విప్ప సారా: బ్రిటిషర్లు నిషేధించిన ఈ భారతీయ మద్యం అంతర్జాతీయంగా ఆదరణ పొందగలదా?

ఫొటో సోర్స్, Alamy
- రచయిత, సుగతో ముఖర్జీ
- హోదా, బీబీసీ ట్రావెల్ కోసం
దశాబ్దాల నుంచీ గిరిజన సంస్కృతులతో ఈ పానీయానికి విడదీయరాని అనుబంధం ఉంది. అయితే, దీనిపై వలస పాలకులు నిషేధం విధించారు. మళ్లీ ఇప్పుడు దీనికి ప్రాచుర్యం లభిస్తోంది.
ఆ పువ్వులను చూడకముందే ఆ వాసన నేను గుర్తించాను. ఒడిశాలోని సిమ్లిపాల్ జాతీయ పార్కులో ఒక ఉదయం మేం ముందుకు సాగుతున్నాం. ఓ చోట నీరు జలపాతంలా ప్రవహిస్తోంది. అక్కడే చెట్ల నుంచి కొన్ని లేత ఆకుపచ్చ రంగు పువ్వులు రాలుతూ కనిపించాయి. అక్కడ నేలంతా ఆ పూలతో పరిచినట్లుగా అనిపించింది.
‘ఇవి విప్ప చెట్లు’ అని చెప్పారు కిస్కు సురేశ్. సంతాల్ గిరిజన తెగకు చెందిన ఆయన నాకు గైడ్‌గా వ్యవహరిస్తున్నారు.
విప్ప చెట్టుగా పిలిచే మధుక లాంగిఫోలియా భారత్‌లోని తూర్పు, పశ్చిమ, మధ్య ప్రాంత అడవుల్లో విస్తారంగా కనిపిస్తుంది.
3 వేల ఏళ్లుగా ఈ అడవుల్లో నివసిస్తున్న స్థానిక గిరిజన జాతులైన సంతాల్, గోండ్, ముండా, ఓరావోలు దీన్ని ‘జీవ వృక్షం’గా పిలుస్తారు.
ఈ తెగలకు చెందిన గిరిజనులు విప్ప పువ్వులు, పండ్లు, కొమ్మలు, ఆకులు అన్నిటినీ ఆహారంగా, పశుగ్రాసంగా, ఇంధనంగా, మందులుగా ఉపయోగించేవారు.
వస్తుమార్పిడి విధానం వాడుకలో ఉన్న అటవీప్రాంతాలలో దీన్ని కరెన్సీగానూ వినియోగించేవారు.
పాటలు, పద్యాలు, తమ సంబరాలలోనూ విప్పకు ప్రాధాన్యమిచ్చి దానికి ప్రత్యేక గౌరవం కల్పించారు వీరు.
అయితే, విప్ప అనగానే చాలామందికి దాంతో తయారుచేసే సారా గుర్తొస్తుంది. ఎనిమిది రోజులు పులియబెట్టి కుండలో మరిగించి తయారుచేసే విప్ప సారాయే చాలామందికి తెలుసు.

ఫొటో సోర్స్, Conrad Braganza
‘స్వచ్ఛతకు మారుపేరు’
ఆ రోజు సాయంత్రం సురేశ్ నన్ను అడవిలోని వాళ్ల ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన తల్లి, చెల్లెలు ఒక లోహపు పాత్రలో పులియబెట్టిన విప్ప ద్రావణాన్ని కట్టెలపొయ్యిపై పెట్టి సారా తయారుచేస్తున్నారు.
పొయ్యిపై ఒక పెద్ద కుండను పెట్టి దానిపై మరో రెండు కుండలు అమర్చారు. వాటికి ఒక పైప్ కనెక్ట్ చేసి దాన్ని పొయ్యి పక్కన ఉన్న మరో పాత్రకు కలిపారు. పొయ్యిపై కుండలోని పులిసిన విప్ప ద్రావణం మరిగి ఆ ఆవిరి పక్కనుండే పాత్రలో చేరి సారా అవుతుంది.
ఇలా విప్పసారా వండుతున్న క్రమంలో సురేశ్ చెల్లెలు గీత పాత్రలో చేరిన సారాను గరిటతో కొంచెం తీసి పొయ్యిలో విసిరింది. అంతే... ఒక్కసారిగా తెల్లని మంట భగ్గుమంది. ‘సార పడగానే మంట భగ్గుమంది అంటే ఇది అత్యంత స్వచ్ఛమైనదని అర్థం’ అని సురేశ్ నాతో చెప్పారు.

ఆ సాయంత్రం గీత నాకు ఆకులతో చేసిన చిన్న కప్పులో వేసి ఇచ్చిన రంగులేని, స్వచ్ఛమైన విప్ప సారాను మెల్లమెల్లగా తాగాను. అది ఒక్కో చుక్కా గొంతులో దిగుతుంటే ‘ఇంతకుముందు నేను దీన్ని ఎందుకు రుచి చూడలేదు’ అనిపించింది నాకు.
ప్రాచీన కాలం నుంచి దాదాపు 19వ శతాబ్దం చివరి వరకు కిస్కు వంటి స్థానిక తెగలు ఈ విప్ప సారా వండడం, తాగడం, విక్రయించడానికి ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు.
అయితే, బ్రిటిషర్ల పాలనలో ఇలాంటి మద్యాన్ని నాటుసారాగా పరిగణిస్తూ ప్రజారోగ్యానికి, నైతికతకు ముప్పు కలిగించే ప్రమాదకర మత్తుపదార్థంగా పేర్కొన్నారు. బ్రిటిష్ పాలకులు 1878లో బొంబాయి అబ్కారీ చట్టం, 1892లో మౌరా చట్టం తీసుకొచ్చారు.
ఈ చట్టాల ప్రకారం విప్పసారా తయారీతో పాటు విప్ప పూల సేకరణ, నిల్వపైనా నిషేధం విధించారు.
ఫలితంగా రహస్యంగా తయారుచేయడం మొదలైంది. దీంతో నాణ్యత లోపించేది. అది విప్పసారా విషయంలో బ్రిటిష్ పాలకుల అజెండాకు మరింత బలం చేకూర్చింది.
స్థానికంగా తయారుచేసే మద్యాన్ని నియంత్రించడం వల్ల బ్రిటన్, జర్మనీ నుంచి మద్యం దిగుమతులు పెరిగి ఆ ఆదాయం బ్రిటిష్ సైనిక విస్తరణకు నిధులు సమకూర్చడానికి ఉపయోగపడింది.
బ్రిటిష్ అధికారుల్లో కొందరు పోషకాలు, సంస్కృతి దృష్ట్యా ఈ విప్పసారా ప్రాధాన్యాన్ని గుర్తించినప్పటికీ ఇది మనుగడలో ఉంటే ఖజానాకు రావాల్సిన మద్యం ఆదాయం తగ్గుతుందన్న లెక్కే పైచేయి సాధించిందరి లండన్ విశ్వవిద్యాలయంలో ఆధునిక చరిత్ర బోధించే ప్రొఫెసర్ ఎరికా వాల్ట్ చెప్పారు.

ఫొటో సోర్స్, Conrad Braganza
అయితే, 1947లో భారత్ స్వాతంత్ర్యం సాధించిన తరువాత కూడా బ్రిటిష్ కాలం నాటి ఆర్థిక, సామాజిక విధానాలు మారలేదు. ‘వలస పాలనలో ఉన్నట్లుగానే మద్యం విక్రయాలు, ఉత్పత్తిపై ప్రభుత్వ గుత్తాధిపత్యమే కొనసాగింది. విప్ప సారాపై కఠిన ఆంక్షలూ యథాతథంగా కొనసాగాయి’ అన్నారు వాల్ట్.
‘నిగ్రహం పాటించాలని చెప్పేవారు, జాతీయవాదులకు మద్యం ఎప్పుడూ ప్రధాన లక్ష్యంగా ఉండేది. మద్యం దుకాణాలు మూసివేయించడం వంటివీ చేసేవారు. అసలు మద్యం భారతదేశానికి బయట నుంచి వచ్చిన అలవాటని జాతీయవాదులు వాదించేవారు. వీటన్నిటి నేపథ్యంలో గిరిజనుల జీవితాలలో ముఖ్యమైన విప్ప సారా వంటివి సమస్యాత్మకంగా మారిపోయాయి’ అని వాల్ట్ చెప్పారు.
ఇలాంటి పరిస్థితుల్లో విప్పసారా నాణ్యత ఉండదని, తాగితే ప్రమాదమని చెబుతూ గిరిజనులు దాన్ని తయారుచేయకుండా, తాగకుండా, స్థానిక సంతలలో అమ్మకుండా నిషేధం కొనసాగించారు.
‘స్వాతంత్ర్యానంతరం దేశంలోని ఉన్నత వర్గాల స్వభావాన్ని ఇది అర్థమయ్యేలా చెబుతుంది. వారు స్థానిక జాతుల జీవనశైలిని అసహ్యించుకునేవారు’ అని న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో ఫుడ్ స్టడీస్ ప్రొఫెసర్ కృష్ణేందు రే చెప్పారు.
అయితే, కాలక్రమంలో విప్పసారాను బ్రాండ్‌గా మలిచే ప్రయత్నం జరిగింది. 2018లో ‘డెస్మండ్‌జీ’ పేరుతో డెస్మండ్ నజారెత్ విప్పసారాను మార్కెట్లోకి తేగలిగారు. ‘గోవాలో మేం విప్పసారాను మార్కెట్‌కు పరిచయం చేశాం. ఇండియన్ మేడ్ లిక్కర్(ఐఎంఎల్) కేటగిరీలో దీన్ని తయారుచేశాం. ప్రభుత్వాన్ని ఎంతో ఒప్పించిన తరువాత మాకు ఇది సాధ్యమైంది’ అని చెప్పారు డెస్మండ్ నజారెత్.
గోవాకు చెందిన క్రాఫ్ట్ డిస్టిలర్ ఈ విప్పసారాను కర్ణాటకలో విక్రయిస్తుంది. విప్పసారా నాటుసారా కాదు ఇండియన్ మేడ్ లిక్కర్(ఐఎంఎల్) అని గుర్తించిన రెండో రాష్ట్రం కర్ణాటక.
దేశంలోని చట్టాల ప్రకారం ఒక రాష్ట్రంలోని దేశీయ మద్యాన్ని మరో రాష్ట్రంలో విక్రయించడం సాధ్యం కాదు కాబట్టి దీన్ని ఐఎంఎల్ కేటగిరీలో చేర్చడం ద్వారా దేశంలోని ఇతర రాష్ట్రాలలోనూ విక్రయించడానికి వీలు కలుగుతుంది.

ఫొటో సోర్స్, Conrad Braganza
అయితే, గత రెండేళ్లుగా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. 2021లో మధ్యప్రదేశ్ విప్పసారాను వారసత్వ మద్యంగా ప్రకటించింది. మహారాష్ట్ర ప్రభుత్వం స్థానిక గిరిజన తెగలు విప్ప పూలు సేకరించొచ్చు, నిల్వ చేసుకోవచ్చంటూ పాత చట్టాలలో మార్పులు తెచ్చింది.
ఆ ఏడాదిలోనే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వ సంస్థ ‘అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ’ గిరిజనులు సేకరించి ఎండబెట్టిన విప్ప పూలను ఫ్రాన్స్‌కు ఎగుమతి చేసింది.
ముంబయి కేంద్రంగా పనిచేస్తున్న స్టార్టప్ ‘నేటివ్ బ్రూస్’ డైరెక్టర్ సుసాన్ డయాస్ 2018లోనే వసంత్‌దాదా షుగర్ ఇనిస్టిట్యూట్‌లో విప్పపూలతో మద్యం తయారీ యూనిట్ ప్రారంభించారు.
‘మాకు వంటకం అందుబాటులోనే ఉంది. విప్పపూల ఉత్పత్తి, సేకరణ, సరఫరా, మార్కెటింగ్ సులభతరం చేసే నిబంధనలు కావాలి’ అన్నారు సుసాన్.

ఫొటో సోర్స్, Alamy
‘నో హ్యాంగోవర్’
ఇకపోతే డెస్మండ్ నజారెత్ తన సంస్థ తయారుచేసే విప్పసారా కోసం పూలను ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలోని గిరిజన సంఘాలు, సహకార సంఘాల సాయంతో సంపాదిస్తున్నారు. ఇది అటవీ ఉత్పత్తుల వ్యాపారాన్ని పెంచుతుందని, స్థానిక గిరిజన తెగల ఆర్థిక సామాజిక అభివృద్ధికి తోడ్పడుతుందని డెస్మండ్ చెబుతున్నారు.
విప్పసారా ప్రాముఖ్యాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తామని డెస్మండ్ చెప్తున్నారు.
‘మేం ఆహారంగా తీసుకోగల స్థాయి పువ్వులను మాత్రమే కొంటాం. అది కూడా గిరిజనులు వలలపై సేకరించి, ఎండలో శుభ్రమైన చాపలపై ఆరబెట్టిన తరువాత మా వద్దకు వస్తుంది. పూర్తిగా ఆరోగ్యకరమైన వాతావరణంలో సేకరించిన పువ్వులివి’ అంటున్నారు డెస్మండ్.
కాక్‌టైల్స్ కలపడంలో దేశంలోనే పేరున్నవారిలో ఒకరైన శాత్వీ బసు మాట్లాడుతూ.. విప్పసారాను అంతర్జాతీయ పానీయంగా మలచాలంటే సంప్రదాయ తయారీ పద్ధతులను ప్రముఖంగా చెప్పాలన్నారు.
‘టకీలా, సేక్, పిస్కో వంటివీ ఆయా ప్రాంతాలలో స్థానిక జాతులు తయారుచేసే మద్యంగానే ప్రారంభమై అంతర్జాతీయంగా ఆదరణ పొందాయి. విప్పసారాకూ అలాంటి అవకాశం ఉంది. విప్పసారాలో మెథనాల్ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది తాగితే హ్యాంగోవర్ సమస్య కూడా ఉండదు’ అన్నారామె.
ఇవి కూడా చదవండి:
- మద్యం తాగితే మనిషి శరీరంలో ఏం జరుగుతుంది... హ్యాంగోవర్ దిగడానికి పారాసెటమాల్ మంచిదేనా?
- ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పెంచడం వల్ల ప్రజలు తాగడం మానేశారా
- మద్యం తాగితే పోలీసులకు పట్టించే కాళ్ల పట్టీలు
- 50 ఏళ్లు ప్రతి రోజూ కొండపైకి వెళ్లిన ఈ 85 ఏళ్ల తాతను అంతా ఎగతాళి చేశారు, ప్రభుత్వం సన్మానం చేసింది
- PMSBY ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన: 20 రూపాయలతో రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














