Beer: ఇది మూత్రంతో తయారుచేసిన బీర్.. అయినా, ఫరవాలేదంటూ తాగేస్తున్నారు

బీర్

సింగపూర్‌లో ఒక కొత్త రకమైన బీర్ అమ్ముతున్నారు. దీన్ని అత్యంత పర్యావరణహిత బీర్‌గా చెబుతూ ప్రకటనలు ఇస్తున్నారు.

స్థానిక షాపులు, బార్లలో ఈ బీర్ దొరకుతుంది. సింగపూర్ వాటర్ ఏజెన్సీ (ఎస్‌డబ్ల్యూఏ) దీన్ని తయారుచేస్తోంది.

నీటి కొరతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు, నీటి సమస్యకు కొత్త పరిష్కారాలు కొనుగొనేందుకు ఈ బీర్ స్ఫూర్తినిస్తోందని ఎస్‌డబ్ల్యూఏ చెబుతోంది.

బీర్

‘‘నాకు ఇలాంటి బీరే కావాలి. వారమంతా పనిచేసిన తర్వాత, దీని సాయంతో వారాంతం హాయిగా ఉంటుంది’’అని ఒక స్విట్జర్లాండ్ వాసి బీబీసీతో చెప్పారు.

జర్మన్ బార్లీ, నార్వే ఈస్ట్ లాంటివాటితో ఈ బీరు తయారుచేస్తారు. అయితే, దీనిలో కీలకమైనది ‘‘నీ వాటర్’’యేనని బీబీసీ రిపోర్టర్ మోనికా మిల్లర్ వెల్లడించారు.

మురికినీటిని శుద్ధి చేయడం ద్వారా నీవాటర్‌ను తయారుచేస్తారు. అంటే మూత్రంతోపాటు ఇంటి నుంచి బయటకు వచ్చే మురికినీటిని ఇక్కడ శుభ్రం చేయడం ద్వారా నీవాటర్ వస్తుంది.

బీరులో ఉండేది 90 శాతం నీరే. అంటే తాజా బీరులో 90 శాతం నీవాటరే ఉంటుంది. ‘‘దీన్ని చాలా పరిశుభ్రంగా తయారుచేస్తారని అధికారులు చెబుతున్నారు. దీన్ని హాయిగా తాగొచ్చని వారు వివరించారు’’అని మోనికా చెప్పారు.

బీర్

ఇంతకీ టేస్ట్ ఎలా ఉంటుంది?

‘‘ఈ బీరు చాలా బాగుంటుంది. తాగేకొద్దీ తాగాలని అనిపిస్తుంది’’అని సింగపూర్‌లో నివసించే ఓ వ్యక్తి బీబీసీతో చెప్పారు.

అయితే, ఈ బీరు నీవాటర్‌తో తయారుచేస్తారని మీకు తెలుసా? అని చెప్పినప్పుడు ఒక వ్యక్తి ‘‘అవునా’’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన చీ అని కూడా అన్నారు. కానీ, ఆ తర్వాత తాను సరదాగా జోక్ చేశానని చెప్పారు.

బీర్

‘‘ఇక్కడ అందరికీ నీవాటర్ గురించి తెలుసు. కాబట్టి నీవాటర్‌తో చేసినా ఫర్వాలేదు’’అని అంటూ ఆయన ఆ బీరును తాగారు.

ఆ విషయం తెలిసాక, మీ మనసేమీ మారలేదా? అని ప్రశ్నించినప్పుడు.. ‘‘లేదు ఇది మంచి బీర్’’అని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, కాఫీ అంతరించిపోతుందా?

ఏళ్లుగా ఇక్కడ పెరుగుతున్న నీటి డిమాండ్‌ కోసం సింగపూర్ ప్రభుత్వం కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.

సింగపూర్‌ అన్నివైపులా నీరున్నప్పటికీ, ఇక్కడ మంచినీటి వనరులు మాత్రం చాలా తక్కువ.

వర్షం నీటితోపాటు మలేసియా నుంచి తీసుకునే నీరుతో తమకు 50 శాతం నీటి అవసరాలే తీరుతున్నాయని అధికారులు మోనికాకు చెప్పారు. మిగతా అవసరాలకు నీవాటర్‌పైనే ఆధారపడుతున్నామని వివరించారు.

వీడియో క్యాప్షన్, మద్యం తాగితే సంతాన సామర్థ్యం తగ్గుతుందా?

నీవాటర్‌లో మురికినీరుతోపాటు శుద్ధిచేసిన సముద్రం నీరు కూడా ఉంటుంది. 2060నాటికి నీటి వనరుల డిమాండ్ రెట్టింపు అవుతుందని సింగపూర్ అంచనా వేస్తోంది. ఈ డిమాండ్‌ కోసం సంప్రదాయేతర వనరులపై సింగపూర్ ఆధారపడాల్సి ఉంటుంది.

‘‘ప్రజల నుంచి ఆమోదం దొరకడం చాలా ముఖ్యం. ఇది శుభ్రమైన నీరని వారు నమ్మాలి. మేం కాలువల నుంచి నీటిని తీసుకుంటున్నప్పటికీ, చాలా శుభ్రంచేస్తామని వారికి అవగాహన కల్పించాలి’’అని పబ్లిక్ యుటిలిటీస్ బోర్డు సభ్యుడు ర్యాన్ యూన్ చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాంతాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. వాతావరణ మార్పులతో ఈ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే ముప్పుంది.

దీంతో సింగపూర్‌లాంటి ప్రాజెక్టులే దేశంలోని చాలా ప్రాంతాల్లో చేపడుతున్నారు. భారత్, చైనా, అమెరికాల్లోనూ ఇలా నీటిని శుద్ధిచేసే ఏర్పాట్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)