ఖతార్: అత్యంత సంపన్న దేశంలో పేదరికం ఎలా ఉంటుందంటే...

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES
ఖతార్‌లో పేదరికం గురించి మాట్లాడటం, ఇక్కడి పేదలపై వార్తలు రాయడం అంత తేలిక కాదు.
‘‘ఇది చాలా క్లిష్టమైన అంశం. ఎందుకంటే దీని గురించి మాట్లాడితే, ఇక్కడి పరిపాలన యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకుంటుంది’’అని బీబీసీతో ఒక ట్యాక్సీ డ్రైవర్ చెప్పారు. ఆయన తన వివరాలను బయటకు వెల్లడించొద్దని కోరారు.
ప్రపంచంలోని అత్యధిక సుసంపన్న దేశాల్లో ఖతార్ కూడా ఒకటి. అయితే, ఇక్కడ పేదరికం గురించి బయట దేశాల ప్రజలకు చాలా తక్కువ తెలుసు. ఎందుకంటే ఇక్కడ పేదరికాన్ని దాచిపెడతారు.
విదేశీ కార్మికులను విడిగా, మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లి పని చేయిస్తారు. ముఖ్యంగా పర్యటకులు విడిదిచేసే ప్రాంతాలకు ఇవి చాలా దూరంగా ఉంటాయి.
ఖతార్ స్థూల దేశీయోత్పత్తి 180 బిలియన్ డాలర్లు (రూ.14.64 లక్షల కోట్లు). ప్రధానంగా చమురు, గ్యాస్ అన్వేషణ నుంచే దేశానికి ఆదాయం వస్తోంది.
మరోవైపు ఈ రంగాల్లో పనిచేసేందుకు లక్షలాది మంది కార్మికులు ఖతార్‌కు వస్తుంటారు. ఇక్కడి ఎడారుల్లోనూ భారీయెత్తున నిర్మాణ ప్రాజెక్టుల్లో వీరు పాలుపంచుకుంటారు.

ఫొటో సోర్స్, Reuters
90 శాతం మంది విదేశీయులే
ఖతార్‌లో 30 లక్షల మంది ప్రజలు జీవిస్తున్నారు. అయితే, వీరిలో ఖతార్ పౌరుల వాటా పది శాతం మాత్రమే. అంటే ఖతార్ పౌరులు 3.5 లక్షల మంది వరకు ఉంటారు. మిగతా అందరూ విదేశీయులే.
ఇక్కడి పౌరులకు భారీ వేతనాలు, మెరుగైన సామాజిక భద్రతా పథకాలను ఖతార్ అందిస్తోంది. మరోవైపు పశ్చిమ దేశాల నుంచి వచ్చేవారికీ ఈ ప్రయోజనాలను కల్పిస్తోంది.
అధికారిక గణాంకాల ప్రకారం, పేదరికాన్ని ఖతార్ జయించింది. కానీ, వాస్తవ పరిస్థితులు ఇక్కడ భిన్నంగా ఉంటాయి. దక్షిణ, ఆగ్నేయాసియా నుంచి వచ్చే వలస కూలీల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది.
ఇక్కడ పనిచేస్తున్న పాకిస్తానీ డ్రైవర్ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడకు ఎక్కువ మంది భారత్, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ల నుంచి వస్తారు. వీరు పెద్దగా చదువుకోరు. ఇంగ్లిష్ కూడా వారికి సరిగా వచ్చుండదు. అయితే, వారి సొంత దేశంలో కంటే ఇక్కడ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉండొచ్చు. కానీ, ఇక్కడ కనీస వేతనం మాత్రం ఆశించకూడదు. ఇంటికి డబ్బులు పంపేందుకు ఒకే గదిలో ఆరుగురు కూడా జీవించాల్సి వస్తుంది’’అని చెప్పారు.

ఫొటో సోర్స్, AFP VIA GETTY IMAGES
దారుణమైన ప్రవర్తన
ఖతార్ పౌరులు, పశ్చిమ దేశాల ప్రజలు ఇక్కడ ఏడాదికి వేల డాలర్లు సంపాదిస్తుంటారు. వీరికి చాలా ప్రయోజనాలు ఉంటాయి.
అదే నైపుణ్యాలులేని విదేశీ కార్మికుల విషయానికి వస్తే, వీరికి నెలవారీ జీతం 275 డాలర్లు (రూ.22,377) మాత్రమే.
వివాదాస్పద కఫాలా వ్యవస్థను రద్దు చేసిన తొలి అరబ్ దేశం ఖతార్. మొదట కువైత్ ఈ విధానాన్ని రద్దు చేసింది. ఈ విధానంలో భాగంగా ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు తమ వసల కార్మికులపై పూర్తి హక్కులు ఉంటాయి.
కఫాలా విధానంలో ఒక కార్మికుడు యజమాని అనుమతి లేకుండా వేరే ఉద్యోగంలో చేరితే అరెస్టులు, దర్యాప్తులు, స్వదేశానికి తిరిగి పంపించడం లాంటి చర్యలు ఎదుర్కొనే అవకాశం ఉండేది.
కొన్నిసార్లు కార్మికుల పాస్‌పోర్టులను వారి యజమానులు తీసుకునేవారు. ఫలితంగా అక్కడే బలవంతంగా ఉండాల్సి వచ్చేది.
మరోవైపు ఇక్కడకు రావడానికి ప్రైవేటు సంస్థలకు ఒక్కొక్కరు 500 డాలర్లు నుంచి 3500 డాలర్లు (రూ. 40,000 నుంచి రూ.2.84 లక్షలు) వరకు చెల్లిస్తారు. దీని కోసం కొందరు రుణాలు కూడా తీసుకుంటారు. ఫలితంగా వారి పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
సంస్కరణలు తీసుకొచ్చినా..
కార్మికుల చట్టాలను సవరించే ప్రక్రియల్లో భాగంగా ఒప్పందాలు పూర్తయిన తర్వాత ఉద్యోగాలు మారేందుకు కార్మికులకు ఖతార్ అనుమతిస్తోంది. మరోవైపు కార్మికుల పాస్‌పోర్టులను తీసుకునే కంపెనీలు, ఉద్యోగులపై జరిమానాలను కూడా అమలులోకి తీసుకొచ్చింది.
అయితే, సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ, ఇప్పటికీ వలస కార్మికులు దేశంలోకి అడుగుపెట్టేందుకు ప్రైవేటు వ్యక్తులపైనే ఎక్కువ ఆధారపడుతున్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ లాంటి సంస్థలు చెబుతున్నాయి. అంటే తమ ఉద్యోగ అనుమతులు, నివాస అనుమతులు పునరుద్ధరించుకునేందుకు ఇప్పటికీ ఖతార్ పౌరులు, ఇక్కడి సంస్థలపైనే కార్మికులు ఆధారపడాల్సి వస్తోంది.
‘‘ఉద్యోగ సంస్థలు తమ కార్మికుల అప్లికేషన్లను ప్రాసెస్ చేయడానికి ఇష్టపడకపోతే, కార్మికులు ఏ తప్పూ చేయనప్పటికీ శిక్షను అనుభవించాల్సి వస్తోంది. అయితే, ఇక్కడి ఉద్యోగ సంస్థలపై ఎలాంటి ప్రభావం ఉండదు’’అని హ్యూమన్ రైట్స్ వాచ్ తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది.
మరోవైపు ఉద్యోగాలను మారొద్దని ఇక్కడి విదేశీ కార్మికులపై కంపెనీలు విపరీతమైన ఒత్తిడి తీసుకొస్తున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా వెల్లడించింది.
అయితే, విదేశీ కార్మికులను దృష్టిలో ఉంచుకొని దేశంలోని కార్మిక చట్టాలను ఖతార్ ప్రభుత్వం సవరించిందని, దీని వల్ల కార్మికుల స్థితిగతులు మెరుగుపడ్డాయని ప్రభుత్వ అధికార ప్రతినిధి బీబీసీకి తెలిపారు.
‘‘సంస్కరణల అమలులోనూ చాలా పురోగతి కనిపిస్తోంది. ఈ నిబంధనలను ఉల్లంఘించే కంపెనీల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది’’అని ఆయన వివరించారు.
ఫిఫా వరల్డ్ కప్
ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ కోసం ఏడు కొత్త స్టేడియంలు, ఒక ఎయిర్‌పోర్టు, మెట్రో, హోటళ్లు, రోడ్లను ఖతార్ నిర్మించింది.
ఫైనల్ మ్యాచ్‌ల కోసం లూసాల్ స్టేడియంను గత ఐదేళ్లుగా ఖతార్ నిర్మిస్తోంది.
ఈ స్టేడియంల నిర్మాణం కోసం 30,000 మంది విదేశీ కార్మికులను ఖతార్ ఇక్కడికి తీసుకొచ్చింది. బంగ్లాదేశ్, భారత్, నేపాల్, ఫిలిప్పీన్స్‌ల నుంచి ఎక్కువగా కార్మికులు వచ్చారు.
అయితే, వరల్డ్ కప్ కోసం పనిచేస్తున్న విదేశీ కార్మికుల్లో చాలా మంది మరణించారని మీడియాలో చాలా వార్తలు కూడా వచ్చాయి.
‘‘ఖతార్‌లోని విదేశీ దౌత్య కార్యాలయాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. 2010లో వరల్డ్ కప్‌కు అతిథ్యం ఇవ్వాలని ఖతార్ నిర్ణయించినప్పటి నుంచి నేటి వరకు 6500 మంది భారత్, నేపాల్, బంగ్లాదేశ్, నేపాల్‌లకు చెందిన కార్మికులు మరణించారు’’అని బ్రిటిష్ వార్తా పత్రిక గార్డియన్ ఒక కథనం ప్రచురించింది.
ఈ వార్తలను ఖతార్ ఖండించింది. ‘‘ఇక్కడ చనిపోయిన కార్మికులందరినీ వరల్డ్ కప్ ప్రాజెక్టుల్లో చూపించడం సరికాదు. కొందరు వయసు పైబడటం వల్ల, మరికొందరు సహజ కారణాలతో మరణించి ఉండొచ్చు’’అని ఖతార్ ప్రభుత్వ అధికార ప్రతినిధి చెప్పారు.
మొత్తం 2014 నుంచి 2020 మధ్య ఫిఫా వేడుకల కోసం పనిచేసిన 37 మంది మాత్రమే మరణించినట్లు ఖతార్ చెబుతోంది. ఇందులో మూడు మరణాలు మాత్రమే పనిచేస్తున్నప్పుడు సంభవించాయని వివరిస్తోంది.
అయితే, ఖతార్ చెబుతున్న లెక్కలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌వో) చెబుతోంది. గుండెపోటు, ఊరిపి ఆడక మరణించడం లాంటి మృతులను పనిచేస్తున్నప్పుడు సంభవించిన మృతులుగా ఖతార్ పేర్కొనడంలేదని వివరిస్తోంది. ఇక్కడ వడదెబ్బ మరణాలను కూడా లెక్క వేయడంలేదని చెబుతోంది.
ఐఎల్‌వో సమాచారం ప్రకారం.. 2021లోనే 50 మంది కార్మికులు మరణించారు. 500 మందికి తీవ్రమైన గాయాలయ్యాయి. మరో 37,600 మంది స్వల్ప గాయాలు అయ్యాయి.
మరోవైపు విదేశీ కార్మికుల మరణాలను ఖతార్ ప్రభుత్వం దాచిపెడుతోందని చెప్పే ఆధారాలు బీబీసీ అరబిక్ సర్వీస్‌కు కూడా లభించాయి.
అంతర్జాతీయంగా ఒత్తిడి రావడంతో విదేశీ కార్మికుల కోసం ఖతార్ ప్రత్యేక శిబిరాలను ఏర్పాటుచేసింది. అయితే, ఈ శిబిరాలు కూడా రాజధాని దోహాకు దూరంగా ఉన్నాయి. టీవీల్లో కనిపించే ప్రపంచ కప్ వేడుకలకు కనిపించనంత దూరంలో ఈ శిబిరాలను ఏర్పాటుచేశారు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: స్కూలు బాలికపై ఐదుగురు బాలుర అత్యాచారం.. ఆలస్యంగా వెలుగు చూసిన ఉదంతం - నిందితుల అరెస్ట్
- ఆంధ్రప్రదేశ్: కోచింగ్ సెంటర్లుగా ఫైర్ స్టేషన్లు, నిరుద్యోగులకు పోటీ పరీక్షల శిక్షణ
- ‘ఇవే నా చివరి ఎన్నికలు’ అని చంద్రబాబు ఎందుకు అన్నారు? ఏడాది కిందట అసెంబ్లీలో ఏమైంది
- డిజిటల్ పేమెంట్స్: ఫోన్‌పే, పేటీఎం వాడుతున్నారా? మీ ఖాతాలు వేరొకరికి చిక్కకుండా ఎలా జాగ్రత్తపడాలి?
- మీజిల్స్: తట్టు వ్యాధి తిరగబెడుతోందా? తెలుసుకోవాల్సిన 10 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















