గుజరాత్ ఎన్నికల్లో ముస్లింలు కూడా బీజేపీకే ఓటు వేశారా, ఈ వాదనల్లో నిజమెంత?

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA/GETTYIMAGES
- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రికార్డు విజయాన్ని సాధించిన తర్వాత ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ముస్లిం జనాభా అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఎలా విజయాన్ని సాధించింది? అన్నది ఆ చర్చ.
ఈ ఎన్నికల్లో కూడా ముస్లిం అభ్యర్థులను బీజేపీ పోటీలో నిలపలేదు. అయినప్పటికీ ముస్లిం జనాభా 20-30 శాతం ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ మెరుగైన ఫలితాలు రాబట్టింది.
ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయడం, యూనిఫాం సివిల్ కోడ్ అంశాన్ని లేవనెత్తడం వల్ల తమ పార్టీకి పెద్ద సంఖ్యలో ముస్లిం ఓట్లు వచ్చాయని బీబీసీతో మాట్లాడుతూ గుజరాత్ బీజేపీ అధికార ప్రతినిధి యగ్నేష్ దవే అన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరుగురు ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇవ్వగా, ఆమ్ ఆద్మీ పార్టీ నలుగురు ముస్లింలను ఎన్నికల బరిలో నిలిపింది.
ఏఐఎంఐఎంకు చెందిన అసదుద్దీన్ ఓవైసీ 13 మంది అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టారు. అందులో ఇద్దరు హిందువులు.
అయితే, కేవలం ఒక ముస్లిం అభ్యర్థి మాత్రమే ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. కాంగ్రెస్ తరఫున జమాల్‌పుర్ ఖాడియా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఇమ్రాన్ ఖేడావాలా గెలిచారు.
గుజరాత్‌లో ముస్లిం జనాభా 9 శాతమే. అయితే, ముస్లింల సంఖ్య 20-30 శాతం వరకు ఉండే నియోజకవర్గాలు 10 కంటే ఎక్కువే ఉన్నాయి. వీటిలో జమాల్‌పుర్ మినహా మిగతా అన్ని స్థానాల్లో బీజేపీనే విజయం సాధించింది.
ముస్లింలు ఎక్కువగా ఉన్న వాగ్రా, ఈస్ట్ సూరత్, భుజ్, దరియాపుర్, గోద్రా, వెజల్‌పుర్, దానిలిమ్డా, భరూచ్, లింబాయత్, అబ్డాసా, వాంకనెర్ నియోజకవర్గాలు కూడా బీజేపీ వశమయ్యాయి.

ఫొటో సోర్స్, SAM PANTHAKY/GETTYIMAGES
ముస్లింలు, బీజేపీకి ఓటు వేశారా?
ముస్లిం ఓటర్ల శాతం ఎక్కువగా ఉన్న స్థానాల్లో కూడా పార్టీ విజయం సాధిస్తుందని అంచనా వేసినట్లు బీబీసీతో మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ యగ్నేష్ దవే అన్నారు.
‘‘అహ్మదాబాద్‌లోని జమాల్‌పుర్, దరియాపుర్, వెజల్‌పూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కేవలం జమాల్‌పుర్ సీటును మాత్రమే గెలుచుకుంది. గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ ఖాతాలోనే చేరుతున్న గోద్రా వంటి నియోజకవర్గంలో కూడా ఈసారి బీజేపీనే గెలిచింది’’ అని అన్నారు.
గోద్రా సీటును బీజేపీ నేత చంద్రసిన్హ్ కనక్‌సింగ్ రౌల్జీ గెలుచుకున్నారు.
2017 వరకు గోద్రా సీటు కాంగ్రెస్‌కే దక్కగా, చంద్రసింగ్ రౌల్జీ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన తర్వాత ఈ సీటును బీజేపీ గెలుచుకోవడం ఇది రెండోసారి.
2007 నుంచి ఆయన ఈ స్థానంలో పోటీ చేస్తున్నారు.
‘‘ముస్లింలు బీజేపీకి ఓటు వేశారని చెప్పడం తప్పు’’ అని బీబీసీతో మాట్లాడుతూ అహ్మదాబాద్ సీనియర్ జర్నలిస్ట్ అజయ్ ఉమట్ అన్నారు.
ఈ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు ఏకతాటిపైకి వచ్చారని, అనేక అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు చీలిపోయేలా స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టారని, దీని వల్ల భాజపా లబ్ధి పొందిందని ఆయన వివరించారు.
‘‘ముస్లింలకు సంబంధించిన అనేక సమస్యలపై ‘ఆప్’ పార్టీ మౌనంగా ఉన్నందున ముస్లింలలోని ఒక వర్గం ఆమ్ ఆద్మీ పార్టీపై కోపంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు కాంగ్రెస్‌కు ఓటు వేశారు’’ అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
బిల్కిస్ బానో అంశం బీజేపీకి సమస్యగా మారలేదా?
బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో దోషులను విడుదల చేయడం తమకు ఈ ఎన్నికల్లో సమస్యగా మారలేదని, కొన్ని జాతీయ చానళ్లు మాత్రమే దీన్ని సమస్యగా మార్చాయని బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ యగ్నేశ్ దవే అన్నారు.
"గోద్రాలో ఈ ఘటన జరిగిన వార్డులోని బూత్‌లో మాకు 60 శాతం ఓట్లు వచ్చాయి. మోర్బీలో ప్రజలు బీజేపీ చేసిన పనిని చూశారు. కాబట్టి ఇటీవల అక్కడ ప్రమాదకర సంఘటన జరిగినప్పటికీ మమ్మల్నే గెలిపించారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
2002 అల్లర్లలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యులలో ఏడుగురిని చంపిన 11 మంది దోషులకు జీవిత ఖైదు విధించారు.
సత్ప్రవర్తన కారణంగా ఈ కేసులోని దోషులందరినీ గుజరాత్ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేసింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అన్ని చోట్ల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ కేసులో బిల్కిస్ బానో తరపున సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా దాఖలైంది.
ఈ ఎన్నికల్లో ముస్లిం ఓట్లు మాత్రమే కాకుండా దళిత, గిరిజన వర్గాల ఓట్లు కూడా బీజేపీకి వచ్చాయని యగ్నేశ్ దవే అన్నారు. ఈ కారణంగానే పార్టీ అదనంగా 50 సీట్లను సాధించిందని తెలిపారు.
దీనితో పాటు ట్రిపుల్ తలాక్‌పై నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయం, కామన్ సివిల్ కోడ్ అంశం, ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పనిచేసిన మైనార్టీ మిత్రులను బీజేపీ సంపాదించుకోవడం కూడా ఫలితాలపై ప్రభావం చూపిందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES/GETTYIMAGES
‘ముస్లింలు, బీజేపీకి ఓటు వేశారని చెప్పడం తప్పు’
అయితే బీజేపీ చేస్తోన్న ఈ వాదనతో ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు సంజయ్ కుమార్ ఏకీభవించడం లేదు. గణాంకాల ద్వారా ఆయన తన అభిప్రాయాన్ని వివరించారు. వివరిస్తున్నారు.
గుజరాత్‌లోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం ఓట్ల శాతం 20 శాతానికి పైగా ఉన్న స్థానాలు 12 మాత్రమేనని ఆయన చెప్పారు.
ఈ 12 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 10 సీట్లలో గెలిచింది.
ఆయన చెప్పినదాని ప్రకారం, మొత్తం ఓటర్ల సంఖ్యలో ముస్లిం ఓటర్లు 10-20 శాతం ఉన్న స్థానాలు 53 ఉన్నాయి. వాటిలో 50 స్థానాలను బీజేపీ గెలుచుకుంది.
అంటే దీనర్థం ఈ స్థానాల్లో ముస్లిం ఓటర్లు అత్యధికంగా బీజేపీ అభ్యర్థులకే ఓటు వేశారని కాదు.
లెక్క ప్రకారం, ఈ అసెంబ్లీ స్థానాల్లో ముస్లిం ఓటర్లు కేవలం 10-20 శాతం మాత్రమే ఉన్నారు. మిగిలినవారంతా హిందువులే. వీరంతా బీజేపీకి ఓటు వేసినట్లు అర్థం చేసుకోవాలి.
సంజయ్ కుమార్ ఈ గణాంకాల గురించి మరింతగా వివరించారు.
"ఈ ఎన్నికల్లో 64 శాతం ముస్లిం ఓట్లు కాంగ్రెస్‌కు పోలయ్యాయి. దాదాపు 15 శాతం బీజేపీకి, 12-14 శాతం ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చాయని మా సర్వేలో తేలింది.

ఫొటో సోర్స్, Getty Images
ముస్లింల ఓట్లు ఎక్కువ వచ్చాయని బీజేపీ చెప్పుకుంటోంది. కానీ, కాంగ్రెస్‌కు 64 శాతం ముస్లిం ఓట్లు వెళ్లాయి’’ అని ఆయన చెప్పారు.
గత ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుపొందగా, ఈసారి 156 సీట్లు గెలుచుకుంది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి ఓట్లు పెరిగాయి. ఇది నిజం. కానీ, ముస్లిం ఓట్ల కారణంగా బీజేపీకి ఈ ఆధిక్యం దక్కలేదు.
గతంతో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం 48 నుంచి 52.5 శాతానికి పెరిగింది. అంటే అందులో నాలుగున్నర శాతం పెరుగుదల కనిపించింది’’ అని సంజయ్ కుమార్ వివరిచారు.
ఈ ఎన్నికలలో ఏఐఎంఐఎం చెందిన అసదుద్దీన్ ఓవైసీ 13 మంది అభ్యర్థులను నిలబెట్టారు.
అయితే ఆ పార్టీకి కేవలం 0.29 శాతం ఓట్లు మాత్రమే దక్కాయని సంజయ్ కుమార్ చెప్పారు.
ఈ ఎన్నికల్లో 12 మంది ఏఐఎంఐఎం అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి.
ఆప్, ఒవైసీల మధ్య చాలా ముస్లిం ఓట్లు చీలిపోయాయని, దాని ప్రభావం కాంగ్రెస్‌పై పడిందని కాంగ్రెస్ నాయకుడు ఇమ్రాన్ ఖేదావాలా, బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: జయహో బీసీ సభను అధికార పార్టీ ఎందుకు నిర్వహిస్తోంది, బీసీ కార్పోరేషన్లతో జరిగిన మేలు ఎంత ?
- విశాఖపట్నం: నీళ్ల డ్రమ్ములో మహిళ మృతదేహం, 18 నెలలుగా ఎవరికీ అనుమానం రాలేదు, అసలేం జరిగింది?
- వివాహేతర లైంగిక సంబంధాలను నిషేధిస్తూ చట్టం తెచ్చిన ఇండోనేసియా
- నోబెల్ ప్రైజ్ డిసీజ్: నోబెల్ అందుకున్న తర్వాత కొంతమంది శాస్త్రవేత్తల వింత ప్రవర్తనకు కారణం ఇదేనా?
- బీబీసీ 100 మంది మహిళలు 2022: ఈ ఏడాది జాబితాలో తెలుగు యువతి ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















