ్రిడ్ పిచ్‌లను వాడేందుకు అనుమతి ఇచ్చారు. ఇందుకు రెండు జట్లు అంగీకరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం విమెన్ టీ20లలో మాత్రమే హైబ్రిడ్ పిచ్‌లను వాడుతున్నారు.

వీడియో క్యాప్షన్, Farmers Cricket Team: పంచె కట్టి... బ్యాట్ పట్టి.. పరుగులు కొల్లగొట్టి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)