Japan : ‘మన యువతతో బాగా మద్యం తాగించే మంచి ఐడియా ఇవ్వండి ప్లీజ్’-ప్రజలకు టాక్స్ డిపార్ట్‌మెంట్ విన్నపం

మద్యపానం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మాలు కుర్సినో
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జపాన్‌లో యువత అధిక శాతం మద్యానికి దూరంగా ఉంటారు. కానీ ఈ పరిస్థితిని మార్చాలని ప్రభుత్వ యంత్రాంగం భావిస్తోంది. యువతను మద్యపానం దిశగా నడిపించటానికి కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది.

యువతరం తమ తల్లిదండ్రుల తరం కన్నా తక్కువగా మద్యం తాగుతారు. ఇది సేక్ (వరి సారాయి) వంటి మద్యపానీయాల మీద పన్ను ఆదాయాన్ని దెబ్బతీస్తోంది.

దీంతో ఈ పరిస్థితిని మార్చటానికి ఐడియాలు కావాలంటూ జాతీయ పన్ను సంస్థ.. జాతీయ స్థాయిలో ఒక పోటీ పెట్టింది.

ఈ పోటీకి 'సేక్ వివా!' (సారాయి వర్ధిల్లాలి) అని పేరు పెట్టింది. మద్యపానాన్ని మరింత ఆకర్షణీయంగా మలిచి..ఈ రంగంలో కాసులు పండించటానికి ఈ పోటీలో ఒక మంచి ప్లాన్ లభిస్తుందని ఆశిస్తోంది.

జపనీస్ సేక్ కానీ, షోచు కానీ, విస్కీ కానీ, బీర్ కానీ, వైన్ కానీ.. ఏ మద్యానికైనా యువతలో డిమాండ్‌ను పెంచటానికి మంచి బిజినెస్ ఐడియాలతో 20 ఏళ్ల నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పోటీలో పాల్గొనాలని చెప్పింది.

మద్యపానం

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్ మహమ్మారి కాలంలో రూపొందిన కొత్త అలవాట్ల వల్ల.. జనాభాలో ఎక్కువ మంది వయసు మళ్లుతుండటం వల్ల మద్యం కొనుగోళ్లు పడిపోయాయని.. పన్ను విభాగం కోసం ఈ పోటీని నిర్వహిస్తున్న సంస్థ పేర్కొంది.

ప్రచార కార్యక్రమాలు, బ్రాండింగ్‌ల వంటి సంప్రదాయ ప్రణాళికలతో పాటు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక సాంకేతికతను కూడా వినియోగిస్తూ ప్రణాళికలను రూపొందించాలని పోటీదారులకు సూచించింది.

ఈ పోటీలు, ప్రణాళికల పట్ల ప్రజల నుంచి మిశ్రమ స్పందన లభిస్తున్నట్లు జపనీస్ మీడియా కథనాలు చెప్తున్నాయి. ఓ అనారోగ్యకరమైన అలవాటును ప్రోత్సహించే ప్రయత్నాన్ని కొందరు విమర్శిస్తున్నారు. అయితే.. ఇంకొందరు వేగంగా స్పందిస్తూ ఆన్‌లైన్‌లో తమ ఐడియాలను పోస్ట్ కూడా చేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, జపనీయులకు ఇష్టమైన తెలుగు సినిమా ఇదే

ప్రముఖ నటీమణులు డిజిటల్ క్లబ్‌లలో వర్చువల్ రియాలిటీ హెస్టెస్‌లుగా 'పెర్ఫార్మ్' చేయటం వంటి ఐడియాలు వాటిలో ఉన్నాయి.

పోటీదారులు తమ ఐడియాలను సమర్పించటానికి సెప్టెంబర్ చివరి వరకూ గడువు ఉంది. ఆ ఐడియాల్లో ఉత్తమమైన వాటిని నిపుణుల సాయంతో మరింతగా అభివృద్ధి చేసి, తుది ప్రతిపాదనలను నవంబర్‌లో సమర్పిస్తారు.

ఈ పోటీ కోసం నెలకొల్పిన వెబ్‌సైట్‌లో.. జపాన్‌లో మద్యం మార్కెట్ కుచించుకుపోతోందని పేర్కొన్నారు. దేశంలో వయసుమళ్లిన జనాభాతో పాటు.. జననాల రేట్లు పడిపోతుండటం దీనికి ఒక ముఖ్య కారణమని చెప్పారు.

జపాన్ వృద్ధులు

ఫొటో సోర్స్, Getty Images

జపాన్ జనం 1995 సంవత్సరంలో తాగిన మద్యం కన్నా.. 2020 లో తాగిన మద్యం తక్కువగా ఉన్నట్లు పన్ను విభాగపు తాజా గణాంకాలు చూపుతున్నాయి. వయోజనుల వార్షిక తలసరి మద్యం వినియోగం 100 లీటర్ల నుంచి 75 లీటర్లకు పడిపోయినట్లు ఈ లెక్కలు చెప్తున్నాయి.

మద్యం మీద పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కూడా కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తోంది. జపాన్ టైమ్స్ వార్తాపత్రిక కథనం ప్రకారం.. 1980లో మొత్తం ఆదాయంలో మద్యం మీద పన్ను ఆదాయం 5 శాతంగా ఉంటే.. 2020 సంవత్సరంలో అది కేవలం 1.7 శాతంగా మాత్రమే ఉంది.

జపాన్‌లో దాదాపు మూడో వంతు మంది (29 శాతం మంది) వయసు 65 సంవత్సరాలు, అంతకన్నా ఎక్కువగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా - ఇది ప్రపంచ దేశాల్లో అత్యధిక దామాషా.

జపాన్ ఆర్థిక వ్యవస్థకు సమస్యగా పరిణమించింది.. సేక్ అంటే సారాయి భవిష్యత్తు మీద ఆందోళనలు మాత్రమే కాదు. కొన్ని రకాల ఉద్యోగాలకు యువ సిబ్బంది లభించకపోవటం, భవిష్యత్తులో వయోవృద్ధుల సంరక్షణ కూడా ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.

వీడియో క్యాప్షన్, భారత స్వాతంత్ర్యోద్యమానికి.. జపాన్‌లోని ఈ పసందైన వంటకానికి సంబంధం ఏంటో తెలుసా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)