అదానీ చేతికి NDTV: దేశంలోని అగ్రస్థాయి న్యూస్ నెట్‌వర్క్‌ను గౌతమ్ అదానీ ఎలా నడపనున్నారు

ఫొటో సోర్స్, AFP
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ఇండియా కరెస్పాండెంట్
భారతదేశంలో అగ్రస్థాయి న్యూస్ నెట్‌వర్క్ ‘న్యూ దిల్లీ టెలివిజన్’ (NDTV) వ్యవస్థాపకులు రాధికా రాయ్, ప్రణయ్ రాయ్‌లు తమ కంపెనీని ప్రొమోట్ చేసే గ్రూప్ సంస్థలో డైరెక్టర్ల పదవులకు రాజీనామా చేశారు.
దీంతో.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీ సారథ్యంలోని సంస్థల చేతికి ఈ వార్తా చానళ్ల సంస్థ వెళ్లనుంది.
ఈ పరిణామం భారతదేశంలో టీవీ వార్తల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపనుంది?
ఎన్‌డీటీవీని తాను, తన భర్త ప్రణయ్ రాయ్ కలిసి స్థాపించటం ‘అనుకోకుండా’ జరిగిన ఆనందకరమైన విషయమని రాధికా రాయ్ ఒక సందర్భంలో గుర్తుచేసుకున్నారు.
రాయ్ దంపతులు 1988 నవంబర్‌లో దూర్‌దర్శన్ చానల్‌లో ‘ది వరల్డ్ దిస్ వీక్’ పేరుతో వారం వారం ప్రసారమయ్యే ‘సింగిల్ షో’గా ఎన్‌డీటీవీని స్థాపించారు.
అది స్థాపించేటపుడు వారికి ‘భారీ ప్రణాళికలేవీ లేవు’. వారంవారం ప్రపంచ వార్తలను అందించే కార్యక్రమాన్ని ప్రొడ్యూస్ చేసే సంస్థ నుంచి భారతదేశపు తొలి 24/7 ప్రైవేట్ న్యూస్ నెట్‌వర్క్‌గా, స్వతంత్ర వార్తా ప్రసార సంస్థగా అభివృద్ధి చెందుతుందనే ఊహ కూడా లేదు.
మూడు దశాబ్దాలు దాటిపోయిన తర్వాత ఈ దంపతుల న్యూస్ చానల్ ఇప్పుడు చేతులు మారుతోంది. ప్రపంచంలో అతిపెద్ద సంపన్నుల్లో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్‌ల తర్వాత మూడో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ.. ఎన్‌డీటీవీని కొనుగోలు చేయబోతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఓడ రేవులు, ఇంధన సంస్థలను నడిపే 60 ఏళ్ల అదానీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ఆయన ప్రభుత్వానికి సన్నిహితుడని చాలామంది భావిస్తారు.
నిజానికి.. ‘‘అన్ని రకాల రాజకీయాల్లో రాజకీయ నాయకులు, సామాజిక నేతలతో ఆయన సంబంధాల వల్ల ప్రతి ప్రభుత్వానికీ ఆయన ఆమోదనీయుడే అవుతారు’’ అని ఇటీవల అదానీ జీవితచరిత్రను రాసిన ఆర్.ఎన్.భాస్కర్ అంటారు.
అదానీ కొత్త కంపెనీ ఏఎంజీ మీడియా నెట్‌వర్క్స్ లిమిటెడ్ ఈ ఏడాది మార్చి నెలలో క్వింటిలియన్ అనే డిజిటల్ బిజినెస్ న్యూస్ కంపెనీలో మైనారిటీ వాటా కొనుగోలు చేసింది. ‘‘క్వింటిలియన్‌లో పెట్టుబడులు చాలా స్వల్పం. దానిమీద అదానీ దృష్టి పెట్టాల్సిన పనే లేదు. కానీ ఆయన దృష్టి పెట్టారంటే పెద్ద ప్రణాళికలు ఏవైనా ఉన్నాయా?’’ అని భాస్కర్ తన పుస్తకంలో ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
ఇప్పుడు మనకు తెలుసు. దాదాపు 26,000 కోట్ల డాలర్ల మార్కెట్ విలువ గల అదానీ వ్యాపార సామ్రాజ్యంతో పోల్చితే కేవల 510 కోట్ల డాలర్ల ఆదాయం, 100 కోట్ల డాలర్ల లాభం గల ఎన్‌డీటీవీ.. ఆయనను ఆకర్షించేంత పెద్దది కాదు.
అయితే ఎన్‌డీటీవీ అనేది భారతదేశంలో ప్రధాన న్యూస్ నెట్‌వర్క్‌లలో ఒకటి.
టీవీ చానళ్లలో డాటా ఆధారంగా ఓట్ల విశ్లేషణకు, మార్నింగ్ షోలకు, అనేక టెక్నాలజీ, లైఫ్‌స్టైల్ ప్రోగ్రామ్‌లతో కొత్త ఒరవడిని ప్రారంభించిన టీవీ చానల్ ఇది.
ఇప్పుడు ఈ టీవీకి ఆన్‌లైన్‌లో కూడా బలమైన ఉనికి ఉంది.
వివిధ డిజిటల్ వేదికల మీద 3.5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నట్లు చెప్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
‘‘మా విజన్‌ను సాకారం చేయటానికి అన్నిటికన్నా బాగా సరిపోయే ప్రసార, డిజిటల్ వేదిక ఎన్‌డీటీవీ’’ అని అదానీ గ్రూప్ భావిస్తోంది. తన విజన్ ఏమిటనేది అదానీ కొంత సూచనాత్మకంగా చెప్పారు.
‘‘ఒక మీడియా సంస్థకు మద్దతు ఇచ్చి, అది స్వతంత్రంగా మారేలా, అంతర్జాతీయ ఉనికిని సంపాదించుకునేలా ఎందుకు చేయకూడదు? ఫైనాన్షియల్ టైమ్స్ లేదా అల్ జజీరా వంటి వాటితో పోల్చదగిన సంస్థ భారతదేశంలో ఒక్కటి కూడా లేదు’’ అని ఆయన ఫైనాన్షియల్ టైమ్స్‌తో పేర్కొన్నారు.
అయితే ఈ కొనుగోలును విమర్శిస్తున్న వారు సందేహిస్తున్నారు. భారతదేశంలో స్వతంత్రంగా వ్యవహరిస్తున్న అతి కొద్ది న్యూస్ నెట్‌వర్క్‌లలో ఎన్‌డీటీవీ ఒకటని చాలా మంది భావిస్తారు.
చాలా టీవీ చానళ్లు చేసే హడావుడికి ఇది దూరంగా ఉంటుంది. ఎన్‌డీటీవీ ఇచ్చే సమాచారాన్ని విశ్వసిస్తామని 76 శాతం మంది రెస్పాండెంట్లు చెప్పినట్లు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, రాయిటర్స్ ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించిన ‘స్టడీ ఆఫ్ జర్నలిజం’ అధ్యయనం పేర్కొంది.
ఈ న్యూస్ నెట్‌వర్క్‌ను అదానీ సొంతం చేసుకోవటం వల్ల.. ఈ సంస్థ సంపాదక నిబద్ధత దెబ్బతింటుందనే ఆందోళనలు రేకెత్తాయి. భారతదేశంలో మీడియాలో ఎంతో వైవిధ్యం ఉన్నప్పటికీ.. స్వతంత్ర పాత్రికేయత అనేది ఆరోగ్యకరంగా ఉన్నట్లు కనిపించదు.
పారిస్ కేంద్రంగా పనిచేసే ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ ఈ ఏడాది విడుదల చేసిన ‘వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ (ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీ)’ లో.. మొత్తం 180 దేశాల్లో భారత్ 150వ స్థానానికి దిగజారింది. ఈ సూచీలో ఇండియాకు ఇప్పటివరకూ ఇదే అత్యంత అధమ స్థానం.
ఈ నివేదికను నరేంద్రమోదీకి చెందిన అధికార భారతీయ జనతా పార్టీ తిరస్కరిస్తోంది.
ఆ సూచీ అనుసరించిన విధానం ప్రశ్నార్థకమని, పారదర్శకత లేదని విమర్శించింది.
మీడియా వైవిధ్యం వల్ల యాజమాన్యం కూడా కేంద్రీకృతమవుతోందని నిపుణులు అంటున్నారు.
ఉదాహరణకు హిందీ పత్రికా పఠనంలో నాలుగింట మూడు వంతుల భాగం నాలుగు దినపత్రికలదేనని రిపర్టర్స్ వితౌట్ బోర్డర్స్ చెప్తోంది.
రిటైల్ మొదలుకుని చమురు శుద్ధి సంస్థల వరకూ.. 22,000 కోట్ల విలువైన అనేక భారీ వ్యాపారాలు గల కుబేరుడు ముకేష్ అంబానీ.. భారతదేశంలో అతి పెద్ద మీడియా కంపెనీల్లో ఒకటైన ‘నెట్‌వర్క్18’ని నియంత్రిస్తున్నారు.
అదానీ, అంబానీల యాజమాన్యంలోని కంపెనీలన్నీ కలిపి.. భారతదేశపు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 4 శాతానికి సమానమైన ఆదాయాలు సృష్టిస్తున్నాయి.
ఎన్‌డీటీవీనీ అదానీ సొంతం చేసుకోవటం.. భారతదేశంలో వార్తా వ్యాపారాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలకు కూడా ప్రతీక వంటిదని మీడియా రంగ నిపుణులు వనితా కోహ్లి ఖండేకర్ పేర్కొన్నారు.
దేశంలో 400కు పైగా న్యూస్ చానళ్లు ఉన్నాయి. వాటిలో ప్రైవేటు యాజమాన్యంలో ఉన్నవి, ప్రాంతీయ భాషల్లో ఉన్నవే ఎక్కువ. 2021 సంవత్సరంలో టీవీ వాణిజ్య ప్రకటనలకు లభించిన 42.30 కోట్ల డాలర్లలో న్యూస్ చానళ్లకు లభించిన వాటా 8 శాతమని ఒక అంచనా.
‘‘అన్నిచోట్లా కూడా వార్తల వ్యాపారం అత్యంత కఠినమైన వ్యాపారం. భారతదేశంలో టీవీ న్యూస్ అనేది ఏమాత్రం లాభాలు లేని, రాజకీయంగా సమస్యలున్న, కష్టాలతో కూడుకున్న వ్యాపారాల్లో ఒకటి. ఈ రంగంలో కేవలం ‘ఒకటి నుంచి మూడు కంపెనీలు’ మాత్రమే లాభాలు గడిస్తుంటాయి’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
వార్తల కోసం డబ్బులు కట్టటానికి జనం సుముఖంగా లేకపోవటంతో.. వార్తా చానళ్లు ఆదాయం కోసం ప్రధానంగా వాణిజ్య ప్రకటనల మీదే ఆధారపడి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో వార్తా చానళ్ల విశ్వసనీయత ఆవిరైపోయిందని చాలా మంది భావిస్తారు. చాలా చానళ్లు రేటింగ్‌లలో అవకతవకలకు పాల్పడ్డాయని ఆరోపణలు ఎదుర్కొన్నాయి. అలాగే ‘‘వార్తలను విపరీత ధోరణిలోకి మార్చటం, పక్షపాతపూరితంగా కథనాలు ప్రసారం చేయటం’’ పెరిగిపోయిందని ఒక నిపుణుడు పేర్కొన్నారు.
ఎన్‌డీటీవీ ఆర్థిక కష్టాలు దశాబ్దం కిందట ఆర్థిక మందగమనం సమయంలో మొదలయ్యాయి. ఆ సమయంలో ఎన్‌డీటీవీ బాకీలను తీర్చటం కోసం అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ నియంత్రణలోని ఒక సంస్థ నుంచి 4.4 కోట్ల డాలర్లు అప్పు తీసుకోవాల్సి వచ్చింది.
‘‘ఎన్‌డీటీవీ సుదీర్ఘ కాలం పాటు గట్టిగా పోరాడింది. కానీ ఓడిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇది పాత్రికేయ వ్యాపారానికి ఓటమి లాగా కనిపిస్తోంది’’ అని వనితా కోహ్లీ ఖందేకర్ వ్యాఖ్యానించారు.
కొత్త యాజమాన్యం కింద ఎన్‌డీటీవీ సంపాదక నిబద్ధత, వార్తాంశాలు, స్వరం మారుతుందా లేదా అనేది కాలం చెప్తుంది. టీవీ వార్తలు ఒకే వైపు పోగుపడిన సమయంలో, ‘‘చాలా మంది ఇతరులు చేయని పనిని ఎన్‌డీటీవీ చేసింది.. కొంత వామపక్షంలో నిలిచి ప్రభుత్వం పట్ల విమర్శనాత్మకంగా ఉండే కథనాలు అందించింది’’ అని మీడియా కన్సల్టెన్సీ సంస్థ ‘ఒర్మాక్స్ మీడియా’కు చెందిన శైలేష్ కపూర్ పేర్కొన్నారు.
‘‘ఇప్పుడు సంపాదక ఆంక్షల కారణంగా ఆ చానల్ వైఖరి మెత్తబడి, మరింత తటస్థ వైఖరిని అవలంబిస్తుందా?’’ అనేది చూడాల్సి ఉందన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘నా భార్య నగ్న ఫోటోలు అప్పులోళ్ల దగ్గరకు ఎలా వెళ్లాయి’
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా మొఘల్ సైన్యం మీదకు విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ
- కాంతారా: అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా మీద అసంతృప్తి ఎందుకు
- విప్ప సారా: బ్రిటిషర్లు నిషేధించిన ఈ భారతీయ మద్యం అంతర్జాతీయంగా ఆదరణ పొందగలదా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














