ఇంధన సంక్షోభం: చలితో గజగజ వణికించే ఇంట్లో ఉంటే ఆరోగ్యం దెబ్బతింటుందా?

చలికాలం

ఫొటో సోర్స్, Jeremy Sutton-Hibbert/Alamy

    • రచయిత, క్రిస్ బరానిక్
    • హోదా, బీబీసీ ఫ్యూచర్

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలను ఇంధన సంక్షోభం వెంటాడుతోంది. కోట్ల మంది ప్రజలు ఈ శీతాకాలంలో తమ ఇళ్లలో ఎలా చలి కాచుకోవాలో తెలియక ఆందోళన పడుతున్నారు. అయితే, ఇలా చలిలో గడపడంతో సుదీర్ఘ కాలంపాటు మన ఆరోగ్యంపై పడే ప్రభావాల మీద క్రిస్ బరానిక్ అందిస్తున్న కథనమిదీ.

విపరీతంగా చలివేసే రోజుల్లో మీకా ఫెఫీల్డ్‌కు ఉదయం అలారమ్ అవసరం లేదు. కాళ్ల నొప్పులే ఆమెను నిద్ర లేపుతుంటాయి. ముఖ్యంగా మడమలు, కీళ్లలో ఆమెకు చాలా నొప్పి వస్తుంటుంది.

నొప్పులతో అలా పడుకున్నప్పుడే ఇంట్లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఆమె గుర్తుచేసుకుంటుంటారు. కానీ, మంచంపై నుంచి లేవడం ఆమెకు చాలా కష్టంగా ఉంటుంది.

ఇంగ్లండ్‌ లాంకషైర్‌లోని పైఅంతస్తులో ఆమె ఇంటిని వేడిగా ఉంచే హీటింగ్ వ్యవస్థలు ఆఫ్‌చేసి ఉన్నాయి. కిటికీల దగ్గర చలికి నీరు కారుతున్నట్లుగా కనిపిస్తోంది. విపరీతమైన చలి నడుమ మీకా కాళ్ల నొప్పులు మరింత ఎక్కువ అవుతున్నాయి.

మీకా ఫెఫీల్డ్‌

ఫొటో సోర్స్, Mica Fifield

భయం.. భయం..

‘‘ఏదిఏమైనప్పటికీ మేం హీటింగ్ వ్యవస్థలను ముట్టుకోవడం లేదు’’అని మీకా చెప్పారు. గ్యాస్, విద్యుత్ ధరలు విపరీతంగా పెరగడమే దీనికి కారణమని ఆమె వివరించారు. ఇప్పుడు స్విచ్‌లు ఆన్‌చేస్తే బిల్లులు ఎంత వస్తాయోనని మీకా, ఆమె భర్త ఆందోళనతో ఉన్నారు. ‘‘మేం చాలా భయపడుతున్నాం’’అని ఆమె వివరించారు.

ఇంకా చలికాలం పూర్తిగా రాలేదు. రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముంది. అయితే, ఈ చలికాలం మొత్తం హీటింగ్ వ్యవస్థలను ముట్టుకోకూడదని మీకా కుటుంబం భావిస్తోంది.

మీకా వయసు 27ఏళ్లు. ఆమె ఐలర్స్ డాన్లోస్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. దీని వల్ల ఆమెకు విపరీతమైన నొప్పి వస్తుంటోంది. కాస్టోకోండ్రైటిస్ రుగ్మత కూడా ఆమెకు సోకింది. దీని వల్ల ఛాతిలోని ఎముకల చుట్టు ఇన్‌ఫ్లమేషన్ ఉంటోంది. దీని వల్ల గుండెపోటు వచ్చినట్లుగా అనిపిస్తుంటోందని ఆమె వివరించారు.

కొన్ని సంవత్సరాల క్రితం జుంబా డ్యాన్స్ నేర్పించే థియేటర్‌లో పనిచేయాలని ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, ఈ రుగ్మతలు సోకిన తర్వాత, అన్నింటినీ ఆమె పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ఆమె ఎలాంటి ఉద్యోగం చేయలేకపోతున్నారు. కానీ, ప్రభుత్వం నుంచి ఆమెకు సాయం అందుతోంది. మరోవైపు తన భర్త కూడా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తుంటారు.

పాల్ డోహెర్టీ

ఫొటో సోర్స్, PA/Alamy

చాలా మందిపై ప్రభావం...

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా మందిపై ఇంధన సంక్షోభం ప్రభావం చూపుతోంది. ఉదాహరణకు వంట చేయడానికి కిచెన్‌లోకి మీకా వెళ్లినప్పుడు, ఓవెన్‌ను ఇప్పుడు ఆమె ముట్టుకోవడం లేదు. తక్కువ విద్యుత్ ఉపయోగించే ఫ్రైయర్‌నే ఆమె ఉపయోగిస్తున్నారు. మరోవైపు తన స్కూటర్‌కు అవసరమైన విద్యుత్ విషయంలోనూ మీకా ఆందోళనతో ఉన్నారు.

వారంలో నాలుగుసార్లు స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లడమంటే మీకాకు ఇష్టం. దీని వల్ల ఆమె కాళ్ల నొప్పులు కూడా తక్కువగా అనిపిస్తుంటాయి. అక్కడ మాత్రమే ప్రస్తుతం ఆమె వేడినీళ్లతో స్నానం చేస్తున్నారు. ఎందుకంటే ఇంట్లో హీటర్‌తో ఎక్కువ విద్యుత్‌ ఖర్చు అవుతోంది.

ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, తను ధైర్యంగానే ఉన్నానని మీకా చెబుతున్నారు. తనను పీడిస్తున్న రుగ్మతలపై ప్రజలకు ఆమె అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా చలిలో గడపడంతో ఈ రుగ్మత మరింత తీవ్రం ఎలా అవుతుందో ఆమె చెబుతున్నారు.

ప్రస్తుత చలికాలంలో మీకాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు చాలా మంది ఉన్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న కరెంటు బిల్లులపై ఆందోళన వ్యక్తంచేస్తూ.. కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

చలికాలం

ఫొటో సోర్స్, Jeremy Sutton-Hibbert/Alamy

3.6 కోట్ల మంది ఇలానే...

2020లో యూరప్‌లో 3.6 కోట్ల మంది ఇంధన ఖర్చులు పెరగడం వల్ల తమ ఇళ్లను వేడిగా ఉంచుకునేందుకు హీటింగ్ వ్యవస్థలను ఆన్‌ చేయలేదని గణాంకాలు చెబుతున్నాయి. అమెరికాలో దాదాపు 16 శాతం మందిని ఇంధన పేదరికం పీడిస్తోంది. వీరిలో దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న 52 లక్షల మంది కూడా ఉన్నారు. ఇక చైనాలో 24 నుంచి 27 శాతం మంది ఇంధన పేదరికంతో జీవిస్తున్నారు.

ఇంధన మార్కెట్ ఒడిదొడుకులను ఎదుర్కోవడంతో ధరలు నానాటికీ పెరుగుతున్నాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, గ్యాస్ కొరత లాంటి సమస్యలు మరింత ఎక్కువ అవుతున్నాయి. దీంతో ప్రస్తుతం పరిస్థితులు మరింత దిగజారే ముప్పుంది.

యూరప్‌లో ఈ ధరల పెరుగుదల మరింత ఎక్కువగా కనిపిస్తోంది. అయితే, ఈ ప్రభావం అమెరికాలోనూ కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచం ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని ఇటీవల ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) కూడా హెచ్చరించింది. ముఖ్యంగా యుక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో ఈ సంక్షోభం మొదలైంది. దీని ప్రభావం పేదలపై ఎక్కువగా పడుతోంది.

మరోవైపు ఈ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై కూడా పడుతోంది. ఇంట్లో చలి వల్ల ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితం అవుతుందని, కొన్నిసార్లు ఇది ప్రాణాంతకంగా కూడా మారుతుందని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

పక్షవాతం, శ్వాసకోశ వ్యాధులు, ఇతర రుగ్మతలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజల్లో శక్తి కూడా తగ్గినట్లుగా అనిపిస్తుందని వివరిస్తున్నాయి.

ప్రస్తుతం భూమి ఉత్తరార్ధగోళం వేసవి నుంచి శీతాకాలం దిశగా అడుగులు వేస్తోంది. రానున్న రోజుల్లో చలి మరింత ఎక్కువ అవుతుందని, చాలా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే చాలా మంది వైద్యులు హెచ్చరిస్తున్నారు. అనారోగ్య ముప్పు ఎక్కువగా ఉండేవారికి ఇప్పటికే స్వచ్ఛంద సంస్థలు కూడా సాయం చేయడం మొదలుపెట్టాయి. చలి బట్టలు ఇవ్వడం, ఆహారాన్ని అందించడం లాంటి చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, ఈ చలిని పట్టించుకోకపోతే, తీవ్రమైన అనారోగ్య ముప్పులను మనం ఎదుర్కోవాల్సి ఉంటుందని కొందరు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చలికాలం

ఫొటో సోర్స్, Mustafa Hassona/Getty Images

ఉత్తర ఐర్లాండ్‌ వెస్ట్ బెల్‌ఫాస్ట్‌లోని ఒక ఫుడ్‌బ్యాంక్‌లో మధ్యాహ్నం అవుతోంది. ఆహారంతో నిండిన బ్యాగ్‌లు డెలివరీ కోసం సిద్ధంగా ఉన్నాయి. వీటిలో ఆహార ధాన్యాలు, సూప్ ప్యాకెట్లు, బీన్స్ ఉన్నాయి. పాస్తా ప్యాకెట్లు, న్యాపీలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి.

ఆ రోజు ఉదయమే ఒక స్థానిక వ్యాపార సంస్థ వితరణ చేసిన హామ్ ప్యాకెట్లను పాల్ డోహెర్టీ ప్యాక్ చేస్తూ కనిపించారు. పేదరికాన్ని అరికట్టేందుకు ఆయన ప్రత్యేక ప్రచారాలు చేపడుతుంటారు. ఈ ఫుడ్ బ్యాంక్‌ను నడిపేందుకు ఫుడ్‌స్టాక్ పేరుతో ఆయన ప్రత్యేక సంస్థను కూడా స్థాపించారు.

బెల్‌ఫాస్ట్‌లో ఆహారాన్ని సరఫరా చేస్తున్న స్వచ్ఛంద సంస్థల్లో ఫుడ్‌స్టాక్ కూడా ఒకటి. దాదాపు 400 ఇళ్లకు ఈ సంస్థ ఆహారాన్ని ఇస్తోంది. ఇప్పుడు ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోందని డోహెర్టీ చెబుతున్నాయి. తనతోపాటు పనిచేసే వాలంటీర్లు ఆహారాన్ని అందించడంతోపాటు చాలా సేవలు అందిస్తారని వివరించారు. చలి బట్టలు, స్కూల్ యూనిఫామ్‌లు కూడా వీరు పంచుతుంటారు.

‘‘నిజంగా చెప్పాలంటే ప్రజలు చాలా ఆందోళనతో ఉన్నారు. అది వారి మొహాల్లో స్పష్టంగా కనిపిస్తోంది’’అని ఆయన వివరించారు.

ఇంధన పేదరికం అనేది కొత్త సమస్యకాదని ఆయన అంటున్నారు. ‘‘ఇటీవల ఒక వృద్ధుడిని కలిశాను. ఆయన కూడా మీకాలానే హీటింగ్ వ్యవస్థలను ఆన్‌ చేయకూడదని భావిస్తున్నారు. ఒక్కోసారి తెల్లవారుజామున కొందరు తల్లిదండ్రులు మాకు ఫోన్లు చేస్తుంటారు. తమ పిల్లలు చలికి గడ్డకట్టినట్లు అయిపోయారని, సాయం చేయాలని వారు కోరుతుంటారు’’అని ఆయన వివరించారు.

‘‘కుటుంబం మొత్తం కోట్లు వేసుకొని టేబుల్ దగ్గర భోజనం కోసం కూర్చుకుంటున్నారు. ఇదే వాస్తవం. ఇలాంటివి నేను చాలాసార్లు చూశాను’’అని ఆయన చెప్పారు. మేం మాట్లాడుతుండగా.. ఒక మహిళ వచ్చి, డోహెర్టీకి ఒక కవర్‌ను అందించారు. ఇంధన సంక్షోభంతో బాధపడుతున్న పేదలకు ఆమె విరాళం అందించారు.

చలికాలం

ఫొటో సోర్స్, Christopher Furlong/Getty Images

మానసిక ఆరోగ్యంపై కూడా..

ఇక్కడి చర్చల్లో అనారోగ్య సమస్యలు తరచుగా వినిపిస్తుంటాయని డోహెర్టీ చెప్పారు. ‘‘పిల్లలు ఆస్థమాతో బాధపడుతున్నట్లు వారి తల్లిదండ్రులు చెబుతుంటారు. గడ్డకట్టే ఉష్ణోగ్రతలో గడపడంతో తమ మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతోందని కొందరు చెబుతున్నారు’’అని ఆయన వివరించారు.

‘‘అసలు ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయో అర్థంచేసుకోవాలంటే దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మన శరీరం పనిచేసే తీరు దెబ్బతింటుంది’’అని బ్రిటన్‌లోని లివర్‌పూల్ యూనివర్సిటీలోని పబ్లిక్ హెల్త్ ఫ్రొఫెసర్ డేమ్ మార్గరెట్ వైట్‌హెడ్ చెప్పారు.

‘‘రక్తాన్ని ఉదాహరణగా తీసుకోండి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రక్తనాళాలు కొంచెం కుంచించుకుపోయినట్లు అయిపోతాయి. దీని వల్ల రక్తపోటు పెరుగుతుంది. మరోవైపు రక్తం కూడా కాస్త చిక్కబడినట్లు అనిపిస్తుంది. ఫిబ్రోనోజెన్‌గా పిలిచే ప్రోటీన్ స్థాయిలు పెరగడమే దీనికి కారణం. దీని వల్ల పక్షవాతం లేదా గుండెపోటు వచ్చే ముప్పు ఎక్కువ అవుతుంది’’అని మార్గరెట్ చెప్పారు.

క్యాన్సర్, అర్థిరైటిస్ ఇతర అనారోగ్యాలు ఉండేవారిపై చలి మరింత ఎక్కువ ప్రభావం చూపుతుందని మార్గరెట్ వివరించారు. అయితే, చలిని తట్టుకునేందుకు మనం తీసుకునే చర్యలు కూడా కొన్నిసార్లు సమస్యలకు కారణం కావొచ్చని ఆమె చెప్పారు.

‘‘మీరు అన్నిరకాల కోట్లు, గ్లవ్స్ వేసుకుంటే కదలడం కష్టం అవుతుంది. ముఖ్యంగా వృద్ధులకు అయితే, అదుపుతప్పి కిందపడి గాయాలపాలు కావడం లాంటి ముప్పులు మరింత ఎక్కువ అవుతాయి’’అని ఆమె చెప్పారు.

వీడియో క్యాప్షన్, అనాధల కోసం సకల సౌకర్యాలతో దిల్లీ ప్రభుత్వ వృద్ధాశ్రమాలు

పిల్లలకు మరింత ముప్పు...

మరోవైపు మీకా తరహాలో చాలా మందికి చలితో నొప్పులు పెరిగే అవకాశం ఉంటుంది. 2016లో చేపట్టిన ఒక అధ్యయనంలో ఐలర్స్ డాన్లోస్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఒక మహిళకు చలికాలంలో ఈ నొప్పులు మరింత ఎక్కువ అవుతున్నట్లు తేలింది.

‘‘చలి ఎక్కువగా ఉండే రోజుల్లో కేవలం ఇంట్లో కూర్చుంటే సమస్య తీరిపోతుందని అనుకుంటే పొరపాటే. ఏదైనా పుస్తకం చదువుతున్నా, లేదా ఫోన్ చూస్తున్నా.. నెమ్మదిగా కాళ్లు, చేతుల్లో నొప్పి మొదలవుతుంది. క్రమంగా ఇది మిగతా ప్రాంతాలకూ విస్తరిస్తుంది’’అని ఆమె చెప్పారు.

చలితోపాటు ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల గోడలపై తేమ, బూజులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా హీటింగ్ వ్యవస్థలు లేని ఇళ్లలో ఇవి కనిపిస్తుంటాయి. ఇవి ప్రజల ఊపిరితిత్తుల్లోకి చేరి ఆస్థమా లాంటి వ్యాధులను మరింత తీవ్రంచేసే అవకాశం ఉంటుంది.

దీర్ఘకాలంపాటు ఇలాంటి తేమ ఉండే ప్రాంతాల్లో గడిపితే, ఊపిరితిత్తుల పనితీరు మందగిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. ఇలాంటి ఇళ్లలో జీవించే చిన్నారులకు శ్వాసకోశ వ్యాధులు వచ్చే ముప్పు కూడా ఎక్కువగా ఉంటుంది.

‘‘చాలా చిన్న పిల్లలకు కూడా ఈ ముప్పు వెంటాడుతుంది’’అని లివర్‌పూల్‌లోని రెస్పిరేటరీ పీడియాట్రీషియన్ ఇయాన్ సిన్హా చెప్పారు. ‘‘కొంతమంది పిల్లలకు కృత్రిమ శ్వాస అవసరం అవుతుంది. కొందరు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆక్సిజన్ సిలెండర్లు వాడాల్సి ఉంటుంది’’అని ఆయన వివరించారు.

వీడియో క్యాప్షన్, వయసు 100 ఏళ్లకు చేరువవుతున్నా.. బావుల్లోకి దూకి ఈతకొడుతున్న బామ్మ

కొన్నిసార్లు ప్రాణాంతకంగా...

కొన్నిసార్లు చలితో వచ్చే దుష్ప్రభావాలు ప్రాణాంతకంగా ఉంటాయి. చలికాలంలో అదనంగా చోటుచేసుకునే 21.5 శాతం మరణాలకు ఇంట్లో విపరీతంగా ఉండే చలే కారణమని యూనివర్సిటీ కాలేజీ లండన్ (యూసీఎల్)కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఈక్విటీ 2011లో చేపట్టిన ఒక అధ్యయనం వెల్లడించింది.

2020-21లో ఇంగ్లండ్‌లో శీతాకాలంలో 63,000 మరణాలు అదనంగా నమోదయ్యాయి. వీటిలో 10 శాతానికి ఇంధన పేదరికమే కారణమని తాజా అధ్యయనం అంచనా వేసింది. దీన్ని చేపట్టిన వారిలో సిన్హా కూడా ఒకరు.

ఇంట్లో చలి విపరీతంగా ఉండటంతో మొత్తంగా ఆరోగ్యం దెబ్బతినడంతో ఈ మరణాలు సంభవించొచ్చని అధ్యయనకర్తలు అంచనా వేస్తున్నారు. మరోవైపు అమెరికాలో చేపట్టిన అధ్యయనంలో చలి పెరిగినప్పుడు డిమెన్షియాతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్లు వెల్లడైంది.

‘‘ఇంధన పేదరికం, అనారోగ్యానికి దగ్గర సంబంధమున్నట్లు మా అధ్యయనంలో తేలింది’’అని బ్రిటన్‌లోని బర్మింగ్హమ్ యూనివర్సిటీకి చెందిన గ్లోబల్ సోషల్ పాలసీ నిపుణుడు హారియెట్ థామ్సన్ వివరించారు. ‘‘ఇంధన సంక్షోభంతో కుంగుబాటు వచ్చే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా పేద దేశాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది’’అని ఆయన చెప్పారు. మరోవైపు చైనాలో చేపట్టిన అధ్యయనంలోనూ ఇంధన పేదరికంతో ప్రజల మానసిక ఆరోగ్యం ప్రభావితం అవుతుందని వివరించారు.

వీడియో క్యాప్షన్, ‘ముసలితనమే బెటర్.. యవ్వనమే కఠినం’

భావోద్వేగ సమస్యలు

కొన్నిసార్లు ఈ ఇంధన పేదరికంతో భావోద్వేగపరమైన సమస్యలు కూడా ఉంటాయి. ‘‘కొన్ని కుటుంబాల్లో కుక్కర్లు, టీవీలు, హీటింగ్ వ్యవస్థలు ఇలా అన్నీ ఆపేస్తుంటారు. ఒక్క ఫ్రిడ్జ్ మాత్రమే ఆన్‌లో ఉంటుంది’’అని డాడ్స్ హౌస్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు బిల్లీ మెక్‌గ్రానఘన్ వివరించారు. ఆయన లండన్‌లో రెండు ఫుడ్ బ్యాంకులను కూడా నడిపిస్తున్నారు.

‘‘దీని వల్ల చాలా కుటుంబాల్లో సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే ఇంధన ధరలు పెరగడంతో పిల్లలపై ఖర్చు పెట్టేందుకు డబ్బులు సరిపోవడం లేదు’’అని బిల్లీ చెప్పారు. ‘‘అసలు ఈ విషయంపై మాట్లాడేందుకు చాలా మంది సిగ్గుపడుతుంటారు. వారు మాట్లాడేటప్పుడు స్వరం, బాడీ లాంగ్వేజీలలో తేడా కనిపిస్తుంది’’అని ఆయన అన్నారు.

మళ్లీ బెల్‌ఫాస్ట్‌కు వద్దాం. నేను మళ్లీ డోహెర్టీని కలిశాను. స్థానిక చర్చి ఆయనకు లోన్ వచ్చేలా సాయం చేసింది. కొన్ని వారాల్లోనే ‘‘వార్మ్ కమ్యూనిటీ స్పేస్’’ను ఆయన సిద్ధం చేస్తున్నారు. స్థానికుల కోసం ప్రతి సోమవారం దీన్ని తెరవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా తమ ఇళ్లను వేడిగా ఉంచుకోలేని వారి కోసం దీన్ని సిద్ధం చేస్తున్నారు. దీని కోసం బన్స్, కేక్స్ ఇచ్చేందుకు స్థానిక సూపర్‌మార్కెట్ అంగీకరించింది. బ్రిటన్‌లోని చాలా ప్రాంతాల్లో ఈ ‘‘వార్మ్ బ్యాంక్’’లను ఏర్పాటు చేస్తున్నారు.

ఇలాంటి సదుపాయాల కల్పన నేడు అత్యవసరం. ఇళ్లలో గడ్డకుపోకుండా చూసేందుకు ఇవి చాలా మందికి సాయం చేస్తాయి.

దీర్ఘకాలం చలిలో గడిపితే తన ఆరోగ్యంపై పడే ప్రభావం గురించి మీకాకు అవగాహన ఉంది. ఒకవేళ గ్యాస్ ధరలు తక్కువగా ఉండుంటే పరిస్థితులు అదుపులో ఉండేవని ఆమె అన్నారు.

‘‘ఇదివరకు అన్నీ చక్కగా ఉండేవి. గంటలపాటు హీటింగ్ సిస్టమ్‌ ఆన్‌ చేసుకునేదాన్ని. కానీ, ఇప్పుడు అలా కాదు’’అని ఆమె వివరించారు.

ఇవి కూడా చదవండి:

సంబంధిత కథనాలు