చెన్నై నుంచి 1,000 మొసళ్లను గుజరాత్‌లోని ముకేష్ అంబానీ జూకు ఎందుకు తరలిస్తున్నారు?

మొసళ్లు

ఫొటో సోర్స్, JERIN SAMUEL

    • రచయిత, పరిమళ కృష్ణన్
    • హోదా, బీబీసీ తమిళ్

అపర కుబేరుడు ముకేష్ అంబానీకి చెందిన జూ కోసం తమిళనాడులోని ఒక మొసళ్ల పెంపకం కేంద్రం నుంచి 1,000 మొసళ్లను గుజరాత్‌ తరలించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

చెన్నై నగరంలోని మద్రాస్ క్రొకొడైల్ బ్యాంక్ ట్రస్ట్ నుంచి దాదాపు 2,000 కిలోమీటర్ల దూరంలోని జామ్‌నగర్‌లో గల గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్‌కు వీటిని పంపిస్తున్నారు.

తమిళనాడు లోని మొసళ్ల పెంపక కేంద్రం నుంచి ఈ మొసళ్లను గుజరాత్‌లోని జూకు తరలించటానికి భారత జంతు ప్రదర్శనశాల నియంత్రణ సంస్థ గత ఏడాది ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకూ సుమారు 300 మొసళ్లను గుజరాత్ పంపించారు కూడా.

చెన్నైలోని మొసళ్ల పెంపక కేంద్రం 8.5 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అయితే ఇక్కడ మొసళ్ల సంఖ్య పెరిగిపోయి ఇరుకుగా మారటంతో వాటి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని ట్రస్ట్ అధికారులు చెప్తున్నారు.

‘‘బ్యాంక్‌లో మొసళ్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోవటంతో ప్రతి ఏటా వందలాది మొసలి గుడ్లు ధ్వంసమవుతున్నాయి’’ అని ఈ మొసళ్ల పెంపక కేంద్రం క్యురేటర్ నిఖిల్ విటాకర్ చెప్పారు. ఆ మొసళ్లు జీవించటానికి మెరుగైన స్థలం అందించటం కోసం వాటిని గుజరాత్ తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

వీడియో క్యాప్షన్, MCBT: ఇదొక మొసళ్ల బ్యాంక్, ఇక్కడ వేల మొసళ్లు పుట్టాయి

మద్రాస్ క్రొకొడైల్ బ్యాంక్ నుంచి దేశ వ్యాప్తంగా గల జూలు, రక్షిత ప్రాంతాలకు చాలా ఏళ్లుగా మొసళ్లను పంపిస్తున్నారు. అయితే ఇంత భారీ సంఖ్యలో మొసళ్లను తరలించటం ఇదే మొదటిసారి.

ముకేష్ అంబానీ గుజరాత్‌లోని జామ్‌నగర్ నగరంలో 425 ఎకరాల విస్తీర్ణంలో మూడేళ్ల కిందట జూను ప్రారంభించారు. చెన్నై నుంచి తరలిస్తున్న మొసళ్లకు తమ జూలో ‘‘తగినంత స్థలం, ఆహారం, రక్షణ’’ అందిస్తామని జూ తన తాజా వార్షిక నివేదికలో పేర్కొంది.

మద్రాస్ మొసళ్ల పెంపకం కేంద్రాన్ని 1976లో ప్రారంభించారు. ప్రధానంగా.. స్థానిక జాతుల మొసళ్లైన మగ్గర్, ఉప్పునీటి మొసళ్లు, ఘరియల్ మొసళ్లను పరిరక్షించటం కోసం దీనిని నెలకొల్పారు.

ఆరంభంలో ఈ కేంద్రంలో సుమారు 40 మొసళ్లు ఉండేవి. వాటిని సంరక్షించటం ద్వారా వాటా సంతతిని పెంపొందించి, ఆ మొసళ్లను వాటి సహజ ఆవాసాల్లో తిరిగి వదిలి పెట్టాలన్నది లక్ష్యంగా ఉండేది.

అయితే నిర్బంధంలో పుట్టించిన మొసళ్లను అటవీ ప్రాంతాల్లో వదలటానికి వీలు లేదని కేంద్ర ప్రభుత్వం 1994లో ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఈ మొసళ్ల కేంద్రంలో పెంచే మొసళ్లను తరచుగా జూలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు తరలించాల్సి వస్తోంది.

మొసళ్లు

ఫొటో సోర్స్, JERIN SAMUEL

ఫొటో క్యాప్షన్, చెన్నైలోని క్రొకొడైల్ బ్యాంక్ ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణ

వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కుదించుకుపోతుండటం, జూలు స్వీకరించగలిగే మొసళ్ల సంఖ్య చాలా పరిమితంగా ఉండటంతో మొసళ్ల కేంద్రంలో పెరిగిపోతున్న మొసళ్లను పంపించటానికి తగినన్ని ప్రదేశాలు దొరకటం లేదని అధికారులు చెప్పారు.

గుజరాత్‌కు తరలించే మొసళ్లను వాతావరణ నియంత్రణ సదుపాయం గల వాహనంలో చెక్క పెట్టెల్లో పంపిస్తామని మొసళ్ల కేంద్రం అధికారులు తెలిపారు.

‘‘నిర్బంధంలో పెంచిన మొసళ్లకు వారానికి ఒక్కసారి మాత్రమే ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి గుజరాత్ పంపించే మొసళ్లకు అవి ప్రయాణం ప్రారంభించటానికి ముందు ఆహారం అందిస్తాం’’ అని విటాకర్ వివరించారు.

అయితే.. మొసళ్ల పెంపక కేంద్రంలో వాటి సంఖ్య పెరిగిపోవటానికి పరిష్కారంగా వాటిని వేరే చోటుకు తరలించటం మీద ప్రకృతి పరిరక్షణ ఉద్యమకారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

మొసలి

ఫొటో సోర్స్, JERIN SAMUEL

ఈ మొసళ్లను తరలించే కొత్త చోటులో కూడా వీటిని పరిమితమైన ప్రదేశంలోనే బంధించి ఉంచుతారు కనుక.. ఆ సమస్య అక్కడ కూడా ఉత్పన్నమవుతుందని వన్యప్రాణి జీవశాస్త్రవేత్త పి కన్నన్ పేర్కొన్నారు.

‘‘మొసళ్లకు గర్భనిరోధక పద్ధతులేవీ ఇంకా అందుబాటులో లేవు. అలాగని మగ, ఆడ మొసళ్లను ఎక్కువ కాలం వేర్వేరు ఎన్‌క్లోజర్‌లో ఉంచటం కూడా సాధ్యం కాదు. అలా ఉంచితే మొసళ్ల మధ్య ఘర్షణలు జరుగుతాయి’’ అని ఆయన చెప్పారు.

ఈ మొసళ్లను స్వీకరిస్తున్న గుజరాత్‌లోని జూ అధికారులను బీబీసీ సంప్రదించింది. మొసళ్ల జనాభాను నియంత్రించటానికి ఎటువంటి చర్యలు చేపడుతున్నారని అడిగింది. అటువైపు నుంచి ఇంకా సమాధానం రాలేదు.

జంతువులను ఒక చోటు నుంచి వేరొక చోటుకు తరలించటానికి బదులుగా.. దేశంలో వన్యప్రాణుల కోసం రక్షిత ప్రాంతాలను పెంచాలని.. నీలగిరి వైల్డ్‌లైఫ్ అండ్ ఎన్వైరాన్‌మెంట్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి ఎస్.జయచంద్రన్ పేర్కొన్నారు.

‘‘మొసళ్ల కోసం అడవుల్లో తగినంత స్థలం ఉన్నట్లయితే వాటిని జూకు తరలించాల్సిన అవసరం ఉండదు’’ అంటారాయన.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)