ఫిఫా వరల్డ్ కప్ 2022: ఖతార్ అత్యంత ధనిక దేశాల జాబితాలో ఎలా చేరింది? ఇవీ 3 కారణాలు...

ఖతర్‌లో ఫిఫా వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జోస్ కార్లోస్ క్యూటో
    • హోదా, బీబీసీ ముండో

ఫిఫా వరల్డ్ కప్ 2022కు ఖతార్ రాజధాని దోహా వేదికగా మారింది. కొన్నేళ్ల క్రితం వరకు ఈ మెగా ఈవెంట్‌ ఖతార్‌లో జరుగుతుందనే అనుమానం కూడా ఎవరికీ రాలేదు.

ఖతార్ 12,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. ఒక శతాబ్దం క్రితం అంటే 1922లో ఖతార్‌ను నివాసయోగ్యం కాని ప్రాంతంగా పరిగణించేవారు.

ఇక్కడ నివసించేవారిలో మత్స్యకారులు, ముత్యాలను సేకరించేవారు పెద్ద సంఖ్యలో ఉండేవారు.

ప్రస్తుతం 90వ పడిలో ఉన్న ప్రజలకు 1930-40లలో తలెత్తిన భయంకరమైన ఆర్థిక సంక్షోభం ఇంకా గుర్తుంది. జపాన్ ప్రజలు ముత్యాల సాగు, భారీ ఉత్పత్తిని ప్రారంభించిన సమయం ఇదే. దాని ఫలితంగా ఖతార్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.

అదే దశాబ్దంలో ఖతార్‌లోని 30 శాతం జనాభా విదేశాలకు వలస వెళ్లారు. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం ఇక్కడి జనాభా 24,000లకు తగ్గిపోయింది.

కానీ, మళ్లీ ఖతార్ ఆర్థిక వ్యవస్థ యూటర్న్ తీసుకుంది. మాయ చేసినట్లు ఖతార్ ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వగా ఎదిగిపోయింది.

20వ శతాబ్దం మధ్యలో ఖతార్ ఖజానా వేగంగా పెరగడం ప్రారంభమైంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా అవతరించింది.

ఈరోజు ఖతార్ లెక్కలేనన్ని ఆకాశహర్మ్యాలు, అద్భుతమైన కృత్రిమ దీవులు, అత్యాధునిక స్టేడియాలకు నిలయంగా మారింది.

కాబట్టి ఖతార్‌ను ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా మార్చిన మూడు మార్పుల గురించి బీబీసీ విశ్లేషించింది.

ఖతార్‌

ఫొటో సోర్స్, Getty Images

చమురు ఆవిష్కరణ

ఖతార్‌లో ‘బ్లాక్ గోల్డ్ (చమురు బావులు)’ను కనుగొన్నప్పుడు అది స్వతంత్ర్య దేశం కాదు. 1916 నుంచి బ్రిటన్ పాలనలోనే ఉంది.

అనేక సంవత్సరాలు వెదికిన తర్వాత 1939లో పశ్చిమ తీరాన దోహాకు దాదాపు 80 కి.మీ దూరంలో ఉన్న దుఖాన్ అనే ప్రాంతలో తొలి నిక్షేపాన్ని కనుగొన్నారు.

ఆ ఆవిష్కరణను పెట్టుబడిగా మార్చుకోవడానికి ఖతార్‌కు మరికొన్నేళ్లు పట్టింది.

అమెరికాలోని బేకర్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఖతార్ వ్యవహారాల నిపుణుడు క్రిస్టియాన్ కోట్స్ దీని గురించి బీబీసీతో మాట్లాడారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధ ప్రారంభంలో ఈ ఆవిష్కరణ జరిగింది. అందువల్ల 1949 వరకు చమురు ఎగుమతులు జరగలేదు. లాభాలు రాలేదు’’ అని ఆయన చెప్పారు.

చమురు ఎగుమతి ఖతార్‌లో అనేక అవకాశాలను కల్పించింది. అక్కడ వేగంగా ఆధునీకరణ జరగడానికి కారణమైంది.

అభివృద్ధి చెందుతోన్న చమురు పరిశ్రమకు ఆకర్షితులైన విదేశీయులు, పెట్టుబడిదారులు ఖతార్ రావడం మొదలైంది. జనాభా వృద్ధి జరిగింది. 1950లో ఖతార్ జనాభా 25,000 కంటే తక్కువగా ఉండేది. 1970 నాటికి లక్ష కంటే ఎక్కువగా పెరిగింది.

ఒకప్పుడు మత్స్యకారులు, ముత్యాలు సేకరించేవారికి నెలవుగా పేరుగాంచిన దేశం జీడీపీ 1970 లో 300 మిలియన్ డాలర్ల (రూ. 2,445 కోట్లు)కు చేరింది.

ఒక ఏడాది తర్వాత అక్కడ బ్రిటిష్ పాలన ముగిసింది. ఖతార్ ఒక స్వతంత్ర్య దేశంగా మారింది. దానితో పాటు అక్కడ కొత్త శకం ఆరంభమైంది. ఇది ఖతార్‌ను మరింత సంపన్న దేశంగా మార్చింది.

ఖతార్

ఫొటో సోర్స్, Getty Images

సహజ వాయువు అన్వేషణ

1971లో ఖతార్‌ ఈశాన్య తీరంలోని నార్త్ ఫీల్డ్‌లో విస్తారమైన సహజవాయువు నిక్షేపాలను ఇంజినీర్లు కనుగొన్నప్పుడు వాటి ప్రాముఖ్యత గురించి కొద్ది మందికి మాత్రమే అర్థమైంది.

నార్త్‌ ఫీల్డ్‌ అనేది భూమిపై ఉన్న అతిపెద్ద సహజవాయువు క్షేత్రమని అర్థం చేసుకోవడానికి 14 సంవత్సరాలు పట్టింది. ప్రపంచ నిల్వల్లో పది శాతం ఇక్కడే ఉంది.

సహజవాయువు నిల్వల్లో ఇరాన్, రష్యా తర్వాత ఖతార్ అతిపెద్ద దేశమని తెలిసింది. నార్త్ ఫీల్డ్ క్షేత్ర విస్తీర్ణం దాదాపు 6000 చ.కి.మీ. అంటే ఖతర్‌లో సగ భాగానికి సమానం. ‘ఖతర్ గ్యాస్’ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద ద్రవీకృత సహజ వాయువు ఉత్పత్తిదారు. ఖతర్ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ఈ కంపెనీ ముఖ్య పాత్రను పోషిస్తుంది.

చమురు తరహాలోనే సహజవాయువు నుంచి కూడా ఆర్జించడానికి ఖతార్‌కు సమయం పట్టింది.

హమద్ బిన్ ఖలీఫా అల్తానీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హమద్ బిన్ ఖలీఫా అల్తానీ

1995 తిరుగుబాటు

21వ శతాబ్దంతో రాకతో పాటుగా ఖతార్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు గ్రాఫ్ కూడా అమాంతం పెరిగింది. 2003-04లో ఖతార్ జీడీపీ రేటు 3.7 నుంచి 19.2 శాతానికి ఎగిసింది. రెండేళ్ల తర్వాత 2006లో ఇది 26.2 శాతానికి పెరిగింది.

ఈ పెరుగుతున్న జీడీపీ రేటు ఎన్నో ఏళ్ల పాటు ఖతార్ శక్తిసామర్థ్యాలకు ముఖ్య గుర్తింపుగా ఉంది. ఈ పెరుగుదలను కేవలం సహజ వాయువు ధర వరకే పరిమితం చేయకూడదు.

ఖతర్ యూనివర్సిటీ ప్రొఫెసర్, స్థిరమైన ఆర్థిక శాస్త్రం నిపుణుడు మొహమ్మద్ సైదీ దీని గురించి బీబీసీతో మాట్లాడారు.

‘‘దేశంలో రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నప్పుడే ఈ ఆర్థిక మార్పులు కూడా జరిగాయి. 1995లో ఆమిర్ తమీమ్ బిన్ హమద్ అల్తానీ తండ్రి హమాద్ బిన్ ఖలీఫా అల్తానీ అధికారంలోకి వచ్చారు. అసలు ఇది ఎలా జరిగిందంటూ కొంతమంది ప్రశ్నలు లేవనెత్తుతుంటారు.

తన తండ్రి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో హమాద్ అధికారంలోకి వచ్చారు. అల్తానీ కుటుంబం 150 ఏళ్లుగా ఖతార్‌ను పాలిస్తోంది. వారి వారసులకు అధికారం దక్కడం ఇదే తొలిసారేం కాదు. హమాద్ అధికారంలోకి రావడం ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పును తీసుకొచ్చింది.

గ్యాస్, చమురును వెలికితీయడానికి చేసిన పెట్టుబడులు, వాటిని ఎగుమతి చేయడం కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు ఖతార్‌ను విదేశాలతో అనుసంధానించడానికి దోహదపడ్డాయి.

ఖతర్

ఫొటో సోర్స్, Getty Images

ఖతార్ ఆర్థిక వ్యవస్థ ముందున్న సవాళ్లు

ఇటీవలి సంవత్సరాల్లో ఖతార్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. మందగమనాన్ని ఎదుర్కొంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటంతో భవిష్యత్‌లో అనేక సవాళ్లను ఎదుర్కోనుంది. వాతావరణంపై శిలాజ ఇంధనాల ప్రభావంపై అన్నివైపులా నుంచి సవాళ్లను ఎదుర్కొంటోంది.

‘‘2013, 2014లో చమురు దరలు పడిపోయాయి. ఆదాయ వనరులను మార్చాల్సిన అవసరం గురించి తీవ్ర చర్చ జరిగింది’’ అని సైదీ చెప్పారు.

ఖతార్‌తో ఒక దౌత్యపరమైన వివాదం తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్టు దేశాలు 2017 నుంచి 2021 వరకు నిషేధం విధించాయి. ఇది ఖతార్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా నిలిచింది.

కోట్స్ చెప్పిన దాని ప్రకారం... చమురు, సహజ వాయువు తప్ప ఖతార్ మిగతా మార్గాల్లో ఆదాయ వనరులను అన్వేషించలేదు. అందుకే వారు ఇప్పుడు ప్రైవేటు సెక్టారును విస్తరించాలని అనుకుంటున్నారు. హైడ్రో కార్బన్‌లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి వీలుగా ప్రైవేటులో పెట్టుబడులు పెడుతున్నారు.

ఖతర్‌లో ప్రపంచకప్

ఫొటో సోర్స్, Getty Images

ఈ ప్రయత్నం దిశగా మంచి ఉదాహరణ ఏంటంటే లండన్, న్యూయార్క్ వంటి నగరాల్లో ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఖతర్ ఫండ్ సంస్థలు అనేక ప్రాపర్టీలను కలిగి ఉన్నాయి.

‘‘ఖతార్ ఇప్పుడు దోహాను ఈవెంట్‌లు, కాన్ఫరెన్స్‌లు, మీటింగ్‌లకు హబ్‌గా మార్చడంపై దృష్టి సారించింది. వరల్డ్ కప్ నిర్వహణ దీనికో మంచి ఉదాహరణ’’ అని కోట్స్ నమ్ముతున్నారు.

ఫుట్‌బాల్ వరల్డ్ కప్ నిర్వహణ కోసం ఖతార్ 2,00,000 మిలియన్ల డాలర్లకు పైగా ఖర్చు చేసింది. చరిత్రలో ఇదే అత్యంత ఖరీదైన ఫిఫా వరల్డ్ కప్. దీని కోసం 8 స్టేడియాలు, ఒక కొత్త విమానాశ్రయం, కొత్త మెట్రో లైన్ వంటి మౌలిక సదుపాయాలను నిర్మించింది.

మౌలిక సదుపాయాల నిర్మాణాల కోసం పనిచేసిన విదేశాలకు చెందిన కార్మికులు అమానవీయ పరిస్థితుల్లో ఖతార్‌లో పని చేశారని ఆరోపణలు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో కార్మికులు మరణించినట్లు నివేదికలు వచ్చాయి.

వరల్డ్ కప్ బిడ్ దక్కించుకునేందుకు ఖతార్ లంచం ఇచ్చిందనే ఆరోపణలు కూడా వచ్చాయి.

ఎల్‌జీబీటీ కమ్యూనిటీ పట్ల ఖతార్ చేసిన వివాదాస్పద ప్రకటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.

అయితే, ఈ విమర్శలను ఎదుర్కొంటూ ఒక చిన్న దేశమైన ఖతార్ ఫిఫా వరల్డ్ కప్ టోర్నీకి విజయవంతంగా ఆతిథ్యం ఇస్తోంది.

వీడియో క్యాప్షన్, 'నీళ్లు తాగండి' అన్న రొనాల్డో... 400 కోట్ల డాలర్లు నష్టపోయిన కోకాకోలా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)