డ్రగ్స్ స్మగ్లింగ్‌లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ - డీఆర్ఐ రిపోర్ట్

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఆలమూరు సౌమ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక స్థాయిలో మాదకద్రవ్యాలు పట్టుబడినట్టు 'స్మగ్లింగ్ ఇన్ ఇండియా 2021-22' నివేదిక తెలిపింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఈ నివేదికను సోమవారం విడుదల చేసింది.
2021-22లో మొత్తం 28,334.32 కేజీల మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకోగా, అందులో 18,267.84 కేజీలు ఆంధ్రప్రదేశ్‌లోనే దొరికినట్టు డీఆర్ఐ నివేదిక తెలిపింది.
మాదకద్రవ్యాల కేసుల్లో ఏపీ నుంచి 90 మందిని అరెస్ట్ చేసినట్టు నివేదిక పేర్కొంది.
ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరికింది ఏపీలోనే. తరువాతి స్థానాల్లో త్రిపుర (10104.99 కేజీలు), అస్సాం (3633.08 కేజీలు), తెలంగాణ (1012.04 కేజీలు) ఉన్నాయి.
మాదకద్రవ్యాల కేసుల్లో అత్యధికంగా అస్సాం నుంచి 500 మందిని అరెస్ట్ చేశారని, త్రిపుర నుంచి 27 మందిని, తెలంగాణ నుంచి అయిదుగురిని అరెస్ట్ చేశారని నివేదిక పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
గంజాయి స్మగ్లింగ్
2021-22లో అత్యధికంగా మధ్యప్రదేశ్ నుంచి 5,846 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోగా, ఆంధ్రప్రదేశ్ నుంచి 1,057 కేజీలను స్వాధీనం చేసుకున్నట్టు స్మగ్లింగ్ ఇన్ ఇండియా 2021-22 నివేదిక తెలిపింది. ఈ గణాంకాల ప్రకారం గంజాయి స్మగ్లింగ్‌లో ఏపీ ఎనిమిదవ స్థానంలో ఉంది.
అయితే, ఈ ఏడాది జూలైలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ), విడుదల చేసిన గణాంకాల ప్రకరం కోవిడ్ మహమ్మారి సమయంలో ఏపీలో గంజాయి స్మగ్లింగ్ విపరీతంగా పెరిగింది.
2019లో ఎన్‌సీబీ ఆంధ్రప్రదేశ్ నుంచి 1,764.20 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోగా, 2021లో 7,490.30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుంది. అంటే, రెండేళ్లల్లో నాలుగు రెట్లు పైనే పెరిగింది.
ఏపీలో గిరిజన, అదివాసీ ప్రాంతాలలో గంజాయి సాగు, వ్యాపారాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న సంగతి తెలిసిందే.
ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో 10 వేల ఎకరాలకు పైనే గంజాయి సాగవుతోందని కిందటి ఏడాది బీబీసీ పరిశోధనలో తేలింది. అనధికారికంగా గంజాయి సాగు 15 వేల ఎకరాలకు పైనే ఉండవచ్చని అంచనా.
అక్కడ దాదాపు ప్రతి గ్రామంలోనూ గంజాయి తోటలుంటాయి. ఏ చిన్న ఖాళీ స్థలం దొరికినా అందులో గంజాయి మొక్కలు పెంచుతున్నారు. చివరకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను సైతం వదలడం లేదు. చింతపల్లి మండలం బలపం పంచాయతీలో నిర్మాణంలో ఉన్న కోరుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా కొందరు గంజాయి మొక్కలు పెంచుతున్నారు. వరి, పసుపు, అసరాల పంటలతో పాటు గంజాయిని కూడా సాగు చేస్తామని గిరిజనులు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
హెరాయిన్, కొకైన్ స్మగ్లింగ్
కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ విమాన ప్రయణాలపై ఆంక్షలు సడలించారు. దాంతో, భారతదేశానికి వచ్చే ప్రయాణికుల సంఖ్య పెరిగిందని, 2021-22 చివరి రెండు నెలలలో డీఆర్ఐ పలు హెరాయిన్ స్మగ్లింగ్ కేసులను పట్టుకుందని ఈ నివేదికలో తెలిపారు.
2021-22లో కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో 16 కేజీలు, హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 3.2 కేజీలు, అహ్మదాబాద్‌లో మూడు సార్లు 4.4 కేజీలు, 5.9 కేజీలు, 8.4 కేజీల హెరాయిన్‌ను, దిల్లీ, చెన్నైలలో కూడా పలుమార్లు హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు డీఆర్ఐ వెల్లడించింది.
అలాగే, 2020-21తో పోలిస్తే 2021-22కు కొకైన్ స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిందని, 2021-22లో డీఆర్ఐ 310 కేజీల కొకైన్ స్వాధీనం చేసుకుందని నివేదిక తెలిపింది.
మరోవైపు, అరేబియా సముద్ర ప్రాంతాలలో కార్గో షిప్పుల ద్వారా దేశంలోకి హెరాయిన్ అక్రమ రవాణా 2021-22లో కూడా కొనసాగిందని డీఆర్ఐ పేర్కొంది. ముఖ్యంగా అఫ్గానిస్తాన్ నుంచి ఇరాన్, యూఏఈ ద్వారా దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్న హెరాయిన్‌ను పెద్ద మొత్తాల్లో స్వాధీనం చేసుకున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.

ఎర్రచందనం స్మగ్లింగ్
ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం దక్షిణ భారతదేశంలో దక్షిణ తూర్పు కనుమలలో దొరుకుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ ప్రాంతంలోని కొండల్లో మాత్రమే దొరుకుతుంది. ఈ కొండలు దాదాపు 5.5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి.
చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలో విస్తరించిన శేషాచలం, వెలుగొండ, పాలకొండ, లక్కమల, నల్లమల అడవులు తూర్పు కనుమల్లో ఉన్నాయి. వీటిలో ఎక్కువగా శేషాచలం, వెలుగొండల్లో మాత్రమే ఎర్రచందనం అధికంగా పెరుగుతుంది.
దేశీయంగా ఎర్రచందనానికి ఎక్కువ డిమాండ్ లేకపోయినప్పాటికీ, ఎర్రచందనం కలపకు తూర్పు ఆసియాలో చాలా ఎక్కువ డిమాండ్ ఉందని డీఆర్ఐ పేర్కొంది. చైనా, జపాన్, హాంగ్‌కాంగ్, సింగపూర్, మియన్మార్ లాంటి దేశాల్లో దీనిని అత్యంత విలువైనదిగా భావిస్తారు. అధిక ధరల వద్ద దీన్ని కొనుగోలు చేస్తారు. అందువల్లే, దేశం నుంచి ఎర్రచందనాన్ని ఎగుమతి చేయడం కోసం విచక్షణారహితంగా చెట్లను నరికివేస్తున్నారని, అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని డీఆర్ఐ పేర్కొంది.
2021-22లో రూ. 97.05 కోట్ల విలువైన 161.83 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని డీఆర్ఐ స్వాధీనం చేసుకున్నట్టు స్మగ్లింగ్ ఇన్ ఇండియా 2021-22 నివేదికలో పేర్కొన్నారు. 2019-20లో డీఆర్ఐ 174.5 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని తైవాన్, మలేషియా, చైనా వంటి దేశాలకు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్టు డీఆర్ఐ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం ప్రత్యేకంగా దొరికే ప్రాంతాల నుంచి దేశంలోని ప్రధాన ఓడరేవుల ద్వారా విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేయడానికి వ్యవస్థీకృత సిండికేట్లు ఉంటాయని డీఆర్ఐ పేర్కొంది.
ముఖ్యంగా ముంబైలోని నావసేవ, గుజరాత్‌లోని ముంద్ర పోర్ట్, చెన్నై పోర్ట్‌ల ద్వారా విదేశాలకు అక్రమంగా తరలిస్తున్నారని డీఆర్ఐ తెలిపింది.
కొన్నిసార్లు సెజ్‌ల నుంచి కూడా వెళ్తోంది. తనిఖీలను తప్పించుకోవడానికి ముందుగా కంటైనర్లను దుబాయ్, మలేషియా, సౌత్ కొరియా లాంటి దేశాలకు తరలించి, అక్కడి నుంచి వాటి గమ్యస్థానాలకు చేరుస్తారని తెలిపింది.
ఈమధ్య ఎయిర్-కార్గో రూట్ ద్వారా చిన్న మొత్తాలలో ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారని డీఆర్ఐ వెల్లడించింది. ఎర్రచందనం దుంగలను దేశం నుంచి వివిధ ఉత్పత్తుల రూపంలో స్మగ్లింగ్ చేస్తారని, ముఖ్యంగా ఇనుము, ఇత్తడి బిల్డర్ హార్డ్‌వేర్, ప్రెజర్ కుక్కర్లు, గృహోపకరణాలు, దుస్తులు, గ్రానైట్ స్లాబ్‌లు, ట్రాక్టర్ విడి భాగాలు, కాస్ట్ ఐరన్ పైపుల ద్వారా అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకున్నట్టు డీఆర్ఐ వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
బంగారం
బంగారం వినియోగంలో చైనా తరువాత స్థానం భారతదేశానిదే. బంగారం దిగుమతులు 2020 నుంచి 2021కి 33.34 శాతం పెరిగాయని, రత్నాలు, ఆభరణాల ఎగుమతులు 50 శాతం పెరిగాయని డీఆర్ఐ తెలిపింది.
దీనితో పాటే, బంగారం అక్రమ రవాణా కూడా అమాంతంగా పెరిగిందని స్మగ్లింగ్ ఇన్ ఇండియా 2021-22 నివేదిక పేర్కొంది.
2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు మొత్తం 405.35 కోట్ల విలువైన 833.07 కేజీల బంగారాన్ని అక్రమ రవాణా నుంచి తప్పించి, డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది. దీనిలో అధిక భాగం మియన్మార్ ప్రాంతం నుంచి వచ్చినదేనని పేర్కొంది.
చారిత్రకంగా మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి భారత్‌లోకి బంగారం అక్రమంగా దిగుమతి అయ్యేదని, గత రెండేళ్లల్లో మియన్మార్ నుంచి రావడం మొదలైందని డీఆర్ఐ తెలిపింది.
కోవిడ్ సమయంలో విమాన ప్రయాణాలపై ఆంక్షల కారణంగా వ్యక్తులు బంగారం మోసుకు రావడం తగ్గిందని, గత రెండేళ్లలో భూ మార్గాల ద్వారా సరిహద్దులు దాటిస్తున్నారని ఈ నివేదికలో తెలిపారు.
అలాగే, బంగారాన్ని కొరియర్ చేయడం పెరిగిందని, అలాంటి పలు కొరియర్లను డీఆర్ఐ స్వాధీనం చేసుకుందని ఈ నివేదికలో తెలిపారు.
ఫేక్ కరెన్సీ
నకిలీ కరెన్సీ నోట్లు దేశ జాతీయ భద్రతకు ముప్పు తెస్తాయని, చాలావరకు నకిలీ నోట్లను బంగ్లాదేశ్, నేపాల్ నుంచి దేశంలోకి అక్రమంగా తరలిస్తున్నారని డీఆర్ఐ పేర్కొంది.
2020 నుంచి 2021కి దేశంలో నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్న కేసులు గణనీయంగా పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) తెలిపింది.
కోవిడ్ కారణంగా 2020లో నకిలీ నోట్ల వ్యాపారం తగ్గుముఖం పట్టిందని, కోవిడ్ ఆంక్షలు ఎత్తివేసిన తరువాత 2021లో ఇది భారీగా పెరిగిందని డీఆర్ఐ రిపోర్ట్ చెబుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
తుపాకులు, సిగరెట్లు
2021-2022లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) ఆంధ్ర ప్రదేశం నుంచి 4 తుపాకులు, తెలంగాణ నుంచి 4 తుపాకులను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులలో ఏపీ నుంచి ఇద్దరిని అరెస్ట్ చేశారు.
అత్యధికంగా జమ్ము, కశ్మీర్ నుంచి 245 తుపాకులను స్వాధీనం చేసుకోగా, అస్సాం, జార్ఖండ్‌ల నుంచి వరుసగా 112, 103 తుపాకులను సీఆర్‌పీఎఫ్ స్వాధీనం చేసుకుంది.
ఈ కేసులలో అత్యధికంగా జార్ఖండ్ నుంచి 73 మందిని, జమ్ము, కశ్మీర్ నుంచి 69 మందిని, అస్సాం నుంచి 68 మందిని అరెస్ట్ చేశారు.
సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు సముద్రం, వాయు, భూ మార్గాల ద్వారా దేశంలోకి అక్రమ రవాణా అవుతున్నాయని, సిగరెట్ల స్మగ్లింగ్‌లో అంతర్జాతీయ స్థాయి నెట్‌వర్కులు భాగంగా ఉన్నాయని డీఆర్ఐ పేర్కొంది.
2021-11లో మొత్తం రూ. 93 కోట్ల విలువైన సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులను డీఆర్ఐ స్వాధీనం చేసుకుంది.
ఇవి కూడా చదవండి:
- మీరు తాగే నీటిలో రకాలు ఎన్ని? ఆర్వో, వాటర్ ఫిల్టర్ల నీళ్లను తాగితే ఏమవుతుంది?
- మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేయడం మంచిదా? లేక హోం లోన్, కార్ లోన్ తీసుకోవడం ఉత్తమమా?
- భారత్, పాకిస్తాన్ యుద్ధం 1971 - ఘాజీ: విశాఖలో అప్పుడు రాత్రి పూట ఒక్క దీపం కూడా వెలగలేదు
- పారిశ్రామికవేత్త బిర్లా రూ.10 లక్షలు ఇస్తానంటే అంబేడ్కర్ ఎందుకు తిరస్కరించారు
- కరెంటు సరఫరా లేని యుక్రెయిన్‌లో ప్రజలు ఎలా బతుకుతున్నారంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












