పండ్లు, కూరగాయలను తొక్క తీయకుండా తినటమే మంచిది, ఎందుకంటే...

యాపిల్

ఫొటో సోర్స్, Thinkstock

    • రచయిత, క్రిస్టీ హంటర్
    • హోదా, బీబీసీ న్యూస్

పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవటానికి చాలా మంది వాటి తొక్క తీసేస్తుంటారు. కానీ చాలా రకాల పండ్లు, కూరగాయలకు అలా తొక్క తీయాల్సిన అవసరం లేదు. వాటి తొక్కలో చాలా ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అంతేకాదు, వ్యర్థాలుగా పడేసే పండ్లు, కూరగాయల తొక్కలు వాతావరణ మార్పు మీద కూడా ప్రభావం చూపుతాయి.

పండ్లు, కూరగాయల్లో విటమిన్లు, మినరళ్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు (కణాలను కాపాడే పదార్థాలు) సహా ఎన్నో ఫైటోకెమికల్స్ (మొక్క రసాయనాలు) సమృద్ధిగా ఉంటాయి.

పోషకాలతో నిండిన ఈ ఆహారాలను తగినంతగా తినకపోతే హృద్రోగాలు, డయాబెటిస్ సహా అనేక రకాల జబ్బులకు లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు చెప్తున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ 2017 నివేదిక ప్రకారం, ప్రపంచంలో ఏటా 39 లక్షల మరణాలకు కారణం తగినంతగా పండ్లు, కూరగాయలు తినకపోవటమే.

దుంపలు

ఫొటో సోర్స్, Getty Images

అయితే, డబ్ల్యూహచ్ఓ సిఫారసు చేసినట్లుగా రోజుకు 400 గ్రాముల పండ్లు, కూరగాయలు తినగలగటం చాలా మంది ప్రజలకు చాలా కష్టం. ఈ సమస్యను పండ్లు, కూరగాయలను వాటి తొక్కతో సహా తినటం కొంతవరకూ పరిష్కరిస్తుంది. వాటి తొక్కల్లో ఉండే ముఖ్యమైన పోషకాలు మనకు అందుతాయి.

ఉదాహరణకు, బీట్‌రూట్, చిలగడదుంప, తెల్ల ఆలుగడ్డ, అడవి ఆవగడ్డ, ముల్లంగి గడ్డ, అడవి కారట్, అల్లం – ఈ ఏడు దుంప/వేరు కూరగాయల తొక్కల్లో విటమిన్ సి, రిబోఫ్లావిన్ వంటి విటమిన్లు, ఐరన్, జింక్ వంటి మినరళ్లు సమృద్ధిగా ఉంటాయి.

అలాగే.. తొక్కతీసిన యాపిల్‌లో కన్నా, తొక్కతీయని యాపిల్‌లో 15 శాతం ఎక్కువ సి విటమిన్, 267 శాతం ఎక్కువ కె విటమిన్, 20 శాతం ఎక్కువ కాల్షియం, 19 శాతం ఎక్కువ పొటాషియం, 85 శాతం ఎక్కువ ఫైబర్ ఉంటాయని అమెరికా వ్యవసాయ విభాగం చెప్తోంది.

యాపిల్

ఫొటో సోర్స్, Getty Images

చాలా తొక్కల్లో సేంద్రియంగా క్రియాశీలంగా ఉండే ఫ్లావనాయిడ్లు, పాలిఫెనాళ్లు వంటి ఫైటోకెమికళ్లు సమృద్ధిగా ఉంటాయి. వీటికి యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబియల్ గుణాలు ఉంటాయి.

తొక్కలను పారేయకూడదనేందుకు మరో కారణం.. పర్యావరణం మీద అవి చూపే ప్రభావం. ఐక్యరాజ్యసమితిలోని ఆహారం, వ్యవసాయ సంస్థ సమాచారం ప్రకారం.. ప్రపంచంలో విడుదలయ్యే గ్రీన్‌హౌస్ వాయువల ఉద్గారాల్లో 8 నుంచి 10 శాతం వరకూ తొక్కలు సహా తినకుండా పారేసే ఆహారం వల్ల ఉత్పత్తి అవుతున్నాయి. చెత్తకుప్పల్లో కుళ్లిపోయే ఆహారం నుంచి మీథేన్ అనే గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలవుతుంది.

కేవలం 51 లక్షల మంది జనాభా ఉన్న న్యూజీలాండ్ దేశం ఒక్కటే.. ఏటా 13,658 టన్నుల కూరగాయల తొక్కలు, 986 టన్నుల పండ్ల తొక్కలు వ్యర్థాలుగా పారవేస్తున్నట్లు నివేదించింది.

ఆహార వ్యర్థాలు

ఫొటో సోర్స్, Getty Images

పండ్లు, కూరగాయల తొక్కల్లో ఇంత సమృద్ధిగా పోషకాలు ఉన్నప్పటికీ, వాటిని తీసివేయటం వల్ల ఆ పోషకాలు వృధాగా పోవటమే కాకుండా ఆ వ్యర్థాలతో పర్యావరణం దెబ్బతింటున్నప్పటికీ, జనం ఇలా తొక్కతీసి పారేయటానికి కారణాలేమిటి?

కొన్ని పండ్లు, కూరగాయలకు తప్పనిసరిగా తొక్క తీయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటి బయటి భాగాలు తినటానికి తగవు, రుచిగా ఉండవు, శుభ్రం చేయటం కష్టం, లేదంటే అవి తినటం మంచిది కాదు. అరటిపండు, నారింజ, పుచ్చకాయ, అనాసపండు, మామిడి, అవకాడో, ఉల్లిపాయ, వెల్లుల్లి.. ఇటువంటివి.

ఆలుగడ్డ, బీట్‌రూట్, కారట్, కివి, దోసకాయ వంటి కూరగాయలు, పండ్ల తొక్కలు తినగలివే అయినా కూడా చాలా మంది వీటి తొక్కను తీసేస్తుంటారు.

పండ్లు కూరగాయలు

ఫొటో సోర్స్, Getty Images

పురుగుమందుల అవశేషాలు

పండ్లు, కూరగాయల ఉపరితలం మీద పురుగుమందుల అవశేషాలు ఉంటాయనే ఆలోచనతో కొందరు వాటి తొక్కలు తీసివేస్తుంటారు. వీటి ఉపరితలం మీద, ఒక్కోసారి ఉపరితలానికి కొంచెం దిగువకు కూడా పురుగుమందుల అవశేషాలు ఉండిపోవటం అనేది నిజమే. మొక్కల జాతులను బట్టి ఇందులో తేడాలు ఉంటాయి.

అయితే ఈ అవశేషాలను చాలా వరకూ నీటితో కడగటం ద్వారా తొలగించవచ్చు. పురుగుమందులు, దుమ్ము ధూళి, రసాయనాలను తొలగించటానికి పండ్లు, కూరగాయలను చల్లని నీటిలో శుభ్రంగా కడగి, గట్టి బ్రష్‌తో తోమాలని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగం సిఫారసు చేస్తోంది.

నీటిలో లేదా నీటి ఆవిరిలో ఉడికించటం వంటి వంట పద్ధతుల ద్వారా కూడా పురుగుమందుల అవశేషాలను తగ్గించవచ్చు.

కానీ, కడగటం, వండటం ద్వారా అన్ని పురుగుమందుల అవశేషాలూ తొలగిపోవు. ఆ అవశేషాలు కడుపులోకి పోతాయని ఆందోళన చెందే వారు ఆయా కూరగాయలు, పండ్ల తొక్కలు తీసేస్తుంటారు.

ఆహారం

ఫొటో సోర్స్, Getty Images

కొన్ని దేశాల్లో పండ్లు, కూరగాయల్లో ఉండే పురుగుమందుల మోతాదుల జాబితా ఉంటుంది. బ్రిటన్‌లో పెస్టిసైడ్ యాక్షన్ నెట్‌వర్క్ అనే సంస్థ ఇలాంటి జాబితాను తయారు చేస్తుంది. మనం ఏ పండ్లు, కూరగాయలకు తొక్కలు తీసివేయాలో, వేటిని తొక్కతో సహా తినవచ్చో నిర్ణయించుకోవటానికి ఇలాంటి జాబితాలు సాయపడతాయి.

అలాగే, పండ్లు, కూరగాయల తొక్కలతో రకరకాల వంటలు చేయటం, మొక్కలకు ఎరువు తయారు చేయటం సహా చాలా విధాలుగా ఉపయోగంచుకోవచ్చు. ఇందుకు ఆన్‌లైన్‌లో చాలా చిట్కాలు, సమాచారం దొరుకుతుంది.

కొంత పరిశోధన, మరికొంత సృజనాత్మకతతో పండ్లు, కూరగాయల తొక్కల వ్యర్థాన్ని తగ్గించటంతో పాటు మీ ఆహారంలో పోషకాలను పెంపొందించుకోవచ్చు. అలాగే, 2030 నాటికి ఆహార వ్యర్థాన్ని సగానికి తగ్గించాలన్న ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒక దాాన్ని సాధించడాానికి సాయపడవచ్చు.

* క్రిస్టీ హంటర్, బ్రిటన్‌లోని నాటింగామ్ ట్రెంట్ యూనివర్సిటీలో న్యూట్రిషన్ ప్రొఫెసర్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)