చైనా: జిన్‌పింగ్ రాజీనామా చేయాలంటూ నిరసనలు, రోజురోజుకూ తీవ్రం

చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, షాంఘైలో ఆదివారం సమావేశమైన నిరసనకారులను చెదరగొడుతున్న పోలీసులు

చైనాలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్రంగా మారాయి. కరోనా కఠిన నిబంధనలను నిరసిస్తూ ప్రజలు బహిరంగంగా కమ్యూనిస్టు పార్టీ నాయకులపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు.

వేలాదిమంది నిరసనకారులు షాంఘై వీధుల్లోకి వచ్చారు. పోలీసు వాహనాల్లో వారిని తరలించడాన్ని బీబీసీ ప్రతినిధి చూశారు.

బీజింగ్, నాన్జింగ్ విశ్వవిద్యాలయాల్లో కూడా విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేశారు.

షిన్‌జియాంగ్ రాష్ట్ర రాజధాని ఉరుంకి నగరంలోని ఒక అపార్ట్‌మెంట్‌లో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది చనిపోవటంతో ఈ నిరసనలు తీవ్రమయ్యాయి.

ఉరుంచి అగ్నిప్రమాదానికి కారణం నివాస భవనాలను లాక్‌డౌన్ చేయటమేనని చాలా మంది జనం ఆరోపిస్తున్నారు.

దీనిని చైనా ప్రభుత్వ విభాగాలు తిరస్కరిస్తున్నాయి. అయితే అగ్నిప్రమాదానికి సంబంధించి ఎవరైనా అధికారులు బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించినట్లయితే వారిని శిక్షిస్తామని ఉరుంకి అధికారులు శుక్రవారం నాడు ఒక ప్రకటనలో చెప్పారు. ఆ ప్రమాదానికి చింతిస్తున్నామని క్షమాపణ కూడా చెప్పారు.

చైనా

ఫొటో సోర్స్, Reuters

‘షీ జిన్‌పింగ్ దిగిపో’

షాంఘైలో శనివారం రాత్రి నిరసనల్లో ప్రజలు బహిరంగంగా ‘షి జిన్‌పింగ్ దిగిపో’, ‘కమ్యూనిస్ట్ పార్టీ గద్దె దిగు’ అంటూ నినాదాలు చేశారు.

చైనాలో ఇలాంటి డిమాండ్లు కనిపించటం, వినిపించటం అసాధారణమైన విషయం. ప్రభుత్వాన్ని, అధ్యక్షుడిని నేరుగా విమర్శిస్తే కఠిన శిక్షలు విధించటం చైనాలో మామూలు విషయం.

కొంతమంది తెల్లని బ్యానర్లు పట్టుకోగా... మరికొంతమంది ఉరుంకి అగ్నిప్రమాద మృతుల సంస్మరణార్థం కొవ్వొత్తులు వెలిగించారు. పూల బొకేలతో నివాళులు అర్పించారు.

జీరో-కోవిడ్ విధానం పట్ల పెరుగుతోన్నఅసంతృప్తిని ప్రభుత్వం చాలా తక్కువగా అంచనా వేసినట్లు కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.

జీరో కోవిడ్ పాలసీ పట్ల చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పట్టుదలగా ఉన్నాడు. ఈ పాలసీలో మార్పులేమీ ఉండబోవని ఆయన ఇటీవలే అన్నారు.

చైనాలో ఇంత పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను చూడటం ఇదే మొదటిసారి అని షాంఘై నిరసనల్లో పాల్గొన్న ఒక వ్యక్తి బీబీసీతో చెప్పారు. ప్రజలు వీధుల్లోకి రావడం చూసి తొలుత తాను షాక్ చెందానని తర్వాత కాస్త ఉత్సాహంగా నిరసనల్లో పాల్గొన్నానని ఆయన వెల్లడించారు.

‘‘లాక్‌డౌన్స్ వల్ల చాలా నిస్సహాయంగా, కోపంగా, విచారంగా అనిపించేది. లాక్‌డౌన్ కారణంగా క్యాన్సర్ చికిత్స పొందుతున్న ఉన్న నా తల్లిని చూడలేకపోయా’’ అని ఆయన తన బాధను పంచుకున్నారు.

మరికొందరు అక్కడ జరిగిన హింసాత్మక ఘటనలకు సాక్ష్యాలుగా నిలిచారు.

చైనా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉరుంకి అగ్ని ప్రమాద బాధితులకు పూల నివాళులు అర్పించేందుకు ప్రజలు ప్రయత్నించిన చోట భారీగా పోలీసులను మోహరించారు

వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్‌తో ఒక నిరసనకారుడు మాట్లాడుతూ తన స్నేహితుల్లో ఒకరిని పోలీసులు కొట్టారని, మరో ఇద్దరిపై పెప్పర్ స్ప్రే చల్లారని చెప్పారు.

ఆదివారం కూడా ప్రజలు నిరసనలకు దిగారు. షాంఘైలోని ఉరుంకి అగ్రి ప్రమాద బాధితులకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి తమ మద్దతును ప్రకటించారు.

ప్రజలు గుమిగూడటంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.

వీధుల్లో రెండో రోజు సమావేశమైన నిరసనకారులను చెదరగొడుతున్న పోలీసు అధికారులు, ప్రైవేటు భద్రతా బలగాలను బీబీసీ చూసింది.

ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తోన్న నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్నిచోట్ల వారిని కొట్టడం, పోలీస్ కార్లపైకి నెట్టేయడం వంటి ఘటనలు జరిగాయి.

బీజింగ్, నాన్జింగ్ యూనివర్సిటీలలో శనివారం విద్యార్థుల నిరసనలు ప్రారంభించినట్లు చూపే ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లోకి వచ్చాయి.

సింఘువా యూనివర్సిటీలో జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో వందలాది మంది పాల్గొన్నట్లు వార్తా ఏజెన్సీ ఏఎఫ్‌పీతో ఒక విద్యార్థి చెప్పారు.

చైనా నియంత్రణ ధోరణికి ధిక్కార చిహ్నంగా మారిన ఖాళీ పేపర్ షీట్లను కొన్ని సమూహాలు ప్రదర్శించాయి. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యానికి మద్దతుగా పాటలు పాడుతోన్న వీడియాలు బయటకొచ్చాయి.

ప్రభుత్వానికి, అధ్యక్షునికి వ్యతిరేకంగా అనేక వీడియోలు కనిపించాయి. వీటన్నింటిని స్వతంత్రంగా ధ్రువీకరించడం చాలా కష్టం.

చైనాలో కఠినమైన కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నప్పటికీ అక్కడ ఈ వారం కరోనా కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో నమోదైంది.

వీడియో క్యాప్షన్, Hu Jintao: Former China leader led out of Party Congress meeting

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)