గౌతమ్ అదానీ: ‘చావును నేను 15 అడుగుల దూరంలో చూశాను’

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అది 2008 నవంబర్ 26 రాత్రి. ముంబయిలోని విలాసవంతమైన తాజ్‌మహల్ హోటల్‌లో గౌతమ్ అదానీ భోజనం చేస్తుండగా కొందరు దుండగులు లోపలికి దూసుకొచ్చారు. తుపాకీలతో అన్ని దిక్కులా కాల్పులు జరిపారు. గ్రనేడ్లు విసిరారు.
అప్పటికి అదానీ భారతదేశంలోని అత్యంత ధనికుల్లో 10వ స్థానంలో ఉన్నారు.
10 మంది పాకిస్తాన్ సాయుధ తీవ్రవాదులు సముద్ర మార్గంలో ముంబయిలోకి ప్రవేశించారు.
వారు బృందాలుగా విడిపోయి నగరాన్ని ముట్టడించారు. వాహనాలను హైజాక్ చేశారు.
కొన్ని ప్రాంతాలకు గురిపెట్టి కాల్పులు జరిపారు. వాటిలో రెండు ఖరీదైన హోటళ్లు కూడా ఉన్నాయి.
60 గంటల పాటు ముంబయి నగరం నిర్బంధంలోకి వెళ్లిపోయింది. తీవ్రవాదుల కాల్పుల్లో 166 మంది మరణించారు. భారత, పాకిస్తాన్‌ల మధ్య మళ్లీ అగ్గి రాజుకుంది.
ముంబయి తాజ్ హోటల్ దాడి నుంచి బయటపడి..
అదానీ సహా అక్కడ భోజనం చేస్తున్న వారందరినీ హోటల్ సిబ్బంది బేస్‌మెంట్‌కు తరలించారు.
కొన్ని గంటల తరువాత పై ఫ్లోర్‌లోని ఒక హాల్‌కు తరలించారు.
బయట తీవ్రవాదులు కాల్పులు జరుపుతూనే ఉన్నారు.
ఈ సంఘటన తరువాత అదానీ ఇండియా టుడే పత్రికతో మాట్లాడుతూ ఆ రోజు జరిగిన విషయాలను వివరించారు.
"ఆ హాల్‌లో 100 మంది అతిథులు ఉంటారు. కొంతమంది సోఫాల కింద తలదాచుకున్నారు. మరి కొంతమంది మూలలకు పరిగెత్తారు. తమ ప్రాణాలు కాపాడమని దేవుడిని ప్రార్థిస్తున్నారు" అని అదానీ చెప్పారు.
అదానీ ఒక సోఫాపై కూర్చుని దేవుడిపై విశ్వాసం ఉంచమని తోటి అతిథులను చెప్పారు. అహ్మదాబాద్‌లో ఉన్న తన కుటుంబానికి ఫోన్ చేశారు. అప్పటికే వారు ఈ వార్త విని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. హోటల్ బయట ఆయన కారు డ్రైవర్, సెక్యూరిటీ గార్డ్ అదానీ బయటకి రావడం కోసం ఎదురు చూస్తూ భయంభయంగా నిల్చున్నారు.
అదానీ ఆ రాత్రి అక్కడే గడిపారు. మర్నాడు ఉదయం కమాండోలు హోటల్‌ను చుట్టుముట్టిన తరువాత, అదానీ సహా మిగతా బందీలను వెనుక ద్వారం నుంచి బయటకి తీసుకొచ్చారు.
"నేను చావును 15 అడుగుల దూరంలో చూశాను" అని ఆయన అహ్మదాబాద్ తిరిగొచ్చిన తరువాత మీడియాతో చెప్పారు. హోటల్ నుంచి బయటపడిన తరువాత, తన ప్రైవేట్ జెట్‌లో సాయంత్రానికి ఇల్లు చేరుకున్నారు.

ఫొటో సోర్స్, Google
రిస్కుతో కూడిన ప్రయాణం
దాదాపు14 ఏళ్ల తరువాత, 60 ఏళ్ల అదానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో మూడో వ్యక్తిగా ఎదిగారు. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ మొదటి, రెండు స్థానాల్లో ఉన్నారు.
నేడు అదానీ వ్యాపార సామ్రాజ్యం అన్ని మూలలకూ విస్తరించింది.
ఏడు పబ్లిక్ ట్రేడెడ్ కంపెనీలు, 23,000 మంది ఉద్యోగులు, 23 కోట్ల డాలర్ల విలువ గల వ్యాపారాలు నడుపుతున్నారు.
ఇటీవలే ప్రముఖ వార్తా సంస్థ ఎన్‌డీటీవీ అదానీ చేతికి రావడంతో ఆయన పేరు మరోసారి వార్తల్లో వినిపిస్తోంది. అదానీకి ఇది తొలి మీడియా వెంచర్.
స్కూల్ చదువు మధ్యలోనే ఆపేసి వ్యాపారం వైపు అడుగులు వేసి, కోటీశ్వరుడిగా ఎదగడంలో అదానీ తీసుకున్న రిస్క్ సామాన్యమైనది కాదు.
1998 జనవరిలో అహ్మదాబాద్‌లో అదానీని, ఆయన అనుచరుడిని దుండగులు డబ్బు కోసం కిడ్నాప్ చేశారన్న రిపోర్టులు వచ్చాయి.
ఈ కేసుకు సంబంధించిన ఇద్దరు అనుమానితులను 2018లో విడుదల చేశారు. కోర్టు నుంచి ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినప్పటికీ అదానీ, ఆయన అనుచరుడు విచారణకు హాజరు కాకపోవడంతో నిందితులను విడుదల చేశారు.
అదానీ ఎప్పుడూ లోప్రొఫైల్‌లో ఉంటారు. ఈ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడరు. ఒకసారి మాత్రం ఒక జర్నలిస్ట్‌కు ఈ విషయాలు చెప్పారు.
"నా జీవితంలో రెండు మూడు చాలా దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి" అని చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
'అత్యంత దూకుడు కలిగిన పారిశ్రామికవేత్త'
గౌతం అదానీ 16 ఏళ్ల వయసులో చదువు మానేసి ముంబయి వచ్చి వజ్రాల వ్యాపారం మొదలుపెట్టారు. అయితే, ఇది ఎక్కువ కాలం కొనసాగలేదు. రెండేళ్ల తరువాత మళ్లీ గుజరాత్ వచ్చి తన అన్నయ్య నడుపుతున్న ప్యాకేజింగ్ ఫ్యాక్టరీలో చేరారు.
అదానీ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు. వారి కుటుంబం వస్త్ర వ్యాపారం చేసేది.
1998లో తన సొంత సంస్థను ప్రారభించిన తరువాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. 24 ఏళ్లల్లో తన వ్యాపారాన్ని పోర్టులు, గనులు, రైల్వేస్, మౌలిక సదుపాయాలు, ఇంధనం, రియల్ ఎస్టేట్ రంగాలకు విస్తరించారు.
అందుకే అదానీ "భారతదేశంలోని కొత్త తరం పారిశ్రామికవేత్తలలో అత్యంత దూకుడు కలిగిన వ్యక్తి" అని విమర్శకుల ప్రశంసలు పొందారు.
నేడు అదానీ మౌలిక సదుపాయాల రంగంలో తిరుగులేని ఆధిపత్యం సంపాదించారు. భారతదేశంలోని రెండవ అతిపెద్ద సిమెంట్ కంపెనీ నడుపుతున్నారు.
13 పోర్టులు ఆయన చేతిలో ఉన్నాయి. ఏడు పోర్టులలో ఆయన సంస్థ సేవలు అందిస్తోంది. దిల్లీ, ముంబయి మధ్య పొడవైన ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మిస్తున్నారు.
ఆరు బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు అదానీ సొంతం. అదనంగా, గ్రీన్ హైడ్రోజన్‌లో 5 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
8,000 కిమీ పొడవైన సహజ గ్యాస్ పైప్‌లైన్స్ నడుపుతున్నారు. ఇండోనేసియా, ఆస్ట్రేలియాల్లో బొగ్గు గనులు కొన్నారు.
2030 కల్లా పునరుత్పాదక వనరుల రంగంలో అంతర్జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి ఎదగాలన్నదే ఆయన లక్ష్యం.
అదానీ తన వ్యాపారాన్ని విస్తరిస్తున్న వేగం, స్థాయిని బట్టి ఆయన్ను పాత పారిశ్రామిక దిగ్గజాలతో పోల్చవచ్చని పాలసీ అనలిస్ట్ జేమ్స్ క్రాబ్‌ట్రీ, తన పుస్తకం 'ది బిలియనీర్ రాజ్: జర్నీ థ్రూ ఇండియాస్ న్యూ గిల్డెడ్ ఏజ్'లో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
విమర్శలు, వివాదాలు
ఈ ప్రయాణంలో అదానీ బండెడు వివాదాలనూ ఎదుర్కొన్నారు. నరేంద్ర మోదీకి సన్నిహితులని, వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం సహకర్తిస్తోందన్న విమర్శలు వచ్చాయి.
"మోదీ వ్యాపార అనుకూల విధానాలు అదానీకి సహకరించాయి. మౌలిక సదుపాయాల పెట్టుబడులకు ప్రాధాన్యమిస్తూ మోదీ 'గుజరాత్ మోడల్'కి ప్రతీకగా నిలిచిన అనేక ప్రాజెక్టులను అదానీ సంస్థలే నిర్మించాయి" అని క్రాబ్‌ట్రీ అంటారు.
ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉన్న గెలీలీ బేసిన్‌లో అదానీ యాజమాన్యంలోని బొగ్గు గనిపై వివాదాలు చుట్టుముట్టాయి. 2019లో ఈ గనిని ప్రారంభించే ముందు, చాలా ఏళ్ల వరకు దీనికి పర్యావరణ అనుమతులు లభించలేదు. అయితే, ఆస్ట్రేలియాలో తాము చట్టాలకు వ్యతిరేకంగా ఏమీ చేయలేదనీ అదానీ గ్రూపు చెబుతోంది.
2012లో మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదానీ సహా మరి కొందరు వ్యాపారవేత్తలకు ప్రభుత్వ గ్యాస్ కంపెనీ నుంచి చౌకగా ఇంధనాన్ని అందించారనే ఆరోపణలు వచ్చాయి.
మోదీ హయాంలో అదానీకి అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని, సహకారం అందించిందని చెబుతూ 2017లో ఒక జర్నలిస్ట్ అనేక కథనాలు రాశారు. అయితే మోదీ ప్రభుత్వం, అదానీ సంస్థలు కూడా ఈ వాదనను ఖండించాయి.
అదానీ బయోగ్రఫీ రాసిన ఆర్ఎన్ భాస్కర్ ఏమంటారంటే, "సంబంధాలను కలుపుకోవడం, నిలుపుకోవడంలో అదానీకి ఉన్న సామర్థ్యం ఆయన వ్యాపార అభివృద్ధికి దోహదపడింది. రాజకీయ, సామాజిక రంగాలలో ఆయనకు చాలామంది సన్నిహితులు ఉన్నారు."
కేరళలో అదానీ పోర్ట్ ప్రాజెక్టుకు అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం అధికారలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ దానికి మద్దతిచ్చింది.
"వ్యాపారంలో లాభాలు వచ్చేవరకు, పబ్లిక్ నుంచి పెట్టుబడిని కోరని విధానమే" అదానీని ప్రత్యేకంగా నిలబెట్టిందని, అంతే కాకుండా, "జాతీయ ప్రయోజనాలకు దగ్గరగా ఉండే వ్యాపార విధానమే సంస్థ ఎదుగుదలకు తోడ్పడుతుందన్నది అదానీ విశ్వాసం" అని భాస్కర్ అంటారు.
అందుకే, అదానీ గ్రూపు వెబ్‌సైట్‌లో "సదుద్దేశంతో సాధించే అభివృద్ధి ద్వారా దేశ నిర్మాణం జరగాలి" అని రాసి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- దిండి: కేరళను తలపించే ఈ కోనసీమ రిసార్ట్స్ ప్రత్యేకత ఏమిటి?
- భారత్, పాకిస్తాన్ యుద్ధం 1971 - ఘాజీ: విశాఖలో అప్పుడు రాత్రి పూట ఒక్క దీపం కూడా వెలగలేదు
- చెన్నై నుంచి 1,000 మొసళ్లను గుజరాత్‌లోని ముకేష్ అంబానీ జూకు ఎందుకు తరలిస్తున్నారు?
- పెళ్లి కాకుండా సెక్స్‌లో పాల్గొంటే ఏడాది జైలు శిక్ష... చట్టం తీసుకురానున్న ఇండోనేసియా
- రాజమౌళికి ‘బెస్ట్ డైరెక్టర్’ అవార్డ్ ప్రకటించిన న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












