ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలివే... ఇక్కడ జీవించాలంటే చాలా డబ్బు కావాలి

బెంగళూరు మెట్రో
    • రచయిత, మలు కుర్సినో
    • హోదా, బీబీసీ న్యూస్

ప్రపంచంలోనే జీవన వ్యయం అత్యంత చౌకగా ఉన్న నగరాల జాబితాలో భారత్ నుంచి మూడు నగరాలు చోటు దక్కించుకున్నాయి. అలాగే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో న్యూయార్క్, సింగపూర్‌లు అత్యున్నత స్థానాల్లో నిలిచాయి.

‘ది ఎకనమిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్’ వార్షిక సర్వే ప్రకారం ప్రపంచంలో జీవించడానికి అత్యధికంగా ఖర్చు చేయాల్సిన (ఖరీదైన) నగరాల జాబితాలో న్యూయార్క్, సింగపూర్ సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నాయి.

మొత్తం 172 దేశాలతో కూడిన ఈ జాబితాలో న్యూయార్క్‌కు మొదటిసారి తొలి ర్యాంకు లభించింది. గతేడాది నంబర్‌వన్‌గా నిలిచిన టెల్ అవీవ్ ఈ ఏడాది మూడో స్థానానికి పడిపోయింది.

మరోవైపు భారత్‌లోని అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు జీవన వ్యయంలో అత్యంత చౌక అయిన నగరాల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

ఈ జాబితాలో బెంగళూరు 161వ ర్యాంకులో, చెన్నై 164వ ర్యాంకులో, అహ్మదాబాద్ 165వ ర్యాంకులో నిలిచింది.

న్యూయార్క్

ఫొటో సోర్స్, Getty Images

సర్వే నివేదికల ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద నగరాల్లో ఈ ఏడాది జీవన వ్యయం సగటు 8.1 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.

యుక్రెయిన్‌లో యుద్ధం, సరఫరా వ్యవస్థలపై కరోనా ప్రభావం కూడా జీవన వ్యయం పెరుగుదలకు కారణాలుగా గుర్తించారు.

ముఖ్యంగా ఇస్తాంబుల్‌లో ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. అక్కడ ధరల పెరుగుదల 86 శాతంగా నమోదైంది. బ్యూనస్ ఎయిర్స్‌లో 64 శాతం, టెహ్రాన్‌లో 57 శాతంగా ధరల పెరుగుదల ఉంది.

ఖరీదైన నగరాల జాబితాలో న్యూయార్క్ అగ్రస్థానంలో నిలవడానికి డాలర్ బలపడటంతో పాటు అమెరికాలోని అధిక ద్రవ్యోల్బణం కూడా ఒక కారణం.

టాప్-10లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాలు కూడా చోటు దక్కించుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో ద్రవ్యోల్బణం దేశంలో గత 40 సంవత్సరాల గరిష్టానికి చేరింది.

మాస్కో, సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరాలు కూడా ఈ ఏడాది ర్యాంకుల్లో పైకి ఎగబాకాయి.

జీవన వ్యయం

ఫొటో సోర్స్, Getty Images

సర్వే

172 నగరాల్లోని వస్తు, సేవల ఖర్చులను పరిగణలోకి తీసుకొని ఈ సర్వేను చేశారు. ఈ ఏడాది రివ్యూలో కీయెవ్ నగరాన్ని పరిగణలోకి తీసుకోలేదు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న 172 నగరాల్లోని 200 కంటే ఎక్కువ ఉత్పత్తులు, సేవలకు సంబంధించిన 400కు పైగా వ్యక్తిగత ధరలను పోల్చి చూశారు.

ఉపాసన దత్, ఈ సర్వేకు నేతృత్వం వహించారు. యుక్రెయిన్‌లో యుద్ధం, రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు, చైనా జీరో కోవిడ్ విధానాల వల్ల సరఫరా గొలుసు సాఫీగా సాగకుండా ఇబ్బందులు తలెత్తాయని ఉపాసన దత్ అన్నారు.

‘‘వీటికి వడ్డీ రేట్లు పెరగడం, డబ్బు మారకపు రేటులో మార్పులు కూడా తోడవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయ సంక్షోభం ఏర్పడింది’’ అని ఆమె చెప్పారు.

ఈ 172 నగరాలకు సంబంధించి గత 20 ఏళ్లుగా అందుబాటులో ఉన్న డేటా ప్రకారం చూస్తే, తాజా ధరల పెరుగుదల రేటు అత్యంత ఎక్కువగా ఉందని ఆమె తెలిపారు.

2022 అత్యంత ఖరీదైన నగరాలు, ర్యాంకుల వారీగా..

న్యూయార్క్ (1), సింగపూర్ (1), టెల్ అవీవ్ (3), హాంకాంగ్ (4), లాస్ ఏంజిల్స్ (4), జ్యూరిచ్ (6), గిన్ (7), సెయింట్ ఫ్రాన్సిస్ (8), పారిస్ (9), సిడ్నీ (10), కోహెన్ హాగెన్ (10).

చౌక నగరాలు

కొలంబస్ (161), బెంగళూరు (161), అల్జీర్స్ (161), చెన్నై (164), అహ్మదాబాద్ (165), అల్మతీ (166), కరాచీ (167), తాష్కెంట్ (168), ట్యూనీషియా (189), ట్యూనీషియా (169), టెహ్రాన్ (170), ట్రిపోలీ (171), డమాస్కస్ (172).

మూలం: ఈఐయూ జీవన వ్యయం సర్వే నివేదిక

వీడియో క్యాప్షన్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల ప్రభావం.. ఓ మధ్యతరగతి ఇల్లాలిపై ఎలా ఉంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)