తాలిబాన్ల ఏడాది పాలన: ‘భయంలోనే బతుకుతున్నాం.. మహిళల అవకాశాలను లాగేసుకుంటున్నారు’

వీడియో క్యాప్షన్, మహిళలకు ఇప్పటికీ అందని విద్య, ఉద్యోగ అవకాశాలు

అఫ్గానిస్తాన్‌లో తిరిగి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా తాలిబాన్లు దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించారు.

ఏడాది పాలన పూర్తైన సందర్భంగా వందల మంది తాలిబాన్లు, వారి మద్దతుదారులు కాబూల్ వీధుల్లోకి వచ్చారు.

వారి చేతుల్లోని నల్లజండాలను ఊపుతూ విజయ నినాదాలు చేశారు. ఇందులో కేవలం పురుషులు, అబ్బాయిలు మాత్రమే ఉన్నారు. మహిళలు ఎవరూ లేరు.

ఏడాది సంబరాల్లో పాల్గొనేందుకు వీలుగా.. తాలిబాన్ల మద్దతుదారులు నగరంలోని దుకాణాలను కూడా మూసివేయించారు.

తీవ్రమౌతున్న ఆర్థిక, మానవ సంక్షోభంతో.. కుటుంబ పోషణకోసం చాలామంది పురుషులకు పనికూడా దొరకని పరిస్థితుల్లో జరుపుకున్న వార్షికోత్సవమిది.

మహిళలు, ఆడపిల్లల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కఠినమైన నిబంధలనలకు తోడు విద్య, ఉద్యోగాలకు అడుగడుగునా అడ్డంకులే.

గతేడాది ఆగస్టులో కాబూల్‌ను సందర్శించిన బీబీసీ ప్రతినిధి లీస్ డూసెట్.. ఏడాది తర్వాత పరిస్థితులపై స్పెషల్ రిపోర్ట్ అందించేందుకు తిరిగి కాబూల్ చేరుకున్నారు.

ఇది పురుషుల ప్రపంచం.

అఫ్గానిస్తాన్ సంప్రదాయ విశ్వాసాలను అనుసరించే దేశం.

అయితే ఇప్పుడు నిబంధనలన్నీ మత విశ్వాసాలను బలంగా నమ్మే తాలిబాన్లు నిర్ణయిస్తున్నారు.

మహిళల కోసం తెరుచుకున్న చిన్నచిన్న అవకాశాలు కూడా ఇప్పుడు మూసుకుపోయాయి.

మేం మూడు తరాలకు చెందిన మహిళలను కలిశాం. వారి జీవితాలు వారి ప్రపంచానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

చాలామంది భయపడుతున్నారు. వారి గుర్తింపు బహిర్గం చేసేందుకు అంగీకరించలేదు.

ఒక మహిళ ఆర్థిక మంత్రిత్వ శాఖలో సీనియర్ అధికారిగా పనిచేసేవారు.

గతేడాది, ఆమె ఉద్యోగానికి రావాల్సిన పనిలేదని, ఆ ఉద్యోగాన్ని మరో వ్యక్తి చేస్తాడని తాలిబన్లు చెప్పారు.

అలాంటి 60మందికి పైగా ప్రభుత్వోద్యోగులు బృందంగా ఏర్పడ్డారు.

వారు తమ జీవితంలో వచ్చిన మార్పులను మెసేజింగ్ గ్రూప్‌లో షేర్ చేసుకుంటున్నారు.

వీధుల్లో మహిళలు అక్కడక్కడా కనిపిస్తున్నారు. ఆరోగ్యం, విద్య, రక్షణ శాఖ వంటి మంత్రిత్వ శాఖల్లో సైతం కొందరు మహిళలు పనిచేస్తున్నారు.

కొన్ని చోట్ల కేవలం మహిళలే పనిచేసే పరిస్థితి కూడా ఉంది.

హెరాత్‌లోని మార్కెట్‌ను ఇప్పుడే తెరిచారు.

ఇది మొదటి రోజు.. మహిళల్లో కొంత ఆందోళన... షాపులు ఇంకా ఖాళీగానే ఉన్నాయి.

18ఏళ్ళ సొహెయిలా ఉత్కంఠతో కనిపిస్తున్నారు. తన పెద్దక్కతో కలిసి వస్త్ర దుకాణాన్ని తిరిగి తెరుస్తున్నారు. మామూలుగా అయితే తన స్కూల్ చదువు చివరి ఏడాది పూర్తిచేయాల్సిన సమయమిది.

సొహెయిలా తన క్లాస్‌లో అందరికంటే బాగా చదివేది. కానీ తాలిబాన్లు దాదాపు హై స్కూళ్లన్నీ మూసివేశారు.

సెంట్రల్ హైల్యాండ్స్‌లో దూరంగా ఉన్న ఇక్కడ కూడా అదే దారుణ పరిస్థితి.

అఫ్గానిస్తాన్ పేద రాష్ట్రాల్లో ఇదొకటి. తాలిబాన్లు అధికారం చేపట్టాక పేదరికం మరింత పెరిగింది. ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సాయం అందడం లేదు.

నిరాశ్రయులైన ఈ ప్రజలకు మరోదారిలేక పోగా మరింత వేదనలోకి నెట్టేసే పరిస్థితి ఇది.

ఈ మహిళ 95 వేల రూపాయలకు తన కూతురుని పెళ్ళిచేసుకోమని అప్పగిస్తోంది.

ఆ అమ్మాయికి నిండా ఆరేళ్ళుండవు. పెళ్ళికొడుకు వయసుకూడా ఇంచుమించుగా అంతే.

అఫ్గానిస్తాన్‌లో బాల్య వివాహాలపై నిషేధం ఉంది. కానీ అవి జరుగుతూనే ఉంటాయి. అయితే ఇంత చిన్న వయసులో మాత్రం కాదు. మేం ఆ తల్లి , కూతురు, కొడుకుల వివరాలను రహస్యంగా ఉంచాం.

అఫ్గానిస్తాన్‌లో ఒక కొత్త తరం రూపుదిద్దుకుంటోంది. ఇస్లాం పరిధిలో అబ్బాయిలు-అమ్మాయిల హక్కులు గౌరవిస్తామని తాలిబాన్లు చెబుతున్నారు. కానీ ఏడాది తర్వాత చూస్తే గతంలో ముందడుగేసిన ఆడపిల్లలు.. ఇకపై మరింత వెనకబడిపోతారనే భయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)