తియాన్మెన్ స్క్వేర్: మమ్మల్ని చంపకండి అని వేడుకున్న విద్యార్థులపై చైనా ఎలా ఉక్కుపాదం మోపింది?

తియాన్మెన్ స్క్వేర్

ఫొటో సోర్స్, Getty Images

కోవిడ్-19ను కట్టడి చేసేందుకు అనుసరిస్తున్న విధానాలపై చైనాలో వరుస నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ఐఫోన్ల తయారీ ఫ్యాక్టరీ దగ్గర మొదలైన ఈ నిరసనలు నేడు విద్యా సంస్థలకు కూడా చేరాయి. షాంఘై వీధుల్లోనూ ప్రజలు నినాదాలు చేస్తున్నారు.

చైనాలోని ప్రతిష్ఠాత్మక షింఘువా యూనివర్సిటీలో విద్యార్థులు రష్యన్ శాస్త్రవేత్త లెక్స్ ఫ్రీడ్‌మ్యాన్ ఈక్వేషన్‌ను తెల్లకాగితంపై చూపిస్తూ నిరసన తెలియజేశారు. ‘‘ఫ్రీ మ్యాన్’’కు ఈ కాగితం ప్రతీకగా వారు చెబుతున్నారు.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హాంకాంగ్‌లో నిరసనలకు నేతృత్వం వహించిన నాథన్ లా కూడా ఈ ఫోటోను షేర్ చేశారు.

చాలాచోట్ల విద్యార్థులు తెల్లపేపర్లు చూపిస్తూ నిరసన తెలుపుతున్నారు. ‘‘ఏ4 రివొల్యూషన్’’గా దీన్ని సోషల్ మీడియాలో చెబుతున్నారు. ఏ4 సైజ్ తెల్ల పేపర్లు చూపిస్తుండటంతో దీన్ని అలా పిలుస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

చైనా

ఫొటో సోర్స్, Reuters

ఇలాంటి ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చైనాలో చాలా అరుదుగా కనిపిస్తాయి. అయితే, తాజా నిరసనల్లో చైనాకు చెందిన శక్తిమంతమైన అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

భారీ నిరసనలు చూసి ఆశ్చర్యానికి గురవుతున్నానని షాంఘైలో జీవించే ఫ్రాంక్ సయ్ బీబీసీతో చెప్పారు.

‘‘షాంఘైలో గత 15ఏళ్లలో ఇలాంటి నిరసనలు నేను ఎప్పుడూ చూడలేదు’’అని ఆయన అన్నారు.

గత రెండు-మూడు దశాబ్దాల్లో నిరసనలు ఎక్కువగా కార్మికుల హక్కులు, భూముల కోసం జరిగాయని సయ్ చెప్పారు. ‘‘ఈ నిరసనల్లో స్థానిక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసేవారు. కానీ, చైనా ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం చాలా అరుదు’’అని ఆయన వివరించారు.

షాంఘైలో నిరసనల తర్వాత ఆదివారం దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లోని విద్యా సంస్థల్లో నిరసనలు కనిపించాయి.

మరోవైపు ఈ నిరసనలను అడ్డుకునేందుకు చైనా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది.

చైనా ఆర్థిక రాజధానిగా పిలిచే షాంఘై వీధుల్లో నీలం రంగు తాత్కాలిక గోడలను రోడ్లకు రెండు వైపులా అధికారులు ఏర్పాటుచేశారు. షాంఘై నిరసనలకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

ఈ నిరసనలను అడ్డుకునేందుకు చైనా భద్రతా సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

అయితే, నేటి నిరసనలు 1980లలో చోటుచేసుకున్న నిరసనలను గుర్తుకుతెస్తున్నాయి.

చైనా

ఫొటో సోర్స్, Reuters

తియాన్మెన్ స్క్వేర్ నిరసనలు..

1980లలో చైనాను చాలా సవాళ్లు వెంటాడేవి. ప్రైవేటు సంస్థలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం ఇలా చాలా సవాళ్లు ఉండేవి.

ఈ చర్యలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, చైనా ఆర్థిక వ్యవస్థకు ఊతం వస్తుందని చైనా ఇదివరకటి నాయకుడు డెంగ్ జియావోపింగ్ భావించేవారు. అయితే, ఈ చర్యల నడుమ కొన్ని అవినీతి కేసులు వెలుగులోకి వచ్చాయి.

మరోవైపు రాజకీయ స్వేచ్ఛతోపాటు హక్కుల కోసం బహిరంగంగా సామాన్యులు చర్చలు జరపడం కూడా ఎక్కువైంది.

ఇదే సమయంలో దేశంలోని కమ్యూనిస్టు పార్టీలో రెండు వర్గాలు ఏర్పడ్డాయి. దీనిలో ఒక వర్గం చైనా ప్రభుత్వానికి కళ్లెం వేస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని ప్రతిపాదించింది. మరో వర్గం మాత్రం చైనా ప్రభుత్వంపై నియంత్రణ అనేదే ఉండకూడదని భావించింది.

మొత్తంగా 1980ల మధ్యకు వచ్చేసరికి చైనాలో విద్యార్థుల నేతృత్వంలో నిరసనలు మొదలయ్యాయి.

ముఖ్యంగా విదేశాల్లో గడిపిన విద్యార్థులు, కొత్త ఆలోచనలతో పరిచయం ఏర్పడిన వారు, మెరుగైన జీవన ప్రమాణాలను చూసినవారు ఈ నిరసనల్లో ప్రధానంగా పాల్గొనేవారు.

డెంగ్ జియావోపింగ్, యోబాంగ్ (ఎడమ)

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, డెంగ్ జియావోపింగ్, యోబాంగ్ (ఎడమ)

పెద్దయెత్తున గుమిగూడిన ప్రజలు

రాజకీయ హక్కుల పరిధిని విస్తృతం చేయాలని కోరుతూ 1989లో నిరసనలు మరింత ఉద్ధృతం అయ్యాయి.

అదే సమయంలో ఆర్థిక, రాజకీయ మార్పుల కోసం గత కొన్ని సంవత్సరాలుగా మాట్లాడిన చైనా అగ్రనాయకుడు హ్యూ యోబాంగ్ మరణించారు.

మరణానికి రెండేళ్ల ముందు కమ్యూనిస్టు పార్టీలోని కీలక పదవి నుంచి యోబాంగ్‌ను ఆయన ప్రత్యర్థులు తప్పించారు.

1989 ఏప్రిల్‌లో యోబాంగ్ అంత్యక్రియలకు లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. వీరు భావప్రకటన స్వేచ్ఛ, సెన్సార్‌షిప్‌కు అడ్డుకట్ట వేయడం లాంటి డిమాండ్లను చేశారు.

కొన్నివారాల తర్వాత చైనా రాజధాని బీజింగ్‌లోని తియాన్మెన్ స్క్వేర్ వద్ద నిరసన తెలిపేందుకు ప్రజలు పెద్దయెత్తున గూమిగూడారు.

చైనా

ఫొటో సోర్స్, AFP

చైనా ఎలా అణచివేసింది?

నిరసనలపై మొదట్లో చైనా ప్రభుత్వం నేరుగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. అసలు నిరసనలకు ఎలా కళ్లెం వేయాలని పార్టీలో అంతర్గతంగా మాత్రం చర్చలు జరిగేవి.

అయితే, నిరసనకారులను శాంతింపజేసేలా కొన్ని చర్యలు తీసుకోవాలని పార్టీలో కొందరు సూచించారు.

మరోవైపు నిరసనకారులపై ఉక్కుపాదం మోపాలని మరికొందరు డిమాండ్ చేశారు. మొత్తంగా ఉక్కుపాదం మోపేందుకే ప్రభుత్వం మొగ్గుచూపింది.

మే నెల చివరి రెండు వారాలు బీజింగ్‌లో మార్షల్ లా ప్రయోగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఆ తర్వాత జూన్ మూడు, నాలుగు తేదీల్లో తియాన్మెన్ స్క్వేర్‌కు పరిసరాల్లో ప్రభుత్వం పెద్దయెత్తున బలగాలను మోహరించింది.

ఆనాడు తీసిన చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా మీడియా సంస్థల్లో ప్రచురితం అయ్యాయి. నాలుగు యుద్ధ ట్యాంకుల ముందు ఒక వ్యక్తి నిలబడుతూ కనిపించారు. అతడికి ఏమైందో ఎవరికీ తెలియదు.

అయితే, ఆనాడు నిరసనకారులకు ఏం జరిగింది? అనే అంశం నేటికీ చైనాలో చాలో సున్నితమైనది. దీనిపై ఎవరూ పెద్దగా మాట్లాడేందుకు ముందుకురారు.

అక్కడ ఏం జరిగిందో బీబీసీ ప్రతినిధి కేట్ ఎడ్డీ తన కళ్లతో ప్రత్యక్షంగా చూశారు. ‘‘సామాన్యులపై పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అప్పటికి అక్కడ వీధుల్లో వేల మంది నిరసనకారులు ఉన్నారు’’అని కేట్ తెలిపారు.

వీడియో క్యాప్షన్, Hu Jintao: Former China leader led out of Party Congress meeting

ఎంతమంది మరణించారు?

ఈ ఘర్షణల్లో ఎంత మంది మరణించారో ఎప్పటికీ స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.

అయితే, జూన్ 1989లో చైనా సైన్యం దీనిపై స్పందించింది. డజన్ల మంది సైనికులతోపాటు 200 మంది పౌరులు మరణించినట్లు వెల్లడించింది.

అయితే, ఇక్కడ మరణించిన పౌరుల సంఖ్య వేలల్లో ఉండొచ్చని కొన్ని స్వచ్ఛంద సంస్థలు, విదేశీ నిఘా సంస్థలు అంచనా వేశాయి.

2017లో దీనికి సంబంధించిన బ్రిటిష్ ప్రభుత్వం నివేదిక ఒకటి బయటకు వచ్చింది. దీనిలో మొత్తంగా మరణించిన వారి సంఖ్య 10,000గా అంచనా వేశారు. ఆనాటి బ్రిటిష్ దౌత్య ప్రతినిధి సర్ అలన్ డోనల్డ్ నేతృత్వంలో ఆ పత్రాన్ని సిద్ధంచేశారు.

‘‘అక్కడి నుంచి బయటకు పడేందుకు తమకు గంట సమయం ఉందని విద్యార్థులు భావించారు. కానీ, ఐదు నిమిషాల్లో సైనిక వాహనాలు దూసుకుంటూ అక్కడికి వచ్చాయి’’అని అని డోనల్డ్ ఆ పత్రంలో పేర్కొన్నారు.

‘‘తమను వదిలిపెట్టాలని కొందరు విద్యార్థులు ప్రాథేయపడ్డారు. కానీ, సైనికులు ఊరుకోలేదు. ఆ తర్వాత శవాల పైనుంచే సైనిక వాహనాలు వెళ్లాయి. ఆ తర్వాత ఈ మృతదేహాల్లో కొన్నింటిని కాల్చేశారు. మరికొన్నింటికి నదుల్లోకి విసిరేశారు’’అని ఆ పత్రంలో పేర్కొన్నారు.

‘‘స్టేట్ కౌన్సిల్‌లో చాలా మంది సభ్యులు ఈ నిరసనలను ఆపలేమనే అనుమానం వ్యక్తంచేశారు. దీంతో ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు’’అని డోనల్డ్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)