నాలుగుసార్లు చాంపియన్ జర్మనీకి షాకిచ్చిన జపాన్.. ఆ తర్వాత జపాన్ అభిమానులు స్టేడియంలో చేసిన పనికి అంతా ఆశ్చర్యపోయారు..

ఫొటో సోర్స్, Getty Images
ఫిపా ప్రపంచకప్‌లో భాగంగా జర్మనీపై జపాన్ జట్టు గెలుపొందిన తర్వాత జపాన్ అభిమానులు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు.
వరల్డ్ కప్ తమ తొలి మ్యాచ్‌లో జపాన్ 2-1తో ఏకంగా నాలుగు సార్లు చాంపియన్ జర్మనీపై విజయం సాధించింది.
ఈ గెలుపును జపాన్ అభిమానులు రాత్రంతా పార్టీ చేసుకుంటూ ఆస్వాదించి ఉండొచ్చు. కానీ, వారు అలా చేయలేదు.
తమ సంస్కృతిలో పాతుకుపోయిన మంచి అలవాట్లు, సంస్కారాన్ని వారు మరోసారి ప్రదర్శించారు.
పుట్‌బాల్ మ్యాచ్ పూర్తయ్యాక స్టేడియంలోని స్టాండ్లు ఎలా మారుతాయో ఊహించుకోండి. సాధారణంగా ప్రేక్షకులు వదిలేసిన ఆహారపదార్థాలు, కాగితాలు, కూల్ డ్రింక్స్ బాటిళ్లు, ప్లేట్లతో నిండిపోతాయి. ఆ తర్వాత వాటిని శుభ్రం చేసేందుకు స్టేడియం సిబ్బంది కష్టపడాల్సి వస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
కానీ, స్టేడియంలో జపాన్ జట్టు మద్దతుదారులు (అభిమానులు) ఉంటే ఈ పరిస్థితి తలెత్తదు.
బుధవారం జపాన్ జట్టు గెలుపొందగానే వారి అభిమానులు సంబరాల్లో మునిగిపోలేదు. ఖలీఫా అంతర్జాతీయ స్టేడియాన్ని వదిలి వెళ్లలేదు. వెంటనే దాన్ని శుభ్రం చేసే పని మొదలుపెట్టారు.
నాలుగేళ్ల క్రితం రష్యాలో జరిగిన వరల్డ్ కప్ సందర్భంగా కూడా జపాన్ అభిమానులు ఇలాగే స్టేడియాన్ని శుభ్రం చేశారు. అప్పుడు ప్రిక్వార్టర్స్‌లో జపాన్ 2-3తో బెల్జియం చేతిలో ఓటమి పాలైంది.
టోర్నీ ప్రారంభమైన ఆదివారం రోజున ఖతార్, ఈక్వెడార్ మ్యాచ్ తర్వాత కూడా జపాన్ అభిమానులు ఇలాగే చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
జపాన్ సంస్కృతిలో శుభ్రత ఒక భాగం. చిన్నతనం నుంచే ప్రజల్లో శుభ్రతను అలవరుస్తారు.
2018లో ఒసాకా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ స్కాట్ నార్త్, బీబీసీతో మాట్లాడుతూ...‘‘ పరిసరాలను శుభ్రం చేయడం ద్వారా జపాన్ ప్రజలు తమ జీవన విధానాన్ని గర్వంగా ప్రదర్శిస్తారు’’ అని అన్నారు.
‘‘జపాన్ పాఠశాలల్లో విద్యార్థులు తమ తరగతి గదులు, హాళ్లను శుభ్రం చేసుకుంటారు. మ్యాచ్ తర్వాత స్టేడియాలను శుభ్రం చేయడం అనేది పాఠశాలలో వారు నేర్చుకున్న మంచి అలవాట్లకు పొడిగింపులాంటిది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
గ్రూప్ ‘ఇ’లో ఉన్న జపాన్ తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం కోస్టారికాతో తలపడుతుంది. గురువారం స్పెయిన్‌తో ఆడుతుంది.
జపాన్ జట్టు ఒకవేళ వరల్డ్ కప్ గెలవకపోయినా, వారి అభిమానులు మాత్రం ఇప్పటికే విజేతలుగా నిలిచారు.
ఇవి కూడా చదవండి:
- పోడు వ్యవసాయమా, హరిత హారమా, పాత పగలా.. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరణానికి కారణం ఏంటి
- బంగారు నాణేలను మ్యూజియంలోంచి 9 నిమిషాల్లో కొట్టేశారు, వాటి విలువ రూ. 13.5 కోట్లు
- అఫ్గానిస్తాన్: ‘ఆకలితో ఉన్న నా పిల్లలను నిద్రపుచ్చేందుకు మత్తు మందు ఇస్తున్నా'
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా ముస్తాబై మొఘల్ సైన్యం మీదకు అహోం సైన్యం ఎందుకు వెళ్లేది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














