చంద్రగ్రహణం ఈరోజు భారతదేశంలో ఎప్పుడు, ఎక్కడ కనిపిస్తుంది?

చంద్రగ్రహణం

ఫొటో సోర్స్, Getty Images

చంద్రగ్రహణం ఈరోజు మధ్యాహ్నం 2.39 గంటలకు ప్రారంభమవుతుంది. దీని పూర్తి దశ అంటే చంద్రుడు పూర్తిగా కనుమరుగయ్యే దశ మధ్యాహ్నం 3.46 గంటలకు మొదలవుతుంది.

భారతదేశంలో తదుపరి చంద్రగ్రహణం 2023 అక్టోబర్ 28న ఏర్పడుతుంది. అయితే ఇది పాక్షిక చంద్రగ్రహణం.

భారతదేశంలో సంపూర్ణ చంద్రగ్రహణం మళ్లీ మూడు సంవత్సరాల తరువాత 2025 మార్చిలో కనిపిస్తుంది.

నేటి చంద్రగ్రహణం దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, ఆసియా, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం ప్రాంతాలలో కనిపిస్తుంది.

బ్లడ్ మూన్

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, బ్లడ్ మూన్

ఎక్కడెక్కడ సంపూర్ణంగా కనిపిస్తుంది?

2022, నవంబర్ 8, మంగళవారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కేంద్ర భూవిజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ గ్రహణం చంద్రోదయం సమయం నుంచి భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది.

2022 సంవత్సరానికి ఇదే చివరి చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం కూడా బ్లడ్‌మూన్ అవుతుందని నాసా తెలిపింది. అంటే గ్రహణం సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు.

అయితే, భారతదేశంలో చంద్రోదయానికి ముందే గ్రహణం ప్రారంభమవుతుంది కాబట్టి పూర్తి చక్రాన్ని చూడడం కుదరకపోవచ్చని భూవిజ్ఞాన శాస్త్రాల శాఖ తెలిపింది. దేశంలోని తూర్పు ప్రాంతాలవారికి సంపూర్ణ గ్రహణం చివరి దశ కనిపించవచ్చని, మిగతా ప్రాంతాలవారికి గ్రహణం పాక్షిక దశలు కనిపించవచ్చని తెలిపింది.

"సంపూర్ణ చంద్రగ్రహణం పూర్తి దశ మధ్యాహ్నం 3.46 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.12 గంటలకు ముగుస్తుంది. సాయంత్రం 6.19 గంటలకు గ్రహణం పూర్తిగా విడుతుంది" అని భూవిజ్ఞాన శాస్త్రాల శాఖ వెల్లడించింది.

కోల్‌కతా, గౌహతి వంటి తూర్పు ప్రాంతాలలో చంద్రోదయం సమయానికి సంపూర్ణ గ్రహణం జరుగుతూ ఉంటుంది.

కోల్‌కతాలో చంద్రోదయ సమయానికి చంద్రుడు పూర్తిగా కనుమరుగైపోయిన దశ నడుస్తూ ఉంటుంది. అక్కడి నుంచి 20 నిమిషాలు ఆ దశ కనిపిస్తుంది. ఆ తరువాత పాక్షికంగా చంద్రుడు కనిపించే దశ 1 గంట 27 నిమిషాలు ఉంటుంది. సాయంత్రం 6.19 గంటలను గ్రహణం పూర్తిగా విడుతుంది.

గౌహతిలో చంద్రోదయ సమయానికి చంద్రుడు పూర్తిగా కనుమరుగైపోయిన దశ 38 నిమిషాలు కనిపిస్తుంది. ఆ తరువాత 1 గంట 45 నిమిషాల పాటు గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది.

దిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి ఇతర నగరాల్లో చంద్రోదయ సమయానికి పాక్షిక గ్రహణమే కనిపిస్తుంది. ఈ నగరాల్లో గ్రహణం పాక్షిక దశ వరుసగా 50 నిమిషాలు, 18 నిమిషాలు, 40 నిమిషాలు, 29 నిమిషాలు.

దీనికి ముందు, 2021 నవంబర్ 19న భారతదేశంలో పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడింది. ఇది 580 ఏళ్లలో ప్రపంచంలోనే అతి పొడవైన పాక్షిక చంద్రగ్రహణం అని చెబుతున్నారు.

ఈ ఏడాది మే 15-16 తేదీలలో కూడా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో చంద్రగ్రహణం ఏర్పడింది కానీ, భారతదేశంలో అది కనిపించలేదు.

ఒక సంవత్సరంలో గరిష్టంగా మూడు చంద్ర గ్రహణాలు ఉండవచ్చని నాసా పేర్కొంది. 21వ శతాబ్దంలో మొత్తం 228 చంద్రగ్రహణాలు ఉంటాయని నాసా అంచనా వేసింది.

వీడియో క్యాప్షన్, చంద్రగ్రహణం పేరులో తోడేలు ఎందుకు చేరింది?

చంద్రగ్రహణాన్ని ఎలా చూడవచ్చు?

చంద్రగ్రహణం సూర్యగ్రహణం కంటే చాలా విస్తృత స్థాయిలో కనిపిస్తుంది. రాత్రిపూట భూమిపై ఎక్కడైనా చూడవచ్చు.

సూర్యగ్రహణాన్ని చూసేందుకు ప్రత్యేక పరికరాలు అవసరం. కానీ, చంద్రగ్రహణం విషయంలో అలా కాదు. నేరుగా కంటితో చంద్రగ్రహణాన్ని చూడవచ్చు.

టెలిస్కోప్‌తో చూస్తే బాగా దగ్గరగా కనిపిస్తుంది.

నాసా సహా అనేక సంస్థలు ఈ చంద్రగ్రహణం లైవ్ స్ట్రీమ్, రికార్డ్ చేసిన వీడియోను ప్లే చేస్తాయి. మీ సౌలభ్యం బట్టి వాటిని చూడవచ్చు.

చంద్రగ్రహణం

ఫొటో సోర్స్, QAI PUBLISHING/GETTY IMAGES

గ్రహణం ఎలా ఏర్పడుతుంది?

గ్రహణం అనేది ఒక అద్భుత ఖగోళ దృశ్య విశేషం. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఔత్సాహికులు, శాస్త్రవేత్తలు ఈ ఖగోళ అద్భుతాన్ని స్వయంగా చూసేందుకు ఉవ్విళ్లూరతారు. ఇక గ్రహణ సమయాల్లో పరిశోధనలు చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తారు.

''సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో సూర్యుడు, చంద్రుడు రెండూ భూమికి ఎదురుగా ఉంటాయి. భూమి నీడ చంద్రుడి మీద పడుతున్నప్పటికీ, కొంత వెలుతురు చంద్రుడిని చేరుతూనే ఉంటుంది. భూ వాతావరణం మీదుగా ఈ వెలుతురు వెళుతున్నప్పుడు నీలం రంగు ఫిల్టర్ అవుతుంది'' అని నాసా వెల్లడించింది.

చంద్రుడు భూమి నీడ గుండా ప్రయాణించినప్పుడు చీకటిలోకి వెళ్లిపోతాడు. పూర్తిస్థాయిలో చీకటిలోకి వెళ్లినప్పుడు దాన్ని సంపూర్ణ చంద్రగ్రహణం అంటారు.

భూమి వ్యాసం చంద్రుడికన్నా 4 రెట్లు అధికంగా ఉంటుంది. అందువల్ల దాని నీడ చంద్రుడి మీద చాలా సేపు ఉండేందుకు అవకాశం ఉంటుంది. దీంతో సంపూర్ణ చంద్రగ్రహణం దాదాపు 104 నిమిషాల వరకు సాగే అవకాశం ఉంటుంది.

పాక్షిక చంద్రగ్రహణం అంటే ఏంటి?

భూమి నీడలోకి చంద్రుడిలోని కొంత భాగం మాత్రమే వచ్చినప్పుడు ఏర్పడేది పాక్షిక చంద్రగ్రహణం. అంటే చంద్రుడి మీద భూమి నీడ కొంత ప్రాంతం మాత్రమే పడగా, మిగిలిన భాగంలో సూర్యకాంతి కొనసాగుతుంటుంది. భూమి నీడ, సూర్యుడు వెలుతురు ఒకేసారి పడుతున్న కారణంగా దాని ప్రభావంతో చంద్రుడు నలుపు, ముదురు గోదుమ రంగుల్లో కనిపిస్తాడు.

నాసా చెప్పిన దాని ప్రకారం, సంపూర్ణ చంద్ర గ్రహణాలు అరుదుగా మాత్రమే వస్తాయి. పాక్షిక చంద్రగ్రహణాలు ఏడాదిలో కనీసం రెండుసార్లు వస్తాయి.

2010 లో చిత్రించిన చంద్రగ్రహణంలోని వివిధ దశలు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, 2010 లో చిత్రించిన చంద్రగ్రహణంలోని వివిధ దశలు

సంపూర్ణ చంద్రగ్రహణం పౌర్ణమి నాడు మాత్రమే ఎందుకు వస్తుంది? ప్రతి పౌర్ణమికి ఎందుకు ఏర్పడదు?

సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఆయా టైమ్ జోన్‌లను బట్టి చంద్రుడు గ్రహణం సమయంలో ఎర్రగా, ముదురు నారింజ రంగులో కనిపిస్తాడు. అందుకే దీనిని ఇంగ్లీషులో బ్లడ్ మూన్ అని పిలుస్తారు. అయితే, ఇది శాస్త్రీయంగా ఉపయోగించే పేరు కాదు.

భూమి నీడ రెండు రకాలుగా ఉంటుంది. భూమి తేలికపాటి నీడను పెనంబ్రా అంటారు. భూమి పూర్తి చీకటి నీడను అంబ్రా అంటారు.

భూమి నీడ(Umbra)లోకి చంద్రుడు ప్రవేశించినప్పుడు చంద్రుడి మీద సూర్యకాంతి కారణంగా ఏర్పడే పరావర్తనం ఆగిపోతుంది. అయితే, ఆ సమయంలో సూర్యుడి కాంతి వెలుతురు రూపంలో పరోక్షంగా చంద్రుడి మీద పడుతుంటుంది. ఇది భూ వాతావరణం ద్వారా చంద్రుడిని చేరుతుంది.

ఆ సమయంలో సూర్యుడి కాంతిలో ఎరుపు రంగు తరంగ దైర్ఘ్యాల కన్నా నీలి రంగు తరంగ దైర్ఘ్యాలు ఎక్కువ విక్షేపణం చెందుతాయి. దీంతో కేవలం ఎరుపు రంగు కాంతి మాత్రమే చంద్రుడిని చేరుతుంది. అందుకే ఆ సమయంలో చంద్రుడు ఎర్రగా నారింజ రంగులో ప్రతిబింబిస్తాడు.

చంద్రగ్రహణం పౌర్ణమి నాడు మాత్రమే ఏర్పడుతుంది. సూర్య గ్రహణం అమావాస్య నాడు మాత్రమే ఏర్పడుతుంది. అయితే ప్రతి పౌర్ణమికి, అమావాస్యకు గ్రహణాలు ఏర్పడవు. ఎందుకంటే భూమి సూర్యుడు చుట్టూ తిరిగే కక్ష్యా మార్గానికి, చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష్యా మార్గం 5 డిగ్రీల వంపుతో ఉంటుంది.

వీడియో క్యాప్షన్, గ్రహణం ఏర్పడి విడిపోయే వరకూ అన్నం వండకూడదా? భోజనం చేయకూడదా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)