యూరో 2020 ఫైనల్ : ఇంగ్లండ్ వర్సెస్ ఇటలీ, ఎవరి బలం ఎంత?

యూరో 2020 ఫైనల్

ఫొటో సోర్స్, Getty Images

యూరో 2020 పుట్‌బాల్‌ కప్ ఫైనల్ పోరుకు లండన్‌లోని వెంబ్లీ స్టేడియం ముస్తాబైంది. ఇంగ్లండ్, ఇటలీ మధ్య జరిగే ఈ తుది సమరంలో కప్ ఏ జట్టు దక్కించుకొంటుందనే ఉత్కంఠకు ఆదివారం అర్ధరాత్రి తర్వాత తెర పడనుంది.

ఈ టోర్నమెంటులో ఇప్పటివరకు ఇటలీ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. అయితే, ఇంగ్లండ్ జట్టు కూడా మరీ వెనుకబడి ఏమీ లేదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

సెమీఫైనల్‌లో స్పెయిన్‌పై 4-2 గోల్స్ తేడాతో ఇటలీ విజయం సాధించగా, డెన్మార్క్‌పై 2-1 గోల్స్ తేడాతో ఇంగ్లండ్ గెలిచింది.

55 ఏళ్ల తర్వాత యూరో కప్ టోర్నీ ఫైనల్ చేరిన ఇంగ్లండ్... సొంత గడ్డపై టైటిల్ గెలవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఇటలీ రెండోసారి యూరో కప్ కొట్టాలనే పట్టుదలతో ఉంది.

1966 తర్వాత ఇంగ్లండ్ ఒక ప్రధాన టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. 1966లో ఇంగ్లండ్ ఫుట్ బాల్ ప్రపంచకప్‌ సాధించింది.

ఇంగ్లండ్ జట్టుకు ఈ ఫైనల్ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్. ఇంగ్లండ్ జట్టుకు బ్రిటన్ రాణి ఎలిజబెత్ శుభాకాంక్షలు చెప్పారు. యూరో కప్ ఫైనల్ మ్యాచ్ గెలవాలని ఆమె ఆకాంక్షించారు.

యూరో కప్‌ చరిత్రలో ఇంగ్లండ్ కన్నా ఇటలీ ట్రాక్ రికార్డ్ మెరుగ్గా ఉంది. ఇటలీ 1968లో యూరో కప్ సాధించింది. 2000, 2012లలో ఫైనల్‌ వరకూ వెళ్లి వెనుదిరిగింది.

యూరో 2020 ఫైనల్

ఫొటో సోర్స్, Getty Images

ఫైనల్ ఎలా చేరాయంటే…

యూరో కప్ గ్రూపు మ్యాచుల్లో క్రొయేషియాపై, చెక్ రిపబ్లిక్‌పై ఇంగ్లండ్ గెలుపొందింది. స్కాట్లాండ్‌తో మ్యాచ్ డ్రా అయ్యింది. ప్రి క్వార్టర్ ఫైనల్లో జర్మనీపై, క్వార్టర్ ఫైనల్లో యుక్రెయిన్‌పై విజయం సాధించింది. సెమీస్‌లో డెన్మార్క్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

గ్రూపు మ్యాచుల్లో టర్కీ, స్విట్జర్లాండ్‌, వేల్స్ జట్లను ఇటలీ ఓడించింది. ప్రి క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రియాను, క్వార్టర్ ఫైనల్లో బెల్జియంను ఓడించింది. సెమీఫైనల్లో స్పెయిన్‌ను ఓడించి, ఫైనల్ చేరింది.

వీడియో క్యాప్షన్, యూరో 2020: ఇంగ్లండ్ - ఇటలీ ఫైనల్ పోరుకు రంగం సిద్ధం

పాఠాలు నేర్చుకున్న ఇటలీ

2018 ప్రపంచకప్‌కు అర్హత సాధించడంలో విఫలమైన ఇటలీ.. ఆ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకుని మేనేజర్ రాబర్టో మాన్సిని నేతృత్వంలో పటిష్ఠంగా మారింది. ఆ తర్వాత ఆడిన 33 మ్యాచ్‌ల్లో అన్నింటినీ గెలుచుకుంది.

ప్రధాన టోర్నీల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఇటలీ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా ఓడిపోలేదు.

ఇప్పుడు సొంతగడ్డపై, స్థానిక అభిమానుల మధ్య ఆడటం ఇంగ్లండ్ జట్టుకు అనుకూలించే అంశమే. గతంలో వెంబ్లీ మైదానంలో ఆడిన 17 మ్యాచుల్లో ఇంగ్లండ్ 15 గెలుచుకుంది.

అలా అని.. అది ఇటలీ జట్టుకు ప్రతికూలమని చెప్పలేమని, వాళ్లు ఈ మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తారని బీబీసీ స్పోర్ట్ ఫుట్ బాల్ నిపుణులు మార్క్ లారెన్సన్ తెలిపారు. ఇంగ్లండ్ జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని ఇటలీ సీనియర్ డిఫెండర్ చీలిని వ్యాఖ్యానించారు.

ఇంగ్లండ్ జట్టులో కౌప్టైన్‌ హ్యారీ కేన్,‌ రహీమ్‌ స్టెర్లింగ్‌, మెగ్వాయోర్‌ లాంటి మెరుగైన ఆటగాళ్లు ఉన్నారు. ఇటలీ కూడా మిడ్ ఫీల్డర్ లోరెంజో, సిరో, ఫెడెరికో లాంటి ఆటగాళ్లతో పటిష్ఠంగా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)