పెళ్లి కావడం లేదనే బాధతో మగవాళ్ళే ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారు, ఎందుకిలా? - NCRB రిపోర్ట్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, హరికృష్ణ పులుగు
- హోదా, బీబీసీ ప్రతినిధి
హైదరాబాద్‌కు చెందిన శ్రీకాంత్ వయసు 39 ఏళ్ళు. కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చిన వృత్తిలో ఉన్నారు. సంపాదన ఫర్వాలేదు. ఒంటరిగా ఉంటున్న శ్రీకాంత్ ఇటీవలే తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన అశోక్‌ది కూడా ఇదే కథ. 30 ఏళ్ళ అశోక్ వారసత్వంగా వచ్చిన పని చేస్తున్నారు. ఆయన కూడా ఓ రోజు ఉరి వేసుకున్నారు.
మదనపల్లెకు చెందిన గంగిరెడ్డి వయసు 35 సంవత్సరాలు. వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన పురుగుల మందు తాగి చనిపోయాడు.
పైన చెప్పిన ముగ్గురు వ్యక్తుల ఆత్మహత్యలకు కుటుంబ సభ్యులు, బంధువులు చెప్పిన ప్రధాన కారణం...పెళ్లి కాలేదనే మనోవ్యథ.
ఆత్మహత్య దాకా వెళ్లకపోయినా మన బంధువుల్లోనో, మిత్రుల్లోనో, మన చుట్టూ ఉన్న సమాజంలోనో ఇలాంటి వ్యక్తులు, ఉదంతాలు అనేకం మనకు తారసపడుతుంటాయి.
సంప్రదాయంగా వస్తున్న వృత్తులను అనుసరిస్తున్నవారే కాదు, వివిధ ఆదాయ మార్గాలు, భిన్న సామాజిక వర్గాలకు చెందిన అనేకమంది మగవాళ్లు పెళ్లి కాలేదని మనస్తాపం చెందడం, లేదంటే బలవన్మరణాలకు పాల్పడటం ఈ మధ్య కాలంలో పెరుగుతున్న ధోరణి.
హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. ఆయన వయసు కేవలం 26 సంవత్సరాలు.
ఇటీవలి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాలు, పెళ్లి కావడం లేదన్న మనోవ్యథతో ప్రాణాలు తీసుకుంటున్న మగవారి సంఖ్య పెరుగుతున్న విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా ఆత్మహత్యల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది.
‘‘ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుండడం అన్నది వాస్తవం. దురదష్టవశాత్తూ దీనిని ఒక పిరికి చర్యగా చర్చించడం చూస్తున్నాం. అటువంటి ఆలోచనలు అసంకల్పితంగా వస్తాయి. తట్టుకోలేని సంఘటన ఉండవలసిన అవసరం లేదు. విచక్షణరహితంగా లేదా నిరాశగానో ఉన్న స్థితి ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది’’ అని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.ఎన్. రాజు అన్నారు.

ఫొటో సోర్స్, https://ncrb.gov.in/
అబ్బాయిల పెళ్లి సమస్య
2021లో దేశవ్యాప్తంగా కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి శాతం మొత్తం ఆత్మహత్యల్లో 56.6 శాతం ఉన్నట్లు ఎన్సీఆర్బీ రికార్డులలో తేలింది. ఇందులో వివాహంతో ముడిపడి ఉన్న ఆత్మహత్యలు 4.8శాతం ఉన్నాయి.
2021లో దేశవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న స్త్రీ, పురుష నిష్పత్తి ( ఇందులో అన్ని వయోవర్గాలు, పెళ్లయినవారు, కాని వారు కలిపి) 27.5 : 72.5 గా ఉంది.
ఆత్మహత్యలకు కారణమవుతున్న కుటుంబ సమస్యల్లో ప్రధానంగా కనిపించేది వివాహం. వైవాహిక సంబంధ సమస్యలతో పురుషులు ప్రాణాలు తీసుకుంటున్న ధోరణి పెరుగుతోంది.
మహిళలు మానసికంగా సున్నితంగా, బలహీనంగా ఉంటారన్నది సమాజంలో వినిపించే అభిప్రాయం. అయితే, ఇటీవల కాలంలో మానసిక వేదనతో మగవాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయని క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదికలు చెబుతున్నాయి.
ముఖ్యంగా వివాహం కావడం లేదన్న బెంగతో మనోవేదనకు గురై మగవాళ్లు బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు
2020లో పెళ్లి కాలేదని ఆత్మహత్య చేసుకున్న మగవారి సంఖ్య 1348గా ఉంటే, అదే 2021 వచ్చేసరికి ఆ కారణంతో ప్రాణాలు తీసుకునే మగవాళ్ల సంఖ్య 1616కు పెరిగింది.
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే, పై కారణంతో బలవన్మరణాలకు పాల్పడుతున్న మహిళల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే పెరిగినప్పటికీ ( 2020లో 847 మంది ఆత్మహత్యకు పాల్పడగా, 2021లో 1031 మంది ప్రాణాలు తీసుకున్నారు) మగవాళ్ల కన్నా ఈ సంఖ్య తక్కువ.
ఈ ధోరణిని అనేక కోణాల్లో చూడాల్సి ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇన్వెస్టిగేషన్స్ ఎడిటర్ ఉడుముల సుధాకర్ రెడ్డి బీబీసీతో అన్నారు.
‘‘మహిళలల్లో సాధికారత పెరిగింది. వాళ్లలో ఎంపిక చేసుకునే శక్తి పెరిగింది. ఇంతకు ముందులాగా తల్లిదండ్రులు చూపించిన సంబంధాలనే అంగీకరించాల్సిన పరిస్థితిలో లేరు. అన్ని విధాల తమకు నచ్చిన వారిని, తగిన వారిని అమ్మాయిలు ఎంచుకుంటున్నారు. ఇది మగవాళ్లలో స్ట్రెస్‌కు కారణమైంది’’ అని ఆయన విశ్లేషించారు.
మగవాళ్లలో ఆత్మహత్యలు పెరిగినట్లు రికార్డులలో కనిపిస్తున్నప్పటికీ, ఆడవాళ్లలో ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
కోవిడ్ కారణంగా స్ట్రెస్ సమస్యలు ఎక్కువై ఆత్మహత్యల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తోందని, అయితే, ఈ ప్రభావం స్త్రీ పురుషులిద్దరిపైనా ఉందని సుధాకర్ రెడ్డి అన్నారు.
2021 సంవత్సరంలో పెళ్లి కాలేదన్న బాధతో దేశవ్యాప్తంగా( రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి ) ఆత్మహత్య చేసుకున్న వారిలో మగవారు 1616 మంది కాగా, ఆడవారు 1031 మంది. అదే 2020లో 1348 మంది పురుషులు, 847 మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంటే మగవాళ్ల సంఖ్య 268 మంది పెరగగా, ఆడవాళ్లు 184 మంది పెరిగారు.

ఫొటో సోర్స్, https://ncrb.gov.in/
తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువే
2021: పెళ్లి సెటిల్ కాలేదన్న మనోవేదనలో తెలంగాణ రాష్ట్రంలో 71మంది మగవాళ్లు, 23 మంది ఆడవాళ్లు ప్రాణాలు తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో 8 మంది సూసైడ్ చేసుకుంటే, అందులో ఒక్కరు కూడా ఆడవాళ్లు లేరని ఎన్సీఆర్బీ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 18 మంది మగవారు, 9 మంది ఆడవాళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. విజయవాడలాంటి పెద్ద సిటీలో ఈ తరహా ఆత్మహత్య ఒక్కటి కూడా జరగకపోగా, విశాఖపట్నంలో నలుగురు సూసైడ్ చేసుకుంటే అందులో అందరూ మగవారే.
పెళ్లి కాలేదని ఏ వయసు వారు ఎక్కువగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు?
పెళ్లి కాలేదన్న బాధతో 2021లో దేశవ్యాప్తంగా చనిపోయిన వారిలో 18 నుంచి 30 ఏళ్లలోపు వారు ఎక్కువగా ఉన్నారు.
ఈ వయసు వారిలో 867 మంది పురుషులు, 644మంది మహిళలున్నారు. మొత్తంగా ఈ ఏజ్ గ్రూప్ నుంచి 1511 మంది ప్రాణాలు తీసుకున్నారు.
30 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు ఆత్మహత్యల మృతుల్లో 640 మంది అబ్బాయిలు, 314 మంది అమ్మాయిలు ఉండగా, మొత్తం 954 మంది పెళ్లి కాలేదన్న కుంగుబాటుతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
18 ఏళ్లలోపు వయసున్న వారిలో 14 మంది పురుషులు, 42 మంది మహిళలు మొత్తంగా 56 మంది పెళ్లి కుదరడం లేదన్న వేదనతో ప్రాణం తీసుకున్నట్లు తేలింది.
2020: తెలంగాణలో పెళ్లి కాక ఆత్మహత్య చేసుకున్న పురుషులు 19 మంది ఉండగా స్త్రీలు ఏడుగురు ఉన్నారు.
మొత్తంగా పెళ్లి కాలేదన్న బాధతో చనిపోయిన వారు 26 మంది అని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఆ సంవత్సరం హైదరాబాద్‌లో పెళ్లి కుదరడం లేదని ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు తమ ప్రాణాలను బలి తీసుకున్నారు. మొత్తంగా ముగ్గురు ఈ కారణంతో చనిపోయారు.
అలాగే ఏపీలో పెళ్లి సెటిల్ కావడం లేదని చనిపోయిన పురుషులు 49 మంది, మహిళలు 27 మంది ఉన్నారు. ఆ సంవత్సరం మొత్తంగా ఏపీలో 76 మంది పెళ్లి కాక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు.
విశాఖపట్నంలో ఒక అబ్బాయి, ముగ్గురు అమ్మాయిలు మొత్తంగా నలుగురు పెళ్లి కావడం లేదనే కారణంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.
దేశవ్యాప్తంగా 2020లో పెళ్లి కాక చనిపోయిన వారిలో ఎక్కువగా 18 నుంచి 30 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారున్నారు.
ఈ వయసు వారిలో 716 మంది పురుషులు, 544 మంది మహిళలు.. మొత్తంగా 1260 మంది ప్రాణాలు తీసుకున్నారు.
30 నుంచి 45 ఏళ్లలోపు వారిలో 554 మంది మగవాళ్లు, 252 మంది ఆడవాళ్లు మహిళలు.. మొత్తంగా 806 మంది పెళ్లి కాక కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
18 ఏళ్లలోపు వయసు వారిలో 23 మంది అబ్బాయిలు, 44 మంది అమ్మాయిలు ఉన్నారు. మొత్తంగా 67 మంది పెళ్లి కుదరడం లేదన్న బాధతో చనిపోయినట్టు వెల్లడైంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇతర కారణాలతో ఆత్మహత్యలు...ఎవరు ఎంతమంది?
2021లో తెలుగు నగరాలలో జరిగిన ఆత్మహత్యలు హైదరాబాద్‌లో 571 ( మగవారు 458, ఆడవారు 113), విజయవాడలో 385 ( మగవారు 304, ఆడవారు 81), విశాఖపట్నంలో 378 (మగవారు 288, ఆడవారు 90) మంది ఉన్నారు.
పెరుగుతున్న ఆత్మహత్యల ధోరణి
దేశవ్యాప్తంగా కూడా ఆత్మహత్యలు పెరుగుతున్నట్లు గత రికార్డులను పరిశీలించినప్పుడు తేలుతోంది.
2020లో 1,53,052 ఆత్మహత్య చేసుకోగా, అదే 2021లో ఆ సంఖ్య 1,64,033కు చేరింది.
2020లో 11.3 శాతంగా ఉన్న ఆత్మహత్యల రేటు( ప్రతి వెయ్యిమందిలో ఆత్మహత్య చేసుకుంటున్న వారి రేటు), 2021నాటికి 12 శాతానికి పెరిగింది.
ముఖ్యంగా నగరాలలో ఆత్మహత్యలు పెరుగుతున్నట్లు జాతీయ గణాంకాలు చెబుతున్నాయి.
దేశంలో పెద్ద పెద్ద నగరాలలో సరాసరి ఆత్మహత్యల రేటు 16.1 శాతంగా ఉండగా, దేశవ్యాప్త ఆత్మహత్యల సరాసరి రేటు 12 శాతంలోపే ఉంది.
2020తో పోలిస్తే 2021లో దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అత్యధిక ఆత్మహత్యలు చోటు చేసుకున్న రాష్ట్రాలలో తెలంగాణ మొదటి స్థానం (26.2 శాతం) లో ఉండగా, ఉత్తరప్రదేశ్ (23.5శాతంతో) రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఈ గణాంకాలలో నాలుగో స్థానంలో నిలిచింది.
2021లో దేశవ్యాప్తంగా ఆత్మహత్య మరణాల రేటు 12 శాతంగా నమోదు కాగా, ఇందులో అత్యధిక మరణాల రేటు నమోదైన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో అండమాన్ అండ్ నికోబార్ 39.7 శాతంతో అగ్రస్థానంలో ఉంది. సిక్కిం (39.2)కు రెండో స్థానం, పుదుచ్చేరి (31.8)కి మూడో స్థానం, తెలంగాణ (26.9 శాతంతో) నాలుగో స్థానంలో నిలిచాయి.
‘‘ఆత్మహత్యలను ఒక మానసిక దౌర్బల్యంగా కాకుండా, నిస్సహాయ స్థితిగా చూడవలసిన బాధ్యత సమాజంపై ఉన్నది. అటువంటి వారికి సహాయం అందే దిశగా సమాయత్తం చేయడం అవసరం. అవగాహనని పెంచడం, అవసరమైన మానసిక నిపుణుల సేవలపై దృష్టి సారించడం ప్రభుత్వపరంగా చేపట్టాలి’’ అని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.ఎన్. రాజు సూచించారు.
ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000
ఇవి కూడా చదవండి:
- తమ దేశంలో శాశ్వతంగా నివాసం ఉండేందుకు 15 లక్షల మందిని కెనడా ఎందుకు ఆహ్వానిస్తోంది
- ప్రపంచంలోనే బెస్ట్ క్లీనర్: 'ఇంట్లోని చెత్త నన్ను బర్గర్లా ఊరిస్తుంది'
- ఫేస్‌బుక్, ట్విటర్ల కథ ముగిసిపోతుందా?
- తెలంగాణ - గద్వాల: ప్రసవం మధ్యలో డాక్టర్ వెళ్ళిపోయారని ఆరోపణలు, పురిటిలోనే బిడ్డ మృతికి కారకులెవరు?
- ఆంధ్రప్రదేశ్: రెడ్లు, కాపుల మధ్య ఆధిపత్య పోరులో ఇప్పటం నలిగి పోతోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















