మ్యూజియంలో భద్రపరిచిన 300 ఏళ్ళ నాటి గోదుమ గింజలకు ప్రపంచం మొత్తానికి ఆహారాన్ని అందించే శక్తి ఉందా?

ఫొటో సోర్స్, BBC/TONY JOLLIFFE
- రచయిత, రెబెకా మోరెల్, అలిసన్ ఫ్రాన్సిస్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
సుకుమార్ దర్శకత్వం వహించిన '1-నేనొక్కడినే' సినిమాలో హీరో మహేశ్ బాబు తన తండ్రి కనిపెట్టిన 'గోల్డెన్ రైస్' గింజలను సాధించేందుకు జీవితమంతా పోరాడతాడు. ఆ బియ్యపు గింజలకు మొత్తం మానవాళి ఆకలి తీర్చే సత్తా ఉందని చెబుతాడు.
ఇప్పుడు వాతావరణ మార్పుల ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రపంచాన్ని అలాంటి ఓ వంగడం అవసరమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒక మ్యూజియంలో భద్రపరచిన 300 ఏళ్ల నాటి గోదుమలలో ఆ శక్తి ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు.
నేచురల్ హిస్టరీ మ్యూజియంలో భద్రపరిచిన 12,000 రకాల గోదుమ గింజలను ఇప్పుడు శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. వీటిలోని వంగడాలు ప్రపంచ మానవాళికి కావలసిన మొత్తం ఆహారాన్ని అందించే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.
అందుకే, వీటిలో దృఢమైన గోదుమ రకాల జన్యు నిర్మాణాన్ని కనిపెట్టేందుకు వారు జీనోమ్ సీక్వెన్స్‌ను పరిశీలిస్తున్నారు.
ఆధునిక కాలంలో వాతావరణ మార్పులు, తెగుళ్లు, వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా గోదుమ పంటను నాశనం చేస్తున్నాయి.
నేచురల్ హిస్టరీ మ్యూజియంలో పాత రకాల గోదుమలను వందల కొద్దీ ఫైల్స్‌లో వరుసగా, జాగ్రత్తగా భద్రపరిచారు. ఒక్కొక్క గోదుమ రకానికి సంబంధించిన ఎండిన ఆకులు, కొమ్మలు, గింజలు అన్నీ భద్రపరిచారు. ఇవన్నీ కొన్ని వందల ఏళ్ల నాటి గోదుమ రకాలు.
వాటి పేర్లు, అవి ఎక్కడ, ఎప్పుడు లభమయ్యాయి మొదలైన వివరాలను జాగ్రత్తగా పొందుపరిచారు.
"ఈ గోదుమలు 1700ల నాటివి. క్యాప్టన్ కుక్ తొలిసారి ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు సేకరించినవి కూడా ఉన్నాయి" అని లారిసా వెల్టన్ చెప్పారు.
వీటిని డిజిటలైజ్ చేస్తున్న బృందంలో లారిసా వెల్టన్ ఒకరు. వీటిని ఆన్‌లైన్‌లో యాక్సిస్ చేసుకోవడానికి వీలుగా డిజిటలైజ్ చేస్తున్నారు.
జేమ్స్ కుక్ సేకరించినది ఒక అడవి గోదుమ మొక్క. ఇది గడ్డిని పోలి ఉంది. నేడు పండిస్తున్న గోదుమల కంటే చాలా భిన్నంగా ఉందని వెల్టన్ చెప్పారు.
అయితే, ఈ వ్యత్యాసమే మనకు ఇప్పుడు ప్రయోజనాలు అందించగలదని పరిశోధకులు విశ్వసిస్తున్నారు.
"వ్యవసాయ పద్ధతులు అభివృద్ధి చెందకముందు పండించిన గోదుమలు ఇవి. కృత్రిమ ఎరువులు, పురుగుల మందులు వాడుకలోకి రాక మునుపు అడవుల్లో పెరిగినవి" అని లారిసా వెల్టన్ వివరించారు.

ఫొటో సోర్స్, BBC/TONY JOLLIFFE
గోదుమలు ఎందుకంత ముఖ్యం?
ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన పంటలలో గోదుమ ఒకటి. దీన్ని అనేక ఆహారపదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. రొట్టెలు, బ్రెడ్, పాస్తా, సిరియల్స్, కేక్స్.. ఇలా గోదుమ మనం తినే ఆహారంలో ముఖ్యమైన భాగంగా మారిపోయింది.
యుక్రెయిన్‌లో గోదుమలను అత్యధికంగా పండిస్తారు. ప్రస్తుతం రష్యా-యుక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ గోదుమల సరఫరా ముప్పు అంచున ఉంది.
అయితే, ఇదొక్కటే సమస్య కాదు. వాతావరణ మార్పులు కారణంగా సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు గోదుమ పంటపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
ప్రపంచ ఉష్ణోగ్రతలలో 1C పెరిగినా, ప్రపంచవ్యాప్తంగా పండించే గోదుమ పంటలో 6.4 శాతం వరకు నష్టం వాటిల్లవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
తెగుళ్లు, వ్యాధులు కూడా గోదుమ పంటకు పెద్ద సవాలుగా మారాయి. వీటివల్ల దిగుబడి ప్రతి ఏడాదికి అయిదవ వంతు తగ్గిపోతోంది.
ఆధునిక గోదుమ పంటలు పలు సమస్యలతో పెనుగులాడుతున్నాయి. 1950, 1960లలో వచ్చిన హరిత విప్లవం, అధిక దిగుబడిని ఇచ్చే పంట రకాల అన్వేషణకు దారితీసింది. దాంతో, విపరీత వాతావరణాలకు తట్టుకునే పంట సహా ఇతర రకాలు మూలపడ్డాయి. గోదుమ పంట వైవిధ్యం తగ్గిపోయింది.
"మనం కోల్పోయిన రకాలను పునరుద్ధరించి, ఆధునిక కాలానికి తీసుకురాగలమా, లేదా అని పరీక్షించడమే మా లక్ష్యం" అని నేచురల్ హిస్టరీ మ్యూజియంలోని జన్యు శాస్త్రవేత్త డాక్టర్ మాథ్యూ క్లార్క్ వివరించారు.
ఇది చాలా ముఖ్యం కూడా. ప్రపంచ జనాభా పెరుగుతున్నకొద్దీ గోదుల అవసరాలు పెరుగుతాయి. 2050 నాటికి 60 శాతం ఎక్కువ గోదుమలు అవసరం అవుతాయని ఒక అంచనా.
అందుకే, నేటి కాలంలో గోదుమలు పండించ లేని చోట కూడా వాటిని పండించగలిగే రకాల కోసం శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. ఇదే కాకుండా, వాతావరణ మార్పులకు తట్టుకునే పంట రకాల కోసం కూడా వెతుకుతున్నారు.
"వేడి, పొడి వాతావరణంలో కూడా పండించగల గోదుమ రకాలు లభ్యమైతే అభివృద్ధి చెందుతున్న దేశాల ఆహారా సరఫరా మెరుగవుతుంది" అని క్లార్క్ వివరించారు.
సంప్రదాయ పద్ధతిలో పంటలు పండించడం లేదా జన్యు మార్పులు చేసి పంటను అభివృద్ధి చేయడం ద్వారా దీన్ని సాధించవచ్చని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, BBC/TONY JOLLIFFE
నార్విచ్‌లో జాన్ ఇన్స్ సెంటర్‌లోని శాస్త్రవేత్తలు పాత గోదుమ రకాల నమూనాల కోసం అన్వేషిస్తున్నారు.
వారి వద్దనున్న వాట్కిన్స్ ల్యాండ్‌రేస్ సేకరణలో 100 ఏళ్ల పాత గోదుమ రకాలు, ప్రపంచవ్యాప్తంగా పండించిన రకాలు ఉన్నాయి. వాటిని 4C వద్ద చల్లని వాతావరణంలో భద్రపరిచారు. ఇలా ఉంచడం వలన విత్తనాలు ఎండిపోకుండా, కుళ్లిపోకుండా ఉంటాయి. వాటిని నాటితే, మొలకలు వస్తాయి.
"వ్యాధి నిరోధకత, ఒత్తిడిని తట్టుకునే శక్తి, అధిక దిగుబడి, ఎరువుల వినియోగ సామర్థ్యం మొదలైన లక్షణాలు కలిగిన జన్యు రకాల కోసం అన్వేషిస్తున్నాం" అని సైమన్ గ్రిఫిత్ చెప్పారు.
జాన్ ఇన్స్ పరిశోధకుల బృందం పాత వెరైటీలను, కొత్త రకాలతో క్రాస్ బ్రీడ్ చేయడంలో కొంత విజయం సాధించారు.
"యెల్లో రస్ట్ అని పిలిచే వ్యాధి ప్రపంచవ్యాప్తంగా గోదుమ పంటను నాశనం చేస్తోంది. దీన్ని నియంత్రించడం రోజురోజుకూ కష్టమైపోతోంది. పాత గోదుమ రకాలలో ఈ వ్యాధిని తట్టుకునే సామర్థ్యం ఉన్నవి చాలా ఉన్నాయి. ప్రస్తుతం వాటిని నాటి పరీక్షిస్తున్నాం. ఇవి విజయవంతమైతే గోదుమ పంట ఎదుర్కొంటున్న పెద్ద ముప్పు నుంచి తప్పించుకునే మార్గం దొరుకుతుంది" అని గ్రిఫిత్ వివరించారు.
అలాగే, పోషకార విలువలు ఎక్కువగా ఉన్న రకాలను కూడా ఈ బృందం అన్వేషిస్తోంది.
"గోదుమలలో ఉన్న పిండిపదార్థాలు, ఖనిజలవణాల మోతాదును పెంచవచ్చు. గోదుమ రైతులు ఇంకా పూర్తిగా వాడుకోని రకాలు చాలా ఉన్నాయి. వాటిని మేం వారికి అందించగలమని ఆశిస్తున్నాం" అన్నారు.
చరిత్రలో పండించిన గోదుమ రకాలను పునరుద్ధరించగలిగితే ప్రపంచ ఆహారభద్రతకు ముప్పు వాటిల్లకుండా చూడవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- 10 లక్షలమందికి పైగా భారతీయులు చనిపోతుంటే బ్రిటిష్ ప్రభుత్వం ఎందుకు చూస్తూ కూర్చుంది?
- మమ్మల్ని చంపకండి అని వేడుకున్న విద్యార్థులపై చైనా ఎలా ఉక్కుపాదం మోపింది?
- భర్తను చంపి ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టిన భార్య... అసలేం జరిగింది?
- తెలంగాణ బీజేపీ ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు హైకోర్టు అనుమతి...అసలు వివాదం ఏంటి
- హెచ్ఐవీ/ఎయిడ్స్ గురించి అందరూ మాట్లాడటం మానేశారా? తెలుగు రాష్ట్రాలలో ఎన్ని కేసులున్నాయి?














