హైదరాబాద్: స్కూలు బాలికపై ఐదుగురు బాలుర అత్యాచారం.. ఆలస్యంగా వెలుగు చూసిన ఉదంతం - నిందితుల అరెస్ట్

లైంగిక హింస

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్‌ శివార్లలో.. సహ విద్యార్థిని అయిన ఓ బాలిక మీద అత్యాచారం చేసిన ఆరోపణలతో ఐదుగురు బాలురను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం... బాధితురాలు 10వ తరగతి చదువుతుండగా, అరెస్టయిన అబ్బాయిల్లో ఒకరు 9వ తరగతి, మిగతావాళ్లు 10వ తరగతి చదువుతున్నారు.

హైదరాబాద్ శివార్లలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒక గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వీరంతా చదువుకుంటున్నారు.

ఈ నలుగురు అబ్బాయిలు ఫ్రెండ్స్‌గా ఉండేవారని, స్కూల్ అయిపోయాక ఊరి బయట తిరుగుతూ మొబైల్ ఫోన్లలో అశ్లీల వీడియోలు చూడడం వీరికి అలవాటైందని పోలీసులు చెప్పారు.

రాచకొండ కమిషనరేట్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నిందితులైన బాలురకు, బాధిత బాలికకు పరిచయం ఉంది.

ఆ అమ్మాయి కూడా వీళ్లు ఉండే వాడలోనే ఉంటోంది. ఒకే ప్రాంతం, ఒకే స్కూల్, ఒకే క్లాస్ కావడంతో రోజూ మాట్లాడేంత చనువు పెరిగింది.

అప్పటికే అశ్లీల వీడియోల ప్రభావంలో ఉన్న అబ్బాయిలు, ఈ అమ్మాయిని తమతో శారీరకంగా కలిసేలా ఒప్పించాలని ఆలోచించారు.

బాలికపై అత్యాచారం

‘‘ఆ అమ్మాయి తల్లితండ్రులిద్దరూ పేద వర్గానికి చెందిన వారు. వారి తల్లి, తండ్రి ఇద్దరూ పనుల నిమిత్తం ఉదయాన్నే వెళ్లి సాయంత్రం వస్తారని గమనించారు ఈ బాలురు. ఒకరోజు, అమ్మాయి వాళ్లింట్లో తల్లిదండ్రులు లేని సమయంలో నలుగురు అబ్బాయిలూ కలసి ఆమె ఇంటికి వెళ్లారు. పుస్తకం కోసం వచ్చామంటూ ఇంట్లోకి వెళ్లారు. లోపలికి వెళ్లాక ఒకరి తరువాత ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. వారిలో ఒకరు ఇదంతా వీడియో తీశారు. ఎవరికైనా చెబితే వీడియో బయట పెడతాం అంటూ బెదిరించారు. ఇది ఆగస్టులో జరిగింది’’ అని పోలీసులు చెప్పారు.

‘‘ఆ ఘటన జరిగిన పది రోజుల ఆ నలుగురిలో ఒక అబ్బాయి, తనకు తెలిసిన మరో అబ్బాయిని తీసుకుని ఆ అమ్మాయి ఇంటికి వెళ్లాడు. మళ్లీ అత్యాచారం చేశారు. ఈసారి కూడా ఫోన్‌లో వీడియో తీశారు’’ అని పేర్కొన్నారు. అయితే ఇలా రెండుసార్లే జరిగిందా, లేదా ఆమెను బ్లాక్ మెయిల్ చేసి తరచుగా అత్యాచారానికి పాల్పడ్డారా అన్న విషయం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

అయితే రెండోసారి తీసిన వీడియోను ఒక అబ్బాయి వాట్సప్ ద్వారా స్నేహితులకు పంపాడని, దీంతో భయపడిన బాలిక తన తల్లితండ్రులకు విషయం చెప్పిందని, తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారని వివరించారు.

వీడియో క్యాప్షన్, నటి భావనపై లైంగిక దాడి కేసు: ఆ రోజు ఏం జరిగింది? నిందితులు ఎవరు?

కేసు నమోదైన 24 గంటల్లోనే అబ్బాయిలు ఐదుగురినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు, అమ్మాయిని వైద్య పరీక్షలకు పంపారు. అబ్బాయిలను జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరచి, జువైనల్ బోర్డుకు తరలించారు.

బాలుర దగ్గర నుంచి మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

ఆ వీడియో ఇప్పటికే బయటకు వెళ్లడంతో, ఎవరైనా ఆ వీడియోను ఫార్వర్డ్ చేస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

బాలురిపై ఐపీసీ సెక్షన్లు, మైనర్లపై అత్యాచారాలకు సంబంధించిన పోక్సో చట్టంలోని సెక్షన్లు, ఫోన్లో వీడియోలు తీసి ఫార్వర్డ్ చేయడంతో ఐటీ చట్టంలోని సెక్షన్ల కింద కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.

‘‘ఈ ఘటనలో అమ్మాయీ, అబ్బాయిలూ అంతా పేద కుటుంబాల నుంచి వచ్చిన వారే. అందరిదీ దాదాపు ఒకే ఆర్థిక పరిస్థితి. అమ్మాయి మతిస్థిమితం సక్రమంగా లేదు అనేది నిజం కాదు’’ అని బీబీసీతో చెప్పారు ఒక పోలీసు అధికారి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)