లద్దాఖ్‌లో చైనా నిబంధనలకు భారత్ తల వంచాల్సి వస్తోందా

- రచయిత, షకీల్ అఖ్తర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
చైనా సరిహద్దులకు 30 కి.మీ. దూరంలోని తూర్పు లద్దాఖ్‌లో చోశూల్ గ్రామం ఉంటుంది. ఇక్కడి ఓ కొండపై ఒక సంచార జాతికి చెందిన కుటుంబం జీవిస్తోంది.
రాళ్లతో ఈ కుటుంబం ఒక గుండ్రని నిర్మాణాన్ని సిద్ధంచేసింది. దీనిలో వందల కొద్దీ గొర్రెలున్నాయి. ఆ చుట్టుపక్కలే దాదాపు 50 నుంచి 60 జడల బర్రెలు గడ్డి మేస్తున్నాయి.
అయితే, ఈ కుటుంబ పెద్ద సివాంగ్ నోర్బో చాలా బాధతో కనిపిస్తున్నారు.
అక్టోబరు చివర్లో లేదా నవంబరు మొదటి వారంలో ఇక్కడ మంచు కురవడం మొదలవుతుంది. అప్పుడు ఉష్ణోగ్రతలు మైనస్ 35 నుంచి మైనస్ 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పడిపోతాయి.
ఆ తరవాత ఆరు నెలలు ఈ ప్రాంతం మొత్తం మంచులో కూరుకుపోతుంది. శీతాకాలంలో ఇక్కడ సంచార కుటుంబాలన్నీ పశువులతోపాటు సమీపంలోని పర్వత ప్రాంతాలకు తరలివెళ్తాయి.
గడ్డి దొరకని ప్రాంతాలకు ఇప్పుడు తాము వెళ్లాల్సి ఉంటుందని సివాంగ్ చెప్పారు. ‘‘ఇదివరకు మేం వెళ్లిన పర్వత ప్రాంతాల్లో శీతాకాలంలోనూ గడ్డి బాగా లభించేది. అక్కడ మేం నెలలపాటు ఉండేవాళ్లం. కానీ, ఇప్పుడు అక్కడకు భారత సైన్యం మమ్మల్ని వెళ్ల నివ్వడం లేదు. మేం చైనా సైన్యం ఆధీనంలోని ప్రాంతాల్లోకి వెళ్లబోమని చెప్పినప్పటికీ, మమ్మల్ని అక్కడకు పోనివ్వడం లేదు. మేం చాలా ఇబ్బంది పడుతున్నాం. అసలు మమ్మల్ని అక్కడకు ఎందుకు వెళ్లనివ్వడం లేదో అర్థం కావడం లేదు’’అని ఆయన అన్నారు.
తూర్పు లద్దాఖ్‌లోని 70 శాతం జనాభా సంచార జాతులే. గొర్రెలు, జడల బర్రెల పెంపకంపై ఆధారపడి వీరు జీవిస్తారు. శతాబ్దాల నుంచీ వీరు చైనాకు సరిహద్దుల్లోని పెద్దపెద్ద కొండల మధ్య ఉండే చిన్నచిన్న గ్రామాల్లో జీవిస్తున్నారు.
ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 3.5 వేల నుంచి 5 వేల మీటర్ల ఎత్తులో ఉంటుంది. వాస్తవాధీన రేఖకు వెంబడి ఇక్కడి ప్రాంతాల్లో జీవించడం చాలా కష్టం.

క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఇలా..
ఈ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే, జూన్ 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణల తర్వాత ఇక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల నడుమ ఇక్కడున్న కొన్ని ప్రాంతాల్లోకి చైనా సైన్యం ప్రవేశించింది.
దోర్బక్, గల్వాన్, ప్యాంగ్యంగ్ సో, డెప్సాంగ్, హాట్ స్ప్రింగ్స్, గోగ్రా, చోశుల్, చోమూర్, డెంచోక్ తదితర సరిహద్దు ప్రాంతాల్లో రెండు దేశాల సైనికులు అప్పుడప్పుడు ఎదురెదురు పడుతున్నారు.
చాలా ప్రాంతాల్లో రెండు దేశాల సైనికుల మధ్య దూరం చాలా తక్కువగా ఉంటోంది. దీంతో ఇక్కడి గ్రామస్థులు చాలా అప్రమత్తంగా ఉంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో భారత సైన్యం శిబిరాలు, కంటోన్మెంట్‌లను ఏర్పాటుచేసింది.
ఇక్కడి పరిస్థితులపై స్థానికుడు సివాంగ్ గెస్తు మాట్లాడుతూ.. ‘‘ఇదివరకు భారత సైనికులు ఇంత పెద్ద సంఖ్యలో ఉండేవారు కాదు. కేవలం సరిహద్దుల్లో మాత్రమే వారు కనిపించేవారు. కానీ, గల్వాన్ ఘర్షణల తర్వాత, ఇక్కడ సైనికుల సంఖ్య భారీగా పెరిగింది. ఇక్కడకు చాలా సైనిక ట్రక్కులు వస్తున్నాయి. యుద్ధ ట్యాంకులు, ఇతర ఆయుధాలను కూడా ఇక్కడ మోహరిస్తున్నారు’’అని ఆయన వివరించారు.

స్థానికులు ఏం అంటున్నారు?
చోశూల్ గ్రామ సర్పంచ్‌గా సెరంగ్ దుల్కర్ పనిచేస్తున్నారు. గల్వాన్ ఘర్షణల తర్వాత స్థానికులకు చాలా సమస్యలు పెరిగాయని దుల్కర్ చెప్పారు. ‘‘ఇక్కడి అబ్బాయిలు, అమ్మాయిలు.. సైన్యం కోసం కూలీలుగా పనిచేస్తున్నారు. నిర్మాణాల్లోనూ సాయం చేస్తున్నారు. అయితే, సంచార జాతులకు మాత్రం కష్టాలు ఎక్కువయ్యాయి’’అని ఆమె చెప్పారు.
‘‘గల్వాన్‌లో ఘర్షణలకు ముందు, ఇక్కడి సరిహద్దుల్లో ఎలాంటి సమస్యా ఉండేది కాదు. ఇక్కడి ప్రజలు తమ పశువులతోపాటు సరిహద్దులను దాటి అవతలి ప్రాంతాలకు కూడా వెళ్లేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సైన్యం ఆంక్షల వల్ల శీతాకాలంలో గడ్డి అనేది చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. ఘర్షణలకు ముందు మాకు 1,700 పశువులు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 1,100 నుంచి 1,200కు పడిపోయింది. గడ్డి దొరకడం మాకు చాలా కష్టం అవుతోంది’’అని ఆమె చెప్పారు.
చైనా ఎలాంటి వాతావరణం సృష్టించాలని అనుకుంటుందో ఇక్కడి పరిస్థితులను చూస్తే స్పష్టం అవుతోంది.
చోశూల్ నుంచి ఎన్నికైన కౌన్సెలర్ కోంచోక్ స్టెజెన్ మాట్లాడుతూ.. ‘‘2020నాటి ఘటన చాలా పెద్దది. 1962 తర్వాత మళ్లీ అంత పెద్ద మొత్తంలో ఇక్కడ సైనికులను చూడటం ఇదే తొలిసారి. ఇలాంటి ఘర్షణ వాతావరణం ఇదివరకెప్పుడూ లేదు’’అని అన్నారు.

చోశూల్‌కు సమీపంలోని పర్వతాలపై ఎక్కడ చూసినా సైనికులు కనిపిస్తున్నారు. ఇదివరకు డెంచోక్, చోమూర్ ప్రాంతాల్లో మాత్రమే చైనా శిబిరాలు కనిపించేవని కోంచోక్ చెప్పారు.
‘‘కానీ, ఇప్పుడు ఎటు చూసినా సైనిక నిర్మాణాలే కనిపిస్తున్నాయి. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దులున్న ప్రతిచోటా చైనా 5జీ టవర్లను ఏర్పాటుచేసింది. అంతేకాదు ప్యాంగ్యంగ్ సో చెరువుపై రెండు వంతెనలు కూడా నిర్మించారు. 2020 నుంచి చాలా కొత్త నిర్మాణాలను చైనా చేపట్టింది. అసలు చైనా ఎలాంటి వాతావరణాన్ని సృష్టించాలని అనుకుంటోందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు’’అని ఆయన వివరించారు.
లెహ్‌కు ఎగ్జిక్యూటివ్ కౌన్సెలర్‌గా మొహమ్మద్ షఫీ పనిచేశారు. ‘‘లద్దాఖ్‌కు రెండు అంతర్జాతీయ సరిహద్దులు ఉన్నాయి. పశ్చిమం వైపు పాకిస్తాన్, తూర్పువైపు చైనా ఉన్నాయి. 1962 తర్వాత తొలిసారి చైనా ఇక్కడ దూకుడుగా వ్యవహరిస్తోంది’’అని ఆయన అన్నారు.
‘‘చొరబాట్లతో ఇక్కడ చాలా సరిహద్దు ప్రాంతాలను వారు ఆక్రమించారు. ఇదివరకు కూడా అక్కడి స్థానికులను పశువులను మేపేందుకు పంపుతున్నామంటూ చాలా ప్రాంతాలను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. 2020 జూన్ తర్వాత వారు గల్వాన్ లోయలోని చాలా ప్రాంతాలతోపాటు డెప్సాంగ్.. ఇలా ఎక్కడ చూసినా వారి నిర్మాణాలే కనిపిస్తున్నాయి’’అని ఆయన వివరించారు.

చైనా ఆగ్రహం
రెండేళ్ల క్రితం భారత్ కొత్త మ్యాప్‌లో ఆక్సాయీ చిన్‌ను తమ ప్రాంతంగా చూపించడంపై చైనా ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ తర్వాత.. జూన్ 14, 2020న గల్వాన్ లోయలో గస్తీ కాస్తున్న భారత్, చైనా సైనికులు ఢీఅంటేఢీ అని ఎదురుపడ్డారు. ఈ ఘర్షణల్లో దాదాపు 20 మంది భారత సైనికులు మరణించారు. తమ వైపు నలుగురు సైనికులు మరణించారని చైనా చెబుతోంది. అయితే, వాస్తవానికి అంతకంటే ఎక్కువే మరణాలు సంభవించి ఉండొచ్చని అంతర్జాతీ మీడియా సంస్థలు వెల్లడించాయి.
గత ఏప్రిల్‌లోనూ రెండు దేశాల సైనికుల మధ్య స్వల్ప స్థాయిలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో వాస్తవాధీన రేఖ వెంబడి చాలా ప్రాంతాల్లో చైనా సైన్యం ముందుకు వచ్చినట్లు భారత సైన్యం వెల్లడించింది. అయితే, ఈ ప్రాంతాల నుంచి ఇప్పటికీ చైనా సైన్యం వెనక్కి వెళ్లలేదని కూడా వార్తలు వస్తున్నాయి.
భారత్-చైనా ఘర్షణలపై ‘‘ద లాస్ట్ వార్’’ పేరుతో ఇటీవల పుస్తకం ప్రచురించిన ప్రవీణ్ సాహ్నీ ఈ అంశంపై బీబీసీతో మాట్లాడారు. ‘‘భారత్ కొత్త మ్యాప్‌పై చైనా చాలా ఆగ్రహంతో ఉండేది. అందుకే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులకు చైనా కాలుదువ్వింది. అప్పటి మ్యాప్‌లో లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా పేర్కొంటూ.. ఆక్సాయీ చిన్‌ను కూడా దానిలో కలిపి చూపించారు. ఇది చైనాకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు. 1959 నుంచి చైనా ఇదే చెబుతోంది. తాజా మ్యాప్ వారికి ఒక అవకాశం లాంటిది. ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఇప్పుడు వారు వెనక్కి వెళ్లడం లేదు. వారికి వెనక్కి పంపేందుకు అవసరమైన సైనిక శక్తి మన దగ్గర లేదు’’అని అన్నారు.

సదుపాయాలు లేవు
చోమూర్ కూడా సరిహద్దుల్లో ఉంటుంది. అయితే, ఇక్కడి ప్రజలకు ప్రభుత్వం సరిపడా సదుపాయాలు కల్పించడంలేదని మాజీ కౌన్సెలర్ గోర్మె దోర్జే చెప్పారు.
‘‘చోమూర్ అనేది జీరో బోర్డర్‌పై ఉంటుంది. కానీ, ఇక్కడ మొబైల్ టవర్ కూడా లేదు. కానీ, చైనా ఆధీనంలోని ప్రాంతాల్లో గొర్రెల కాపరులకు చాలా సదుపాయాలు కల్పిస్తున్నారు. 2013లో ఇక్కడి కొన్ని ప్రాంతాలను చైనా ఆక్రమించింది. చర్చల తర్వాత కూడా వారు వెనక్కి పోలేదు. ఇదివరకు మేం అటువైపు ప్రాంతాలకు కూడా పశువులను మేపడానికి తీసుకెళ్లేవాళ్లం. కానీ, ఇప్పుడు అక్కడకు వెళ్లడనివ్వడం లేదు’’అని ఆయన వివరించారు.

వెనక్కి వెళ్లడం అంటే?
కఠినమైన తూర్పు లద్దాఖ్ పర్వత ప్రాంతాల్లో చైనా 60 వేల మందికిపైగా సైనికులను మోహరించినట్లు రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు భారత్ కూడా అదే స్థాయిలో సైనికులను మోహరిస్తోంది. సైనికులకు అవసరమైన వస్తువులు ఇతర నిత్యవసరాల కోసం ఇక్కడ వందల సంఖ్యలో ట్రక్కులు తిరుగుతున్నాయి.
అసలు ఎంత మందిని ఈ సరిహద్దుల్లో మోహరించారని కనుక్కొనేందుకు భారత సైన్యానికి బీబీసీ ఒక మెయిల్ పంపింది. అయితే, వార్త రాసే సమయానికి మాకు ఎలాంటి సమాధానం రాలేదు.
హాట్‌స్ప్రింగ్స్ ప్రాంతంలో మూడు రోజుల క్రితం సైన్యాలను వెనక్కి తీసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి.
దీనిపై ప్రవీణ్ సాహ్నీ మాట్లాడుతూ.. ‘‘చైనా పెడుతున్న నిబంధనలకు అనుగుణంగానే బలగాలను వెనక్కి తీసుకోవడం జరుగుతోంది. గల్వాన్ ఘర్షణల తర్వాత 10 సెప్టెంబరు 2020న మాస్కోలో భారత్, చైనాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. బలగాలను వెనక్కి తీసుకుంటామని దీనిలో రెండు సైన్యాలు అంగీకరించాయి. అయితే, ఇప్పుడు చైనా నిబంధనల ప్రకారమే.. బలగాల ఉపసంహరణ జరుగుతోంది’’అని ఆయన అన్నారు.
‘‘ఏప్రిల్ 2020కు మునుపటి యథాతథ స్థితికి వెళ్లేందుకు చైనా అంగీకరించడం లేదు. వాస్తవాధీన రేఖ నేడు ‘బోర్డర్ ఏరియా’గా మారిపోయింది’’అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘ఈ బోర్డర్ ఏరియా మొత్తం ఒకప్పుడు మన ఆధీనంలో ఉండేది. 19 జూన్ 2020న దీనిపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రకటన చేశారు. మన భూమిని ఎవరూ తీసుకోలేదని చెప్పారు. అయితే, ఇప్పుడు ఇంత పెద్దమొత్తంలో సైన్యాన్ని ఎందుకు మోహరిస్తున్నారో తెలుసా.. చైనా సైనికులు మరిన్ని ప్రాంతాలను ఆక్రమించకుండా చూసేందుకే’’అని ఆయన వివరించారు.
ఈ ప్రాంతాలన్నీ ఒకప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేవి. గల్వాన్ ఘర్షణల తర్వాత తూర్పు లద్దాఖ్ మొత్తం నేడు ఉద్రిక్తంగా మారింది.
ఇక్కడ వేల మంది సైనికులను మోహరించారు. ఈ మోహరింపులు క్రమంగా మరింత ఎక్కువవుతున్నాయి. చిన్నచిన్న ఉద్రిక్తతలు కూడా ఘర్షణలుగా మారేలా పరిస్థితులు దిగజారాయి.
ఇవి కూడా చదవండి:
- మూన్‌లైటింగ్ అంటే ఏమిటి? ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలు దీనిపై ఎందుకు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి?
- ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన చిరుతలివి, 70 ఏళ్ల తర్వాత భారత్‌లో అడుగుపెట్టాయి.
- హైదరాబాద్ సంస్థానం భారత్‌లో కలవడంపై బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధానికి కారణమేంటి?
- క్వీన్ ఎలిజబెత్ 2: ఇప్పటి నుంచి అంత్యక్రియల వరకు ఏ రోజు ఏం జరుగనుంది?
- స్వాతి రెడ్డి: రైలులో పురిటినొప్పులతో విలవిల్లాడుతున్న మహిళకు కత్తెర కూడా వాడకుండా ఆమె ఎలా పురుడు పోశారంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












