మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేయడం మంచిదా? లేక హోం లోన్, కార్ లోన్ తీసుకోవడం ఉత్తమమా?

హోం లోన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఐవీబీ కార్తికేయ
    • హోదా, బీబీసీ కోసం

గతవారం ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ బెంజ్ మార్కెటింగ్ శాఖాధిపతి మాట్లాడుతూ తమ సంస్థ కార్ల విక్రయాలు మ్యూచువల్ ఫండ్స్ SIP వల్ల పెరగడం లేదని అన్నారు. నెలకు యాభైవేల రూపాయల SIP చేసే వారి చేత ఆ అలవాటు మాన్పించేస్తే తమ కార్ల విక్రయాలు విపరీతంగా పెరుగుతాయని పేర్కొన్నారు.

ఈ రెండు విషయాలకు ఒక మౌలికమైన తేడా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక మదుపు. సొంత కారు అనేది ఒక ఖర్చు. మధ్యతరగతి వారు గతంలో చేసే పోస్టాఫీస్ లేదా బ్యాంక్ చిన్న మొత్తాల పొదుపును ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ ఎస్.ఐ.పి ఆక్రమించింది.

మరోవైపు కారు అనేది ఒక లగ్జరీ వస్తువు అనే అభిప్రాయం రెండవ శ్రేణి పట్టణాలలో ఇంకా బలంగానే ఉంది (టాటా నానో విఫలమైనప్పుడు తెలుసుకున్న విషయాలలో ఇదీ ఒకటి). ఈ కారణంగానే చాలామంది ఇది మోకాలికి బోడిగుండుకు ముడి పెట్టడం అని కొట్టి పారేశారు. ఇంకొందరు ఇది మారుతున్న ప్రజల అభిరుచులను ప్రతిబింబిస్తోందని అన్నారు. ఈ వాదోపవాదాలు ఎలా ఉన్నా, అసలు మ్యూచువల్ ఫండ్స్ మదుపుకు కారు విక్రయాలకు ఎలాంటి సంబంధం ఉందో చూద్దాం.

ఈఎంఐ

ఫొటో సోర్స్, Getty Images

50 వేల నెలవారి ఈ.ఎం.ఐ ఉన్న వ్యక్తి పెట్టే మొత్తం ఖర్చు ఎంత వస్తుందో లెక్కలు చూద్దాం:

  • ప్రస్తుతం కారు రుణం వార్షిక వాడ్డీ 7.5% అటు ఇటుగా ఉంది. ఏడు సంవత్సరాల రుణ కాలాన్ని పరిగణిస్తే నెలకు యాభై వేల ఈ.ఎం.ఐ. చెల్లించే వ్యక్తి మొత్తం రుణం గరిష్ఠంగా 30 లక్షలకు పైగా ఉంటుంది. ఈ మొత్తానికి 20% డౌన్ పేమెంట్ కలుపుకుంటే ఈ వ్యక్తి కొనవలసిన కారు ఖరీదు 40 లక్షలకు పైగా ఉండాలి. ఒక మంచి బెంజ్ కార్ ఖరీదు అదే రకంగా ఉంటుంది. ఈ లెక్క ప్రకారం చూస్తే మెర్సిడెస్ బెంజ్ సంస్థ అధికారి చెప్పింది సబబుగా అనిపిస్తుంది.
  • పైన చెప్పిన ఖర్చుకు బీమా, పెట్రోల్, రహదారి టోల్ అదనం.
  • గత ఎడాది మనదేశంలో కారు రుణాల్లో 20% వృధ్ధి కనిపించింది. కానీ ఇందులో లగ్జరీ కార్ల కోసం తీసుకున్న రుణం చాలా తక్కువ.
  • ఈ రుణం ఉండటం వల్ల సిబిల్ స్కోరు భారీగా తగ్గుతుంది. అంటే ఏదైనా అత్యవసర పరిస్థితులకు తీసుకునే రుణానికి చాలా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు.
మ్యూచువల్ ఫండ్స్

ఫొటో సోర్స్, NORA CAROL PHOTOGRAPHY

ఇప్పుడు ఒక వ్యక్తి నెలకు యాభై వేల రూపాయలు మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తే దాని వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో చూద్దాం.

  • 12% వార్షిక వృద్ధి ప్రకారం చూసుకుంటే ఒక అయిదేళ్ళ తర్వాత ఆ వ్యక్తి దగ్గర ఉండే మొత్తం 65 లక్షలకు పైగా ఉంటుంది. ఇందులో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పన్ను తీసేస్తే 62 లక్షల రూపాయల నిధి ఉంటుంది.
  • ఈ మదుపు మొత్తం ఆ మదుపరి క్రెడిట్ స్కోర్ పెరగడానికి ఎంతో సహకరిస్తుంది. వేరే క్రెడిట్ కార్డ్ బిల్ కట్టకపోవడం లాంటి ఇబ్బందులు లేకపోతే సదరు మదుపరి సిబిల్ స్కోర్ 770 పైగా ఉంటుంది.
  • ఈ యాభై వేలలో కొంత భాగం సెక్షన్ 80సీ ద్వారా ఆదాయపు పన్నులో మినహాయింపు పొందే అవకాశం ఉంది.
హోం లోన్

ఫొటో సోర్స్, Getty Images

ఇదే పద్ధతిలో లెక్కలోకి తీసుకోవాల్సిన మరో విషయం గృహ రుణం.

చాలామంది మదుపరులకు మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేస్తే మంచిదా? లేదా సొంత ఇల్లు కొనుగోలు చేస్తే మంచిదా? అనే ప్రశ్న తరచుగా వస్తుంది. గృహరుణం వడ్డీ 8-9 శాతం మధ్య ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ వడ్డీ 12-15 శాతం మధ్య ఉంటుంది. ఈ రెండింటిని ఎలా బేరీజు వేయాలి? అనే అనుమానం కూడా చాలామంది మదుపరుల్లో ఉంటుంది.

దీనికి ఎలాంటి స్పష్టమైన సమాధానం లేకపోయినా నిర్ణయం తీసుకునే ముందు అవగాహన చేసుకోవలసిన కొన్ని విషయాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

యాభై వేల రూపాయల నెలవారీ గృహ రుణం ఈ.ఎం.ఐ గురించి ఇప్పుడు చూద్దాం.

  • ముందుగా ఆ వ్యక్తి సొంత వినియోగం కోసం ఇల్లు కొనుగోలు కోసం గృహ రుణం తీసుకుంటున్నారా? లేక అద్దెకు ఇవ్వడం కోసం రుణం తీసుకొని ఇల్లు కొనుగోలు చేస్తున్నాడా? అనే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే కోవిడ్ వల్ల ఎక్కువగా దెబ్బతిన్న రంగం రియల్ ఎస్టేట్. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి మీద వచ్చే అద్దె, ఈ.ఎం.ఐ. కంటే చాలా తక్కువగానే ఉంటుంది.
  • ఇరవై ఏళ్ళ కాలపరిమితి తీసుకుంటే చెల్లించాల్సిన మొత్తం కోటీ ఇరవై లక్షల దాకా ఉంటుంది. సాధారణంగా తీసుకున్న రుణానికి రెండింతలు ఈ.ఎం.ఐ. రూపంలో చెల్లిస్తాం. కాబట్టి ఇంటి విలువ అరవై లక్షలకు దగ్గరగా ఉంటుంది.
  • గృహ రుణం మీద చెల్లించిన వడ్డీ వల్ల వార్షిక ఆదాయపు పన్నులో రెండు లక్షల రూపాయల దాకా రాయితీ పొంద వచ్చు. 30% ఆదాయపు పన్ను శ్రేణిలో ఉన్నవారు ఏడాదికి అరవై వేల దాకా గరిష్ఠంగా లాభం పొందగలరు.
  • సొంత వినియోగానికి తీసుకున్న ఇల్లు మనం చెల్లించాల్సిన అద్దె తగ్గిస్తుంది కాబట్టి కొంత ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.
  • గృహ రుణం వల్ల కూడా సిబిల్ స్కోర్ భారీగా తగ్గుతుంది.
మ్యూచువల్ ఫండ్స్

ఫొటో సోర్స్, Getty Images

ఇప్పుడు యాభై వేల మ్యూచువల్ ఫండ్స్ ఎస్.ఐ.పిని 20 ఏళ్ల కాలపరిమితికి పరిశీలిద్దాం.

  • 12% వార్షిక వృద్ధిని పరిగణలోకి తీసుకుంటే ఇరవై ఏళ్ళ తర్వాత ఐదు కోట్ల రూపాయల నిధి అందుబాటులో ఉంటుంది. 10% క్యాపిటల్ గెయిన్స్ పన్ను తీసివేత తరువాత నాలుగు కోట్లా అరవై లక్షలకు పైగా నిధి కూడబెట్టినట్లు అవుతుంది. రిస్క్ ఉండే మ్యూచువల్ ఫండ్స్ మార్గంలో 12% వార్షిక వృధ్ధి ఉంటుందా అనే అనుమానం రావడం సహజం. వచ్చే దశాబ్దాలలో మనదేశంలో జరిగే వృధ్ధి ప్రకారం 12% వార్షిక వృధ్ధి సహేతుకమైనదేనే అంచనా అని అనుకోవాలి.
  • మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కలిగే నిధి మరో మార్గంలో మదుపు చేసే అవకాశాన్ని కల్పిస్తుంది.
  • ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మదుపు చేసేవారు పదేళ్ళ కాలపరిమితిని దాటితే ఏ కంపెనీ ఫండ్స్ ద్వారా మదుపు చేసినా తేడా ఉండదు అని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ఆ రకంగా చూస్తే మ్యూచువల్ ఫండ్ మదుపుకు ఉండే రిస్క్ చాలా తక్కువ అని అర్థం చేసుకోవలి.
  • మదుపు వల్ల క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. ఒక పదేళ్ళ పాటూ నెలకు యాభై వేల ఎస్.ఐ.పి. చేసిన వ్యక్తి సిబిల్ స్కోర్ 800 పైగా ఉంటుంది. అంటే రుణ లభ్యత ఎక్కువగా ఉంటుంది.

గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే..

వీడియో క్యాప్షన్, నెలకు 5000తో 12 లక్షలు సంపాదించొచ్చా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)