చైనా: బీబీసీ జర్నలిస్టులను కొట్టిన పోలీసులు, ప్రజాందోళనలను ప్రభుత్వం అదుపు చేయలేకపోతోందా?

షాంఘైలో భద్రతా సిబ్బంది

ఫొటో సోర్స్, Reuters

చైనా పోలీసులు బీబీసీ జర్నలిస్టును కస్టడీలో కొట్టారు.

చైనాలో కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలను కవర్ చేస్తున్న సమయంలో ఎడ్ లారెన్స్ అనే బీబీసీ జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు.

కస్టడీలో ఉన్న సమయంలో లారెన్స్‌ను కొట్టినట్లు బీబీసీ న్యూస్ ప్రెస్ టీం తెలిపింది.

‘ఎడ్ లారెన్స్‌ను విడుదల చేసే ముందు పోలీసులు కొట్టడంతోపాటు తన్నారు. షాంఘైలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలను కవర్ చేస్తున్న సమయంలో లారెన్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు’ అని బీబీసీ ప్రకటనలో పేర్కొంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

మరోవైపు చైనాలో కరోనా ఆంక్షలకు వ్యతిరేకంగా చెలరేగుతున్న నిరసనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇతర కీలక పట్టణాలు, నగరాల నుంచి రాజధాని బీజింగ్‌కు కూడా పాకాయి.

ఇప్పటికే షాంఘైలో భారీ ఎత్తున్న నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. చెంగ్డూ, షియాన్, వూహాన్ వంటి నగరాల్లోనూ నిరసనకారులు వీధుల్లోకి వస్తున్నారు.

‘గత 15ఏళ్లలో ఇంత భారీ స్థాయిలో నిరసన ప్రదర్శనలను తాను ఎన్నడూ చూడలేదు’ అని షాంఘైకు చెందిన ఫ్రాంక్ సాయ్, బీబీసీకి తెలిపారు.

చైనా అమలు చేస్తున్న ‘జీరో కోవిడ్’ విధానం వల్ల... యువత, కార్మికులు, మధ్యతరగతి, సంపన్నులు సహనం కోల్పోయారని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో సోషియాలజిస్ట్‌గా పని చేస్తున్న ప్రొఫెసర్ హో ఫుంగ్ అన్నారు.

దాని ఫలితమే ఇటీవల ప్రపంచంలోనే అతి పెద్ద ఐఫోన్ల తయారీ ఫ్యాక్టరీ అయిన ఫాక్స్‌కాన్‌లో కార్మికులు నిరసనకు దిగారని ఆయన తెలిపారు.

తాజాగా యురుంకిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి కొందరి ప్రాణాలు పోవడంతో ప్రజల్లోని అసంతృప్తి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.

పోలీసుల కాపలా

ఫొటో సోర్స్, Reuters

చైనాలో పాలకుల మీద అసంతృప్తి వ్యక్తం చేయడమనేది కొత్త కాదు.

గాలి కాలుష్యం నుంచి భూముల కబ్జా వరకు అనేక అంశాల మీద గతంలో ప్రజలు నిరసనలు వ్యక్తం చేశారు.

కానీ ఈ సారి మాత్రం భిన్నం.

‘జీరో కోవిడ్’ పేరుతో చైనా నాయకత్వం అమలు చేస్తున్న కఠిన ఆంక్షలను ఆ దేశ ప్రజలు నేడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చాలా మంది ప్రజలు వాటితో విసిగి పోయారు. సోషల్ డిస్టెన్స్ పాటించేలా ఏర్పాటు చేసిన బారికేడ్లను ప్రజలు ధ్వంసం చేస్తున్నారు. ఇప్పుడు వారి ఆగ్రహం ఏకంగా వీధుల్లోకి వచ్చేసింది.

చైనాలోని పెద్దపెద్ద నగరాలు, యూనివర్సిటీలలో నిరసనలు చెలరేగుతున్నాయి.

షాంఘైలో నిరసనకు దిగిన కొందరు, ‘దిగిపో షీ జిన్‌పింగ్...’ అంటూ నినాదాలు చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే.

చైనాలో దేశాధినేతను బహిరంగంగా విమర్శించడం చాలా ప్రమాదకరం. జైలులో పడే అవకాశం కూడా ఉంటుంది.

షిన్‌జియాంగ్‌లో అగ్నిప్రమాదం వల్ల 10 మంది చనిపోయారు. ‘జీరో కోవిడ్’ పాలసీ వల్ల సహాయక చర్యలు ఆలస్యం కావడమే ఇందుకు కారణం అని ప్రజలు చెబుతున్నారు.

నిరసనకారుల్లో ఒకరు... ‘షీ జిన్‌పింగ్’ అంటూ అరిస్తే...

అందుకు బదులుగా మిగతా వాళ్లు... ‘దిగిపో’ అని నినదించారు.

‘కమ్యూనిస్ట్ పార్టీ... దిగిపో’ అనే నినాదాలు కూడా మారు మోగాయి.

నాన్జింగ్: కమ్యూనికేషన్ యూనివర్సిటీ ఆఫ్ చైనాలో నిరసనలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నాన్జింగ్: కమ్యూనికేషన్ యూనివర్సిటీ ఆఫ్ చైనాలో నిరసనలు

అధికారంలో ఉండటమే ఏకైక ప్రధాన లక్ష్యంగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకు ఈ నిరసనలు ఒక పెద్ద సవాలుగా మారుతున్నాయి.

‘జీరో కోవిడ్’తో పేరుతో అమలు చేస్తున్న కఠిన ఆంక్షల మీద ప్రజల్లో చెలరేగుతున్న అసంతృప్తి జ్వాలలను చైనా నాయకత్వం ముందుగానే పసిగట్టలేక పోయినట్లుగా కనిపిస్తోంది. ఆ ఆంక్షలను సడలించేది లేదని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇటీవలే ప్రకటించి ఉన్నారు.

కరోనా సంక్షోభం మొదలైన మూడేళ్ల కాలంలో చైనా మరిన్ని ఆసుపత్రులు కట్టి ఉండాల్సింది. వాటిలో మరిన్ని ఐసీయూ విభాగాలు ఏర్పాటు చేసి ఉండాల్సింది. వ్యాక్సినేషన్ మీద అవగాహన పెంచి ఉంటే బాగుండేది.

కానీ వాటికి బదులుగా భారీ స్థాయిలో కరోనా టెస్టులు చేయడం మీదనే చైనా నాయకత్వం దృష్టి పెట్టింది.

కరోనావైరస్‌ను అంతమొందించేందుకు లాక్‌డౌన్, ఐసోలేషన్, క్వారంటైన్ వంటి అస్త్రాలను మాత్రమే నమ్ముకుంది.

ఎన్నటికీ వీడి వెళ్లని ఒక వైరస్ మీద యుద్ధం చేస్తూ ఆ యుద్ధంలో గెలవాలని చైనా భావిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)