భారత్-చైనా: సరిహద్దు ఉద్రిక్తతలున్నా వాణిజ్యం రికార్డు స్థాయిలో పెరుగుతోంది... ఇది భారత్‌కు మంచిది కాదా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బీబీసీ మానిటరింగ్
- హోదా, న్యూస్ రిపోర్టింగ్, అనాలిసిస్

- 2020 నుంచి భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అయితే, రెండు దేశాల మధ్య వాణిజ్యం కూడా రికార్డు స్థాయిలో పెరిగింది.
- చైనా నుంచి భారత్ భారీగా వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. వీటి మొత్తం విలువ 94.2 బిలియన్ డాలర్లు. అంటే రూ.7,51,530 కోట్లు. భారత్ మొత్తం దిగుమతుల్లో ఈ వాటా 15 శాతం వరకు ఉంటుంది.
- చైనాతో వాణిజ్యం పెరగడంపై భారత్ ప్రభుత్వాన్ని విపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు విమర్శిస్తున్నాయి.


ఫొటో సోర్స్, Getty Images
తూర్పు లద్దాఖ్‌లో 2020లో భారత్-చైనాల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. దీనిపై రెండు దేశాల సైనిక కమాండర్ల స్థాయిలో 16వ సారి చర్చలు జరిగాయి. కానీ, వాటి వల్ల పెద్దగా ఎలాంటి ప్రయోజనమూ కనిపించలేదు.
అయితే, చర్చలు కొనసాగిస్తామని రెండు దేశాలూ నొక్కి చెప్పడం ఒక సానుకూల పరిణామంగా చెప్పుకోవచ్చు.
జులై 17న చివరిసారిగా రెండు దేశాల మధ్య కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగాయి. అయితే, సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకుంటామని ప్రకటనలో పేర్కొన్నారు.
అయితే, వాస్తవాధీన రేఖ వెంబడి చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రతిష్టంభన, వివాదం అలానే ఉన్నాయి.
వివాదం ఉన్నప్పటికీ, రెండు దేశాల మధ్య వాణిజ్యం విపరీతంగా పెరుగుతోంది. ముందెన్నడూ లేని స్థాయిలో రెండు దేశాల వాణిజ్యం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA
పెరిగిన దిగుమతులు..
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకు వరుసగా చైనా నుంచి దిగుమతులు పెరుగుతూ వస్తున్నాయని భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ సమాచారం పరిశీలిస్తే తెలుస్తోంది.
2021-22 వార్షిక సంవత్సరానికి సంబంధించి తాజాగా మంత్రిత్వ శాఖ ఒక నివేదిక విడుదల చేసింది. దీనిలో రెండు దేశాల మధ్య 115 బిలియన్ డాలర్ల (రూ. 9,17,614 కోట్లు) వాణిజ్యం నమోదైనట్లు పేర్కొన్నారు. గత ఏడాది ఇది 86 బిలియన్ డాలర్లు (రూ.6,86,216 కోట్లు) మాత్రమే.
చైనా నుంచి భారత్‌కు దిగుమతులు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఇది 94 బిలియన్ డాలర్లు (రూ.7,50,050 కోట్లు) కాగా.. గత ఇది ఏడాది 65.3 బిలియన్ డాలర్లు (రూ.5,21,045 కోట్లు) మాత్రమే.
మరోవైపు ప్రస్తుత వార్షిక సంవత్సరంలోనూ రెండు దేశాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగినట్లు భారత మీడియా సంస్థలు, చైనా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
2022 మొదటి ఆరు నెలల్లో రెండు దేశాల మధ్య వాణిజ్యం 67.08 బిలియన్ డాలర్లు (రూ.5,35,248 కోట్లు)గా గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది.
విమర్శలు ఎందుకు?
చైనాతో వాణిజ్యం పెరగడంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రధాన విపక్షం కాంగ్రెస్ విమర్శిస్తోంది. ‘‘ఒకవైపు రెండు దేశాల సైన్యాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటుంటే... మోదీ రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచుతున్నారు’’అని కాంగ్రెస్ పార్టీ ట్విటర్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ చేశారు.
‘‘చైనాపై ఆగ్రహంతో ఉన్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నారు. నిజానికి రెండు దేశాల మధ్య మొదటి ఆరు నెలల్లో 67.08 బిలియన్ డాలర్లు (రూ.5,35,248 కోట్లు) వాణిజ్యం నమోదైంది. సరిహద్దుల్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు అలానే ఉన్నాయి’’అని కూడా కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
మరోవైపు మోదీ ప్రభుత్వ నినాదం ‘‘ఆత్మనిర్భర భారత్’’ను చైనా ఆధారిత భారత్‌గా కాంగ్రెస్ విమర్శించింది.
రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరిగినట్లు భారత్‌లోని చాలా వార్తా సంస్థల్లో కథనాలు వచ్చాయి. అయితే, కొన్ని మీడియా సంస్థలు ఈ వాణిజ్యంపై ఆందోళన వ్యక్తంచేస్తూ విశ్లేషణలు కూడా ప్రచురించాయి.
చైనా నుంచి దిగుమతులు క్రమంగా పెరుగుతున్నాయని, ఫలితంగా భారత్ భద్రతకు ముప్పు పొంచివుందని ఈ కథనాల్లో హెచ్చరించారు.
‘‘ఆత్మనిర్భరత, స్వావలంబన గురించి విశ్లేషణలు, కథనాలు వస్తున్నాయి. కానీ, చైనాతో వాణిజ్య లోటు క్రమంగా పెరుగుతోంది’’అని మింట్ వెబ్‌సైట్ ఓ కథనం ప్రచురించింది. ఇక్కడ వాణిజ్య లోటు అంటే చైనాకు ఎగుమతి చేస్తున్న వస్తువుల కంటే దిగుమతి చేసుకుంటున్న వస్తువులే ఎక్కువగా ఉన్నాయని అర్థం.

ఫొటో సోర్స్, Twitter
మరోవైపు భారత్‌కు చెందిన వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడు బ్రహ్మ చెలాణీ కూడా మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. భారత్‌కు వ్యూహాత్మక ఆలోచన కరవైందని ఆయన అన్నారు.
‘‘చైనాతో వాణిజ్యం 50 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనికి మోదీ ప్రభుత్వం ఎలా వివరణ ఇస్తుంది? సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నడుమ చైనాకు అనుకూలంగా వాణిజ్య లోటు పెరుగుతూ పోతోంది. జనవరి నుంచి నవంబరు మధ్య 61.5 బిలియన్ డాలర్లు (రూ. 4,90,649 కోట్లు) అదనంగా చైనా వాణిజ్యం నమోదైంది. ఇది మన మొత్తం వార్షిక రక్షణ బడ్జెట్‌కు సమానం’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- మీర్ సుల్తాన్ ఖాన్: ఒక భారతీయ సేవకుడు బ్రిటన్ సామ్రాజ్య చెస్ ఛాంపియన్ ఎలా అయ్యాడు?
- మనీషా రూపేటా: పాకిస్తాన్లో డీఎస్పీ అయిన తొలి హిందూ మహిళ
- ఎలాన్ మస్క్: అఫైర్ వివాదంలో టెస్లా అధినేత
- పాకిస్తాన్ ఆదాయంలో 40 శాతం వడ్డీలకే... ఈ దేశం మరో శ్రీలంక అవుతుందా?
- మంకీపాక్స్: 'జననేంద్రియాలపై కురుపులు... దుస్తులు ధరిస్తే తట్టుకోలేనంత మంట'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













